32
ఏశావును మళ్లీ కలుసుకొనుట
యాకోబు కూడ అక్కడ నుండి వెళ్లి పోయాడు. అతడు ప్రయాణం చేస్తుండగా దేవుని దూతలను చూశాడు. యాకోబు వారిని చూసినప్పుడు, “ఇది దేవుని శిబిరం” అన్నాడు. కనుక ఆ స్థలానికి “మహనయీము”* మహనయీము అనగా “రెండు సేనలు” లేక “శిబిరాలు.” అని యాకోబు పేరు పెట్టాడు.
యాకోబు అన్న ఏశావు శేయెరు అనే ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఇది ఏదోం పర్వత ప్రాంతం. యాకోబు ఏశావుకు వార్తాహరులను పంపాడు. “ఏశావుకు ఇలా చెప్పండి అని వార్తాహరులతో చెప్పాడు యాకోబు: ‘మీ సేవకుడైన యాకోబు, నా యజమాని ఏశావుకు చెప్పేదేమిటంటే, ఇన్ని సంవత్సరాలు నేను లాబానుతో నివసించాను. పశువులు, గాడిదలు, మందలు, అనేక మంది సేవకులు, దాసీలు నాకు ఉన్నారు. అవన్నీ నేను నీకు పంపిస్తున్నాను. నీవు మమ్మల్ని చేర్చుకోవాలని మనవి.’ ”
వార్తాహరులు తిరిగి వచ్చి, “నీ అన్న ఏశావును కలుసుకొనేందుకు మేము వెళ్లాం. నిన్ను కలుసుకొనేందుకు అతడు వస్తున్నాడు. అతనితో 400 మంది మనుష్యులు ఉన్నారు” అని యాకోబుతో చెప్పారు.
ఆ వార్త యాకోబుకు భయం కలిగించింది. తనతో ఉన్న మనుష్యులందరినీ అతడు రెండు గుంపులుగా విభజించాడు. మందలను, పశువులను, ఒంటెలను రెండు గుంపులుగా విభజించాడు. “ఏశావు వచ్చి ఒక గుంపును హతమార్చినా, మరో గుంపు పారిపోయి తప్పించుకోవచ్చు” అనుకున్నాడు యాకోబు.
యాకోబు ఇలా అన్నాడు “నా తండ్రి అబ్రాహాము దేవా! నా తండ్రి ఇస్సాకు దేవా! ఓ యెహోవా, నన్ను మళ్లీ నా కుటుంబం దగ్గరకు, నా స్వదేశానికి నీవే వచ్చేయమన్నావు. నీకు నాకు మేలు చేస్తానన్నావు. 10 నా యెడల నీవు ఎంతో దయ చూపించావు. నాకు ఎన్నో మేళ్లు చేసావు. మొదటిసారి నేను యోర్దాను దాటినప్పుడు, నా చేతి కర్ర తప్ప యింకేమీ నా స్వంతం లేదు. ఇప్పుడు రెండు గుంపులకు సరిపడినంత నాకు ఉన్నది. 11 దయచేసి నా అన్న ఏశావు నుంచి నన్ను కాపాడు. నాకు అతడంటే భయంగా ఉంది. అతడు వచ్చి మమ్మల్ని అందరిని, చివరికి తల్లులను పిల్లలను కూడ చంపేస్తాడని భయంగా ఉంది. 12 నేను నీతో మంచిగా ఉంటాను. నేను నీ కుటుంబాన్ని వర్ధిల్లచేసి, నీ పిల్లల్ని ఇసుక రేణువులంత విస్తారంగా చేస్తాను. లెక్కింప జాలనంత విస్తారంగా వారుంటారు” అని నీవు నాతో అన్నావు గదా ప్రభూ.
13 యాకోబు ఆ రాత్రి అక్కడే ఉండిపోయాడు. ఏశావుకు కానుకలుగా ఇచ్చేందుకు కొన్ని వస్తువులను యాకోబు సిద్ధం చేసాడు. 14 యాకోబు 200 ఆడ మేకలను, 20 మేకపోతులను, 200 ఆడ గొర్రెలను, 20 పొట్టేళ్లను తీసుకొన్నాడు. 15 30 ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఎద్దులను, 20 ఆడ గాడిదలను, 10 మగ గాడిదలు యాకోబు తీసుకొన్నాడు. 16 “ఒక్కొక్క రకం జంతువుల మందను యాకోబు తన సేవకులకు అప్పగించాడు. అప్పుడు యాకోబు తన సేవకులతో ఒక్కో రకం జంతువుల మందను వేరు చేయండి నాకు ముందుగా నడుస్తూ, ఒక్కో మందకు మధ్య ఎడం ఉంచండి” అన్నాడు. 17 యాకోబు వారికి ఇవ్వవలసిన ఆజ్ఞలన్నీ ఇచ్చాడు. మొదటి మంద వెంబడి ఉన్న సేవకులతో యాకోబు “నా అన్న ఏశావు నీ దగ్గరకు వచ్చి, ‘ఇవి ఎవరి జంతువులు? నీవు ఎక్కడికి వెళ్తున్నావు? నీవు ఎవరి సేవకుడువి?’ అని అడిగితే, 18 ‘ఇవి నీ సేవకుడైన యాకోబు మందలు. నా యజమాని ఏశావుకు కానుకగా యాకోబు వీటిని పంపించాడు. యాకోబు కూడా మా వెనుక వస్తున్నాడు’ అని నీవు చె ప్పాలి” అన్నాడు.
