5
ఆదాము కుటుంబ చరిత్ర
1 ఆదాము*ఆదాము అక్షరాల “మానవత్వం లేక ప్రజలు” “భూమి లేక ఎర్రమన్ను” అన్న పదాలకు అర్థంలాంటిదే. వంశాన్ని గూర్చిన గ్రంథం ఇది. దేవుడు తన పోలికలో మనిషిని (ఆదాము) చేసాడు. 2 ఒక పురుషుణ్ణి, మరో స్త్రీని దేవుడు చేసాడు. వాళ్లిద్దర్నీ చేసిన రోజున ఆయన వాళ్లను ఆశీర్వదించి, అప్పుడు వాళ్లకు మనుష్యులు అని పేరు పెట్టాడు.
3 ఆదాముకు 130 సంవత్సరములు వయస్సు వచ్చాక ఇంకో కుమారునికి తండ్రి అయ్యాడు. ఈ కుమారుడు అచ్చం ఆదాములాగే ఉన్నాడు. ఆదాము తన కుమారునికి షేతు అని పేరు పెట్టాడు. 4 షేతు పుట్టిన తర్వాత ఆదాము 800 సంవత్సరములు బతికాడు. ఆ కాలంలో ఆదాముకు ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. 5 కనుక ఆదాము మొత్తం 930 సంవత్సరములు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.
6 షేతుకు 105 సంవత్సరముల వయస్సులో ఎనోషు అనే ఒక కుమారుడు పుట్టాడు. 7 ఎనోషు పుట్టిన తర్వాత షేతు 807 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో షేతుకు ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. 8 కనుక మొత్తం 912 సంవత్సరాలు షేతు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.
9 తొంబై సంవత్సరాల వయస్సు దాటిన తరువాత ఎనోషుకు కేయినాను అనే కుమారుడు పుట్టాడు. 10 కేయినాను పుట్టిన తర్వాత, ఎనోషు 815 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి యింకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. 11 కనుక మొత్తం 905 సంవత్సరాలు ఎనోషు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.
12 కేయినాను 70 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత, మహలలేలు అనే కుమారుడు అతినికి పుట్టాడు. 13 మహలలేలు పుట్టిన తర్వాత కేయినాను 840 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో కేయినానుకు ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. 14 కనుక కేయినాను మొత్తం 910 సంవత్సరాలు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.
15 మహలలేలు 65 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు యెరెదు అను కుమారుడు అతనికి పుట్టాడు. 16 యెరెదు పుట్టిన తర్వాత, మహలలేలు 830 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. 17 కనుక మహలలేలు మొత్తం 895 సంవత్సరాలు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.
18 యెరెదుకు 162 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత హనోకు అనే కుమారుడు పుట్టాడు. 19 హనోకు పుట్టిన తర్వాత, యెరెదు 800 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. 20 కనుక యెరెదు మొత్తం 962 సంవత్సరాలు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.
21 హనోకు 65 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత మెతూషెల అనే కుమారుడు అతనికి పుట్టాడు. 22 మెతూషెల పుట్టిన తర్వాత, హనోకు యింకా 300 సంవత్సరాలు దేవునితో సహవాసం చేసాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. 23 కనుక హనోకు మొత్తం 365 సంవత్సరాలు జీవించాడు. 24 హనోకు దేవునికి సన్నిహితంగా ఉన్నాడు. ఒకనాడు దేవుడు హనోకును తనతో తీసుకుపోయాడు గనుక అతడు కనబడకుండా పోయాడు.
25 మెతూషెలకు 187 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత లెమెకు అనే కుమారుడు పుట్టాడు. 26 లెమెకు పుట్టిన తర్వాత, మెతూషెల 782 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. 27 కనుక మెతూషెల మొత్తం 969 సంవత్సరాలు జీవించాడు. అతడు అప్పుడు మరణించాడు.
28 లెమెకు వయస్సు 182 సంవత్సరాలు ఉన్నప్పుడు అతనికి ఒక కుమారుడు పుట్టాడు. 29 లెమెకు తన కుమారునికి నోవహు†నోవహు అనగా “నెమ్మది.” అని పేరు పెట్టాడు. “దేవుడు భూమిని శపించాడు గనుక వ్యయసాయ దారులమైన మనం చాసా కష్టపడి పని చేస్తున్నాం. అయితే నోవహు మనకు నెమ్మది కలుగజేస్తాడు” అన్నాడు లెమెకు.
30 నోవహుకు పుట్టిన తర్వాత లెమెకు 595 సంవత్సరములు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. 31 కనుక లెమెకు మొత్తం 777 సంవత్సరాలు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.
32 నోవహు 500 సంవత్సరములు దాటిన తర్వాత షేము, హాము, యాఫెతు అనే కుమారులు పుట్టారు.