23
యాజకుడైన యెహోయాదా, రాజైన యోవాషు
1 ఆరు సంవత్సరాల అనంతరం యెహోయాదా తనశక్తిని, ధైర్యాన్ని చూపించాడు. అతడు సైనికాధిపతులతో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. ఆ అధిపతులు ఎవరంటే యెరోహాము కుమారుడు అజర్యా; యెహోహానాను కుమారుడైన ఇష్మాయేలు; ఓబేదు కుమారుడైన అజర్యా; అదాయా కుమారుడైన మయశేయా; మరియు జిఖ్రీ కుమారుడైన ఎలీషాపాతు. 2 వారు యూదా రాజ్యమంతా తిరిగి, యూదా పట్టణాలలో వున్న లేవీయులను కూడ గట్టారు. వారు ఇశ్రాయేలులో కుటుంబ పెద్దలనుకూడ కలుపుకున్నారు. పిమ్మట వారు యెరూషలేముకు వెళ్లారు. 3 వీరంతా ఆలయంలో సమావేశమై రాజుతో ఒక ఒడంబడిక కుదుర్చుకున్నారు.
ఆ ప్రజలనుద్దేశించి యెహోయాదా యిలా అన్నాడు: “రాజకుమారుడు పరిపాలిస్తాడు. దావీదు సంతతి వారి విషయంలో యెహోవా ఇదే వాగ్దానం చేశాడు. 4 ఇప్పుడు మీరు చేయవలసినదేమనగా: విశ్రాంతి దినాన విధులకు వెళ్లే యాజకులు, లేవీయులలో మూడవ వంతు వారు ద్వారాల వద్ద కాపలా వుండాలి. 5 మీలో ఒక వంతు రాజు ఇంటి వద్ద వుండాలి. ఇంకొక వంతు ప్రధాన ద్వారం (పునాది ద్వారం) వద్ద నిఘావేయాలి. మిగిలిన వారంతా ఆలయ ఆవరణంలలో వుండాలి. 6 యెహోవా ఆలయంలో ఎవ్వరినీ ప్రవేశించనీయకండి. యాజకుడు, లేవీయులు పరిశుద్ధులు గనుక వారు మాత్రమే సేవ చేయటానికి లోనికి అనుమతిమంపబడాలి. వీరు మినహా, మిగిలిన వారంతా యెహోవా నిర్దేశించిన తమ తమ పనులను యధావిధిగా ఆచరించాలి. 7 లేవీయులు రాజు వద్ద నిలవాలి. ప్రతి ఒక్కడూ తన కత్తిని తప్పక ధరించి వుండాలి. ఎవ్వడేగాని ఆలయంలో ప్రవేశించటానికి ప్రయత్నిస్తే వానిని చంపి వేయండి. రాజు ఎక్కడికి వెళితే అక్కడికి మీరు కూడ అతనితో వెళ్లాలి.”
8 యాజకుడైన యెహోయాదా ఆజ్ఞాపించినదంతా లేవీయులు, యూదా ప్రజలు అంగీకరించారు. యాజకుల వర్గాలలో ఎవ్వరినీ యాజకుడైన యెహోయాదా ఉపేక్షించి ఊరు కోలేదు. విశ్రాంతి దినాన బయటకు వెళ్లిన వారితో కలిసి ప్రతి సైన్యాధిపతి, అతని మనుష్యులు లోనికి వచ్చారు. 9 యాజకుడైన యెహోయాదా రాజైన దావీదుకు చెందిన ఈటెలను, చిన్న పెద్ద డాళ్లను అధికారులకు ఇచ్చాడు. ఆ ఆయుధాలన్నీ ఆలయంలో వుంచబడ్డాయి. 10 పిమ్మట యెహోయాదా ఎవరెక్కడ నిలబడాలో ఆ మనుష్యులకు చెప్పాడు. ప్రతి ఒక్కడూ తన ఆయుధాన్ని ధరించివున్నాడు. వారంతా ఆలయానికి కుడినుండి ఎడమ ప్రక్కకు బారులుదీరి నిలబడ్డారు. వారు బలిపీఠానికి, ఆలయానికి రాజుకు దగ్గరగా నిలబడ్డారు. 11 వారు రాజకుమారుణ్ణి బయటకు తీసికొని వచ్చి, వాని తలపై కిరీటం పెట్టారు. ఒక ధర్మశాస్త్ర గ్రంథ ప్రతిని అతనికిచ్చారు.*ఒక ధర్మశాస్త్ర … అతనికిచ్చారు హెబ్రీలో వారతనికి సాక్ష్యము యిచ్చారు ద్వితీయోపదేశకాండం 17:18 చూడండి. తరువాత వారు యోవాషును రాజుగా ప్రకటించారు. యెహోయాదా, అతని కుమారులు కలిసి యోవాషును అభిషిక్తుని చేశారు. వారు “రాజు చిరంజీవియగు గాక!” అని అన్నారు.
