7
ఆలయాన్ని దేవునికి అంకింతం చేయుటం
1 సొలొమోను ప్రార్థన పూర్తి చేసేసరికి ఆకాశం నుండి అగ్ని దిగి దహనబలులను, మిగిలిన అర్పణలను దహించి వేసింది. యెహోవా మహిమ ఆలయాన్ని నింపివేసింది. 2 యెహోవా మహిమ నిండి వున్న ఆలయంలో యాజకులు ప్రవేశించలేక పోయారు. 3 ఆకాశం నుండి అగ్ని దిగిరావటం ఇశ్రాయేలీయులంతా చూశారు. యెహోవా మహిమ ఆలయాన్ని ఆవరించిండటం కూడ వారు చూశారు. వారంతా బాటపై సాష్టాంగ పడ్డారు. వారు యెహోవాను స్తుతించి, నమస్కరించారు. వారింకా యీలా అన్నారు:
“ప్రభువు ఉత్తముడు,
ఆయన కరుణ ఎప్పటికీ కొనసాగుతుంది.”
4 పిమ్మట రాజైన సొలొమోను, ఇశ్రాయేలు ప్రజలందరు యెహోవా ముందు బలులు అర్పించారు. 5 రాజైన సొలొమోను ఇరవై రెండువేల గిత్తలను, ఒక లక్షా ఇరవైవేల గొర్రెలను బలియిచ్చాడు. రాజు, ప్రజలు అంతా కలిసి ఆలయాన్ని పవిత్రం చేశారు. అది యెహోవా ఆరాధనకై వినియోగింపబడాలి. 6 యాజకులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించటానికి సిద్ధంగా నిలబడ్డారు. లేవీయులు కూడ యెహోవా మేళం వాయించే పనిముట్లు పట్టుకుని నిలిచారు. దేవునికి వందనాలర్పించే నిమిత్తం ఈ వాద్య విశేషాలను రాజైన దావీదు చేయించాడు. “దేవుని ప్రేమ అనంతం!” అని యాజకులు, లేవీయులు పలికారు. లేవీయులకు ఎదురుగా నిలబడి యాజకులు బాకాలు ఊదారు. ఇశ్రాయేలీయులందరూ నిలబడ్డారు.
7 ఆలయం ముందున్న ఆవరణ మధ్య భాగాన్ని సొలొమోను ప్రతిష్టంచాడు. అక్కడే సొలొమోను దహనబలులు,*దహనబలులు దేవునితో స్నేహం కొనసాగించటానికి, పోయిన సహవాసాన్ని తిరిగి పోందటానికిగాను చేయు అర్పణ, ఇందులో బలిపశువు ఒక ప్రత్యేక భాగాన్ని అర్పించి మిగిలిన దానిని ప్రజలుగాని యాజకులగాని తింటారు. సమాధాన బలుల కొవ్వును అర్పించాడు. తాను నిర్మించిన కంచు బలిపీఠం దహనబలులు, ధాన్యపు అర్పణలు, కొవ్వును పెట్టటానికి చాలనందున, సొలొమోను ఆలయ ఆవరణ మధ్య భాగాన్ని వినియోగించాడు.
8 సొలొమోను, ఇశ్రాయేలు ప్రజలు కలిసి ఏడు రోజులపాటు పండుగ చేశారు. సొలొమోనుతో చాలా మంది జనం వున్నారు. హమాతు పట్టణద్వారం నుండి ఈజిప్టు సెలయేటి వరకు వున్న ప్రాంత మంతటి నుండి జనసమూహాలు వచ్చాయి. 9 ఏడు రోజుల పండుగ ఆచరణ ముగిశాక, ఎనిమిదవ రోజున వారు పవిత్ర సమావేశం ఏర్పాటు చేశారు. బలిపీఠాన్ని వారు పవిత్ర (శుద్ధి) చేశారు. దానిని దైవారాధనలోనే విని యోగిస్తారు. వారు ఏడు రోజులు పండుగ ఆచరించారు. 10 ఆ సంవత్సరం ఏడవ నెల ఇరవై మూడవ రోజు సొలొమోను ప్రజలందరినీ తమ తమ ఇండ్లకు పంపివేశాడు. యెహోవా దావీదుపట్ల, సొలొమోను పట్ల, ఇశ్రాయేలు ప్రజలపట్ల ఎంతో ఉదారంగా వున్నందుకు ప్రజలంతా చాలా సంతోషించారు. వారి హృదయాలు ఆనందమయమయ్యాయి.
