17
దావీదు, గొల్యాతు
ఫిలిష్తీయులు యూదా ప్రదేశంలో తమ సైన్యాలను యుద్ధానికి సమకూర్చారు. శోకోలో సమకూడి ఏఫెస్దమ్మీము దగ్గర శోకో, అజేకా మధ్య మకాం చేశారు.
సౌలు, ఇశ్రాయేలీయులు కూడుకుని ఏలా లోయలో దిగి ఫిలిష్తీయులను ఎదిరించడానికి వరుసల్లో నిలబడ్డారు. ఒక లోయకు ఇరుప్రక్కలా కొండల మీద ఫిలిష్తీయులు, ఇశ్రాయేలీయులు నిలిచి ఉన్నారు.
ఫిలిష్తీయుల సైన్యంలోనుండి గొల్యాతు అనే బలశాలి బయలుదేరాడు. అతడు గాతు ప్రాంతానికి చెందినవాడు. అతని ఎత్తు ఆరు మూరల ఒక జానెడు. అతడు తన తలపై కంచు శిరస్త్రాణం ధరించాడు. అతడు యుద్ధ కవచం పెట్టుకున్నాడు. కవచం బరువు 57 కిలోలు.
అతని కాళ్లకు కంచు కవచం, అతని భుజాల మధ్య ఒక కంచు బల్లెం ఉన్నాయి. అతని చేతిలోని ఈటె, చేనేత పనివాడి అడ్డకర్ర అంతపెద్దది. ఈటె కొన బరువు 7 కిలోల ఇనుమంత బరువు. ఒక సైనికుడు బల్లెం మోస్తూ గొల్యాతు ముందు నడుస్తున్నాడు.
అతడు నిలబడి ఇశ్రాయేలీయుల సైన్యం వారితో “నేను ఫిలిష్తీయుణ్ణి, మీరంతా సౌలు దాసులు కదా. యుద్ధం చేయడానికి మీరంతా ఎందుకు వస్తున్నారు? మీరు మీ తరఫున ఒకరిని ఎన్నుకుని అతణ్ణి నాపైకి యుద్ధానికి పంపండి. అతడు నాతో పోరాడి నన్ను చంపగలిగితే మేమంతా మీకు దాసోహం అవుతాం. నేనే గనక అతణ్ణి జయించి, అతణ్ణి చంపితే మీరంతా మాకు దాస్యం చేయాలి.”
10 ఆ ఫిలిష్తీయుడు ఇంకా ఇలా అన్నాడు. “ఈ రోజున నేను ఇశ్రాయేలీయుల సైన్న్యాన్ని సవాలు చేస్తున్నాను. మీ నుండి ఒకరిని పంపితే వాడూ నేనూ పోరాడతాం” అంటూ రంకెలు వేశాడు. 11 సౌలు, ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుని కేకలు విని హడలిపోయి చాలా భయపడి పోయారు.
12 దావీదు యూదా దేశపు బేత్లెహేమువాడు, ఎఫ్రాతీయుడైన యెష్షయి కొడుకు. యెష్షయికి ఎనిమిదిమంది కొడుకులు. అతడు సౌలు కాలంలో ముసలివాడై బలహీనంగా ఉన్నాడు. 13 యెష్షయి ముగ్గురు పెద్ద కొడుకులు సౌలుతోపాటు యుద్ధానికి వెళ్లారు. యుద్ధానికి వెళ్ళిన అతని ముగ్గురు కొడుకుల్లో మొదటివాడు ఏలీయాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షమ్మా. 14 దావీదు ఆఖరి కొడుకు. అన్నలు ముగ్గురూ సౌలుతోబాటు వెళ్లారు కాని 15 దావీదు బేత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుతూ, సౌలు దగ్గరకు వెళ్ళి వస్తూ ఉన్నాడు.
16 ఆ ఫిలిష్తీయుడు నలభై రోజులు ప్రతి ఉదయం సాయంత్రం లోయలోకి వచ్చి నిలబడేవాడు.
