48
దేవుడు తన ప్రపంచాన్ని పాలిస్తాడు
1 యెహోవా చెబతున్నాడు: “యాకోబు వంశమా, నా మాట విను!
మిమ్మల్ని మీరు ‘ఇశ్రాయేలు’ అని చెప్పుకొంటారు.
మీరు యూదా వంశస్థులు.
ప్రమాణాలు చేయటానికి మీరు యెహోవా నామం ప్రయోగిస్తారు. ఇశ్రాయేలు దేవుణ్ణి మీరు స్తుతిస్తారు.
కానీ ఈ సంగతులను మీరు చేస్తున్నప్పుడు మీరు నమ్మకంగా ఉండరు.”
2 ప్రజలారా, పవిత్ర పట్టణంలో సభ్యులని మీరు పిలువబడుతున్నారు.
ఇశ్రాయేలు దేవుని మీద మీరు ఆధారపడుతున్నారు. సర్వశక్తిమంతుడైన యెహోవా ఆయన పేరు.
3 “జరుగబోయే సంగతులను గూర్చి చాలా కాలం కిందట నేను మీకు చెప్పాను.
వాటిని గూర్చి నేను మీకు చెప్పాను.
అకస్మాత్తుగా ఆ సంగతులు సంభవించేట్టు నేను చేశాను.
4 మీరు మొండివాళ్లని నాకు తెలుసు గనుక నేను అలా చేశాను.
నేను చెప్పిన ప్రతిది మీరు నమ్మటానికి నిరాకరించారు.
వంగని ఇనుములా మీరు చాలా మొండివాళ్లు. మీ తల ఇత్తడితో చేసినట్టుగా ఉంది.
5 కనుక జరుగబోయే సంగతులను గూర్చి నేను మీతో చెప్పాను.
ఆ సంగతులు జరుగకముందే చాలాకాలం క్రిందటనే నేను మీకు చెప్పాను.
‘మా స్వంత శక్తితో మేమే వీటిని చేశాము’ అని మీరు చెప్పకుండా నేనిలా చేశాను.
‘మా ప్రతిమలు-విగ్రహాలే వీటిని జరిగించాయి’
అని మీరు చెప్పకుండా ఉండాలనే నేను ఇలా చేసాను.”
ఇశ్రాయేలీయులను పవిత్రం చేసేందుకు దేవుడు వారిని శిక్షించటం
6 “జరిగిన సంగతులన్నింటినీ మీరు చూశారు, విన్నారు
గనుక మీరు ఇతరులకు ఈ వార్త చెప్పాలి.
మీకు ఇంకా తెలియని కొత్త సంగతులను
ఇప్పుడు నేను మీకు చెబతాను.
7 ఇవి చాలాకాలం కిందట జరిగిపోయిన సంగతులు కావు. ఇవి ఇప్పుడు సంభవించటం మొదలైన సంగతులు.
ఈ సంగతులను గూర్చి ఈ వేళకు ముందు మీరు ఎన్నడూ వినలేదు.
అందుచేత ‘అది మాకు ముందే తెలుసు’ అని మీరు చెప్పజాలరు.
8 కానీ భవిష్యత్తులో ఏమి జరుగబోతుందో అది నేను మీకు చెప్పినప్పటికీ మీరు ఇంకా నా మాట వినేందుకు నిరాకరిస్తారు.
మీరు నేర్చు కొనేది శూన్యం.
నేను మీకు చెప్పింది ఎన్నడూ ఏదీ మీరు వినలేదు.
మీరు నాకు వ్యతిరేకంగా ఉంటారని మొదట్నుండి నాకు తెలుసు. మీరు
పుట్టినప్పట్నుండి తప్పుడు పనులే చేశారు.
9 “కానీ నేను ఓపిగ్గా ఉంటాను.
నా కోసమే నేను ఇలా చేస్తాను.
నేను కోపగించి మిమ్మల్ని నాశనం చేయనందుకు ప్రజలు నన్ను స్తుతిస్తారు.
సహించినందుకు మీరూ నన్ను స్తుతిస్తారు.
10 “చూడండి, నేను మిమ్మల్ని పవిత్రం చేస్తాను.
వెండిని పవిత్రం చేసేందుకు ప్రజలు వేడినిప్పును ప్రయోగిస్తారు.
కానీ నేను మీకు కష్టాలు కలిగించటం ద్వారా మిమ్మల్ని పవిత్రం చేస్తాను.
11 నా కోసం-నా కోసమే నేను ఇలా చేస్తాను.
