11
ఇశ్రాయేలుకు దావీదు రాజవటం
1 ఇశ్రాయేలు ప్రజానీకం హెబ్రోను పట్టణంలో దావీదు వద్దకు వెళ్లారు. వారు దావీదుతో ఇలా అన్నారు: “మేము నీ రక్త మాంసాలను పంచుకు పుట్టిన వాళ్లం (బంధువులం). 2 గతంలో మమ్మల్ని నీవు యుద్ధంలో నడిపించావు. సౌలు రాజుగా వున్నప్పటికీ మమ్మల్ని నడిపిన వాడవు నీవే! యెహోవా నీతో, ‘దావీదూ, ఇశ్రాయేలీయులైన నా ప్రజల కాపరివి నీవే. నా ప్రజలకు నీవు నాయకుడివవుతావు’ అని అన్నాడు.”
3 ఇశ్రాయేలు పెద్దలంతా హెబ్రోను పట్టణంలో దావీదు రాజువద్దకు వచ్చారు. యెహోవా సన్నిధిలో ఆ పెద్దలతో దావీదు ఒక ఒడంబడిక చేసుకొన్నాడు. పెద్దలు దావీదు తలమీద నూనె పోసి అభిషిక్తుని చేశారు. ఆ పని దావీదు ఇశ్రాయేలు రాజు అయినట్లు తెలుపుతుంది. ఇది జరుగుతుందని యెహోవా మాటయిచ్చాడు. ఈ వాగ్దానం యెహోవా సమూయేలు ద్వారా చేశాడు.
దావీదు యెరూషలేమును జయించటం
4 దావీదు, ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి యెరూషలేముకు వెళ్లారు. ఆ కాలంలో యెరూషలేము “యెబూసు” అని పిలువబడేది. ఆ నగరంలో నివసించే ప్రజలంతా యెబూసీయులనబడేవారు. ఆ నగరవాసులు 5 దావీదుతో, “నీవు మా నగర ప్రవేశం చేయకూడదు” అని అన్నారు. అయినప్పటికి దావీదు ఆ ప్రజలను ఓడించాడు. సీయోను కొండ*సీయోను కొండ యెరూషలేము నగరం కట్టబడిన ఒక కొండ పేరు. మీది కోటను దావీదు వశం చేసుకొన్నాడు. ఈ ప్రదేశమే దావీదు నగరమని పిలువబడింది.
6 “మీలో ఎవరు సైన్యాన్ని యెబూసీయుల మీదికి విజయవంతంగా నడిపిస్తారో అతడు నా సైన్యానికంతటికి ముఖ్య అధిపతి అవుతాడు” అని దావీదు ప్రకటించాడు. అది విని యోవాబు దండయాత్రకు నాయకత్వం వహించి నిర్వహించాడు. యోవాబు తండ్రిపేరు సెరూయా. యోవాబు సైన్యాధిపతయ్యాడు.
7 దావీదు తన నివాసం కోటలో ఏర్పరచుకొన్నాడు. అందువల్ల దానికి దావీదు నగరం అని పేరు వచ్చింది. 8 కోట చుట్టూ దావీదు నగరాన్ని నిర్మించాడు. మిల్లో†మిల్లో పాత యెరూషలేములో ఒక భాగం. బైబిలు విద్యార్థులు దీనిని ఒక సమావేశ స్థలంగానో, లోయగానో, లేక నీటి వనరుగల ప్రదేశంగానో పరిగణించవచ్చు. నుండి బయటి ప్రాకారం వరకు అతడు నగరాన్ని నిర్మించాడు. యోవాబు ఆ నగరంలో ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేయించాడు. 9 రోజురోజుకు దావీదు గొప్పతనం పెరుగుతూ వచ్చింది. సైన్యాలకు అధిపతియైన యెహోవా దావీదుకు తోడైయున్నాడు.
దావీదు యొక్క ముగ్గురు వీర నాయకులు
10 దావీదు సైన్యంలో మహావీరులున్నారు. దావీదులాగానే వీరుకూడా శక్తిమంతులయ్యారు. ఇశ్రాయేలు ప్రజలంతా దావీదు రాజ్యానికి మంచి మద్దతు ఇచ్చారు. ఈ మహావీరులూ, ఇశ్రాయేలు ప్రజానీకం కలసి దావీదును రాజుగా చేశారు. దేవుడు ఇది జరుగుతుందని వాగ్దానం చేశాడు.
11 దావీదు సైన్యంలో మహాయోధులు ఎవరనగా:
హక్మనీయులకు చెందిన యాషాబాము ఒకడు. యాషాబాము అధికారులకు పై అధికారి.‡యాషాబాము … అధికారి దీని అర్థం ముప్పదిమంది కావచ్చు. చూడండి సమూయేలు రెండవ గ్రంథం. 23:8. అతడు తన ఈటెనుపయోగించి మూడు వందల మందిని ఎదిరించాడు. ఆ మూడువందల మందిని ఒక్క వేటుతో చంపివేశాడు.
