15
యూదా మీద అజర్యా పరిపాలన
1 ఇశ్రాయేలు రాజుగా యరొబాము పరిపాలన చేసే 27వ సంవత్సరమున యూదాకు రాజైన అమాజ్యా కుమారుడు అజర్యా రాజయ్యాడు. 2 అతను పరిపాలన ప్రారంభించేనాటికి, అజర్యా 16 సంవత్సరముల వయస్సు గలవాడు. యెరూషలేములో 52 సంవత్సరాలు పరిపాలించాడు. అజ ర్యా తల్లి పేరు యెరూషలేముకు చెందిన యెకొల్యా. 3 తన తండ్రి అమాజ్యావలె, అజర్యా యెహోవా మంచివని చెప్పిన పనులు చేశాడు. అతని తండ్రి అమాజ్యా చేసిన వాటినే అజర్యా అనుసరించాడు. 4 కాని అతను ఉన్నత స్థానాలను పాడు చేయలేదు. ఈ ఉన్నత స్థలాల్లో*ఉన్నత స్థలాల్లో దేవుణ్ణి, అబద్ధపు దేవుళ్లను పూజించే స్థలాలు తరచుగా ఈ స్థలాలు కొండలపైన, పర్వతాలపైన ఉంటాయి. ప్రజలింకా బలులు అర్పించుచూ; ధూపం వేయు చున్నారు.
5 యెహోవా అజర్యా రాజును కుష్ఠరోగగ్రస్తునిగా చేశాడు. అతను మరణించేంత వరకు కుష్ఠరోగియే. అజర్యా విడిగా ఒక ఇంట్లో ఉన్నాడు. రాజు కుమారుడైన యోతాము రాజభవన సంరక్షణలో శ్రద్ధ వహించాడు. ప్రజలను న్యాయ విచారణ చేశాడు.
6 అజర్యా చేసిన ఘనకార్యాలన్నీ “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో రాయబడినవి. 7 అజర్యా మరణించగా, దావీదు నగరంలో అతని పూర్వీకులతో పాటు సమాధి చేయబడ్డాడు. అజర్యా కుమారుడు యెతాము, అతని తర్వాత కొత్తగా రాజయ్యాడు.
ఇశ్రాయేలు మీద జెకర్యా కొద్ది కాలపు పరిపాలన
8 యరొబాము కుమారుడైన జెకర్యా ఇశ్రాయేలులోని షోమ్రోనుపై ఆరు నెలలు పరిపాలించాడు. ఇది యూదా రాజుగా అజర్యా పరిపాలనకు వచ్చిన 38వ సంవత్సరమున జరిగింది. 9 యెహోవా తప్పు అని చెప్పిన పనులు జెకర్యా చేశాడు. అతని పూర్వీకులు చేసిన వాటినే అతను చేసెను. నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలవల్ల ఇశ్రాయేలును పాపమునకు పాల్పడజేసిన ఆ పాపకార్యాలను అతను ఆపలేదు.
10 యాబేషు కుమారుడైన షల్లూము జెకర్యాకు విరోధంగా కుట్రపన్నాడు. షల్లూము జెకర్యాను ప్రజల ముందర చంపివేశాడు. అతని తర్వాత షల్లూము కొత్తగా రాజయ్యాడు. 11 జెకర్యా చేసిన ఇతర పన్నులన్నీ “ఇశ్రాయేలు రాజుల చరిత్ర” అనే గ్రంథంలో రాయబడి వున్నవి. 12 ఈవిధంగా యెహోవా చెప్పినవన్నీ నిజమయ్యాయి. యెహూ యొక్క సంతతిలోని నాలుగు తరాల వారు ఇశ్రాయేలు రాజులుగా ఉందురని యెహోవా చెప్పాడు.
ఇశ్రాయేలు మీద షల్లూము కొద్దికాలము అధికారం చేయుట
13 యాబేషు కుమారుడైన షల్లూము ఇశ్రాయేలుకు రాజయ్యాడు. ఇది యూదా రాజుగా ఉజ్జియా పరిపాలన చేసే 39వ సంవత్సరంలో జరిగింది. షోమ్రోనులో షల్లూము ఒక నెల పరిపాలించాడు.
