15
దావీదు మీద అబ్షాలోము తిరుగుబాటు
ఇది జరిగిన తరువాత అబ్షాలోము ఒక రథాన్ని, కొన్ని గుర్రాలను సిద్దం చేసుకున్నాడు. తన ముందు పరుగెత్తడానికి ఏభైమంది సైనికులను ఏర్పాటు చేసుకున్నాడు. పొద్దున్నే లేచి బయలుదేరి పట్టణ ద్వార గుమ్మం దారి దగ్గర ఒకవైపున కూర్చుని ఉండేవాడు. తమ వివాదాల పరిష్కారం కోసం తీర్పుల కోసం రాజు దగ్గర వచ్చే ప్రజలను కనిపెట్టి వారిని పిలిచేవాడు. వారిని “నువ్వు ఏ ఊరివాడివి?” అని క్షేమ సమాచారాలు తెలుసుకొనేవాడు. “నీ దాసుడనైన నేను ఇశ్రాయేలు గోత్రాల్లో ఫలానా గోత్రానికి చెందినవాణ్ణి” అని వాడు చెప్పినప్పుడు, అబ్షాలోము “నీ వివాదం సవ్యంగా, న్యాయంగా ఉన్నది గానీ దాన్ని విచారణ చేసేందుకు రాజు దగ్గర సరి అయిన విచారణకర్త ఒక్కడు కూడా లేడు.
నేను ఈ దేశానికి న్యాయాధిపతిగా ఉంటే ఎంత బాగుండేది. అప్పుడు వివాదాలు పరిష్కరించుకోవడానికి అంతా నా దగ్గరికి వస్తారు, నేను వారికి న్యాయం జరిగిస్తాను” అని చెబుతూ వచ్చాడు. ఎవరైనా తనకు నమస్కారం చేయడానికి తన దగ్గరికి వస్తే అతడు తన చెయ్యి చాపి వారిని పట్టుకుని ముద్దు పెట్టుకొనేవాడు. తీర్పు కోసం రాజు దగ్గరికి వచ్చే ఇశ్రాయేలీయులందరి పట్లా అబ్షాలోము ఈ విధంగా చేసి ఇశ్రాయేలీయులనందరినీ తనవైపు ఆకర్షించుకున్నాడు.
ఆ విధంగా నాలుగేళ్ళు గడచిన తరువాత అబ్షాలోము రాజు దగ్గరికి వచ్చాడు. “నీ దాసుడనైన నేను అరాము దేశంలోని గెషూరులో ఉన్నప్పుడు ‘యెహోవా నన్ను యెరూషలేముకు తిరిగి రప్పిస్తే నేను ఆయనను సేవిస్తాను’ అని మొక్కుకున్నాను. కాబట్టి నేను హెబ్రోనుకు వెళ్ళి యెహోవాకు నేను మొక్కుబడి తీర్చుకొనడానికి నాకు అనుమతి ఇవ్వు” అని అడిగాడు. అప్పుడు రాజు “క్షేమంగా వెళ్లి రండి” అని అతనికి అనుమతి ఇచ్చాడు. అతడు లేచి హెబ్రోనుకు బయలుదేరాడు.
10 అబ్షాలోము తన గూఢచారులను పిలిచి “మీరు బూర శబ్దం విన్నప్పుడు, ‘అబ్షాలోము హెబ్రోనులో పరిపాలిస్తున్నాడు’ అని కేకలు వేయాలని అన్ని ఇశ్రాయేలీయుల గోత్రాల వారిని సిద్ధపరచండి” అని చెప్పి పంపించాడు. 11 అబ్షాలోము ఆహ్వానం మేరకు యెరూషలేములో నుండి 200 మంది విందు కోసం బయలుదేరారు. వీరంతా జరగబోయే విషయాలు ఏమీ తెలియని అమాయకులు. 12 బలి అర్పించాలని గిలో గ్రామ నివాసి అహీతోపెలును పిలిపించాడు. ఇతడు దావీదు సలహాదారుడు. అబ్షాలోము దగ్గర కూడుకొన్న జన సమూహం మరీ ఎక్కువ కావడంవల్ల జరుగుతున్న కుట్ర మరింత బలపడింది.