19 అందరూ అలాగే చేయాలి అని రెండవ సేవకునికి, మూడవ సేవకునికి, మిగిలిన సేవకులందరికి యాకోబు ఆజ్ఞాపించాడు. “ఏశావును మీరు కలుసుకొన్నప్పుడు, ఏశావుకు మీరు ఇలానే చేయాలి. 20 ‘ఇది నీ కోసం కానుక, నీ సేవకుడైన యాకోబు వెనుక ఉన్నాడు’ ” అని మీరు చె ప్పాలి అన్నాడు యాకోబు.
“ఈ కానుకలు ఇచ్చి వీళ్లను ముందు పంపిస్తే ఒకవేళ ఏశావు నన్ను క్షమించి చేర్చుకొంటాడేమో” అనుకొన్నాడు యాకోబు. 21 కనుక యాకోబు ఏశావుకు కానుకలు పంపించాడు. అయితే యాకోబు మాత్రం ఆ రాత్రి శిబిరంలోనే వుండిపోయాడు.
22 ఆ రాత్రి చాలా గడిచిన తర్వాత యాకోబు లేచి బయల్దేరాడు. అతని భార్యలను, ఇద్దరు దాసీలను, తన పదకొండుమంది పిల్లలను అతడు తనతో కూడ వెంటబెట్టుకొని బయల్దేరాడు. యబ్బోకు నదిని దాటవలసిన చోట యాకోబు దాటాడు. 23 తన కుటుంబాన్ని నది దాటించాడు యాకోబు. తర్వాత యాకోబు తనకి కలిగిన దాన్ని అంతటినీ నది దాటించాడు.
దేవునితో పోరాటం
24 అందరికంటే చివర యాకోబు నదిని దాటాడు. అయితే అతడు దాటక ముందు, అతడు ఇంకా ఒంటరిగా ఉండగానే, ఒక మనిషి వచ్చి అతనితో పోరాడాడు. సూర్యుడు ఉదయించే వరకు ఆ మనిషి అతనితో పోరాడాడు. 25 ఆ మనిషి యాకోబును ఓడించలేనట్టు గ్రహించాడు. అందుచేత అతడు యాకోబు కాలును తాకాడు. అప్పుడే యాకోబు కాలి కీలు జారిపోయింది.
26 అప్పుడు ఆ మనిషి, “నన్ను వెళ్లనివ్వు, సూర్యుడు వచ్చేస్తున్నాడు” అని యాకోబుతో అన్నాడు.
కాని యాకోబు, “నేను నిన్ను వెళ్లనియ్యను. నీవు నన్ను ఆశీర్వదించాల్సిందే” అన్నాడు.
27 “నీ పేరేమిటి?” ఆ మనిషి అడిగాడు.
“నా పేరు యాకోబు” అన్నాడు యాకోబు.
28 అప్పుడు, “నీ పేరు ఇకమీదట యాకోబు కాదు. ఇప్పుడు నీ పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అనగా “దేవునితో పోరాడువాడు.” దేవునితోను, మనుష్యులతోను నీవు పోరాడి, ఓడిపోలేదు గనుక నీకు నేను ఈ పేరు పెడుతున్నాను” అన్నాడు ఆ మనిషి.
29 అప్పుడు యాకోబు, “దయచేసి నీ పేరు ఏమిటో చెప్పు” అని అడిగాడు.
అయితే ఆ మనిషి “నీవు నా పేరెందుకు అడగాలి?” అన్నాడు. అప్పుడే యాకోబును అతడు ఆశీర్వదించాడు.
30 అందుచేత ఆ స్థలానికి పెనూయేలు పెనూయేలు అనగా “దేవుని ముఖము.” అని యాకోబు పేరు పెట్టాడు. “ఇక్కడ దేవుణ్ణి నేను ముఖాముఖిగా చూసాను. అయినప్పుటికి నా ప్రాణం దక్కింది” అన్నాడు యాకోబు. 31 అతడు పెనూయేలు దాటుతుండగా సూర్యుడు ఉదయించాడు. యాకోబు కాలికి అలా జరిగినందువల్ల అతడు కుంటుతున్నాడు. 32 అందుచేత తొడ గూటి మీద ఉన్న కండరమును ఇశ్రాయేలీయులు ఈ రోజువరకు తినరు, ఎందుకంటే అక్కడే యాకోబుకు దెబ్బ తగిలింది.

*32:2: మహనయీము అనగా “రెండు సేనలు” లేక “శిబిరాలు.”

32:28: ఇశ్రాయేలు అనగా “దేవునితో పోరాడువాడు.”

32:30: పెనూయేలు అనగా “దేవుని ముఖము.”