14 గాదీ కుమారుడైన మెనహేము తిర్సానుండి షోమ్రోనుకు వచ్చాడు. మెనహేము యాబేషు కుమారుడైన షల్లూమును చంపివేశాడు. తర్వాత మెనహేము, అతని తర్వాత కొత్తగా రాజయ్యాడు.
15 షల్లూము చేసిన అన్ని పనులు జెకర్యాకు విరుద్ధంగా అతని పథకములతో సహా “ఇశ్రయేలు రాజుల చరిత్ర” అనే గ్రంథంలో రాయబడ్డాయి.
ఇశ్రాయేలులో మెనహేము పరిపాలన
16 షల్లూము మరిణానంతరం, మెనహేము తిప్సహు ఆ పరిసర ప్రాంతాన్ని ఓడించాడు. అతనికై ప్రజలు నగరద్వారాన్ని తెరవడానికి అంగీకరించలేదు. అందువల్ల మెనహేము వారిని ఓడించాడు. నగరంలోని గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చాడు.
17 అజర్యా యూదా రాజుగా వున్న 39వ సంవత్సరమున, గాదీ కుమారుడైన మెనహేము ఇశ్రాయేలుకు రాజయ్యాడు. షోమ్రోనులో మెనహేము పది సంవత్సరాల పాటు పరిపాలించాడు. 18 యెహోవా చెడ్డవని చెప్పిన పనులు మెనహేము చేశాడు. నెబాతు కుమారుడైన యరొబాము ఇశ్రాయేలీయులను పాపాలకు గురిచేసిన ఆ పాపాలను మెనహేము ఆపలేదు.
19 అష్షూరు రాజయిన పూలు ఇశ్రాయేలుకు ప్రతి కూలంగా యుద్ధం చేయడానికి వచ్చాడు. మెనహేము పూలుకు 75,000 పౌన్ల వెండి ఇచ్చాడు. పూలు మెనహేముకి సహాయపడుననీ, మెనహేము రాజ్యాన్ని బలిష్ఠం చేయుననీ అనుకుని అతను అలా చేశాడు. 20 ధనవంతులూ, అధికారం గలవారూ పన్నులు చెల్లించునట్లుగా చేసి మెనహేము డబ్బును వసూలు చేశాడు. మెనహేము ప్రతి వ్యక్తికీ 20 తులాల వెండి పన్నుగా విధించాడు. తర్వాత మెనహేము అష్షూరు రాజుకి ఆ డబ్బు ఇచ్చాడు. అందువల్ల అష్షూరు రాజు ఇశ్రాయేలును విడిచి వెళ్లాడు.
21 మెనహేము చేసిన అన్ని గొప్పకార్యాలు “ఇశ్రాయేలు రాజుల చరితగ్రంథంలో” రాయబడినవి. 22 మెనహేము మరణించగా, అతని పూర్వికులతో పాటు, అతడు సమాధి చేయబడ్డాడు. మెనహేము కుమారుడు పెకహ్యా అతని తర్వాత కొత్తగా రాజయ్యాడు.
ఇశ్రాయేలులో పెకహ్యా పరిపాలనఏ
23 అజర్యా యూదా రాజుగా వున్న 50 వ సంవత్సరమున, మెనహేము కుమారుడైన పెకహ్యా షోమ్రోనులోని ఇశ్రాయేలుకు రాజయ్యాడు. పెకహ్యా రెండేండ్లు పాలించాడు. 24 యెహోవా తప్పని చెప్పిన కార్యాలను పెకహ్యా చేశాడు. నెబాతు కుమారుడైన యరొబాము ఇశ్రాయేలును పాపకార్యాలకు గురిచేసిన ఆ పాపాలను పెకహ్యా ఆపలేదు.
25 పెకహ్యా సైన్యానికి అధిపతి అయిన పెకహు రెమల్యా కుమారుడు. పెకహు రాజైన పెకహ్యాకు విరోధముగా పన్నాగము చేశాడు. అతనిని షోమ్రోనులోని రాజభవనములో అతను చంపాడు. గిలాదునుంచి వచ్చిన 50 మంది మనుష్యులు పెకహ్యాని చంపేటప్పుడు పెకహుతో పాటువున్నారు. అతని తర్వాత పెకహు కొత్తగా రాజయ్యాడు.
