3
1 నేను మీకు చెబుతున్న ఈ విషయాలు గ్రహించండి. యెరూషలేము, యూదాలు ఆధారపడే వాటన్నింటిని, ప్రభువు, సర్వశక్తిమంతుడైన యెహోవా తొలగించి వేస్తాడు. భోజనం, నీళ్లు మొత్తం దేవుడు తీసివేస్తాడు. 2 వీరులందరిని, శూర సైనికులందరిని దేవుడు తొలగించి వేస్తాడు. న్యాయమూర్తులను, మాంత్రికులను, పెద్దలను అందరిని దేవుడు తొలగించి వేస్తాడు. 3 సైనిక అధికారులను, ప్రభుత్వ అధికారులను దేవుడు తొలగించివేస్తాడు. నైపుణ్యంగల సలహాదార్లను, మంత్రాలు వేస్తూ, జ్యోతిష్యం చెప్పటానికి ప్రయత్నించే తెలివిగల వాళ్లందరిని దేవుడు తొలగించి వేస్తాడు.
4 దేవుడు చెబుతున్నాడు: “యువకులు మీకు నాయకులయ్యేట్టు నేను చేస్తాను. 5 ప్రతి ఒక్కరు ఒకరికి ఒకరు విరోధం అవుతారు. చిన్నవాళ్లు పెద్దవాళ్లను గౌరవించరు. సామాన్యులు ప్రముఖులను లెక్కచేయరు.”
6 ఆ సమయంలో ఒకడ తన స్వంత కుటుంబంలోంచి తన సోదరుణ్ణి ఒకణ్ణి పట్టుకొచ్చి, “నీకు రాజ వస్త్రము ఉంది గనుక నీవే మాకు నాయకుడివి. ఈ శిథిలాలు అన్నింటి మీద నీవే నాయకుడివి” అని అతనితో చెబుతాడు.
7 అయితే ఆ సోదరుడు లేచి, “నేను నీకు సహాయం చేయలేను. సరిపడినంత ఆహారంగాని బట్టలుగాని నా ఇంట్లో లేవు. నన్ను మీ నాయకుడిని చేయవద్దు” అని చెబుతాడు.
8 యెరూషలేము తొట్రిల్లి, తప్పు చేసింది గనుక ఇలా జరుగుతుంది. యూదా పతనమై, యెహోవాను వెంబడించటం మానివేసింది. వారు చెప్పేవి, చేసేవి యెహోవాకు విరుద్ధం. యెహోవా మహిమ నేత్రాలు వీటన్నింటిని తేటగా చూస్తాయి.
9 మనుష్యులు తప్పు చేసిన దోషులని వారి ముఖాలు చెబుతున్నాయి. ైపెగా వారు వారి పాపము గూర్చి అతిశయిస్తున్నారు. వారు సొదొమ పట్టణ ప్రజల్లా ఉన్నారు. వారి పాపాన్ని ఎవరు చూసినా లెక్క చేయరు. అది వారికి ఎంతో కీడు. వాళ్లకు వాళ్లే చాలా కష్టం తెచ్చుకొన్నారు.
10 మంచి వారికి మంచి సంగతులు జరుగు తాయని మంచి వారితో చెప్పుము. వారు చేసే మంచి పనులకు వారికి బహుమానం లభిస్తుంది. 11 కానీ చెడ్డ వాళ్లకు అది చాలా చెడుగా ఉంటుంది. వారికి చాలా కష్టం వస్తుంది. వారు చేసిన చెడు పనులన్నింటి కోసం వారు శిక్షించబడతారు. 12 చిన్న పిల్లలు నా ప్రజలను ఓడించేస్తారు. స్త్రీలు నా ప్రజల మీద ఏలుబడి చేస్తారు.
నా ప్రజలారా మీ మార్గ దర్శకులు మిమ్మల్ని తప్పు దారిలో నడిపిస్తున్నారు. సరియైన దారినుండి వారు మిమ్మల్ని తప్పించేస్తున్నారు.