12 దావీదు యోధులలో ఎలియాజరు మరొకడు. ఎలియాజరు తండ్రి పేరు దోదో. దోదో అహోహీయుల వంశంవాడు. ముగ్గురు మహా యోధుల్లో ఎలియాజరు ఒకడు. 13 పస్దమ్మీములో ఎలియాజరు దావీదుతో వున్నాడు. ఫిలిష్తీయులు ఆ ప్రదేశానికి యుద్ధానికి సిద్ధమై వచ్చారు. ఆ ప్రాంతంలో విరగపండిన యవల చేనువుంది. ఫిలిష్తీయులకు భయపడి ఇశ్రాయేలీయులు ఈ ప్రదేశానికి పారిపోయి వచ్చారు. 14 కాని వారా చేను మధ్యలో నిలబడి పంటను కాపాడుతూ ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని చంపివేశారు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయులకు ఘనవిజయం చేకూర్చాడు.
15 ముప్పై మంది నాయకులలో ముగ్గురు దావీదు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో దావీదు అదుల్లాము గుహగల కొండ వద్ద ఉన్నాడు. అదే సమయంలో ఫిలిష్తీయుల సైనికులు కొందరు రెఫాయిము లోయలో గుడారాలు వేశారు.
16 అప్పుడు దావీదు కోటలో వున్నాడు. ఫిలిష్తీయుల సైన్యం బేత్లెహేములో దిగివుంది. 17 దావీదుకు అప్పుడు దాహం వేసింది. అతడు, “ఓహో, ఇప్పుడు నాకెవరైనా బేత్లెహేము§బేత్లెహేము బేత్లెహేము దావీదు స్వంత పట్టణం. అందువల్ల ఆ ఊరి బావినుండి నీళ్లు తాగాలని దావీదు కోరుకున్నాడు. నగర ద్వారం వద్దగల బావి నీరు తాగటానికి తెచ్చి ఇవ్వాలని కోరుకుంటున్నాను!” (దావీదు నిజంగా దీనిని కోరుకోలేదు) అని అన్నాడు. 18 అప్పుడు ఆ ముగ్గురు యోధులు ఫిలిష్తీయుల సైన్యాన్ని ఛేదించుకుంటూపోయి, బేత్లెహేము నగర ద్వారంవద్ద గల బావినుండి నీరు తీసుకొన్నారు. ఆ ముగ్గురు యోధులు నీటిని తెచ్చి దావీదుకు ఇచ్చారు. కాని దావీదు ఆ నీటిని తాగ నిరాకరించాడు. ఆ నీటిని యెహోవాకి అర్పణగా పారపోశాడు. 19 దావీదు ఇలా అన్నాడు, “యెహోవా నన్ను ఈ నీటిని తాగకుండా చేయుగాక! ఈ నీటిని నేను తాగటం సరియైనది కాదు. ఎందువల్లననగా ఈ మనుష్యులు ఈ నీటిని తేవటానికి తమ ప్రాణాలను లెక్క చేయలేదు. వారు మృత్యుముఖంలో పడి బయటపడ్డారు.” అందువల్ల దావీదు ఆ నీటిని తాగలేదు. ఆ విధంగా ఆ ముగ్గురు మహాయోధులు వీరోచిత కార్యాలు సాధించారు.
దావీదు ఇతర యోధులు
20 ముగ్గురు యోధుల దళానికి యోవాబు సోదరుడు అబీషై నాయకుడు. అతడు మూడు వందల మందిని తన ఈటెతో ఎదిరించి చంపాడు. ముగ్గురు యోధుల్లాగా అబీషై కీర్తి గడించాడు. 21 కాని అతనికి మిగిలిన వారికంటె ఎక్కువ గౌరవం దక్కింది. ముగ్గురిలో ఒకడు కాకపోయినా అతడు అధిపతి అయ్యాడు.
22 యోహోయాదా కుమారుడు బెనాయా ఒక పరాక్రమవంతుని కుమారుడు. అతడు కబ్సెయేలు వంశంవాడు. అతడు కొన్ని సాహస కార్యాలు నెరవేర్చాడు. మోయాబు దేశానికి చెందిన ఇద్దరు గొప్ప యోధులను చంపాడు. అతడు భూమిలో పెద్ద గోతిలోకి వెళ్లి అక్కడ ఒక సింహాన్ని చంపాడు. అది బాగా మంచుపడే రోజున జరిగింది. 23 ఈజిప్టుకు చెందిన బలవంతుడైన సైనికుని కూడ బెనాయా చంపాడు. ఆ మనుష్యుడు ఏడున్నర అడుగుల ఎత్తుగల వాడు. ఆ ఈజిప్టు వాని వద్ద అతి పెద్దదయిన, బరువైన ఒక ఈటె వుంది. అది నేత నేయువాని మగ్గం దోనెవలె వుంది. బెనాయా వద్ద ఒక గదలాంటి ఆయుధం మాత్రమే వుంది. కాని బెనాయా ఆ ఈజిప్టు వాని వద్ద నుండి ఈటెను లాక్కున్నాడు. దానితోనే వానిని చంపివేశాడు. 24 ఇవన్నీ యోహోయాదా కుమారుడు బెనాయా చేసిన పనులు. ముగ్గురు యోధుల్లాగా బెనాయా పేరు పొందిన వ్యక్తి అయ్యాడు. 25 ఆ ముగ్గురి యోధుల కంటె బెనాయాకు ఎక్కువ గౌరవం లభించింది. కాని అతడు ఆ ముగ్గురిలో చేర్చబడలేదు. దావీదు తన అంగరక్షకులకు అధిపతిగా బెనాయాను నియమించాడు.
