2
దావీదు యూదా రాజుగా అభిషేకం
కొంతకాలం తరువాత దావీదు “నేను యూదా పట్టణాల్లో ప్రవేశించ వచ్చా?” అని యెహోవా దగ్గర విచారణ చేశాడు. “వెళ్ళు” అని యెహోవా అతనితో చెప్పాడు. “ఏ పట్టణానికి వెళ్ళమంటావు?” అని దావీదు అడిగాడు. “హెబ్రోనుకు వెళ్ళు” అని ఆయన చెప్పాడు. అప్పుడు దావీదు యెజ్రెయేలీయురాలు అహీనోయము, కర్మెలీయుడు నాబాలుకు భార్యగా ఉండి విధవరాలైన అబీగయీలు, అనే తన ఇద్దరు భార్యలను వెంట బెట్టుకుని అక్కడికి వెళ్ళాడు. దావీదు తన దగ్గర ఉన్న వారినందరినీ, వారి వారి కుటుంబాలనూ వెంట బెట్టుకుని వెళ్ళాడు. వీరు హెబ్రోను నగరాల్లో కాపురం పెట్టారు. అప్పుడు యూదా జాతి ప్రజలు అక్కడికి వచ్చి దావీదును తమ రాజుగా పట్టాభిషేకం చేశారు.
సౌలును యాబేష్గిలాదు ప్రజలు పాతిపెట్టారని దావీదు తెలుసుకుని వారి దగ్గరికి తన మనుషులను పంపించాడు. “మీరు మీ రాజు సౌలును పాతిపెట్టి అతని పట్ల నమ్మకత్వం కనపరిచారు కాబట్టి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. యెహోవా మీకు తన కృపను, విశ్వాస్యతను చూపుతాడు గాక. మీరు చేసిన ఈ పనిని బట్టి నేను కూడా మీకు మేలు చేస్తాను. మీ రాజు సౌలు చనిపోయినప్పుడు యూదా జాతి వారు నాకు రాజుగా పట్టాభిషేకం చేశారు. మీరు ధైర్యం తెచ్చుకుని స్థిరంగా ఉండండి” అని కబురు పంపాడు.
ఇశ్రాయేలుకు, యూదాకు మధ్య యుధం
3:2-5; 1దిన 3:1-4
సౌలు సైన్యాధిపతి, నేరు కుమారుడు అయిన అబ్నేరు, సౌలు కుమారుడు ఇష్బోషెతు*ను మహనయీముకు తీసుకు వెళ్ళి, అతణ్ణి గిలాదు వారిపై, ఆషేరీయుల పై, యెజ్రెయేలు పై, ఎఫ్రాయిమీయులపై, బెన్యామీనీయులపై, ఇశ్రాయేలు వారి పై రాజుగా నియమించి అతనికి పట్టాభిషేకం చేశాడు. 10 నలభై ఏళ్ల వయసు గల ఇష్బోషెతు రెండు సంవత్సరాలు పరిపాలించాడు. అయితే యూదా జాతివారు దావీదు పక్షాన నిలబడ్డారు. 11 దావీదు ఏడు సంవత్సరాల ఆరు నెలలు హెబ్రోనులో ఉండి యూదా వారిని పరిపాలించాడు.
12 అంతలో నేరు కుమారుడు అబ్నేరు, సౌలు కుమారుడు ఇష్బోషెతు సేవకులు మహనయీములో నుండి బయలుదేరి గిబియోనుకు వచ్చారు. 13 అప్పుడు సెరూయా కుమారుడు యోవాబు, దావీదు సేవకులు బయలుదేరి వారిని ఎదిరించడానికి గిబియోను లోయకు వచ్చి లోయకు వీరు ఈ వైపున, వారు ఆ వైపున దిగి ఉన్నారు.
14 అబ్నేరు “మన యువకులను ముందు ఒకరితో ఒకరు పోరాటం చేయిద్దామా?” అని యోవాబుతో అన్నాడు. యోవాబు “అలాగే చేద్దాం” అన్నాడు. 15 సౌలు కుమారుడు ఇష్బోషెతుకు చెందిన బెన్యామీనీయులు పన్నెండుమంది, దావీదు సేవకుల్లో నుండి పన్నెండుమంది లేచి ఎదురెదురుగా నిలబడ్డారు. 16 ఒక్కొక్కడు తన ఎదురుగా ఉన్నవాడి తల పట్టుకుని వాడి డొక్కలో కత్తితో పొడిచారు. అందరూ ఒకేసారి నేలపై పడిపోయారు. అందువల్ల ఆ స్థలానికి హెల్కతు హస్సూరీము అని పేరు వచ్చింది. అది గిబియోనుకు దగ్గరలో ఉంది.
