10
షోమ్రోను నాయకులకు యెహూ ఉత్తరాలు వ్రాయుట
షోమ్రోనులో అహాబుకి డెబ్భైమంది కుమారులుండిరి. యెహూ ఉత్తరాలు రాసి యెజ్రెయేలు రాజులకు నాయకులకు వాటిని షోమ్రోనుకు పంపాడు. అహాబు కుమారులును పెంచిన ప్రజలకు కూడా ఆ ఉత్తరాలు అతడు పంపాడు. ఆ ఉత్తరాలలో యెహూ ఇట్లు చెప్పాడు: 2-3 “మీకీ ఉత్తరం చేరగానే, మీ తండ్రి కుమారులలో సర్వశ్రేష్టుడైన వానిని ఎన్నుకోండి. మీకు రథాలు గుర్రాలు వున్నాయి. మీరు బలిష్టమైన నగరంలో ఉంటున్నారు. మీకు ఆయుధాలు కూడా వున్నాయి. మీరెన్నుకున్న అతని కుమారుని తండ్రి సింహాసనం మీద కుర్చోబెట్టండి. తర్వాత మీ తండ్రి వంశం కోసం పోరాడండి.”
కాని యెజ్రెయేలు పరిపాలకులు, నాయకులు చాలా భయపడిపోయారు. “ఆ రాజులిద్దరు (యెహోరాము మరియు అహజ్యా) యెహూని ఆపలేక పోయారు. కనుక మనము కూడా అతనిని ఆపలేము” అని వారు అనుకున్నారు.
అహాబు గృహ సంరక్షకుడు, నగరాన్ని అదుపులో ఉంచిన వాడు, అహాబు పిల్లలను పెంచిన పెద్దలు ప్రజలు యెహూకి ఒక సందేశం పంపారు. “మేము మీ సేవకులం. మీరేమి చెపితే మేమది చేస్తాము. మేమె వరిని రాజుగా చేసుకోవాలి. మీకు ఏది మంచిదిగా తోస్తే అది మాకు చెయ్యండి” అని తెలియజేసారు.
షోమ్రోను నాయకులు అహాబు పిల్లలను చంపుట
తర్వాత యెహూ రెండవ ఉత్తర ఆ నాయకులకు రాశాడు. “మీరు కనుక నన్ను సమర్థిస్తే నా మాట పాటిస్తే, ఇప్పుడు అహాబు కుమారుల తలలు నరికి వేయండి. రేపు ఈపాటికి వాటిని యెజ్రెయేలులో నా వద్దకు తీసుకురండి” అని యెహూ చెప్పాడు.
అహాబుకి డెబ్భైమంది కుమారులు. వారు తమను పెంచిన నగర నాయకులతో ఉన్నారు. ఈ లేఖను నగర నాయకులు అందుకోగానే, వారు రాజ కుమారులు డెబ్భైమందిని తీసుకొని వెళ్లి చంపివేశారు. తర్వాత నాయకులు రాజ కుమారుల తలలను బుట్టలలో వేసి యెజ్రెయేలులోని యెహూకి ఆ బుట్టులు పంపారు. దూత యెహూని సమీపించి అతనికిది చెప్పాడు: “వాళ్లు రాజకుమారుల తలలు తెచ్చారు!”
తర్వాత యెహూ, “నగర ద్వారం వద్ద ఉదయం వరకు రెండు వరసలలో ఆ తలలు ఉంచండి” అని చెప్పాడు.
ఉదయాన, యెహూ వెలుపలికి వెళ్లి, ప్రజల యెదుట నిలచి వారితో ఇలా అన్నాడు: “మీరు అమాయకులు. చూడండి. నేన నా యజమానికి విరుద్ధంగా పథకాలు వేశాను. నేనతనిని చంపాను. కాని ఆహాబు పిల్లలందరినీ ఎవరు చంపారు? మీరే చంపారు. 10 యెహోవా చెప్పినదంతా జరుగుతుందని మీరు గ్రహించాలి. మరియు యెహోవా అహాబు వంశానికి సంబంధించిన యీ విషయాలు చెప్పేందుకు ఏలీయాని ఉపయెగించాడు. యెహోవా తాను చేస్తానన్న పనులు చేశాడు.”