17 యెష్షయి తన కొడుకు దావీదును పిలిచి “ఒక తూముడు వేయించిన గోదుమలనూ పది రొట్టెలనూ తీసుకు సైన్యంలో ఉన్న నీ అన్నల కోసం తొందరగా వెళ్ళు. 18 ఇంకా ఈ పది జున్నుగడ్డలు తీసికువెళ్ళి వారి సహస్రాధిపతికి ఇవ్వు. నీ అన్నల క్షేమసమాచారం తెలుసుకుని వారి దగ్గరనుండి ఏదైనా గుర్తు తీసుకురా” అని చెప్పి పంపించాడు.
19 సౌలు సైన్యం, ఇశ్రాయేలీయులంతా ఏలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నారు. 20 దావీదు ఉదయాన్నే లేచి మరో కాపరికి తన గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకు యెష్షయి ఆజ్ఞాపించినట్టు ప్రయాణమయ్యాడు. అతడు యుద్ధ శిబిరం చేరే సమయానికి సైన్యాలు బారులుతీరి నినాదాలు చేస్తూ యుద్ధరంగానికి చేరుకొంటున్నారు. 21 ఇశ్రాయేలువారు, ఫిలిష్తీయవారు ఎదురెదురుగా నిలిచి యుద్ధానికి సిద్ధపడుతున్నారు.
22 దావీదు తాను తెచ్చిన వస్తువులను సామానులు భద్రపరచే వాని దగ్గర ఉంచి, పరిగెత్తుకుంటూ సైన్యంలో చొరబడి తన అన్నలను కుశల ప్రశ్నలడిగాడు. 23 అతడు వారితో మాట్లాడుతున్నప్పుడు గాతు పట్టణపు ఫిలిష్తీయ బలశాలి, గొల్యాతు ఫిలిష్తీయుల సైన్యంలోనుండి వచ్చి పైన పలికిన మాటల్నే చెప్పడం దావీదు విన్నాడు. 24 ఇశ్రాయేలీ సైనికులు అతణ్ణి చూసి ఎంతో భయపడి అతని దగ్గర నుండి పారిపోయారు.
25 ఇశ్రాయేలీయులు “ముందుకు వస్తున్న అతణ్ణి చూశారా, కచ్చితంగా ఇశ్రాయేలీయులను ఎదిరించడానికి వాడు బయలుదేరాడు. వాణ్ణి చంపినవాడికి రాజు చాలా డబ్బులిచ్చి, కూతురినిచ్చి పెళ్లిచేసి, అతణ్ణి, అతని కుటుంబాన్ని పన్ను కట్టే బాధ్యత నుండి మినహాయిస్తాడు” అని చెప్పాడు.
26 అప్పుడు దావీదు “సజీవుడైన దేవుని సైన్యాలను ఎదిరించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయునికి ఎంత ధైర్యం?” వాణ్ణి చంపి ఇశ్రాయేలీయులకు వచ్చిన ఈ అపవాదును తీసివేసిన వాడికి వచ్చే బహుమతి ఏమిటి అని తన దగ్గర నిలబడినవాళ్ళని అడిగితే, 27 వారు, వాణ్ణి చంపినవాడికి లభించే కానుకల గురించి చెప్పారు.
28 దావీదు వారితో మాట్లాడుతున్న విషయాలు, అతని పెద్దన్న ఏలీయాబు విన్నాడు. అతడు దావీదు మీద కోపపడి “నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు? అడవిలో ఆ చిన్న గొర్రెల మందను ఎవరికి అప్పగించావు? నీ గర్వం, నీలోని చెడుతనం నాకు తెలుసు. యుద్ధం చూడడానికే నువ్వు వచ్చావు కదా?” అన్నాడు. 29 దావీదు “నేనేం చేశాను? ఊరికే అడుగుతున్నాను” అని చెప్పి 30 అక్కడ నుండి మరో వ్యక్తిని ఆలానే అడిగాడు. మళ్ళీ అదే జవాబు వచ్చింది.