ముఫ్పై మంది వీరులు
26 ముఫ్పై మంది వీరులైన సైనికులెవరనగా:
యోవాబు సోదరుడైన ఆశాహేలు.
దోదో కుమారుడైన ఎల్హానాను. ఎల్హానాను బేత్లెహేము నివాసి.
27 హరోరీయుడైన షమ్మోతు.
పెలోనీయుడైన హేలెస్సు.
28 ఇక్కీషు కుమారుడైన ఈరా. ఈరా తెకోవ పట్టణానికి చెందినవాడు.
అనాతోతీయుడైన అబీయెజెరు.
29 హుషాతీయుడైన సిబ్బెకై.
అహోహీయుడైన ఈలై.
30 నెటోపాతీయుడగు మహరై, బయనా కుమారుడగు హేలెదు.
హేలెదు కూడ నెటోపాతీయుడు.
31 రీబయి కుమారుడైన ఈతయి. ఈతయి అనేవాడు బెన్యామీను దేశంలోని గిబియా పట్టణవాసి.
పిరాతోనీయుడైన బెనాయా,
32 గాయఘలోయవాడైన హురై,
అర్బాతీయుడైన అబీయేలు,
33 బహరూమీయుడైన అజ్మావెతు.
షయిల్బోనీయుడైన ఎల్యాహ్బా
34 హాషేము కుమారుడు హాషేము గిజోనీయుడు.
షాగే కుమారుడు యోనాతాను. యోనాతాను హరారీయుడు.
35 శాకారు కుమారుడు అహీయాము. అహీయాము హరారీయుడు.
ఊరు కుమారుడు ఎలీపాలు.
36 మెకేరాతీయుడైన హెపెరు.
పెలోనీయుడగు అహీయా.
37 కర్మెలీయుడైన హెజ్రో.
ఎజ్బయి కుమారుడైన నయరై.
38 నాతాను సోదరుడైన యోవేలు.
హగ్రీ కుమారుడగు మిబ్హారు.
39 అమ్మోనీయుడగు జెలెకు.
బెరోతీయుడగు నహరై. నహరై అనేవాడు యోవాబు ఆయుధాలు మోసేవాడు. యోవాబు తండ్రి పేరు సెరూయా.
40 ఇత్రీయుడైన ఈరా.
ఇత్రీయుడగు గారేబు.
41 హిత్తీయుడైన ఊరియా.
అహ్లయి కుమారుడు జాబాదు.
42 షీజా కుమారుడు అదీనా. షీజా అనేవాడు రూబేనీయుడు. అదీనా రూబేను వంశంలో పెద్ద. అతను తనతోవున్న ముగ్గురు యోధులకు నాయకుడు.
43 మయకా కుమారుడు హానాను.
మిత్నీయుడైన యెహోషాపాతు.
44 ఆష్తెరాతీయుడైన ఉజ్జీయా.
హోతాము కుమారులు షామా, యెహీయేలు. హోతాము అరోయేరీయుడు.
45 షిమ్రీ కుమారుడు యెదీయవేలు.
తిజీయుడగు యోహా. యెదీయవేలు సోదరుడు యోహా.
46 మహవీయుడగు ఎలీయేలు.
ఎల్నయము కుమారులైన యెరీబై, యోషవ్యా. మోయాబీయుడైన ఇత్మా.
47 ఎలీయేలు, ఓబేదు, మరియు మెజోబాయా వాడైన యహశీయేలు.
*11:5: సీయోను కొండ యెరూషలేము నగరం కట్టబడిన ఒక కొండ పేరు.
†11:8: మిల్లో పాత యెరూషలేములో ఒక భాగం. బైబిలు విద్యార్థులు దీనిని ఒక సమావేశ స్థలంగానో, లోయగానో, లేక నీటి వనరుగల ప్రదేశంగానో పరిగణించవచ్చు.
‡11:11: యాషాబాము … అధికారి దీని అర్థం ముప్పదిమంది కావచ్చు. చూడండి సమూయేలు రెండవ గ్రంథం. 23:8.
§11:17: బేత్లెహేము బేత్లెహేము దావీదు స్వంత పట్టణం. అందువల్ల ఆ ఊరి బావినుండి నీళ్లు తాగాలని దావీదు కోరుకున్నాడు.