65
ప్రజలందరూ దేవుని గూర్చి నేర్చుకొంటారు
1 యెహోవా చెబుతున్నాడు: “సలహాకోసం నా వద్దకు రాని ప్రజలకు నేను సహాయం చేశాను. నన్ను కనుగొన్నవారు నాకోసం వెదకిన వారు కారు. నా పేరు పెట్టబడని ఒక ప్రజతో నేను మాట్లాడాను. ‘నేనిక్కడ ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను’ అని నేను చెప్పాను.
2 “నాకు విరోధంగా తిరిగిపోయిన వారిని చేర్చుకొనేందుకు నేను సిద్ధంగా నిలబడ్డాను. ఆ ప్రజలు నా దగ్గరకు వస్తారని నేను కనిపెట్టాను. కానీ వారు చెడుమార్గంలోనే జీవించటం కొనసాగించారు. వారి హృదయాలు కోరినవన్నీ వారు చేశారు. 3 ఆ మనుష్యులు నాకు ఎల్లప్పుడూ కోపం పుట్టిస్తూ, నా యెదుట ఉన్నారు. ఆ ప్రజలు వారి ఉద్యానవనాల్లో బలులు అర్పిస్తారు. ధూపం వేస్తారు. 4 ఆ మనుష్యులు సమాధుల్లో కూర్చొంటారు. చనిపోయిన వారి దగ్గర్నుండి సందేశాలకోసం వారు కనిపెడ్తారు. వారు శవాలమధ్య కూడా నివసిస్తారు. వారు పంది మాంసం తింటారు. వారి కత్తులు, గరిటెలు కుళ్లిపోయిన మాంసంతో మైలపడ్డాయి. 5 కానీ ఆ ప్రజలే, ‘దగ్గరకు రాకు, నేను నిన్ను శుద్ధి చేసేంతవరకు నన్ను ముట్టకు’ అని ఇతరులతో చెబుతారు. ఆ ప్రజలు నా కంటికి పొగలా ఉన్నారు. మరియు వారి అగ్ని ఎంతసేపూ మండుతూనే ఉంటుంది.”
ఇశ్రాయేలు శిక్షింపబడాలి
6 “చూడు, నీవు చెల్లించాల్సిన లెక్క చీటి ఒకటి ఇక్కడ ఉంది. నీ పాపాల మూలంగా నీవు దోషివి అని ఈ లెక్క చీటి చూపిస్తుంది. ఈ లెక్క చీటి చెల్లించే వరకు నేను ఊరుకోను, నేను మిమ్మల్ని శిక్షించటం ద్వారా లెక్క చీటి చెల్లిస్తాను. 7 మీ పాపాలు, మీ తండ్రుల పాపాలు అన్నీ ఒకటే. యెహోవా ఇలా చెప్పాడు, ‘మీ తండ్రులు పర్వతాల్లో ధూపం వేసినప్పుడు ఈ పాపాలు చేశారు. ఆ కొండల మీద వారు నన్ను అవమానించారు. మరియు నేను మొదట వాళ్లను శిక్షించాను. వారు పొందాల్సిన శిక్ష నేను వారికి ఇచ్చాను.’ ”
8 యెహోవా చెబుతున్నాడు: “ద్రాక్షపండ్లలో కొత్తరసం ఉన్నప్పుడు, ప్రజలు ఆ ద్రాక్షరసాన్ని పిండుతారు. కాని ద్రాక్ష పండ్లను మాత్రం వారు పూర్తిగా నాశనం చేయరు. ఆ ద్రాక్షపండ్లు ఇంకా ఉపయోగపడ్తాయి. కనుక వారు యిలా చేస్తారు. నా సేవకులకు కూడ నేను అలాగే చేస్తాను. నేను వారిని పూర్తిగా నాశనం చేయను. 9 యాకోబు (ఇశ్రాయేలు) ప్రజలు కొందరిని నేను ఉంచుతాను. యూదా ప్రజలు కొందరికి నా పర్వతం లభిస్తుంది. నా సేవకులు అక్కడ నివసిస్తారు. అక్కడ నివసించాల్సిన మనుష్యులను నేను ఏర్పరచుకొంటాను. 10 అప్పుడు షారోను లోయ*షారోను లోయ పాలస్తీనా తీరపు పల్లపు భూమి. గొర్రెలకు పొలం అవుతుంది. ఆకోరు లోయ†ఆకోరు లోయ యెరూషలేము పది మైళ్లు ఉత్తరానగల ఒక లోయ. పశువులు విశ్రాంతి తీసుకొనే చోటు అవుతుంది. ఈ సంగతులన్నీ నా ప్రజలకోసం-కోసం వెదకే ప్రజలకోసమే.
