22
మీకాయా అహాబును హెచ్చరించుట
తరువాత రెండు సంత్సరాల కాలంలో ఇశ్రాయేలు, అరాము దేశాల మధ్య శాంతి సామరస్యాలు నెలకొన్నాయి. మూడవ సంవత్సరంలో యూదా రాజైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన అహాబును చూడటానికి వెళ్లాడు.
అదే సమయంలో అహాబు తన అధికారులతో, “రామోత్గిలాదు పట్టణాన్ని అరాము రాజు మనవద్ద నుండి తీసుకున్న సంగతి మీకు జ్ఞాపకమున్నదా? మనం రామోత్గిలాదును తిరిగి తీసుకొని రావటానికి ఏ రకమైన చర్యనూ ఎందుకు తీసుకోలేదు? అది మన పట్టణమై తీరాలి” అని అన్నాడు. అప్పుడు అహాబు తన వద్దకు వచ్చిన రాజైన యెహోషాపాతును, “రామోత్గిలాదు వద్ద అరాము సైన్యంతో పోరాడటానికి నీవు మాతో కలుస్తావా?” అని అడిగాడు.
“అవును, నేను మీతో కలుస్తాను. నీ సైన్యంతో సహకరించటానికి నా సైనికులు, గుర్రాలు సిద్ధంగా వున్నాయి. కాని ముందుగా మనం యెహోవాను మనకు సహాయం చేయమని అడగాలి” అని యెహోషాపాతు అన్నాడు.
అందుచేత అహాబు ప్రవక్తలందరినీ సమావేశపర్చాడు. ఆ సయయంలో అక్కడ సుమారు నాలుగువందల మంది ప్రవక్తలున్నారు. “నేను వెళ్లి అరాము సైన్యంతో రామోత్గిలాదు వద్ద యుద్ధం చేయవచ్చునా? లేక నేనింకా మరో సమయం కొరకు వేచివుండాలా?” అని అహాబు వారినడిగాడు.
“నీవు వెళ్లి ఇప్పుడు యుద్ధం చేయవచ్చు. యెహోవా నీకు విజయం చేకూర్చుతాడు” అని ప్రవక్తలన్నారు.
కాని యెహోషాపాతు, “యెహోవా యొక్క ప్రవక్త మరెవరైనా ఇక్కడ వున్నారా? వుంటే అతడు అహాబు ఏమి చేయాలో దేవుని అడిగి తెలుసుకోవాలి” అని అన్నాడు.
“మరో ప్రవక్త వున్నాడు. అతని పేరు మీకాయా, అతడు ఇమ్లా కుమారుడు. కాని నేనతనిని అనహ్యించుకుంటాను. అతడు యెహోవా తరపున మాట్లాడినప్పుడు, అతడెప్పుడూ నాకు మంచి చెప్పడు. నాకు ఇష్టం లేని విషయాలే అతడెప్పుడూ చెపుతాడు” అని అహాబు అన్నాడు.
“అహాబు రాజా, నీవు అలా అనకూడదు” అని యెహోషాపాతు అన్నాడు.
కావున రాజైన అహాబు తన అధికారులలో ఒకనిని పిలిచి మీకాయా కొరకు వెళ్లి ఎక్కడున్నాడో చూడమన్నాడు.
10 ఆ సమయంలో ఆ రాజులిద్దరూ తమ తమ రాజ దుస్తుల్లో వున్నారు. వారు సింహాసనాల మీద కూర్చుని వున్నారు. అది షోమ్రోను నగర ద్వారం వద్దగల న్యాయస్థానం. ప్రవక్తలందరూ వారి ముందు నిలబడ్డారు. ప్రవక్తలు ప్రత్యేకమైన విషయాలనేకం యెహోవా నుండి తెలుసుకుని ప్రకటిస్తున్నారు. 11 వారిలో కెనయనా కుమారుడు సిద్కియా అను వాడొకడున్నాడు. సిద్కియా కొన్ని ఇనుప కొమ్ములు*ఇనుప కొమ్మములు ఇనుప కొమ్ములు గొప్ప బలానికి నిదర్శనాలు. చేయించి తెచ్చాడు. అతడు అహాబుతో యెహోవా ఇలా అంటున్నాడని చెప్పాడు: “అరాము సైన్యంతో పోరాడటానికి నీవు ఈ ఇనుప కొమ్ములు ఉపయోగిస్తావు. నీవు వారిని ఓడించి, సర్వనాశనం చేస్తావు.” 12 మిగిలిన ప్రవక్తలు కూడ సిద్కియా చెప్పిన దానితో ఏకీభవించారు. ఆ ప్రవక్త ఇంకా ఇలా అన్నాడు: “నీ సైన్యం ఇప్పుడే కదిలి వెళ్లాలి. అరాము సైన్యంతో వారు రామోత్గిలాదు వద్ద పోరు సల్పాలి. నీవా పోరాటంలో గెలుస్తావు. యెహోవా నీవు గెలిచేలా చేస్తాడు.”