ప్రాముఖ్యం లేని వానిగా మీరు నన్ను చేయలేరు.
నా మహిమ, స్తుతులను ఎవరో తప్పుడు దేవతలను నేను తీసుకోనివ్వను.
12 “యాకోబూ, నా మాట విను!
ఇశ్రాయేలు ప్రజలారా, మీరు నా ప్రజలుగా ఉండుటకు నేను మిమ్మల్ని పిలిచాను.
కనుక నా మాట వినండి.
నేనే ఆది,
నేనే అంతం.
13 నా స్వహస్తాలతో (శక్తితో) నేనే భూమిని చేశాను.
ఆకాశాన్ని నా కుడి హస్తం చేసింది.
మరియు నేను గనుక వాటిని పిలిస్తే
అవి కలిసి నా ఎదుటికి వస్తాయి.
14 “కనుక మీరంతా సమావేశమై, నా మాట వినండి!
ఈ సంగతులు జరుగుతాయని తప్పుడు దేవుళ్లలో ఏదైనా చెప్పిందా? లేదు.
యెహోవా ఇశ్రాయేలును ప్రేమిస్తున్నాడు.
బబలోను, కల్దీయులకు యెహోవా ఏమి చేయాలనుకొంటే అది చేస్తాడు.
15 “యెహోవా చెబతున్నాడు, నేను అతన్ని*అతన్ని అంటే యెషయా మరణం తర్వాత నూటేభై సంవత్సరాలకు జీవించిన పర్షియా రాజు కోరెషు కావచ్చును. పిలుస్తానని నేను మీతో చెప్పాను.
మరియు నేను అతణ్ణి తీసుకొని వస్తాను.
అతడు జయించేట్టు నేను చేస్తాను.
16 నా దగ్గరకు వచ్చి, నా మాట వినండి.
ప్రజలు నా మాట వినగలుగునట్లు
మొదటనుంచి నేను తేటగా మాట్లాడాను.
బబలోను ఒక దేశంగా ప్రారంభమయినప్పుడు నేను అక్కడ ఉన్నాను.”
అంతట యెషయా, “ఇప్పుడు ఈ సంగతులు, ఆయన ఆత్మను మీతో చెప్పేందుకు నా ప్రభవైన యెహోవా నన్ను పంపుతున్నాడు” అని అన్నాడు. 17 ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు, రక్షకుడు, యెహోవా చెబతున్నాడు,
“నేనే మీ దేవుణ్ణి, యెహోవాను.
మంచి పనులు చేయమని నేను మీకు ఉపదేశిస్తాను.
మీరు నడవాల్సిన మార్గంలో నేను మిమ్మల్ని నడిపిస్తాను.
18 మీరు నాకు విధేయులై ఉంటే
అప్పుడు మీకు నిండుగా ప్రవహిస్తోన్న
నదివలె శాంతి లభించి ఉండేది.
సముద్ర తరంగాల్లా మంచివి మీ వద్దకు ప్రవహించి ఉండేవి.
19 మీరు నాకు విధేయులై ఉంటే అప్పుడు
మీకు ఎంతోమంది పిల్లలు పుట్టి ఉండేవారు. వాళ్లు ఇసుక రేణువులంత మంది ఉండేవాళ్లు.
మీరు నాకు విధేయులై ఉండే అప్పుడు మీరు నాశనం చేయబడి ఉండేవాళ్లు కాదు.
మీరు నాతోనే కొనసాగి ఉండేవాళ్లు.”
20 నా ప్రజలారా, బబలోను విడిచిపెట్టండి.
నా ప్రజలారా, కల్దీయుల దగ్గర్నుండి పారిపొండి.
ఈ వార్త సంతోషంగా ప్రజలకు చెప్పండి.
భూమిమీద దూర ప్రాంతాల వరకు ఈ వార్త వ్యాపింపచేయండి. ప్రజలతో
ఇలా చెప్పండి: “యెహోవా తన సేవకుడు యాకోబును విమోచించాడు!
21 యెహోవా తన ప్రజలను అరణ్యంలో నడిపించాడు. ఆ ప్రజలు ఎన్నడూ దప్పిగొనలేదు.
ఎందుకంటే, ఆయన తన ప్రజలకోసం బండనుండి నీళ్లు ప్రవహింపజేశాడు గనుక.
ఆయన బండను చీల్చాడు.
నీళ్లు ప్రవహించాయి.”
22 కానీ “చెడ్డ వారికి శాంతి లేదు”
అని యెహోవా చెబతున్నాడు.