16
1 మరో పర్యాయం యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఈ విధంగా చెప్పాడు: 2 “నరపుత్రుడా, యెరూషలేము ప్రజలకు వారు చేసిన భయంకర నేరాల విషయం తెలియజెప్పు. 3 నీవు ఇలా చెప్పాలి, ‘యెరూషలేముకు నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు: నీ చరిత్రవైపు ఒకసారి చూడు. నీవు కనానులో జన్మించావు. నీ తండ్రి అమోరీయుడు. నీ తల్లి హిత్తీయురాలు. 4 యెరూషలేమా, నీవు పుట్టిన రోజన నీ బొడ్డు కోయటానికి ఒక్కరు కూడా లేరు. నిన్ను శుభ్రపర్చటానికి నీ మీద ఎవ్వరూ ఉప్పు పెట్టి స్నానం చేయించలేదు. నీకు ఎప్పురూ పొత్తిగుడ్డలు చుట్టలేదు. 5 యెరూషలేమా, నీవు అప్పుడు ఒంటరిదానవు. నీ కొరకు ఎవ్వరూ బాధపడలేదు. నిన్ను గూర్చి ఎవ్వరూ శ్రద్ధ తీసుకోలేదు. యెరూషలేమా, నీవు పుట్టిన రోజునే నీ తలిదండ్రులు నిన్నుపొలాల్లో పారవేశారు. నీవు అప్పటికి ఇంకా రక్తంతోను, మావితోను కప్పబడి ఉన్నావు.
6 “ ‘అప్పుడు నేను (దేవుడు) అటుగా వేళ్లు చున్నాను. నీవు రక్తంలో తన్నుకుంటూ అక్కడ పడివుండటం నేను చూశాను. నీవు రక్తంతో కప్పబడివున్నావు. కాని నేను, “నీవు బతుకుగాక!” అని అన్నాను. అవును. నీవు రక్తంతో కప్పబడినావు. కాని, “నీవు బతుకుగాక!” అని నేనన్నాను. 7 పొలంలో మొక్కలా నీవు పెరిగేటందుకు నేను సహాయం చేశాను. నీవు అలా, అలా పెరిగవు. నీవు కన్యకవయ్యావు. నీవు ఋతుమతివయ్యావు. నీ చన్నులు పెరిగాయి నీ తల వెంట్రుకలు పెరిగాయి. అయినా, నీవు ఇంకా నగ్నంగా దిసమొలతో ఉన్నావు. 8 నేను నిన్ను తేరిపార చూశాను. ప్రేమకు తగిన వయస్సు నీకు వచ్చినట్లు గమనించాను. కావున నా వస్త్రములు నీమీద వేసి, నీ నగ్నత్వాన్ని కప్పివేశాను. నిన్ను వివాహమాడటాకి అభయమిచ్చాను. నాతో ఒక అంగీకారానికి*అంగీకారం అంగీకారం కుదిరినదనగా వివాహానికి ప్రధానం జరిగినదని అర్థం. దీనికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో కుదుర్చుకున్న ఒప్పందం అని కూడ అర్థమవుతుంది. వచ్చాను. అంతే; నీవు నాదానివయ్యావు.’ ” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. 9 “ ‘నేను నిన్ను నీటితో కడిగాను. నీ రక్తాన్ని కడిగాను. నీ వంటికి చమురు రాశాను. 10 †10-13 వచనములు 10 నుండి 13వ వచనం వరకు ఇచ్చిన వస్తువులు పవిత్ర గుడార నిర్మాణంలో ఉపయోగిస్తారు. చూడుము నిర్గమ. 25-40 నీకు అందమైన బట్టలు, మెత్తని చర్మపు పాదరక్షలు ఇచ్చాను. నేను నీకు నారతో ఒక తలకట్టు, భుజాలమీద వేసుకొనే పట్టు బట్టను ఇచ్చాను. 