13 ఈ కార్యక్రమం ఇలా కొనసాగుతూ వుండగా ప్రభుత్వాధికారి మీకాయాకొరకు వెళ్లాడు. అతడు మీకాయాను చూసి, “ప్రవక్తలంతా రాజు గెలుస్తాడని చెపుతున్నారు. నేననేదేమంటే నీవు కూడా అదే మాదిరిగా చెపితే నీకు చాలా క్షేమకరం” అని అన్నాడు.
14 “కాదు! యెహోవా ప్రసాదించిన శక్తిచేత యెహోవా నన్ను ఏది చెప్పమని ఆజ్ఞయిస్తే అదే చెపుతానని ప్రమాణం చేసియున్నాను” అని మీకాయా సమాధానం చెప్పాడు.
15 తరువాత మీకాయా వచ్చి రాజైన అహాబు ముందు నిలబడ్డాడు. రాజు అతనిని ఇలా అడిగాడు: “మీకాయా, రాజైన యెహోషాపాతు, నేను మా సైన్యాలను కలుపవచ్చా? ఇప్పుడు మేము వెళ్లి రామోత్గిలాదు వద్ద అరాము సైన్యంతో పోరాడ వచ్చునా?” “అవును. మీరు వెళ్లి వారితో ఇప్పుడు యుద్ధం చేయవచ్చు. యెహోవా నిన్ను గెలిపిస్తాడు” అని మీకాయా సమాధానం చెప్పాడు.
16 కాని ఇలా అన్నాడు: “నీవు ఈ మాటలు యెహోవా శక్తితో చెప్పటం లేదు. ఇది నీ ఊహాగానం. అందువల్ల నాకు నిజం చెప్పు! నేనేం చేయాలో యెహోవా శక్తి ఆధారంగా నాకు తెలియజెప్పు! ఎన్నిసార్లు నేను నీకు చెప్పాను!”
17 అందుకు మీకాయా ఇలా అన్నాడతు: “ఏమి జరుగుతుందో నేను చూడగలను. ఇశ్రాయేలు సైన్యం కొండల్లో చిందరవందరై పోతుంది. కాపరిలేని గొర్రెల్లా వారు వికలమైపోతారు. ‘ఈ మనుష్యులకు నాయకుడులేడు. పోరుమాని వారు ఇండ్లకు పోతే మంచిది’ అని యెహోవా అంటున్నాడు.”
18 యెహోషాపాతుతో అప్పుడు అహాబు ఇలా అన్నాడు: “చూడు! నేను చెప్పాను గదా! ఈ ప్రవక్త నన్ను గురించి ఎన్నడూ మంచి చెప్పడు. ప్రతిసారీ నేను విననొల్లని మాటలే అతడు చెపుతాడు.”
