3
భ్రష్టత్వం సంభవిస్తుంది
1 చివరి దినాల్లో అపాయకరమైన రోజులు వస్తాయని నీవు గ్రహించాలి.
2 మనుషులు స్వార్థపరులుగా, ధనాశపరులుగా, గొప్పలు చెప్పుకొనేవారుగా ఉంటారు. వారు గర్విష్టులు, దైవ దూషణ చేసేవారు, కన్నవారికి అవిధేయులు, చేసిన మేలు మరిచేవారు, అపవిత్రులు,
3 బొత్తిగా సహజ ప్రేమ లేనివారు, ఇతరులతో సామరస్యంగా ఉండలేనివారు, దుర్భాషలాడేవారు, నిగ్రహం లేనివారు, క్రూరులు, మంచిని ద్వేషించేవారు.
4 వారు ద్రోహులు, తలబిరుసు మనుషులు, గర్వాంధులు, దేవునికంటే శరీర సౌఖ్యాన్నే ఎక్కువగా ప్రేమించేవారు.
5 వారు పైకి భక్తి గలవారిలా ఉంటారు గానీ దాని శక్తిపై ఆధారపడరు. వారికి దూరంగా ఉండు.
6 ఇలాంటి వారు బలహీన మనస్తత్వం గల స్త్రీల ఇళ్ళలోకి చొరబడి వారిని వశం చేసుకుంటారు. ఈ స్త్రీలు అపరాధ భావనలతో కుంగిపోయి రకరకాల వాంఛలతో కొట్టుకు పోయేవారుగా ఉంటారు.
7 వాక్యాన్ని అస్తమానం నేర్చుకుంటూనే ఉన్నా వీరు సత్యం విషయమైన జ్ఞానాన్ని పొందలేరు.
8 యన్నే, యంబ్రే అనేవారు మోషేను ఎదిరించినట్టు వీరు కూడా చెడిపోయిన మనసు కలిగి విశ్వాసం విషయంలో భ్రష్టులై సత్యాన్ని ఎదిరిస్తారు.
9 అయితే వారిద్దరి అవివేకం ఏ విధంగా బయటపడిందో ఆలాగే వీరిది కూడా అందరికీ వెల్లడి అవుతుంది కాబట్టి వీరు ఇంకా ముందుకి సాగలేరు.
10 నీవు మాత్రం నా బోధనూ, ప్రవర్తననూ, ఉద్దేశాన్నీ, విశ్వాసాన్నీ, సహనాన్నీ, ప్రేమనూ, ఓర్పునూ అనుకరించావు.
11 అంతియొకయ, ఈకొనియ, లుస్త్ర అనే పట్టణాల్లో నేను అనుభవించిన హింసలనూ ప్రమాదాలనూ ఎరిగే నన్ను వెంబడించావు. అలాంటి హింసలు నేను సహించాను గాని, వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించాడు.
12 క్రీస్తు యేసులో సద్భక్తితో జీవించాలని కోరేవారంతా హింస పొందుతారు.
13 అయితే చెడ్డ వారూ, వంచకులూ ఇతరులను మోసపరుస్తూ తాము కూడా మోసపోతూ అంతకంతకూ చెడిపోతారు.
14 కానీ నీవు మాత్రం కచ్చితంగా తెలుసుకున్న వాటిని ఎవరి ద్వారా నేర్చుకున్నావో గ్రహించి వాటిలో నిలకడగా సాగిపో.
15 ఎందుకంటే క్రీస్తు యేసులో విశ్వాసం ద్వారా పాప విముక్తినిచ్చే జ్ఞానాన్ని నీకు కలిగించే శక్తిగల పరిశుద్ధ లేఖనాలు బాల్యం నుండీ నీకు తెలుసు.
16-17 దేవుని సేవకుడు సిద్ధపడి ప్రతి మంచి పనినీ జరిగించడానికి పూర్తి సన్నాహంతో ఉండాలి. అందుకోసమే ప్రతి లేఖనం దైవావేశం వలన ఉనికిలోకి వచ్చింది. అది బోధించడానికీ, ఖండించడానికీ, తప్పు దిద్దడానికీ, నీతిలో శిక్షణ ఇవ్వడానికీ తోడ్పడుతుంది.