11 పిమ్మట నీకు కొన్ని ఆభరణాలు ఇచ్చాను. నీ ముంజేతులకు కడియాలు తొడిగాను. నీ మెడలో బంగారు హారం వేశాను. 12 నీకు ముక్కుపుడక చెవికి దుద్దులు, నీ తలకు కిరీటము అమర్చాను. 13 నీవు ధరించిన వెండి బంగారు ఆభరణాలలోను; నార, పట్టు, కుట్టుపని వస్త్రాలలోను నీవు ఎంతో అందంగా కన్పించావు. నీవు మిక్కిలి విలువైన ఆహారం తిన్నావు. నీవు మహా సౌందర్యవతివయ్యావు. నీవు రాణి వయ్యావు! 14 నీవు అందానికి ప్రసిద్ధి చెందావు. ఎందువల్లనంటే నిన్ను అంత లావణ్యవతిగా తీర్చిదిద్దాను!’ ” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
15 దేవుడు ఇంకా ఇలా చెప్పాడు: “కానీ నీవు నీ అందాన్ని నమ్ముకోవటం ప్రారంభించావు. నీకున్న మంచి పేరును నీవు వినియోగించుకుంటూ, నీవు నా పట్ల విశ్వాస ఘాతకురాలుగా వున్నావు. నీ పక్కగా వెళ్లే ప్రతివాని పటల నీవొక వేశ్యవలె ప్రవర్తించావు. నీకై నీవు వారందరికీ సమర్పించుకున్నావు! 16 నీ అందమైన వస్త్రాలను తీసుకొని, నీ ఆరాధనా స్థలాలను అలంకరించటానికి నీవు వాటిని వినియోగించావు. ఆ స్థలాలలో నీవొక వేశ్యవలె ప్రవర్తించావు. నీ పక్కగా వచ్చిన ప్రతివానికీ నిన్ను నీవు సమర్పించుకున్నావు. 17 పిమ్మట నేను నీకిచ్చిన వినువైన ఆభరణాలను తీశావు. ఆ వెండి బంగారాలను కరిగించి పురుషుల విగ్రహాలు చేయటానికి వినియోగించావు. పైగా వాటితో నీవు వ్యభిచరించావు కూడ! 18 తరువాత అందమైన వస్త్రాలు తీసుకొని ఆ విగ్రహాలకు దుస్తులు తయారు చేశావు. నేను నీకిచ్చిన అత్తరులు, సాంబ్రాణి తీసుకొని, వాటిని విగ్రహాల ముందు వుంచావు. 19 నేను నీకు రొట్టె, తేనె, నూనె ఇచ్చాను. కాని నేనిచ్చిన ఆహారాన్నంతా నీవు నీ విగ్రహాలకు సమర్పించావు. నీ బూటకపు దేవతల తృప్తికొరకు నీవు వాటిని మనోహరమైన పరిమళంగా సమర్పించావు. ఆ బూటకపు దేవతలతో నీవొక వేశ్యవలె వ్యవహరించావు!” నా ప్రభువైన యెహోవా ఈ విషయోలు చెప్పాడు.
20 దేవుడు చెప్పటం కొనసాగించాడు, “నీకూ, నాకూ పిల్లలు పుట్టారు. కాని మన పిల్లల్ని నీవు తీసుకొన్నావు. వారిని నీవు చంపి, ఆ బూటకపు దేవుళ్ళకు అర్పించావు! నీవు నన్ను మోసం చేసి, నన్ను వదిలి ఆ బూటకపు దేవుళ్ళ వద్దకు వెళ్లినప్పుడు చేసిన నీచమైన పనులలో ఇది ఒకటి. 21 నీవు నా కుమారులను నరికి, అగ్నిద్వారా వాళను నీ బూటకపు దేవుళ్ళకు అందించావు. 22 నీవు నన్ను వదిలి, ఈ భయంకరమైన పనులన్నిటికీ పాల్పడ్డావు. నీ చిన్నతనాన్ని నీవు ఒక్క సారి కూడా గుర్తుకు తెచ్చుకోలేదు. నేను నిన్ను కనుగొన్నప్పుడు నీవు దిసమొలతో వున్నట్లు, రక్తంలో కొట్టుకుంట్లున్నటలు నీకు జ్ఞాపకం లేదు.