17 ఆ తరువాతి రోజు ఘోరమైన యుద్ధం జరిగింది. అబ్నేరు, ఇశ్రాయేలు వారు దావీదు సైనికుల ముందు నిలవ లేక పారిపోయారు. 18 సెరూయా ముగ్గురు కొడుకులు యోవాబు, అబీషై, అశాహేలు అక్కడ ఉన్నారు. అశాహేలు అడవి లేడి లాగా వేగంగా పరిగెత్తగలడు.
19 అతడు కుడి వైపుకైనా, ఎడమ వైపుకైనా చూడకుండా అబ్నేరును తరుముతున్నప్పుడు, 20 అబ్నేరు వెనక్కి తిరిగి “నువ్వు అశాహేలువా?” అని అతణ్ణి అడిగాడు. అతడు “అవును, నేను అశాహేలునే” అన్నాడు. 21 “నువ్వు కుడి వైపుకైనా, ఎడమ వైపుకైనా పరుగెత్తి ఆ యువకుల్లో ఒకడి మీదకు వెళ్లి వాడి ఆయుధాలు స్వాధీనం చేసుకో” అని అబ్నేరు అతనితో చెప్పినప్పటికీ అశాహేలు ఈ వైపుకు గానీ ఆ వైపుకు గానీ చూడకుండా అతణ్ణి తరుముతూనే ఉన్నాడు.
22 అబ్నేరు “నన్ను తరమడం మానేసి వెనక్కి తిరిగి వెళ్ళు. నేను నిన్ను నేలకు కొట్టి చంపితే, ఆ తరువాత నీ అన్న యోవాబుకు నా ముఖమెలా చూపించగలను?” అన్నాడు. 23 అందుకు అశాహేలు “నేను వెనక్కి వెళ్ళను” అన్నాడు. అప్పుడు అబ్నేరు ఈటె అంచుతో అతని కడుపులో పొడవడం వల్ల ఈటె అతనిలోకి దిగి వీపు నుండి వెనక్కి వచ్చింది. అతడు అక్కడే పడి చనిపోయాడు. అశాహేలు చనిపోయి పడిన ఉన్న స్థలానికి వచ్చిన వారంతా నిలబడి పోయారు.
24 యోవాబు, అబీషైలు అబ్నేరును తరుముతూ గిబియోను అడవి దారిలోని గుహ ఎదురుగా ఉన్న అమ్మా అనే కొండ దగ్గరికి వచ్చారు. అప్పుడు సూర్యుడు అస్తమించాడు. 25 అబ్నేరు మీదికి ఎవరూ దాడి చేయకుండా బెన్యామీనీయులు గుంపుగా చేరి ఆ కొండ మీద నిలబడ్డారు. 26 అబ్నేరు కేక వేసి “కత్తి ఎప్పుడూ చంపుతూనే ఉండాలా? అది చివరకూ కీడుకే కారణం అవుతుందని నీకు తెలుసు గదా. మీ సోదరులను తరమడం ఆపమని నీ మనుషులకు చెప్పకుండా ఎంతకాలం ఉంటావు?” అని యోవాబుతో అన్నాడు.
27 అందుకు యోవాబు “దేవుని మీద ఒట్టు. నువ్వు ఈ మాట చెప్పకుండా ఉన్నట్లయితే మా మనుషులు తమ సోదరులను రేపు ఉదయం వరకూ తరముతూనే ఉండే వారు” అన్నాడు. 28 అతడు బాకా ఊదగా ప్రజలంతా ఆగిపోయి ఇశ్రాయేలు వారిని తరమడం, యుద్ధం చేయడం మానివేశారు. 29 అబ్నేరు, అతని మనుషులు ఆ రాత్రి అంతా ఎడారి గుండా ప్రయాణం చేసి యొర్దాను నది దాటి బిత్రోను దారిలో మహనయీము చేరుకున్నారు.
30 యోవాబు అబ్నేరును తరమడం మాని తిరిగి వచ్చి మనుషులను పోగు చేసి లెక్క చూడగా దావీదు సేవకుల్లో అశాహేలు గాక పందొమ్మిదిమంది తక్కువయ్యారు. 31 అయితే దావీదు సేవకులు బెన్యామీనీయుల్లో, అబ్నేరు మనుషుల్లో మూడు వందల అరవై మందిని చంపారు. 32 వారు అశాహేలును తీసుకువెళ్ళి బేత్లెహేములో ఉన్న అతని తండ్రి సమాధిలో పాతిపెట్టారు. తరువాత యోవాబు, అతని మనుషులు రాత్రంతా నడిచి తెల్లవారేసరికి హెబ్రోనుకు చేరుకున్నారు.
* 2:8 2:8 ఇష్బోషెతు ఇష్బలే 2:16 2:16 హెల్కతు హస్సూరీము కత్తులతో నిండిన భూమి 2:29 2:29 బిత్రోను పగలు అంతా