యెహోవా సొలొమోను వద్దకు రావటం
11 సొలొమోను ఆలయాన్ని, రాజభవనాన్ని నిర్మించటం పూర్తిచేశాడు. ఆలయ నిర్మాణంలోను, తన ఇంటి నిర్మాణంలోను సొలొమోను అనుకున్న పనులన్నీ పూర్తిచేశాడు. 12 ఆ రాత్రి యెహోవా సొలొమోనుకు దర్శనమిచ్చాడు. యెహోవా ఇలా అన్నాడు:
“సొలొమోనూ, నీ ప్రార్థన నేను విన్నాను. బలులు యివ్వటానికి అనువైన ప్రదేశంగా ఈ స్థలాన్ని నేనే ఎంపిక చేశాను. 13 వర్షాలు లేకుండా నేను ఆకాశాన్ని మూసివేసినప్పుడుగాని, దేశాన్ని నాశనం చేసే విధంగా నేను మిడతల దండులను పంపినుప్పుడుగాని, నేను నా ప్రజలకు వ్యాధులు సొకేలా చేసినప్పుడుగాని, 14 నా పేరు మీద పిలవబడే నా ప్రజలు అణకువతో వుండి నన్ను ప్రార్థిస్తే, నా కొరకు ఎదురు చూస్తే, వారు తమ చెడు మార్గాలను విడనాడితే, నేనప్పుడు ఆకాశం నుండి వారి మొర ఆలకిస్తాను. నేను వారి పాపాలను క్షమిస్తాను. నేను వారి దేశాన్ని బాగు చేస్తాను. 15 నేను నా నేత్రలను తెరచియున్నాను. నా చెవులు ఈ ప్రదేశంలో చేసిన ప్రార్థనలను వింటాయి. 16 ఇక్కడ నా పేరు శాశ్వతంగా ఉండునట్లు నేనీ ప్రదేశాన్ని ఎంపిక చేసి, దానిని పవిత్రంగా మార్చాను. అవును; నా కళ్లు, నా హృదయం ఇక్కడ ఈ ఆలయంలో ఎల్లప్పుడూ వుంటాయి. 17 సొలొమోనూ, నీవిప్పుడు నీ తండ్రి మెలగిన రీతిలో నా ముందు జీవిస్తే, నా ఆజ్ఞలన్నీ పాటిస్తే, నా ధర్మశాస్త్రాన్ని, నియమాలను అనుసరిస్తే, 18 నిన్నొక శక్తి యుక్తులుగల రాజుగా చేస్తాను. నీ రాజ్యాన్ని సుస్థిరమైనదిగా చేస్తాను. నీ తండ్రియైన దావీదుతో అదే ఒడంబడిక చేశాను. ‘దావీదూ, ఇశ్రాయేలు రాజుగా నీ కుటుంబంలో ఒకడు కొనసాగుతాడు’ అని నేను చెప్పియున్నాను.
19 “కానీ నీవు నా ధర్మాన్ని, ఆజ్ఞలను శిరసావహించనిచో, నీవు గనుక అన్యదేవతారాధనకు పాల్పడితే, 20 అప్పుడు ఇశ్రాయేలు ప్రజలను నేను వారికిచ్చిన రాజ్యం నుండి బయటకు త్రోసివేస్తాను. నా నామముతో పవిత్రపర్చబడిన ఈ ఆలయాన్ని నేను వదలి వేస్తాను. ఇతర దేశాలన్నీ చెడుమాటలు పలికేలా ఈ ఆలయమును మార్చివేస్తాను. 21 అత్యున్నతంగా గౌరవింపబడిన ఈ ఆలయం ప్రక్కగా వెళ్లే వారెవరైనా చూసి ఆశ్చర్యపోతారు. ‘ఈ రాజ్యానికి, ఈ ఆలయానికి, యెహోవా ఎందుకింత భయంకర పరస్థితి కల్పించాడు?’ అని అనుకుంటారు. 22 పిమ్మట వారు ఈ రకంగా సమాధానం చెప్పుకుంటారు: ‘వారి పూర్వీకుల దేవుడైన యెహోవాను ఇశ్రాయేలు ప్రజలు అనుసరించలేదు. ఆయనే వారిని ఈజిప్టు నుండి విముక్తి చేసి బయటకు తీసుకొనివచ్చాడు. కాని ఇశ్రాయేలు ప్రజలు అన్యదేవతలను సేవించారు. వారు విగ్రహాలను కొలిచారు. అందువల్లనే యెహోవా ఈ భయంకర పరిస్థితులు ఇశ్రాయేలు ప్రజలకు కల్పించాడు అని అనుకుంటారు.’ ”
*7:7: దహనబలులు దేవునితో స్నేహం కొనసాగించటానికి, పోయిన సహవాసాన్ని తిరిగి పోందటానికిగాను చేయు అర్పణ, ఇందులో బలిపశువు ఒక ప్రత్యేక భాగాన్ని అర్పించి మిగిలిన దానిని ప్రజలుగాని యాజకులగాని తింటారు.