19 కాని మీకాయా యెహోవా తరపున మాట్లాడటం కొనసాగించాడు. మీకాయా ఇలా అన్నాడు: “వినండి! ఇవి యెహోవా చెప్పిన మాటలు. యెహోవా పరలోకంలో సింహాసనాసీనుడై వున్నట్లు చూశాను. దేవదూతలు ఆయనకు చేరువలో నిలబడియున్నారు. 20 యెహోవా వారితో ఇలా చెప్పినాడు: ‘మీలో ఎవరైనా రాజైన అహాబును మోసగించగలరా? అతడు రామోత్గిలాదు వద్ద అరాము సైన్యంతో పోరాడేలా చేయాలని నా వాంఛ. అప్పుడతడు చంపబడతాడు.’ దేవదూతలు తాము చేయవలసిన పనిపై ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రాలేకపోయారు. 21 అప్పుడు ఒక దేవదూత యెహోవా ముందుకు వచ్చి, ‘నేనతనిని మాయ జేయగలను!’ అని చెప్పాడు. 22 ‘ఎలామాయలో పడవేయగలవు?’ అని యెహోవా అడిగాడు. ‘అహాబు ప్రవక్తలందరినీ కలవరపెడతాను. రాజైన అహాబుతో అన్నీ అబద్ధాలు చెప్పమని ప్రవక్తలను ప్రోత్సహిస్తాను. ప్రవక్తల సమాచారాలన్నీ అబద్ధాలే’ అని దేవదూత అన్నాడు. అందుకు యెహోవా, ‘మంచిది! వెళ్లి అహాబు రాజును మాయలో పడవేయి; నీకు విజయం చేకూరుతుంది’ ” అని అన్నాడు.
23 మీకాయా తన కథనం ముగించాడు. అతనిలా అన్నాడు: “ఇదీ ఇక్కడ జరిగిన విషయం. యెహోవా నీ ప్రవక్తలను నీతో అబద్దమాడేలా చేశాడు. యెహోవా తనకు తానే నీకు కష్టనష్టాలు రావాలని కోరి నిశ్చయించాడు.”
24 తరువాత ప్రవక్తయగు సిద్కియా, మీకాయా వద్దకు వెళ్లాడు. సిద్కియా మీకాయాను చెంప మీదకొట్టి, “యెహోవా శక్తి నన్ను వదిలి నీద్వారా మాట్లాడుతున్నదని నీవు నిజంగా నమ్ముతున్నావా?” అని అడిగాడు.
25 “నీవు వెంటనే వెళ్లి ఒక చిన్న గదిలో దాగివుండు. అప్పుడు నేను నిజం చెప్తున్నట్లు నీకు తెలుస్తుంది” అన్నాడు మీకాయా.
26 మీకాయాను బంధించమని అహాబు తన అధికారులకు ఆజ్ఞ ఇచ్చాడు. “ఇతనిని బంధించి నగరపాలకుడగు ఆమోను వద్దకు తీసుకుని వెళ్లండి. రాజకుమారుడైన యెవాషును ఇతనిపై తీర్పు చెప్పనీయండి. 27 మీకాయాను కారాగారంలో వుంచమని అతనికి చెప్పండి. వీనికి కేవలం రొట్టె, నీరు మాత్రం ఇవ్వండి. నేను యుద్ధంనుండి ఇంటికి తిరిగి వచ్చేవరకు ఇతనిని అక్కడే వుంచండి” అని రాజైన అహాబు అన్నాడు.
28 అది విన్న మీకాయా ఇలా ప్రకటించాడు: “సర్వప్రజలారా, నే చెప్పేది సావధానంగా వినండి! అహాబు రాజా, యుద్ధం నుండి నీవు క్షేమంగా ఇంటికి తిరిగివస్తే, యెహోవా నా ద్వారా మాట్లాడి యుండనట్లే.”
29 తరువాత రాజైన అహాబు, మరియు రాజైన యెహోషాపాతు కలిసి రామోత్గిలాదు వద్ద అరాము సైన్యంతో యుద్ధం చేయటానికి వెళ్లారు. గిలాదు అనే ప్రాంతంలో ఇది వుంది. 30 అహాబు యెహోషాపాతుతో ఇలా అన్నాడు: “మనం యుద్ధానికి సిద్ధమవుదాం. నేను రాజునని తెలియకుండా వుండేలాగున తగిన దుస్తులు వేసుకుంటాను. కాని నీవు మాత్రం రాజఠీవి ఉట్టిపడే నీ యొక్క ప్రత్యేక దుస్తులు ధరించు.” ఇశ్రాయేలు రాజు మారువేషం వేసుకున్నాడు. యుద్ధం మొదలయింది.
