21
దావీదు నోబులో
1 దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు దగ్గరికి వచ్చాడు. అహీమెలెకు దావీదు రావడం చూసి భయపడి “నువ్వు ఒంటరిగా వచ్చావెందుకు?” అని అడిగాడు,
2 దావీదు “రాజు నాకు ఒక పని అప్పగించి, ‘నేను నీకు ఆజ్ఞాపించి పంపిస్తున్న పని ఎలాటిదో అది ఎవ్వరితో చెప్పవద్దు’ అన్నాడు. ఒక చోటికి వెళ్ళమని యువకులకు నేను చెప్పాను.
3 తినడానికి నీ దగ్గర ఏం ఉన్నాయి? ఐదు రొట్టెలు గానీ ఇంకా ఏమైనా ఉంటే అవి నాకు ఇవ్వు” అని యాజకుడైన అహీమెలెకును అడిగాడు.
4 యాజకుడు “మామూలు రొట్టెలు నా దగ్గర లేవు. పవిత్రమైన రొట్టెలు మాత్రమే ఉన్నాయి. పనివాళ్ళు స్త్రీలకు దూరంగా ఉన్నట్టైతే వారు ప్రతిష్ఠితమైన రొట్టెలు తినవచ్చు” అని దావీదుతో అన్నాడు.
5 అప్పుడు దావీదు “మేము బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ మూడు రోజులు నిజంగా స్త్రీలు మాకు దూరంగానే ఉన్నారు. పనివాళ్ళ బట్టలు పవిత్రంగానే ఉన్నాయి. ఒకవేళ మేము చేయబోయే పని అపవిత్రమైనదైతే ఏంటి? రాజాజ్ఞ బట్టి అది పవిత్రంగా ఎంచబడుతుంది” అని యాజకునితో అన్నాడు.
6 అప్పుడు యెహోవా సన్నిధానం నుండి తీసిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరే రొట్టెలు లేనందువల్ల, వేడిగా రొట్టెలు చేసే రోజున తీసిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికిచ్చాడు.
7 ఆ రోజున సౌలు సేవకుల్లో ఒకడు అక్కడ యెహోవా సన్నిధానంలో ఉన్నాడు. అతని పేరు దోయేగు. అతడు ఎదోమీయుడు. అతడు సౌలు పశుల కాపరులకు నాయకుడు.
8 “రాజు పని త్వరగా జరగాలన్న తొందరలో నా కత్తిని, ఆయుధాలను నేను తీసుకు రాలేదు. ఇక్కడ నీ దగ్గర కత్తి గానీ ఈటె గానీ ఉందా?” అని దావీదు అహీమెలెకును అడిగితే,
9 యాజకుడు “ఏలా లోయలో నువ్వు చంపిన గొల్యాతు అనే ఫిలిష్తీయుడి కత్తి ఉంది. అదిగో బట్టతో చుట్టి ఏఫోదు వెనక ఉంది. అది తప్ప ఇక్కడ మరి ఏ కత్తీ లేదు. దాన్ని తీసుకోవడం నీకు ఇష్టమైతే తీసికో” అన్నాడు. దావీదు “దానికి మించింది వేరొకటి లేదు. అది నాకివ్వు” అన్నాడు.
దావీదు గాతులో
10 దావీదు సౌలుకు భయపడినందువల్ల ఆ రోజునే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు దగ్గరికి వచ్చాడు.
11 ఆకీషు సేవకులు “ఈ దావీదు ఆ దేశపు రాజు కదా? ఆ దేశపు ప్రజలు పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ, సౌలు వెయ్యిమందిని, దావీదు పదివేల మందిని హతం చేసారని పాడిన పాటలు ఇతని గురించినవే గదా” అని అతని గురించి రాజుతో చెబుతుంటే,
12 దావీదు ఈ మాటలను తన మనస్సులో పెట్టుకుని గాతు రాజైన ఆకీషుకు చాలా భయపడ్డాడు.
13 అందుకని దావీదు వారి ముందు తన ప్రవర్తన మార్చుకుని పిచ్చివాడిలా నటిస్తూ, గుమ్మాల తలుపుల మీద గీతలు గీస్తూ, ఉమ్మిని తన గడ్డంపైకి కారనిస్తూ ఉన్నాడు. వారు దావీదును పట్టుకున్నప్పుడు అతడు పిచ్చి పనులు చేస్తూ వచ్చాడు.
14 అది చూసి ఆకీషు రాజు “మీరు చూశారుగా, అతనికి పిచ్చి పట్టింది, ఇతడిని నా దగ్గరికి ఎందుకు తీసుకువచ్చారు?
15 పిచ్చి పనులు చేసేవాడితో నాకేం పని? నా సముఖంలో పిచ్చి పనులు చేయడానికి ఇతడిని తీసుకువచ్చారేంటి? వీడు నా ఇంట్లోకి రావచ్చా?” అని తన సేవకులతో అన్నాడు.