కీర్తన 16
దావీదు శ్రేష్ఠమైన కీర్తన.
1 నా దేవా, నేను మిమ్మల్ని ఆశ్రయించాను,
నన్ను కాపాడండి.
2 యెహోవాతో నేను, “మీరు నా ప్రభువు;
మీకు వేరుగా మంచిదేది నా దగ్గర లేదు” అని చెప్తాను.
3 భూమి మీద ఉన్న పరిశుద్ధ ప్రజల గురించి నేను ఇలా చెప్తాను,
“వారు మహనీయులు, వారిలోనే నా ఆనందం అంతా ఉంది.”
4 వేరే దేవుళ్ళ వెంటపడేవారికి కష్టాలు ఎక్కువవుతాయి.
వారి రక్తార్పణలలో నేను పాల్గొనను
నా పెదవులతో వారి పేర్లు కూడా పలకను.
5 యెహోవా మీరు మాత్రమే నా భాగము, నా పాత్ర.
మీరు నా భాగాన్ని భద్రపరుస్తారు.
6 మనోహరమైన స్థలాల్లో నా కోసం హద్దులు గీసి ఉన్నాయి;
ఖచ్చితంగా నాకు ఆనందకరమైన వారసత్వం ఉంది.
7 నాకు ఆలోచన చెప్పే యెహోవాను నేను స్తుతిస్తాను,
రాత్రివేళలో కూడా నా హృదయం నాకు హితవు చెప్తుంది.
8 ఎల్లప్పుడు నేను నా ఎదుట యెహోవాను చూస్తున్నాను.
ఆయన నా కుడి ప్రక్కనే ఉన్నారు, కాబట్టి నేను కదల్చబడను.
9 కాబట్టి నా హృదయం సంతోషించి, నా నాలుక ఆనందిస్తుంది;
నా శరీరం కూడా క్షేమంగా విశ్రమిస్తుంది.
10 ఎందుకంటే, మీరు నన్ను మృతుల రాజ్యంలో విడిచిపెట్టరు,
మీ పరిశుద్ధుని కుళ్లిపోనీయరు.
11 మీరు నాకు జీవమార్గాన్ని తెలియజేస్తారు;
మీ సన్నిధిలోని ఆనందంతో
మీ కుడిచేతి వైపున నిత్య ఆనందాలతో నన్ను నింపుతారు.