11 అందువల్ల యెహూ యెజ్రెయేలులో నివసించే అహాబు వంశీయుల నందరనీ చంపివేశాడు. యెహూ ముఖ్యులందరినీ, సన్నిహిత మిత్రుల్ని, యాజకులను చంపివేశాడు. అహాబు వంశంలోని వారు ఎవ్వరూ మిగలలేదు.
యెహూ అహజ్యా బంధువులను చంపుట
12 యెహూ యెజ్రెయేలు విడచి షోమ్రోనుకు వెళ్లాడు. తోవలో యెహూ గొర్రెల కాపరులు శిబిరం అనేచోట ఆగాడు. ఆ చోట గొర్రెల కాపరులు గొర్రెల మీద ఉన్నిని కత్తిరిస్తున్నారు. 13 యూదా రాజయిన అహజ్యా యొక్క బంధువులను యెహూ కలుసుకున్నాడు. “ఎవరు మీరు?” అని యెహూ ప్రశ్నించాడు.
వారు, “మేము యూదా రాజయిన అహజ్యా బంధువులము. రాజకుమారులను రాణిగారి పిల్లలను చూసి వెళ్లదామని వచ్చాము” అని సమాధనం చెప్పారు.
14 తర్వాత యెహూ, “వారిని సజీవులుగా తీసుకువెళ్లండి” అని తన మనుష్యులకు చెప్పాడు.
యెహూ మనుష్యులు అహజ్యా బంధువులను సజీవులుగా పట్టుకున్నారు. వారు నలభై రెండు మంది. బేతెకెదు బావి వద్ద యెహూ వారిని చంపివేశాడు. యెహూ ఒక్కరిని కూడా ప్రాణాలతో వుండనివ్వలేదు.
యెహూ యెహోనాదాబును కలుసుకొనుట
15 అక్కడినుంచి యెహూ వెళ్లిన తర్వాత, అతను రేకాబు కుమారుడైన యెహోనాదాబును కలుసుకున్నాడు. యెహూని కలుసుకున్నాడు. యెహోనాదాబు వెళ్లుచున్నాడు.యెహూ యెహోనా దాబును అభినంధించి, “నేను నీకు నమ్మకస్థుడనైన స్నేహితునివలె, నీవు నాకు నమ్మకస్థుడనైన స్నేహితుడవేనా?” అని అడిగాడు.
“నేను నీకు నమ్మకస్థుడైన స్నేహితుడినే” అని యెహోనాదాబు బదులు చెప్పాడు.
“అలా అయితే, నీ చేయి నాకిమ్ము” అని యెహూ చెప్పాడు.
తర్వాత యెహూ యెహోనాదాబును లాగి తన రథంలోకి ఎక్కించుకున్నాడు.
16 “నాతోపాటురా. యెహోవాపట్ల నా భావాలు ఎంత దృఢంగా ఉన్నాయో చూడవచ్చు” అని యెహూ చెప్పాడు.
అందువల్ల యెహోనాదాబు యెహూ రథంలో వెళ్లాడు. 17 యెహూ షోమ్రోనుకి వచ్చి, అక్కడ ఇంకా సజీవులై వున్న అహాబు వంశీయులందరిని హతమార్చాడు. యెహూవా ఏలీయాతో చెప్పినట్లుగా, యెహూ అన్ని పనులు చేసాడు.