31 అరాము రాజుకు ముప్పది యిద్దరు రథాధిపతులున్నారు. ఈ ముప్పది యిద్దరు రథాధిపతులకూ ఇశ్రాయేలు రాజు ఎక్కడ వున్నాడో చూడమని చెప్పాడు. ఇశ్రాయేలు రాజును చంపేయమని అరాము రాజు అధిపతులకు ఆజ్ఞ ఇచ్చాడు. 32 యుద్దం సాగుతూవుంతడగా ఈ అధిపతులు రాజైన యెహోషాపాతును చూశారు. వారు అతనినే ఇశ్రాయేలు రాజుగా భావించారు. అందుచే వారతనిని చంపటానికి వెళ్లారు. యెహోషాపాతు తను రాజు కాదన్నట్లు అరవటం ప్రారంభించాడు. 33 దానితో అతడు రాజైన అహాబుకాదని తెలుసుకున్నారు. అందుచేత వారతనిని చంపలేదు.
34 కాని ఒక సైనికుడు తన బాణాన్ని గాలిలోకి వదిలాడు. అతడు కావాలని దానిని ఎవరిపైకీ గురిచూసి వదలలేదు. కాని ఆ బాణం ఇశ్రాయేలు రాజైన అహాబుకు తగిలింది. రాజు కవచం అతని శరీరాన్ని కప్పని చోట బాణం తగిలింది. రాజైన అహాబు తనసారధితో, “నాకు ఒక బాణం తగిలింది. త్వరగా రథాన్ని ఈ ప్రదేశంనుండి బయటికి నడిపించు. యుద్ధంనుండి మనం వెళ్లిపోవాలి” అని అన్నాడు.
35 సైన్యాలు మాత్రం యుద్ధాన్ని కొనసాగించాయి. రాజైన ఆహాబు తన రథం మీదే వుండిపోయాడు. రథంలో ఒక పక్కగా ఆనుకొని వున్నాడు. అతడు అరాము సైన్యంవైపు చూస్తూ వుండిపోయాడు. అతని గాయం నుండి కారిన రక్తం రథంలో పేరుకుపోయింది. బాగా సాయంత్ర మయ్యేసరికి రాజు చనిపోయాడు. 36 సూర్యాస్తమయసమయంలో ఇశ్రాయేలు సైన్యం తమ స్వదేశానికి, నగరానికి తిరిగి వెళ్లటానికి ఆజ్ఞ ఇవ్వబడింది.
37 రాజైన అహాబు ఆ విధంగా చనిపోయాడు. అతని భౌతిక కాయాన్ని కొందరు షోమ్రోనుకు తీసుకొని వెళ్లారు. వారు దానిని అక్కడ సమాధి చేశారు. 38 అహాబు రథాన్ని సైనికులు షోమ్రోనులో ఒక చెరువు వద్ద కడిగారు. అక్కడ కొన్ని కుక్కలు రథం చుట్టూ చేరి రథంలో పేరుకు పోయిన రాజైన అహాబు రక్తాన్ని నాకాయి. పైగా ఆ నీటిలో వేశ్యలు స్నానం చేశారు. ఇవన్నీ ఎలా జరుగుతాయని యెహోవా చెప్పియున్నాడో అలానే జరిగాయి.
39 రాజైన అహాబు తన పరిపాలనాకాలంలో చేసిన పనులన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో పొందు పర్చబడ్డాయి. రాజు తన భవనాన్ని అందంగా తీర్చిదిద్దటానికి ఉపయోగించిన దంతాన్ని గూర్చి కూడ ఆ గ్రంథం వివరిస్తుంది. అందులో రాజు నిర్మించిన నగరాన్ని గూర్చి కూడా వుంది. 40 అహాబు చనిపోయిన పిమ్మట అతని కుమారుడైన అహజ్యా అతని స్థానంలో రాజు అయ్యాడు.