23 “ఈ చెడు కార్యాలన్నిటి తరువాత, … ఓ యెరూషలేమా, అది నీకు చాలా కీడుగా ఉంటుంది!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు తెలియజేశాడు. 24 “ఈ విషయాలన్నీ చేసిన పిమ్మట, ఆ బూటకపు దేవతను ఆరాధించటానికి నీవొక గుట్టను నిర్మించావు. ప్రతి వీధి చివరా బూటకపు దేవతలను ఆరాధించటానికి నీవు స్థలాలు ఏర్పాటు చేశావు. 25 ప్రతి బాట మొదలయ్యిన చోటా నీవు పూజకై గుట్టలు నిర్మించావు. తరువాత నీవు నీ అందాన్ని భ్రష్టపర్చుకున్నావు. అటుపోయే ప్రతి మనుష్యునీ నీ వలలో వేసుకొనేటందుకు దానిని వినియోగించుకున్నావు. వారికి నీ కాళ్ళు కన్పించేలాగు నీ చీర పైకెత్తావు. తరువాత ఆ మనుష్యులతో నీవొక వేశ్యలా ప్రవర్తించావు. 26 పిమ్మట నీవు కామాతురుడైన నీ పొరుగు వాడైన ఈజిప్టు వద్దకు వెళ్లావు. నన్ను ఆగ్రహపర్చేలా నీవు వానితో అనేకసార్లు వ్యభిచరించావు. 27 కావున నేను నిన్ను శిక్షించాను! నీ బత్తెం (భూమి)లో కొంత భాగాన్ని నేను తీసుకొన్నాను. నీ శత్రువులగు ఫిలిష్తీయుల కుమారైలను (నగరాలు) నీకు వ్యతిరేకంగా వారికి ఇష్టంవచ్చినట్లు చేయనిచ్చాను. నీవు చేసే చెడ్డ పనులపట్ల చివరికి వారు కూడ విభ్రాంతి చెందారు. 28 పిమ్మట నీ కామవాంఛ తీర్చుకోవచానికి నీవు అష్షూరు వెళ్లావు. అక్కడ నీ వార ఛ తీరలేదు. నీకు అసలు తృప్తి అనేది లేదు. 29 అందువల్ల నీవు కనానువైపు తిరిగావు; అటు తరువాత బబలోను (బాబిలోనియా) కు వెళ్లావు. ఆయినా నీకు కామం తీరలేదు. 30 నీ మనస్సు మిక్కిలి బలహీనమయ్యింది. ఆ మనుష్యులందరు (దేశాలు) నిన్ను పాపం చేయటానికి ప్రోత్సహించేలా నీవు అలుసు ఇచ్చావు. నీవు కేవలం అహంకారపు వేశ్యలా‡అహంకారపు వేశ్య అహంకారపు లేదా సిగ్గులేని. ప్రవర్తించావు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
31 దేవుడు ఇలా చెప్పసాగాడు: “కాని, నీవు అసలైన వేశ్యలా లేవు. ప్రతి బాట మొదట నీవు నీ గుట్టలను ఏర్పాటు చేశావు; ప్రతి వీధి చివర నీ ఆరాధనా స్థలాలు నెలకొల్పావు. ఆ మనుష్యులందరితో నీవు వ్యభిచరించావు. అయినా, నిజంగా ఒక వేశ్య అడిగినట్లు నీవు వారిని డబ్బు అడగలేదు. 32 నీవు వ్యభిచారివి. నీవు నీ భర్తతో గాకుండా, కొత్త వారితో సంభోగానికి ఇష్ట పడ్డావు. 33 వేశ్యలలో అధిక సంఖ్యాకులు తమ కోర్కె తీర్చుకొనే పురుషులను డబ్బు ఇమ్మని పీడిస్తారు. కాని నీవు మాత్రం అనేకంగా వున్న నీ విటులకు నీ బహుమానాలను, డబ్బును ఇచ్చావు. నీతో వ్యభిచరించడానికి చుట్టూవున్న పురుషులకు డబ్బిచ్చావు. 34 చాలా మంది వేశ్యలకన్నా నీవు భీన్నంగా వున్నావు. చాలా మంది వేశ్యలు పురుషులను డబ్బు ఇమ్మని బాధిస్తారు. కాని నీవు మాత్రం నిన్ను పొందమని నీ విటులకు డబ్బు ఎదురిస్తున్నావు.”