26 పెకహ్యా చేసిన అన్ని గొప్పకార్యాలు “ఇశ్రాయేలు రాజుల చరిత్ర” అనే గ్రంథంలో రాయబడినవి.
ఇశ్రాయేలులో పెకహు పరిపాలన
27 యూదా రాజుగా అజర్యా వున్న 52వ సంవత్సరమున షోమ్రోనులోని ఇశ్రాయేలుని రెమల్యా కొడుకైన పెకహు పరిపాలించసాగాడు. పెకహు 20 సంవత్సరాలు పరిపాలించాడు. 28 యెహోవా చెడ్డవని చెప్పిన పనులు పెకహు చేశాడు. నెబాతు కుమారుడైన యరొబాము ఇశ్రాయేలుని పాపానికి గురిచేసిన ఆ పాపాలను పెకహు ఆపలేదు.
29 అష్షూరు పాలకుడైన తిగ్లత్పిలేసెరు ఇశ్రాయేలుకు ప్రతికూలంగా యుద్ధం చేయడానికి వచ్చాడు. ఇశ్రాయేలు రాజుగా పెకహు వున్న కాలంలో ఇది జరిగింది. తిగ్లత్పిలేసరు, ఈయోను, ఆబేల్బేత్మయకా, హాసోరు, గిలాదు, యానోయహు కెదెషు గలిలయ మరియు నఫ్తాలీ ప్రాంతమంతటినీ స్వాధీనం చేసుకున్నారు. ఈ అన్ని స్థలాలనుండి తిగ్లత్పిలేసరు ప్రజలను బందీలుగా అష్షూరుకు తీసుకు వెళ్లాడు.
30 హోషేయా కొడుకు ఏలా, రెమల్యా కొడుకు పెకహు మీద పన్నాగం పన్నాడు. హోషేయా పెకహును చంపివేశాడు. అప్పుడు హోషేయా పెకహుకు పిదప క్రొత్తగా రాజు అయ్యాడు. ఇది ఉజ్జియా కొడుకు యోతాము యొక్క 20వ సంవత్సర యూదా పరిపాలనలో జరిగింది.
31 పెకహు చేసిన అన్ని ఘనకార్యములు “ఇశ్రాయేలు రాజుల చరిత్ర” అనే గ్రంథంలో రాయబడినవి.
యూదాపై యోతాము పరిపాలనౌ
32 ఉజ్జియా కుమారుడైన యోతాము యూదాకు రాజయ్యాడు. రెమల్యా కొడుకైన పెకహు ఇశ్రాయేలు రాజుగా వున్న రెండవ సంవత్సరంలో ఇది జరిగింది. 33 యోతాము రాజయినప్పుడు, అతను 25 యేండ్లవాడు. యోతాము యెరూషలేములో 16 సంవత్సరాలు పాలించాడు. యోతాము తల్లి పేరు యెరూషా. ఆమె సాదోకు కుమార్తె. 34 తన తండ్రి ఉజ్జియావలె, యెహోవా మంచివని చెప్పిన పనులు యోతాము చేశాడు. 35 కాని అతను ఉన్నత స్థలాలను పాడు చేయలేదు. ఈ ఉన్నత స్థలలలో ప్రజలు నేటికి బలులు అర్పించుచూ ధూపం వేయుచున్నారు. యెహోవా ఆలయానికి గల పై ద్వారమును యోతాము నిర్మించాడు. 36 యోతాము చేసిన అన్ని ఘనకార్యాలు “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో రాయబడినవి.
37 ఆ సమయమున, సిరియా రాజయిన రెజీనును, రెమల్యా కొడుకైన పెకహును యూదాకు ప్రతికులంగా యుద్ధం చేయడానికి యెహోవా పంపాడు.
38 యోతాము మరణించగా, అతని పూర్వికులతో పాటు అతను అతని పూర్వికుడైన దావీదు పేరు మీదగల నగరంలో సమాధి చేయబడ్డాడు. యోతాము కుమారుడు అహాజు అతని తర్వాత కొత్తగా రాజయ్యాడు.
*15:4: ఉన్నత స్థలాల్లో దేవుణ్ణి, అబద్ధపు దేవుళ్లను పూజించే స్థలాలు తరచుగా ఈ స్థలాలు కొండలపైన, పర్వతాలపైన ఉంటాయి.