యూదా రాజుగా యెహోషాపాతు
41 ఆసా కుమారుడైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన అహాబు ఏలుబడి నాలుగవ సంవత్సరంలో యూదాకు రాజయ్యాడు. 42 యెహోషాపాతు రాజు అయ్యే నాటికి ఇతని వయస్సు ముప్పై అయిదు సంవత్సరాలు. యెహోషాపాతు యెరూషలేములో ఇరవై అయిదు సంవత్సరాలు పరిపాలించాడు. యెహోషాపాతు తల్లి షిల్హీ కుమార్తె. అతని తల్లి పేరు అజూబా. 43 యెహోషాపాతు మంచి వ్యక్తి. గతంలో తన తండ్రి నడచిన రీతినే ఇతడు కూడ నడిచాడు. యెహోవా ఆజ్ఞలను శిరసావహించాడు. కాని యెహోషాపాతు ఉన్నత స్థలాలను తీసివేయలేదు. ఆ స్థలాలలో ప్రజలు బలులు సమర్పించటం, ధూపం వేయటం వంటి ఆరాధనా కార్యక్రమాలు కొనసాగించారు.
44 యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో ఒక శాంతి ఒడంబడికను కుదుర్చుకున్నాడు. 45 యెహోషాపాతు మిక్కిలి ధైర్యవంతుడు. అతడు చాలా యుద్ధాలు చేశాడు. అతడు చేసిన పనులన్నీ యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.
46 వ్యభిచార విషయంగా తమ శరీరాలను అమ్ముకొనే స్త్రీ పురుషులను ఆరాధనా స్థలాలనుండి యెహోషాపాతు వెళ్లగొట్టాడు. తన తండ్రియగు ఆసా రాజ్యం చేసిన కాలంలో ఆ రకమైన స్త్రీ పురుషులు ఆరాధనా స్థలాలలో సేవచేస్తూ వుండేవారు.
47 ఆ కాలంలో ఎదోము దేశానికి రాజు లేడు. అది ఒక పాలనాధికారి అధీనంలో వుండేది. ఆ అధికారి యూదా రాజుచేత ఎంపిక చేయబడేవాడు.
48 రాజైన యెహోషాపాతు సముద్రయానానికి అనువైన ఓడలను నిర్మించాడు. యెహోషాపాతు ఆ ఓడలను ఓఫీరు దేశానికి పంపాడు. ఓడలు బంగారాన్ని తేవాలని అతని ఆశయం. కాని ఓడలు ఎసోన్గెబెరు వద్ద మునిగిపోయాయి. ఓడలు బంగారాన్ని అసలు తేలేక పోయాయి. 49 ఇశ్రాయేలు రాజైన అహజ్యా యెహోషాపాతుకు సహాయం చేయటానికి వెళ్లాడు. యెహోషాపాతుతో నౌకా నిర్మాణ యానాలలో సమర్థులైన వారిని తీసుకొని వస్తానని అహజ్యా అన్నాడు. కాని యెహోషాపాతు అహజ్యా మనుష్యులను వినియోగించుకోడానికి నిరాకరించాడు.
50 యెహోషాపాతు చనిపోయాడు. అతనిని తన పూర్వికులతో దావీదు నగరంలో సమాధిచేశారు. తరువాత అతని కుమారుడు యెహోరాము రాజయ్యాడు.
ఇశ్రాయేలు రాజుగా అహజ్యా
51 అహాబు కుమారుడు అహజ్యా, యెహోషాపాతు పాలన యూదాలో పదునేడవ సంవత్సరం జరుగుతుండగా అహజ్యా ఇశ్రాయేలుకు రాజైనాడు. అహజ్యా షోమ్రోనులో రెండు సంవత్సరాలు పాలించాడు. 52 అహజ్యా యెహోవా దృష్టిలో పాపం చేశాడు. తన తండ్రి అహాబు, తన తల్లి యెజెబెలు, మరియు నెబాతు కుమారుడైన యరొబాము నడచిన చెడునడతనే అహజ్యా కూడ అనుసరించాడు. ఈ పాలకులంతా ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయటానికి కారుకులయ్యారు. 53 అహజ్యా బూటకపు దేవత బయలును ఆరాధించాడు. తనకు ముందున్న తన తండ్రి వలెనే ఆ అసత్య దేవతను కొలిచాడు. తవన ఈ చెడు నడవడితో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు చాలా కోపం కలిగించాడు. తనకు ముందున్న తన తండ్రిపట్ల కోపగించినట్లు యెహోవా అహజ్యా పట్ల కూడా కోపంతోపున్నాడు.

*22:11: ఇనుప కొమ్మములు ఇనుప కొమ్ములు గొప్ప బలానికి నిదర్శనాలు.