35 ఓ వేశ్యా, యెహోవా నుండి వచ్చిన సందేశం విను. 36 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు, “నీ స్వంత డబ్బు ఖర్చు పెట్టి నీ విటులకు, హేయమైన దేవతలకు నీ నగ్నత్వాన్ని చూపించి, వారితో వ్యభిచరించావు. నీ పిల్లల్ని నీవు చంపావు. నీవు వారి రక్తాన్ని వారపోశావు. ఆ బూటకపు దేవుళ్ళకు అది నీ కానుక. 37 అందువల్ల నీ విటుల నందరినీ కూడదీస్తున్నాను. నీవు ప్రేమించిన మనుష్యులందరినీ, నీవు అసహ్యించుకున్న మనుష్యులందరినీ తీసుకువస్తాను. వాళ్లందరినీ ఒక్కసారిగా తీసుకొని వచ్చి వారు నీ నగ్న స్వరూపాన్ని§నగ్న స్వరూపము హెబ్రీ భాషలో ‘బందీగా అన్యదేశాలకు కొనిపోబడతావు’ అని అర్థం వస్తుంది. చూసేలా చేస్తాను. నీ పూర్తి దిగంబరత్వాన్ని వారు చూస్తారు. 38 అప్పుడు నేను నిన్ను శిక్షిస్తాను. ఒక హంతకురాలిగా, వ్యభిచారిణిగా నీ పాప నిరూపణ చేసి నిన్ను శిక్షిస్తాను. కోప గించిన, అసూయ చందిన ఒక భర్త చేతవలె నీవు శిక్షింపబడతావు. 39 నిన్ను నీ ప్రేమికుల చేతుల్లో పడవేస్తాను. వారు నీ గుట్టలన్నీ ధ్వంసం చేస్తారు. వారు నీ ఆరాధనా స్థలాలన్నీ తగలబెడతారు. వారు నీ బట్టలు చించివేస్తారు. వారు నీ అందమైన ఆభరణాలన్నీ తీసుకొంటారు. వారు నిన్ను నిలువు దోపిడీ చేసి, నేను నిన్ను కనుగొన్నప్పుడు వున్నట్లు నగ్నంగా వదులుతారు. 40 వారు ఒక పెద్ద గుంపును తీసుకొని వచ్చి నిన్ను చంపటానికి బండరాళ్ళు విసురుతారు. వారి కత్తులతో నిన్ను ముక్కలుగా నరుకుతారు. 41 వారు నీ ఇంటిని (ఆలయం) తగలబెడతారు. ఇతర స్త్రీలందరూ చూచే విధంగా వారు నిన్ను శిక్షిస్తారు. నీవు వేశ్యా జీవితం గడపకుండా నిన్ను కట్టుదిట్టం చేస్తాను. నీ విటులకు నీవు డబ్బు ఇవ్వకుండా నిన్ను ఆపుతాను. 42 అప్పుడు నేను కోపాన్ని ఆపి, అసూయ చెందకుండా వుంటాను. నేను శాంతిస్తాను. ఆ పిమ్మట నేను మరెన్నడూ కోపగించను. 43 ఈ విషయాలన్నీ ఎందుకు సంభవిస్తాయి? ఎందుకనగా నీవు చిన్న వయస్సులో ఉన్నప్పుడు ఏమి జరిగినదో నీకు జ్ఞాపకం లేదు గనుక. ఆ చెడ్డ పనులన్నీ నీవు చేసి నాకు కోపం కలిగించావు. ఆ చెడు కార్యాలు చేసినందుకు నిన్ను నేను శిక్షించవలసి ఉంది. అయినా నీవు మరిన్ని భయంకరమైన పనులు చేయటానికి వ్యూహం సిద్ధం చేశావు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
