కీర్తన 26
దావీదు కీర్తన.
యెహోవా, నేను నిందారహితునిగా జీవించాను,
నాకు న్యాయం తీర్చండి;
నేను ఏ సందేహం లేకుండ
యెహోవాను నమ్మాను.
యెహోవా, నన్ను పరిశీలించండి, నన్ను పరీక్షించండి,
నా హృదయాన్ని నా మనస్సును పరీక్షించండి;
నేను నిరంతరం మీ మారని ప్రేమను జ్ఞాపకముంచుకుంటాను
మీ సత్యానికి అనుగుణంగా నడుచుకుంటాను.
 
నేను మోసగాళ్ళతో కూర్చోను,
వేషధారులతో నేను సహవాసం చేయను.
కీడుచేసేవారి గుంపు నాకు అసహ్యం
దుష్టులతో నేను కూర్చోను.
6-7 యెహోవా, నిర్దోషినని నా చేతులు కడుక్కుని,
బిగ్గరగా మీ స్తుతిని ప్రకటిస్తూ
మీ అద్భుత క్రియలన్నిటిని గురించి చెబుతూ
మీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేస్తాను.
 
యెహోవా, మీరు నివసించే ఆవరణం,
మీ మహిమ నివసించే స్థలం అంటే నాకు ఇష్టము.
పాపులతో పాటు నా ప్రాణాన్ని
నరహంతకులతో పాటు నా బ్రతుకును తుడిచివేయకండి.
10 వారి చేతుల్లో దుష్ట పన్నాగాలు ఉన్నాయి,
వారి కుడి చేతులు లంచాలతో నిండి ఉన్నాయి.
11 నేను నిందారహితంగా బ్రతుకుతాను;
నన్ను విమోచించండి నన్ను కరుణించండి.
 
12 నా పాదాలను సమతలమైన నేల మీద నిలిపాను;
గొప్ప సమాజాలలో నేను యెహోవాను స్తుతిస్తాను.