9
1 ఇశ్రాయేలు ప్రజల పేర్లన్నీ వారి వారి వంశ చరిత్రల్లో పొందుపర్చబడ్డాయి. ఆ వంశ చరిత్రలన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో చేర్చబడ్డాయి.
యెరూషలేము ప్రజలు
యూదా ప్రజలు బందీలుగా పట్టుబడి బలవంతంగా బబలోనుకు తీసుకొని పోబడ్డారు. దేవునికి వారు విశ్వాసపాత్రులు కానందువల్ల వారికి అలా జరిగింది. 2 మొట్టమొదటి సారిగా తమ స్థలాలకు, పట్టణాలకు తిరిగి వచ్చిన వారిలో కొందరు ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, ఆలయ సేవకులు ఉన్నారు.
3 యెరూషలేములో నివసించిన యూదా, బెన్యామీను, ఎఫ్రాయిము, మనష్షే వంశాల ప్రజలు ఎవరనగా:
4 అమీహూదు కుమారుడు ఊతై. అమీహూదు తండ్రి పేరు ఒమ్రీ. ఒమ్రీ తండ్రి పేరు ఇమ్రీ. ఇమ్రీ తండ్రి బానీ. పెరెసు సంతతి వాడు బానీ. యూదా కుమారుడు పెరెసు.
5 యెరూషలేములో నివసించిన షిలోనీయులెవరనగా: షిలోనీయులలో మొదటివాడైన ఆశాయా మరియు అతని కుమారులు.
6 యెరూషలేములో నివసించిన జెరహు వంశం వారిలో యెవుయేలు, అతని బంధువులు వున్నారు. వారంతా మొత్తం ఆరువందల తొంబదిమంది వున్నారు.
7 మెషుల్లాము కుమారుడు సల్లు; మెషుల్లాము తండ్రి హోదవ్యా; హోదవ్యా తండ్రి హసెనూయా అనేవారు యెరూషలేములో నివసించిన బెన్యామీను సంతతివారు. 8 యెహోరాము కుమారుడు ఇబ్నెయా. ఉజ్జీ కుమారుడు ఏలా. మిక్రి కుమారుడు ఉజ్జీ. షెఫట్యా కుమారుడు మెషుల్లాము. రగూవేలు కుమారుడు షెఫట్యా. ఇబ్నీయా కుమారుడు రగూవేలు. 9 యెరూషలేములో తొమ్మిది వందల ఏబదిఆరు మంది బెన్యామీనీయులు ఉన్నట్లు వారి వంశ చరిత్ర తెలుపుతుంది. వీరంతా ఆయా కుటుంబ పెద్దలు.
10 యెరూషలేములో నివసించిన యాజకులు ఎవరనగా: యెదాయా, యెహోయారీబు, యాకీను, 11 మరియు హిల్కీయా కుమారుడైన అజర్యా. మెషుల్లాము కుమారుడు హిల్కీయా. సాదోకు కుమారుడు మెషుల్లాము. మెరాయోతు కుమారుడు సాదోకు. అహీటూబు కుమారుడు మెరాయోతు. ఆలయ నిర్వహణలో అహీటూబు ముఖ్యమైన అధికారి. 12 యెరోహాము కుమారుడు అదాయా అనువాడొకడున్నాడు. యెరోహాము తండ్రి పేరు పసూరు. పసూరు తండ్రి పేరు మల్కీయా. అదీయేలు కుమారుడు మశై అను వాడొకడున్నాడు. అదీయేలు తండ్రి పేరు యహజేరా. యహజేరా తండ్రి పేరు మెషుల్లాము. మెషుల్లాము తండ్రి పేరు మెషిల్లేమీతు. మెషిల్లేమీతు తండ్రి పేరు ఇమ్మెరు.
13 యాజకులంతా మొత్తం పదిహేడు వందల అరవై మంది. వారంతా వారి వారి కుటుంబ పెద్దలు. ఆలయంలో పూజాది కార్యక్రమ నిర్వహణ బాధ్యత వారిదే.