44 “నిన్ను గురించి చెప్పుకునే ప్రజలందరికీ ఇప్పుడు ఇంకొక విషయం తోడవుతుంది. వారంతా, ‘తల్లిలాగనే కూతురు కూడ’ అని అంటారు. 45 అచ్చం నీవు నీ తల్లి కూతురువే. నీవు నీ భర్తను గురించి గాని, నీ పిల్లలను గురించి గాని శ్రద్ధ చేయవు. నీవు ఖచ్చితంగా నీ సోదరిలా వున్నావు. మీ ఇద్దరూ మీ భర్తలను, మీ పిల్లలను అసహ్యించుకున్నారు. మీరు మీ తల్లిదండ్రుల వలెనే ప్రవర్తిస్తున్నారు. నీ తల్లి హిత్తీయురాలు. నీ తండ్రి అమోరీయుడు. 46 నీ పెద్ద సోదరి సమరయ (షోమ్రోను). ఆమె నీకు ఉత్తరంగా తన కుమారైలతో (పట్టణాలు) నివసిస్తోంది. నీ చిన్న సోదరి సొదొమ*సమరయ … సొదొమ సమరయ, సొదొమ ప్రజలు ఎంత చెడ్డవారో యూదా ప్రజలుకూడా అంత నీచ స్థితికి దిగజారి పోయారని యెహెజ్కేలు చెప్పుచున్నాడు. ఆ రెండు దేశాల ప్రజలు ఎంత చెడ్డవారనగా, చివరికి దేవుడు ఆ నగరాలను సర్వ నాశనం చేయవలసి వచ్చింది. ఆమె నీకు దక్షిణంగా తన కుమారైలతో (పట్టణాలు) నివసిస్తూ ఉంది. 47 వారు చేసిన మహా పాపాలన్నీ నీవూ చేశావు. కాని నీవింకా ఘోరమైన తప్పు పనులు చేశావు! 48 నేనే ప్రభువును; యెహోవాను. నేను సజీవుడను. నా జీవ ప్రమాణంగా చెపుతున్నాను. నీవు, నీ కుమారైలు చేసినన్ని చెడు కార్యాలు నీ సోదరి సొదొమ, ఆమె కుమారైలు ఎన్నడూ చేయలేదు.”
49 దేవుడు ఇలా చెప్పసాగాడు: “నీ సోదరి సొదొమ, ఆమె కుమారైలు గర్వష్ఠులు. వారికి తినటానికి పుష్కలంగా ఉంది. వారికి కావలసినంత తీరుబడి సమయం ఉంది. వారు పేదలను గాని, నిస్సహాయులను గాని ఆదుకోలేదు. 50 సొదొమ, ఆమె కుమారైలు అతి గర్విష్టులయి నా ఎదుటనే భయంకరమైన పాపాలు చేయటం మొదలు పెట్టారు. వారు చెడుకార్యాలు చేయటం నేను చూసి, వారిని శిక్షించాను.”
51 దేవుడు ఇంకా ఇలా చెప్పాడు, “నీవు చేసిన చెడుకార్యాలలో సమరయ సగం మాత్రమే చేసింది. సమరయ చేసిన వాటికంటే ఎన్నో ఘోరమైన పనులు నీవు చేశావు! నీ తోబుట్టువుల కంటె నీవు అనేకనేక చెడుకార్యాలు చేశావు. నీతో పోల్చి చూస్తే సొదమ, సమరయ ఎంతో మెరుగు. 52 కావున నీ సిగ్గు నీవు భరించాలి. నీతో పోల్చినప్పుడు నీ తోబట్టువులు మంచివాళ్లుగా కన్పించేలా నీవు ప్రవర్తించావు. నీవు ఘోరమైన చెడుకార్యాలు చేశావు. అందుకు నీవు సిగ్గుపడాలి.”
53 దేవుడు ఇలా చెప్పసాగాడు: “నేను సొదొమను, దాని చుట్టూ వున్న పట్టణాలను నాశనం చేశాను. నేనింకా సమరయను, దాని చుట్టూ వున్న పట్టణాలను. నాశనం చేశాను. మరియు, ఓ యెరూషలేమా, నిన్ను నాశనం చేస్తాను. కాని ఆ నగరాలను నేను మళ్లీ నిర్మిస్తాను. ఓ యెరూషలేమా, నిన్ను కూడా నేను తిరిగి నిర్మిస్తాను. 54 నిన్ను ఓదార్చుతాను. అప్పుడు నీవు చేసిన భయంకరమైన పనులు నీకు జ్ఞాపకం వస్తాయి. నీవు సిగ్గుపడతావు. 55 కావున నీవు, నీ తోబుట్టువులు తిరిగి నిర్మింపబడతారు. సొదొమ, దాని చుట్టూ వున్న పట్టణాలు; సమరయ, దాని చుట్టూ వున్న పట్టణాలు మరియు నీవు, నీ చుట్టూ వున్న పట్టణాలు, అన్నీ తిరిగి నిర్మింపబడతాయి.”