దావీదు కుటుంబ సమేతంగా పారిపోవడం
13 ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షం చేరిపోయారని దావీదుకు కబురు అందింది. 14 దావీదు యెరూషలేములో ఉన్న తన సేవకులకందరికీ ఇలా ఆజ్ఞ ఇచ్చాడు “అబ్షాలోము చేతిలో నుండి మనం తప్పించుకుని బతకలేము. మనం పారిపోదాం పదండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకుని, మనకు కీడు చేయక ముందే, నగరంలో హత్యాకాండ జరిపించకముందే మనం త్వరగా వెళ్లిపోదాం రండి.” 15 అప్పుడు రాజు సేవకులు ఇలా చెప్పారు “అయ్యా, వినండి. నువ్వు మమ్మల్ని ఏలేవాడివి. మాకు రాజువు. నువ్వు చెప్పినట్టు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము.”
16 అప్పుడు రాజు నగరాన్ని కనిపెట్టుకుని ఉండడానికి తన పదిమంది ఉపపత్నులను ఉంచి, తన కుటుంబాన్ని వెంటబెట్టుకుని కాలినడకన బయలుదేరాడు. 17 రాజు, అతని కుటుంబం బయలుదేరి బెత్మెర్హాకుకు వచ్చి అక్కడ సేదదీర్చుకున్నారు. 18 కెరేతీయులు, పెలేతీయులు, గాతు నుండి వచ్చిన ఆరు వందలమంది గిత్తీయులు రాజుకు ముందుగా నడిచారు. రాజు సేవకులంతా అతనికి రెండు వైపులా నడిచారు. 19 గిత్తీయుడైన ఇత్తయితో రాజు “నువ్వు నివసించేందుకు స్థలం కోరి వచ్చిన విదేశీయుడివి. మాతో కలసి ఎందుకు వస్తున్నావు? వెనక్కు వెళ్లి రాజ భవనంలో ఉండు. 20 నిన్ననే వచ్చిన నీకు, ఎక్కడి వెళ్తామో తెలియని మాతో కలసి ఈ తిరుగులాట ఎందుకు? నువ్వు నీ సహోదరులను తీసుకుని వెనక్కు వెళ్ళిపో. యెహోవా నీకు తన సత్యం, కనికరం నీపై చూపుతాడు గాక” అని చెప్పాడు.
21 అప్పుడు ఇత్తయి “నేను చనిపోయినా, బ్రతికినా యెహోవా మీద ఒట్టు, నా ఏలిక, రాజు అయిన నీ జీవం మీద ఒట్టు. నా రాజువైన నువ్వు ఎక్కడ ఉంటావో ఆ స్థలం లోనే నీ దాసుడనైన నేనూ ఉంటాను” అని రాజుతో చెప్పాడు. 22 అప్పుడు దావీదు “ఆలాగైతే నువ్వు మాతో కూడ రావచ్చు” అని చెప్పినప్పుడు గిత్తీయుడైన ఇత్తయి, అతని పరివారమంతా దావీదును వెంబడించారు.
23 వారు కొనసాగిపోతూ ఉన్నప్పుడు ప్రజలంతా బాగా రోదించారు. ఈ విధంగా వారంతా రాజుతో కలసి కిద్రోనువాగు దాటి ఎడారి వైపు ప్రయాణమై వెళ్ళారు. 24 సాదోకు, లేవీయులంతా దేవుని నిబంధన మందసాన్ని మోస్తూ దావీదు దగ్గర ఉన్నారు. వారు దేవుని మందసాన్ని కిందికి దించారు. పట్టణంలోనుండి బయలుదేరిన ప్రజలంతా దాటిపోయే వరకూ అబ్యాతారు అక్కడే నిలబడి ఉన్నాడు.