14 యెరూషలేములో నివసించిన లేవీ గోత్రపు వారెవరనగా: హష్షూబు కుమారుడు షెమయా. హష్షూబు తండ్రి పేరు అజీక్రాము. అజీక్రాము తండ్రి పేరు హషబ్యా. హషబ్యా మెరారీ సంతతి వాడు. 15 బకబక్కరు, హెరెషు, గాలాలు మరియు మత్తన్యా కూడా యెరూషలేములో నివసించారు. మత్తన్యా తండ్రి పేరు మీకా. మీకా తండ్రి పేరు జిఖ్రీ. జిఖ్రీ తండ్రి ఆసాపు. 16 ఓబద్యా తండ్రి పేరు షెమయా. షెమయా తండ్రి గాలాలు. గాలాలు తండ్రి యెదూతూను, మరియు ఆసా కుమారుడు బెరక్యా. ఆసా తండ్రి పేరు ఎల్కానా. నెటోపాతీయులు నివసించిన గ్రామాలలోనే ఎల్కానా కూడ నివసించాడు.
17 యెరూషలేములో నివసించిన ద్వారపాలకులు ఎవరనగా: షల్లూము, అక్కూబు, టల్మోను, అహీమాను మరియు వారి బంధువులు. షల్లూము వారికి నాయకుడు. 18 తూర్పు దిశలో రాజు ప్రవేశించే దేవాలయ ద్వారం వద్ద వీరు నిలబడేవారు. వారు లేవి సంతతికి చెందిన ద్వారపాలకులు. 19 షల్లూము తండ్రి పేరు కోరే. కోరే తండ్రి ఎబ్యాసాపు. ఎబ్యాసాపు తండ్రి కోరహు. షల్లూము, అతని సోదరులు ద్వారపాలకులే. వారు కోరహు వంశం వారు. పవిత్ర గుడారపు ద్వారాన్ని కాపలా కాయటం వారిపని. వారి పూర్వీకులు*పూర్వీకులు బైబిల్లో ఇక్కడ పూర్వీకులు అనగా వారి తండ్రులు, తాతలు, ముత్తాతలు అని అర్థం. చేసిన విధంగానే వీరుకూడ ఆ పని నిర్వర్తించారు. వారి పూర్వీకులు పవిత్ర గుడారపు ద్వారాన్ని కాపలా కాస్తూ వుండేవారు. 20 గతంలో ద్వారపాలకుల అధిపతిగా ఫీనెహాసు వ్యవహరించాడు. ఫీనెహాసు తండ్రి పేరు ఎలియాజరు. ఫీనెహాసుకు యెహోవా కృప ఉంది. 21 పవిత్ర గుడారపు ద్వారానికి జెకర్యా కూడ కావలి ఉన్నాడు.
22 పవిత్ర గుడారం ద్వారపాలకులుగా మొత్తం రెండు వందల పన్నెండు మంది ఎంపిక చేయబడ్డారు. వారి గ్రామాలలో వారి కుటుంబ చరిత్రలలో వారి పేర్లన్నీ వ్రాయబడినాయి. దావీదు, ప్రవక్తయగు సమూయేలు వారిని ఎంపికచేశారు. ఎందువల్లననగా వారు మిక్కిలి నమ్మకస్తులు. 23 యెహోవా నివాసమైన పవిత్ర గుడారపు ద్వారాలను కాపలా కాసే బాధ్యత ద్వార పాలకులది వారి సంతతి వారిదైయున్నది. 24 తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ద్వారాలు నాలుగు పక్కలా ఉన్నాయి. 25 పరిసర గ్రామాలలో నివసించే ఈ ద్వారా పాలకుల బంధువులు అప్పుడప్పుడు వచ్చి వారికి సహాయపడేవారు. వచ్చినప్పుడల్లా వారు ద్వారపాలకులకు ఏడేసి రోజులు సహాయంగా ఉండేవారు.
26 ద్వారపాలకులందరి మీద నలుగురు ద్వార పాలకులు నాయకత్వం వహించేవారు. వారు లేవీయులు. దేవుని నివాసంలో అన్ని గదుల అజమాయిషీ, ధనాగారాల పరిరక్షణ గావించేవారు. 27 వారు రాత్రంతా దేవాలయాన్ని కాపలా కాసేవారు. పైగా ప్రతిరోజూ ఉదయం ఆలయం ద్వారం తెరచే పని కూడ వారిదే.
