*
కీర్తన 10
యెహోవా, ఎందుకు దూరంగా నిలిచి ఉన్నారు?
నేను కష్టంలో ఉన్నప్పుడు మీరెందుకు దాక్కుంటారు?
 
దుష్టులు తమ అహంకారంలో దీనులను వేటాడతారు,
వారు ఇతరుల కోసం పన్నిన కుట్రలో వారే చిక్కుకుంటారు.
వారు తమ హృదయ కోరికలను బట్టి అతిశయిస్తారు;
వారు అత్యాశపరులను దీవిస్తారు, యెహోవాను దూషిస్తారు.
దుష్టులు తమ అహంకారంలో దేవున్ని వెదకరు;
వారి ఆలోచనల్లో దేవునికి చోటు లేదు.
వారి మార్గాలు ఎప్పటికీ క్షేమంగా ఉంటాయి;
వారు మీ న్యాయవిధులను తిరస్కరించారు;
వారు తమ శత్రువులందరినీ హేళనగా చూస్తారు.
“ఏదీ మమ్మల్ని ఎప్పటికీ కదిలించలేదు ఎవరు మాకు హాని చేయలేరు”
అని వారు తమలో తాము అనుకుంటారు.
 
వారి నోటి నిండా శాపాలు, మోసాలు, బెదిరింపులు ఉన్నాయి;
ఇబ్బంది, కీడు వారి నాలుక క్రింద ఉంటాయి.
వారు గ్రామాల సమీపంలో పొంచి ఉంటారు;
చాటైన స్థలాల్లో వారు నిర్దోషులను చంపుతారు.
నిస్సహాయులైన వారి కోసం వారి కళ్లు వెదకుతాయి;
గుహలో సింహంలా వారు వేచి ఉంటారు.
నిస్సహాయులను పట్టుకోడానికి వారు ఎదురుచూస్తూ ఉంటారు;
వారు నిస్సహాయులను తమ వలలోనికి లాగి పట్టుకుంటారు.
10 బాధితులు నలిగి కుప్పకూలిపోతారు;
వారు వారి బలత్కారం వల్ల పతనమవుతారు.
11 “దేవుడు ఎప్పటికీ గమనించరు;
ఆయన తన ముఖాన్ని కప్పుకున్నారు ఇక ఎప్పుడు చూడరు”
అని వారు తమలో తాము అనుకుంటారు.
 
12 యెహోవా, లెండి! ఓ దేవా, మీ చేయి పైకెత్తండి.
నిస్సహాయులను మరువకండి.
13 దుష్టులు ఎందుకు దేవున్ని దూషిస్తారు?
“దేవుడు నన్ను లెక్క అడగరు”
అని వారు తమలో తాము ఎందుకు అనుకుంటారు?
14 దేవా, మీరైతే బాధితుల ఇబ్బందిని చూస్తారు;
వారి దుఃఖాన్ని మీరు లక్ష్యపెట్టి బాధ్యత తీసుకుంటారు.
నిస్సహాయులు మిమ్మల్ని ఆశ్రయిస్తారు;
తండ్రిలేనివారికి మీరే సహాయకులు.
15 దుష్టుల చేతిని విరగ్గొట్టండి.
కీడు చేసేవారిని వారి దుష్టత్వాన్ని బట్టి లెక్క అడగండి
ఒక్కడు మిగులకుండ వారిని వెంటాడి నిర్మూలం చేయండి.
 
16 యెహోవా నిరంతరం రాజై ఉన్నారు;
దేశాల ప్రజలు ఆయన భూభాగంలో నుండి నశిస్తారు.
17 యెహోవా, మీరు బాధపడేవారి కోరిక విన్నారు;
మీరు వారి ప్రార్థనను ఆలకించి వారిని ప్రోత్సహిస్తారు.
18 తండ్రిలేనివారిని అణచివేయబడిన వారిని మీరు రక్షిస్తారు,
అప్పుడు మానవులెవ్వరు ఎన్నడు భయాన్ని కలిగించరు.
* కీర్తన 10: 9 10 కీర్తనలు మొదట ఒకే అక్రోస్టిక్ పద్యం అయి ఉండవచ్చు, దీనిలో హెబ్రీ అక్షరాల యొక్క వరుస అక్షరాలతో ప్రత్యామ్నాయ పంక్తులు ప్రారంభమయ్యాయి. సెప్టూజంట్ లో ఇవి రెండు ఒకే కీర్తనగా ఉన్నాయి.