యెహూ బయలుదేవుని పూజించే వారిని పిలచుట
18 తర్వాత యెహూ ప్రజలందరినీ సమీకరించాడు. వారితో యెహూ, “అహాబు కొద్దిగా బయలు దేవుని సేవించాడు. కాని యెహూ అనే నేను బయలు దేవునికి ఎక్కువ సేవ చేస్తాను. 19 ఇప్పుడు బయలు దేవుని ప్రవక్తలను యాజకులను అందరినీ పిలవండి. బయలు దేవుని పూజించేవారినందరినీ పిలవండి. ఈ సమావేశానికి అందురూ హాజరు అయ్యేలా చూడండి. బయలు దేవునికి నేనొక గొప్పబలి సమర్పించాలి. ఈ సమావేశానికి రానివారిని నేను చంపుతాను” అని చెప్పాడు.
కాని యెహూ వారిపట్ల కుయుక్తి పన్నాడు. బయలు ఆరాధకులను యెహూ నాశనం చేయదలచాడు. 20 “బయలుకు ఒక పవిత్ర సమావేశం ఏర్పాటు చేయండి” అని యెహూ చెప్పాడు. మరియు యాజకులు సమావేశం ప్రకటించారు. 21 తర్వాత యెహూ ఇశ్రాయేలు దేశమంతటా ఒక సందేశం పంపాడు. బయలు ఆరాధకులందరూ వచ్చారు. ఎవ్వరూ ఇంట్లో వుండలేదు. బయలు దేవుని మందిరంలో బయలు ఆరాధకుందరూ వచ్చారు. మందిర ప్రజలతో నిండిపోయింది.
22 దుస్తులు దగ్గర ఉంచబడిన వ్యక్తితో యెహూ ఇట్లనెను. “బయలు ఆరాధకులందరికి దుస్తులు తీసుకురండి” అని చెప్పగా ఆ వ్యక్తి బయలు ఆరాధకులందరికి దుస్తులు తీసుకు వచ్చాడు.
23 తర్వాత యెహూ, రేకాబు కుమారుడైన యెహూనాదాబు బయలు మందిరంలోనికి పోయారు. బయలు ఆరాధకులను ఉద్దేశించి, “మీ చుట్టు పక్కల చూడండి. మీతో యెహోవా యొక్క సేవకులెవరూ లేరని చూసుకోండి. బయలు ఆరాధకులు మాత్రమే ఇక్కడున్నారని నిర్దారణ చేసుకోండి” అని యెహూ చెప్పాడు. 24 బయలు ఆరాధకులు గుడిలోకి వెళ్లారు; బలులు మరియు దహన బలులు అర్పించాలనుకున్నారు.
కాని వెలుపల, యెహూ ఎనభై మందితో వేచి యున్నాడు. “ఎవ్వరూ తప్పించుకోకుండా చూడండి. ఎవ్వరైనా ఒక్కనినైనా తప్పించినట్లుయితే, ఆ వ్యక్తి తన ప్రాణమునే ఫలితంగా పెట్టవలసి వస్తుంది” అని యెహూ చెప్పాడు.
25 తర్వగా యెహూ తన దహన బలుల అర్పణ పూర్తి చేయగా, అతను కాపలాదారుకు, అధిపతులకు ఇటు చెప్పాడు. “లోపలికి వెళ్లి, బయలు ఆరాధకులను చంపండి. ఆలయంలోనుండి ఎవ్వరూ సజీవంగా బయటికి రాకుండా చూడండి” అని చెప్పాడు.