12 ప్రజలు ఆలయానికి పరుగెత్తే శబ్దం, రాజును ప్రశంసించే ధ్వనులు అతల్యా విన్నది. ఆమె ఆలయంలో వున్న ప్రజల వద్దకు వచ్చింది. 13 ఆమె రాజును పరికించి చూపింది. ముందు ద్వారం వద్ద రాజస్తంభం దగ్గర రాజు నిలబడి ఉన్నాడు. అధికారులు, బూరలు వూదే వారు రాజుదగ్గర వున్నారు. దేశప్రజలు చాలా సంతోషంగా వున్నారు. వారు బూరలు వూదు తూవున్నారు. సంగీత వాద్య విశేషాలపై గాయకులు పాడుతున్నారు. ప్రజలందరి చేత దేవునికి స్తుతిగీతాలు గాయకులు తమతోపాటు పాడించారు. ఇదంతా చూచి కలత చెందిన అతల్యా తన బట్టలు చింపుకొని “రాజ ద్రోహం! రాజద్రోహం!” అని అరిచింది.
14 యాజకుడైన యెహోయాదా సైన్యాధిపతులను బయటకు రప్పించాడు. “అతల్యాను బయటవున్న సైన్యం వద్దకు తీసుకొని వెళ్లండి. ఆమెను ఎవరైనా అనుసరిస్తే వారిని మీ కత్తులతో నరికి వేయండి” అని వారికి చెప్పాడు. “కాని, అతల్యాను ఆలయంలో మాత్రం చంపవద్దు” అని యాజకుడు సైనికులను హెచ్చరించాడు. 15 తర్వాత అతల్యా రాజ భవనపు అశ్వద్వారం వద్దకు వచ్చినప్పుడు వారామెను పట్టుకున్నారు. ఆమెను ఆ భవనం వద్దనే వారు చంపివేశారు.
16 అప్పుడు యెహోయాదా ప్రజలతోను, రాజుతోను ఒక ఒడంబడిక చేసుకున్నాడు. వారంతా యెహోవా భక్తులై ఆయనను అనుసరించటానికి ఒప్పుకున్నారు. 17 ఆ జనమంతా బయలు విగ్రహం ఆలయంలోకి వెళ్లి దానిని నిలువునా పగులగొట్టారు. బయలు ఆలయంలో వున్న బలిపీఠాలను, ఇతర విగ్రహాలను కూడ వారు నాశనం చేశారు. బయలు పీఠాల ముగింటనే బయలు దేవత యాజకుడైన మత్తానును చంపివేశారు.
18 పిమ్మట యెహోయాదా యెహోవా ఆలయ బాధ్యతలు స్వీకరించే యాజకులను ఎంపిక చేశాడు. ఆ యాజకులు లేవీయులు. ఆలయ యాజమాన్యం పనిని దావీదు వారికి అప్పజెప్పాడు. మోషే ధర్మశాస్త్రానుసారం ఆ యాజకులు యెహోవాకు దహనబలులు సమర్పిస్తారు. దావీదు ఆజ్ఞాపించిన రీతిగా వారు ఆనందోత్సాహాలతో బలులు అర్పించారు. 19 ఏరకంగానైనా సరే అపరిశుభ్రంగా ఎవ్వరూ ఆలయంలో ప్రవేశించకుండా యెహోయాదా ఆలయ ద్వారాల వద్ద కాపలా దారులను నియమించాడు.
20 యెహోయాదా సైన్యాధిపతులను, ప్రజానాయకులను, ప్రాంతీయ పాలకులను, ఇతర ప్రజలందరినీ తనతో తీసికొని వెళ్లాడు. ఆలయం నుండి రాజును కూడ తనతో తీసుకొని పై ద్వారం గుండా రాజభవనానికి వెళ్లాడు. అక్కడ వారు రాజును సింహాససనంపై కూర్చుండబెట్టారు. 21 యూదా ప్రజలంతా చాలా సంతోషపడ్డారు. అతల్యా కత్తివేటుకు గురియై చనిపోవటంతో యెరూషలేము నగరంలో శాంతి నెలకొన్నది.
*23:11: ఒక ధర్మశాస్త్ర … అతనికిచ్చారు హెబ్రీలో వారతనికి సాక్ష్యము యిచ్చారు ద్వితీయోపదేశకాండం 17:18 చూడండి.