28 దేవాలయ ఆరాధనలో వాడే పనిముట్ల విషయమై శ్రద్ధ తీసుకొనే ద్వారపాలకులు కొందరున్నారు. ఆ వస్తుసామగ్రిని లోనికి తెచ్చినప్పుడు వారు లెక్కపెట్టేవారు. మళ్లీ వాటిని బయటకు తీసుకొని వెళ్లేటప్పుడు కూడ లెక్క పెట్టేవారు. 29 మరికొందరు ద్వారపాలకులు గర్భగుడిలో సామాన్లు, ఉపకరణాల విషయంలో శ్రద్ధ తీసుకోవటం కోసం ఎంపికచేయబడ్డారు. పిండి, ద్రాక్షారసం, నూనె, ధూపద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాల సరఫరా విషయంలో కూడ వారు తగిన శ్రద్ధ తీసుకొనేవారు. 30 కాని సుగంధ ద్రవ్యాలను కలిపే పని మాత్రం యాజకులది.
31 నైవేద్యంగా వినియోగించే రొట్టె చేయటానికి మత్తిత్యా అనే లేవీయుడు నియమించబడ్డాడు. షల్లూము పెద్ద కుమారుడు మత్తిత్యా. షల్లూము అనే వాడు కోరహు సంతతివాడు. 32 విశ్రాంతి దినాన దైవ సన్నిధికి సమర్పించే నైవేద్యపు రొట్టె తయారు చేయటానికి కోరహు సంతతి ద్వార పాలకులలో కొందరు నియమించబడ్డారు.
33 లేవీయులలో దేవాలయ గాయకులుగా వున్న వారు, వారి కుటుంబ పెద్దలు దేవాలయపు గదులలో నివసించేవారు. వారు రాత్రింబవళ్లు దేవాలయ పనిలో నిమగ్నమై వుండుటచేత మరొక పని చేసేవారు కాదు.
34 ఈ లేవీయులంతా వారి వారి కుటుంబ పెద్దలు. వారి వంశ చరిత్రల్లో పొందుపర్చబడిన విధంగా వారంతా పెద్దలు. వారు యెరూషలేములో నివసించారు.
సౌలు రాజు కుటుంబ చరిత్ర
35 గిబియోను తండ్రి పేరు యెహీయేలు. యెహీయేలు గిబియోను పట్టణంలో నివసించాడు. యెహీయేలు భార్య పేరు మయకా. 36 యెహీయేలు పెద్ద కుమారుడు అబ్దోను. అతని మిగిలిన కుమారులు సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు, 37 గెదోరు, అహ్యో, జెకర్యా మరియు మిక్లోతు. 38 మిక్లోతు కుమారుడు షిమ్యాను. యెహీయేలు కుటుంబం వారు యెరూషలేములో తమ బంధువుల వద్దనే నివసించారు.
39 నేరు కుమారుని పేరు కీషు. కీషు కుమారుని పేరు సౌలు. సౌలు కుమారులు యోనాతాను, మల్కీషూవ, అబీనాదాబు, ఎష్బయలు.
40 యోనాతాను కుమారుని పేరు మెరీబ్బయలు. మెరీబ్బయలు కుమారుడు మీకా.
41 మీకా కుమారులు పీతోను, మెలెకు, తరేయ మరియు ఆహాజు. 42 ఆహాజు యెహోయద్దాకు తండ్రి. యెహోయద్దా కుమారుని పేరు యరా. యరా కుమారుల పేర్లు ఆలెమెతు, అజ్మావెతు మరియు జిమ్రీ. జిమ్రీ కుమారుడు మోజా, 43 మోజా కుమారుడు బిన్యా. బిన్యా కుమారుడు రెఫాయా. రెఫాయా కుమారుడు ఎలాశా. ఎలాశా కుమారుడు ఆజేలు.
44 ఆజేలుకు ఆరుగురు కుమారులు. వారు అజీక్రాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా మరియు హానాను. వారంతా ఆజేలు కుమారులు.