56 దేవుడు ఇలా అన్నాడు: “గతంలో నీవు గర్వంగా వున్నావు. నీ సోదరి సొదొమను నీవు ఎగతాళి చేశావు. కాని మళ్లీ నీవు అలా చేయలేవు. 57 నీవు శిక్షింపబడక ముందు, నీ పొరుగువారు నిన్ను చూచి నవ్వక ముందు నీవది చేశావు. ఎదోము (అరాము) కుమార్తెలు (పట్టణాలు), మరియు ఫిలిష్తీయులు ఇప్పుడు నిన్ను చూచి నవ్వుతున్నారు. 58 వు చేసిన ఘోర పాపాలకు ఫలితం ఇప్పుడు నీవు తప్పక అనుభవించాలి.” యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
59 నీ ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు: “నీవు నీ వివాహ ప్రమాణాన్ని నిలబెట్టుకోలేదు. మన ఒడంబడికను నీవు గౌరవించలేదు. 60 నీవు యౌవ్వన వయస్సులో వున్నప్పుడు మనం చేసుకొన్న నిబంధన నాకు జ్ఞాపకం ఉంది. నేను నీతో సదా కొనసాగే ఒక నిబంధన చేసుకొన్నాను! 61 నీ తోబుట్టువులను నీ వద్దకు చేర్చుతాను. వారిని నీ కుమార్తెలుగా తయారు చేస్తాను. అది మన నిబంధనలో లేకపోయి నప్పటికీ, నీకొరకు నేనది చేస్తాను. అప్పుడు నీవు చేసిన భయంకరమైన పనులు జ్ఞాపకం చేసుకొని సిగ్గుతో క్రుంగిపోతావు. 62 నీతో నేను చేసుకొన్న ఒడం బడికను కాపాడుతాను. అప్పుడు నేను యెహోవానని నీవు తెలుసుకొంటావు. 63 నేను నీపట్ల ఉదారంగా ఉంటాను. దానివల్ల నీవు నన్ను జ్ఞాపకం చేసుకొని, నీవు చేసిన పాపకార్యాలను తలచుకొని సిగ్గుతో కుమిలిపోతావు. నేను నిన్ను పరిశుద్దం చేస్తాను. మళ్లీ నీవు ఎన్నడూ సిగ్గు పడనవసరం లేదు!” నా ప్రభువైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు.
*16:8: అంగీకారం అంగీకారం కుదిరినదనగా వివాహానికి ప్రధానం జరిగినదని అర్థం. దీనికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో కుదుర్చుకున్న ఒప్పందం అని కూడ అర్థమవుతుంది.
†16:10: 10-13 వచనములు 10 నుండి 13వ వచనం వరకు ఇచ్చిన వస్తువులు పవిత్ర గుడార నిర్మాణంలో ఉపయోగిస్తారు. చూడుము నిర్గమ. 25-40
‡16:30: అహంకారపు వేశ్య అహంకారపు లేదా సిగ్గులేని.
§16:37: నగ్న స్వరూపము హెబ్రీ భాషలో ‘బందీగా అన్యదేశాలకు కొనిపోబడతావు’ అని అర్థం వస్తుంది.
*16:46: సమరయ … సొదొమ సమరయ, సొదొమ ప్రజలు ఎంత చెడ్డవారో యూదా ప్రజలుకూడా అంత నీచ స్థితికి దిగజారి పోయారని యెహెజ్కేలు చెప్పుచున్నాడు. ఆ రెండు దేశాల ప్రజలు ఎంత చెడ్డవారనగా, చివరికి దేవుడు ఆ నగరాలను సర్వ నాశనం చేయవలసి వచ్చింది.