25 అప్పుడు రాజు సాదోకును పిలిచి “దేవుని మందసాన్ని తిరిగి పట్టణంలోకి తీసుకువెళ్ళు. యెహోవా దృష్టికి నేను దయ పొందితే ఆయన నన్ను తిరిగి రప్పించి 26 దానినీ, అది ఉండే స్థలాన్నీ నాకు చూపిస్తాడు. నీపట్ల నాకు దయ లేదని చెప్పినట్టయితే అది ఆయన ఇష్టం. ఆయన దృష్టికి ఏది అనుకూలమో దానినే నా విషయంలో జరిగిస్తాడు” అని చెప్పాడు. 27 అతడు యాజకుడైన సాదోకుతో ఇంకా ఇలా చెప్పాడు. “దీర్ఘదర్శివైన సాదోకూ, నీకు మంచి జరుగుతుంది. నువ్వు నీ కొడుకు అహిమయస్సునూ, అబ్యాతారుకు కొడుకు యోనాతానునూ వెంటబెట్టుకుని పట్టణం వెళ్ళు. 28 నేను చెప్పేది విను, నీ నుండి నాకు కచ్చితమైన కబురు వచ్చేదాకా నేను అరణ్యంలో నది తీరాల దగ్గర వేచి ఉంటాను.” 29 అప్పుడు సాదోకు, అబ్యాతారు దేవుని మందసాన్ని యెరూషలేముకు తీసుకువెళ్ళి అక్కడ ఉండిపోయారు.
30 దావీదు తన తల కప్పుకుని, ఏడుస్తూ, చెప్పులు లేకుండా నడుచుకొంటూ ఒలీవ చెట్ల కొండ ఎక్కుతూ వెళ్ళాడు. అతనితో ఉన్నవారంతా తలలు కప్పుకుని ఏడుస్తూ కొండ ఎక్కారు. 31 అంతలో ఒకడు వచ్చి “అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలుకు కూడా పాత్ర ఉంది” అని దావీదుకు చెప్పాడు. అప్పుడు దావీదు “యెహోవా, అహీతోపెలు పథకాలను చెడగొట్టు” అని ప్రార్థన చేశాడు.
32 దేవుణ్ణి ఆరాధించే ఒక స్థలం ఆ కొండమీద ఉంది. వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు అర్కీయుడైన హూషై తన పైదుస్తులు చింపుకుని, తలపై దుమ్ము పోసుకుని వచ్చి రాజు దర్శనం చేసుకున్నాడు.
33 రాజు “నువ్వు నాతో ఉంటే నాకు భారంగా ఉంటుంది. 34 నువ్వు తిరిగి పట్టణానికి వెళ్లి, అబ్షాలోముతో ‘రాజా, ఇంతవరకూ నీ తండ్రికి సేవచేసినట్టు ఇకనుండి నీకూ సేవ చేస్తాను’ అని చెప్పి అతని దగ్గర చేరి, నా తరపున పనిచేస్తూ అహీతోపెలు అబ్షాలోముతో కలసి చేసే కుట్రలు భగ్నం చేయగలవు. 35 అక్కడ యాజకులైన సాదోకు, అబ్యాతారు నీకు సహాయకులుగా ఉంటారు. కనుక రాజ నగరంలో జరుగుతున్న విషయాలు నీకు వినిపిస్తే వాటిని యాజకుడైన సాదోకుతో, అబ్యాతారుతో చెప్పు. 36 వారి ఇద్దరు కొడుకులు సాదోకు కొడుకు అహిమయస్సు, అబ్యాతారుకు కొడుకు యోనాతాను అక్కడ ఉన్నారు. నీకు తెలిసిన విషయాలన్నీ వారి ద్వారా నాకు తెలియపరచు” అని చెప్పి అతణ్ణి పంపించాడు.
37 అందువల్ల దావీదు స్నేహితుడు హూషై యెరూషలేము పట్టణానికి బయలుదేరాడు. ఆ సమయానికి అబ్షాలోము యెరూషలేము చేరుకున్నాడు.