31 దావీదు అడుగుతున్న మాటలు కొందరికి తెలిసినప్పుడు వారు ఆ సంగతి సౌలుతో చెబితే సౌలు దావీదును పిలిపించాడు. 32 దావీదు సౌలుతో “ఈ ఫిలిష్తీయుడి విషయంలో ఎవరూ ఆందోళన పడనక్కరలేదు. మీ సేవకుడనైన నేను వాడితో యుద్ధం చేస్తాను” అన్నాడు. 33 సౌలు “ఈ ఫిలిష్తీయునితో యుద్ధం చేయడానికి నీకు బలం చాలదు. నువ్వు చిన్న పిల్లవాడివి. వాడు చిన్నప్పటినుండి యుద్దాలు చేస్తూ ఉన్నాడు” అని దావీదుతో అన్నాడు.
34 అందుకు దావీదు సౌలుతో “నీ సేవకుడనైన నేను నా తండ్రి గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు ఒక ఎలుగుబంటి అయినా, సింహమైనా వచ్చి మందలోనుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకుపోతే 35 నేను దాన్ని వెంటాడి చంపి దాని నోట్లో నుండి ఆ గొర్రెపిల్లను విడిపించాను. అది నాపైకి వచ్చినప్పుడు దాని గడ్డం పట్టుకుని కొట్టి చంపాను.
36 నీ సేవకుడనైన నేను సింహాన్నీ ఎలుగుబంటినీ చంపాను. సజీవుడైన దేవుని సైన్యాన్ని దూషించిన ఈ సున్నతిలేని ఫిలిష్తీయుడు కూడా వాటిలో ఒకదానిలాగా అవుతాడు.
37 సింహం, ఎలుగుబంటి బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండి కూడా నన్ను విడిపిస్తాడు” అని చెప్పాడు. సౌలు “యెహోవా నీకు తోడుగా ఉంటాడు గాక, వెళ్ళు” అని దావీదుతో అన్నాడు.
38 అప్పుడు సౌలు తన యుద్ధ వస్త్రాలను దావీదుకు తొడిగించాడు. ఒక కంచు శిరస్త్రాణం అతనికి పెట్టి, యుద్ధ కవచం తొడిగించాడు.
39 దావీదు తన యుద్ధ కవచం మీద తన కత్తి కట్టుకున్నాడు. అయితే అవి అతనికి అలవాటు లేవు గనక నడవలేకపోయాడు. అప్పుడు దావీదు “ఇవి నాకు అలవాటు లేదు, వీటితో నేను యుద్ధానికి వెళ్లలేను” అని సౌలుతో చెప్పి వాటిని తీసివేశాడు. 40 తన చేతికర్ర పట్టుకుని వాగులోనుండి ఐదు నున్నని రాళ్లు ఏరుకుని తన దగ్గర ఉన్న వడిసెల పట్టుకుని ఆ ఫిలిష్తీయునికి దగ్గరగా వెళ్ళాడు.
41 బల్లెం మోసేవాడు తనకు ముందుగా నడుస్తుంటే, ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరికి వచ్చి 42 చుట్టూ తేరి చూసి, ఎర్రనివాడు, అందగాడు, బాలుడు అయిన దావీదును నిర్లక్ష్యంగా చూశాడు. 43 ఫిలిష్తీయుడు “కర్ర తీసుకు నువ్వు నా మీదికి వస్తున్నావే, నేనేమైనా కుక్కనా?” అని చెప్పి తమ దేవుళ్ళ పేరున దావీదును శపించాడు.
44 “నా దగ్గరికి రా, నిన్ను చంపి నీ మాంసాన్ని పక్షులకు, జంతువులకు వేస్తాను” అని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అన్నప్పుడు, 45 దావీదు “నువ్వు కత్తి, ఈటె, బల్లెం తీసుకుని నా మీదికి వస్తున్నావు. నేనైతే నువ్వు దూషిస్తున్న ఇశ్రాయేలీయుల సేనల అధిపతి యెహోవా పేరిట నీ మీదికి వస్తున్నాను.