తన ప్రజల గురించి దేవుని నిర్ణయం
13 ప్రజలకు తీర్పు తీర్చేందుకు యెహోవా నిలుస్తాడు. 14 పెద్దలు, నాయకులు చేసిన పనుల మూలంగా యెహోవా వారికి తీర్పు తీరుస్తాడు.
యెహోవా చెబుతున్నాడు, “మీరు ద్రాక్ష తోటలను తగులబెట్టేశారు (యూదా) పేద ప్రజల దగ్గర్నుండి మీరు తీసుకొన్న వస్తువులు ఇంకా మీ ఇండ్లలో ఉన్నాయి. 15 నా ప్రజలను బాధించుటకు మీకు హక్కు ఎక్కడిది? పేద ప్రజల ముఖాలను కృంగదీయుటకు మీకు హక్కు ఎక్కడిది?” నా ప్రభువు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
16 యెహోవా అంటున్నాడు: “సీయోను స్త్రీలు చాలా గర్విష్ఠులయ్యారు. వారు ఇతరుల కంటె మంచి వాళ్లము అన్నట్టు తలలు పైకెత్తి నడుస్తున్నారు. ఆ స్త్రీలు ఓర చూపులు చూస్తారు. కాళ్ల గజ్జెలు మోగిస్తూ వయ్యారంగా కులుకుతూ నడుస్తారు.”
17 సీయోనులో ఆ స్త్రీల తలలమీద నా ప్రభువు పుండ్లు పుట్టిస్తాడు. ఆ స్త్రీలు వారి తలలు విరబోసు కొనేట్టుగా యెహోవా చేస్తాడు. 18 ఆ సమయంలో, వారు గర్వించే వస్తువులన్నింటినీ యెహోవా తొలగించి వేస్తాడు, అందమైన కాలి గజ్జలు, సూర్యహారాలు, చంద్రహారాలు, 19 చెవులదుద్దులు, కడియాలు, మేలి ముసుగులు, 20 రుమాళ్లు, పట్టా గొలుసులు, నడుముకు ధరించే వడ్డాణాలు, పరిమళాల బరిణెలు, హారాల మీద అలంకారాలు, 21 ముద్ర ఉంగరాలు, ముక్కు కమ్ములు, 22 శ్రేష్ఠమైన వస్త్రాలు, ఉత్తరీయాలు, దుప్పట్లు సంచులు, 23 అద్దాలు, మేలిమి వస్త్రాలు, తలపాగాలు, శాలువాలు.
24 ఇప్పుడు ఆ స్త్రీలకు సువాసనల పరిమళాలు ఉన్నాయి కానీ ఆ సమయంలో వారి పరిమళాలు కుళ్లుగాను మురుగుడుగాను అవుతాయి. ఇప్పుడు వాళ్లు వడ్డాణాలు పెట్టుకొంటున్నారు. కానీ ఆ సమయంలో వారు కట్టుకొనేందుకు తాళ్లు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు వారి తల వెంట్రుకలు అలంకారంగా అల్ల బడుతున్నాయి. కానీ ఆ సమయంలో వారి తలలు గుండ్లు గీయబడతాయి. వారికి శిరోజాలు ఉండవు. ఇప్పుడు వారికి విందు వస్త్రాలు ఉన్నాయి. కాని అప్పుడు విచారం వ్యక్తం చేసే వస్త్రాలే వారికి ఉంటాయి. ఇప్పుడు వారి ముఖాల మీద సౌందర్య చిహ్నాలు ఉన్నాయి. కానీ అప్పుడు వారి ముఖాల మీద వాతలు ఉంటాయి.
25 ఆ సమయంలో మీ పురుషులు ఖడ్గాలతో చంపబడతారు. మీ వీరులు యుద్ధంలో చస్తారు. 26 పట్టణ ద్వారాల దగ్గర సమావేశ స్థలాల్లో ఏడ్పు, దుఃఖం ఉంటుంది. దొంగలు, బందిపోటులు సర్వం దోచుకొన్న స్త్రీలాగ యెరూషలేము శూన్యంగా కూర్చుని ఉంటుంది. ఆమె నేల మీద కూర్చుని ఏడుస్తుంది.