అందువల్ల అధిపతులు ఖడ్గాలు ప్రయోగించి బయలు ఆరాధకులను చంపివేశారు. ఆ తర్వాత కాపలా దార్లు, అధిపతులు బయలు ఆరాధకుల శరీరాలను బయటికి విసిరివేశారు. తర్వాత వారు బయలు దేవత ఆలయంలోని లోపలిగదిలోనికి వెళ్లారు. 26 బయలు ఆలయంలో వున్న జ్ఞాపక శిలలను*జ్ఞాపక శిలలను ప్రజలు ఒక ప్రత్యేక విషయాన్ని జ్ఞాపకముంచుకోవాటానికి రాళ్లను ప్రతిష్టించేవాళ్లు. ఇశ్రాయేలీయులు కూడా అలాగే చేసేవాళ్లు. వారు వెలుపలికి తీసుకువచ్చి, దేవాలయాన్ని దగ్ధం చేశారు. 27 తర్వాత దేవాలయంలోని జ్ఞాపకశిలలను నుగ్గు నుగ్గు చేశారు. బయలు దేవాలయాన్ని కూడా నుగ్గు నుగ్గు చేశారు. వారు బయలు దేవాలయాన్ని ఒక మరుగుదొడ్డిగా మార్చారు. ప్రజలు ఇప్పటికి ఆ ప్రదేశమును ముస్తాబు గదిగా (పాయిఖానాగా) వాడతారు.
28 ఈ విధంగా యెహూ ఇశ్రాయేలులో బయలు ఆరాధనను నాశనం చేశాడు. 29 కాని నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలు పూర్తిగా తొలగలేదు; అందువల్ల ఇశ్రాయేలు పాపం చేయవలసి వచ్చింది. బేతేలు, దానులలో బంగారు దూడలను యెహూ నాశనం చెయ్యలేదు.
ఇశ్రాయేలుమీద యెహూ పరిపాలన
30 యెహోవా యెహూని ఉద్దేశించి, “నీవు బాగుగా చేశావు. నేను చెప్పిన సంగతులను నీవు చేశావు. నేను ఆశించిన విధంగా నీవు అహాబు వంశాన్ని నాశనం చేశావు. అందువల్ల నీ సంతతి వారు ఇశ్రాయేలును నాలుగు తరాలవరకూ పరిపాలిస్తారు” అని చెప్పాడు.
31 కాని హృదయపూర్వకంగా యెహూ జాగ్రత్తగా యెహోవా ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ నివసించలేదు. ఇశ్రాయేలును పాపానికి గురిచేసిన యరొబాము పాపాలను యెహూ ఆపలేకపోయాడు.
హజాయేలు ఇశ్రాయేలును ఓడించుట
32 ఆ సమయమున, యెహోవా ఇశ్రాయేలును భాగాలుగా ఛేదింపసాగాడు. సిరియా రాజయిన హజాయేలు ఇశ్రాయేలు ప్రతి సరిహద్దుననున్ను ఇశ్రాయేలు వారిని ఓడించాడు. 33 యోర్దాను నదికి తూర్పునవున్న ప్రదేశాన్ని హజాయేలు జయించాడు. గాదీయులకును, రూబేనీయులకును మరియు మనష్షేవంశాలకు చెందిన ప్రాంతాలను, గిలాదుప్రాంతములన్నీ, అర్నోను లోయ ప్రక్కనున్న అరోయేరు ప్రదేశంలోని గిలాదు, బాషాను ప్రాంతాల వరకూ హజాయేలు జయించాడు.
యెహూ మరణం
34 యెహూ కావించిన ఇతర గొప్ప పనులు “ఇశ్రాయేలు రాజుల వృత్తాంతము” అనే గ్రంథంలో వ్రాయబడినవి. 35 యెహూ మరణించగా, అతని పూర్వికులతో పాటుగా సమాధి చేయబడ్డాడు. షోమ్రోనులో ప్రజలు యెహూని సమాధి చేశారు. అతని తర్వాత, యెహూ కుమారుడైన యెహోయాహాజు ఇశ్రాయేలుకి కొత్తగా రాజయ్యాడు. 36 షోమ్రోనులో ఇశ్రాయేలు మీద యెహూ ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు పరి పాలించాడు.

*10:26: జ్ఞాపక శిలలను ప్రజలు ఒక ప్రత్యేక విషయాన్ని జ్ఞాపకముంచుకోవాటానికి రాళ్లను ప్రతిష్టించేవాళ్లు. ఇశ్రాయేలీయులు కూడా అలాగే చేసేవాళ్లు.