46 ఈ రోజు యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తాడు. నేను నిన్ను చంపి నీ తల తీసేస్తాను. దేవుడు ఇశ్రాయేలీయులకు తోడుగా ఉన్నాడని లోకంలోని వారంతా తెలుసుకొనేలా నేను ఈ రోజున ఫిలిష్తీయుల శవాలను పక్షులకు, జంతువులకు వేస్తాను. 47 అప్పుడు యెహోవా కత్తిచేత, ఈటెచేత రక్షించేవాడు కాదని ఇక్కడ ఉన్నవారంతా తెలుసుకుంటారు. యుద్ధం యెహోవాయే చేస్తాడు. ఆయన మిమ్మల్ని మాకు అప్పగిస్తాడు” అని చెప్పాడు.
48 ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును ఎదుర్కోవడానికి ముందుకు కదిలాడు. దావీదు, సైన్యం ఉన్న వైపుకు వేగంగా పరిగెత్తి వెళ్ళి 49 తన సంచిలో చెయ్యి పెట్టి అందులోనుండి ఒక రాయి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిష్తీయుని నుదురుపై తగిలేలా కొట్టాడు. ఆ రాయి వాడి నుదురులోకి దూసుకు పోయింది. వాడు నేలపై బోర్లా పడిపోయాడు.
50 ఆ విధంగా దావీదు వడిసెలతో, రాయితో ఫిలిష్తీయుణ్ణి ఓడించాడు. అతడు ఆ ఫిలిష్తీయుణ్ణి కొట్టి చంపాడు. అతని చేతిలో కత్తి లేదు. 51 దావీదు పరుగెత్తుకుంటూ వెళ్ళి ఫిలిష్తీయుని మీద నిలబడి వాడి వరలోని కత్తి దూసి దానితో వాడిని చంపి, తల తెగగొట్టాడు. ఫిలిష్తీయులు తమ వీరుడు చనిపోవడం చూసి అంతా పారిపోయారు.
52 అప్పుడు ఇశ్రాయేలువారు, యూదావారు లేచి, హర్షధ్వానాలు చేస్తూ బయలుదేరి లోయ ప్రదేశం వరకూ, ఎక్రోను ద్వారాల వరకూ ఫిలిష్తీయులను తరిమారు. చచ్చిన ఫిలిష్తీయులు షరాయిం దారి పొడవునా గాతు*, ఎక్రోను పట్టణాల వరకూ కూలిపోయారు. 53 తరువాత ఇశ్రాయేలువారు ఫిలిష్తీయులను తరమడం ఆపి తిరిగి వచ్చి వారి డేరాల్లో ఉన్నదంతా దోచుకున్నారు. 54 అయితే దావీదు ఆ ఫిలిష్తీయుని ఆయుధాలను తన డేరాలో ఉంచుకుని, అతని తలను తీసుకు యెరూషలేముకు వచ్చాడు.
55 దావీదు ఫిలిష్తీయుణ్ణి ఎదుర్కోవడానికి వెళ్ళడం చూసి సౌలు తన సైన్యాధిపతి అబ్నేరును పిలిచి “అబ్నేరూ, ఈ కుర్రవాడు ఎవరి కొడుకు?” అని అడిగినప్పుడు, అబ్నేరు “రాజా, నీమీద ఒట్టు. అతడెవరో నాకు తెలియదు” అన్నాడు. 56 అప్పుడు రాజు “ఈ కుర్రవాడు ఎవరి కొడుకో అడిగి తెలుసుకో” అని ఆజ్ఞాపించాడు.
57 ఫిలిష్తీయుని చంపి తిరిగి వస్తున్న దావీదును అబ్నేరు ఎదుర్కొని ఫిలిష్తీయుని తల, దావీదు చేతిలో ఉండగానే సౌలు దగ్గరికి తీసుకువచ్చాడు. 58 సౌలు అతనితో “అబ్బాయ్! మీ నాన్న ఎవరు?” అని అడిగినప్పుడు దావీదు “నేను నీ దాసుడు, బేత్లెహేము ఊరి వాడైన యెష్షయి కొడుకుని” అని జవాబిచ్చాడు.
* 17:52 గాతు లోయలో