11 “అయితే యెహోవాను విడిచిపెట్టిన ప్రజలారా, మీరు శిక్షించబడతారు. నా పవిత్ర పర్వతం‡పవిత్ర పర్వతం యెరూషలేము కట్టబడిన సీయోను పర్వతం. గూర్చి మరచిపోయిన ప్రజలు మీరు. మీరు అదృష్టాన్ని ఆరాధించే ప్రజలు మీరు కర్మ అనే తప్పుడు దేవతమీద ఆధారపడే మనుష్యులు. 12 కానీ మీ భవిష్యత్తును నేను నిర్ణయిస్తాను. మరియు నా ఖడ్గం ప్రయోగించి నేను మిమ్మల్ని శిక్షిస్తాను. మిమ్మల్ని శిక్షించే ఆయన ఎదుట మీరంతా దీనులుగా ఉంటారు. నేను మిమ్మల్ని పిలిచాను, మీరు నాకు జవాబు ఇవ్వటానికి నిరాకరించారు. నేను మీతో మాట్లాడాను కానీ మీరు వినిపించుకోలేదు. కీడు అని నేను చెప్పిన వాటినే మీరు చేశారు. నాకు ఇష్టం లేని వాటినే చేయాలని మీరు తీర్మానించుకొన్నారు.”
13 కనుక యెహోవా నా ప్రభువు ఈ మాటలు చెప్పాడు:
“నా సేవకులు భోజనం చేస్తారు
కానీ దుర్మార్గులైన మీరు ఆకలితో ఉంటారు.
నా సేవకులు పానం చేస్తారు.
కానీ దుష్ఠులైన మీరు దాహంతో ఉంటారు.
నా సేవకులు సంతోషంగా వుంటారు.
కానీ దుష్టులైన మీరు సిగ్గునొందుతారు.
14 నా సేవకుల హృదయాల్లో మంచితనం ఉంటుంది.
కనుక వారు సంతోషంగా ఉంటారు.
కానీ దుష్ఠులైన మీ హృదయాల్లో బాధ ఉంటుంది గనుక మీరు ఏడుస్తారు.
మీ ఆత్మలు భగ్నమైపోతాయి గనుక మీరు చాలా దుఃఖిస్తారు.
15 మీ పేర్లు నా సేవకులకు చెడ్డ మాటల్లా ఉంటాయి.”
నా ప్రభువు, యెహోవా మిమ్మల్ని చంపేస్తాడు.
మరియు ఆయన తన సేవకులను కొత్త పేర్లతో పిలుస్తాడు.
16 ఇప్పుడు ప్రజ లు ఆశీర్వదించమని భూమిని వేడుకొంటున్నారు.
కానీ భవిష్యత్తులో వారు ఆశీర్వాదాలకోసం నమ్మకమైన దేవుణ్ణి అడుగుతారు.
ఇప్పుడు ప్రజలు ప్రమాణాలు చేసినప్పుడు వారు భూశక్తిని నమ్ముకొంటున్నారు.
కానీ భవిష్యత్తులో వారు నమ్మకమైన దేవుణ్ణి నమ్ముకొంటారు.
ఎందుకంటే గతంలోని కష్టాలు మరువబడుతాయి గనుక.
ఆ కష్టాలను నాప్రజలు ఇంక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోరు.
ఒక క్రొత్త సమయం వస్తుంది
17 “చూడు, నేను ఒక కొత్త ఆకాశాన్ని ఒక కొత్త భూమిని చేస్తాను.
గత విషయాలను ప్రజలు జ్ఞాపకం చేసుకోరు.
ఆ విషయాలు ఏవీ నా ప్రజల జ్ఞాపకాల్లో ఉండవు.
18 నా ప్రజలు విచారంగా ఉండరు. లేదు, వారు సంతోషంగా ఉండి, శాశ్వతంగా దేవుని స్తుతిస్తారు.
నేను చేసే సంగతుల మూలంగా వారు సంతోషంగా ఉంటారు.
సంపూర్ణ ఆనందంతో నిండిన ఒక యెరూషలేమును నేను చేస్తాను.
మరియు వారిని సంతోషించే ప్రజగా నేను చేస్తాను.
19 “అప్పుడు యెరూషలేము గూర్చి నేను సంతోషిస్తాను.
నా ప్రజలను గూర్చి నేను సంతోషిస్తాను.
ఆ పట్టణంలో మరల ఎన్నడూ
ఏడుపు, దుఃఖం ఉండవు.
20 జన్మించి, కొన్నాళ్లు మాత్రమే జీవించే శిసవు అంటూ ఎవ్వరు ఆ పట్టణంలో ఉండరు.
కొన్నాళ్లకే ఆయుష్షు తీరిపోయే వ్యక్తులు ఎవ్వరూ ఆ పట్టణంలో ఉండరు.
జన్మించే ప్రతి శిశువు దీర్గకాలం జీవిస్తుంది.
వృద్ధులు ప్రతి ఒక్కరూ చాలాకాలం జీవిస్తూనే ఉంటారు.
వంద సంవత్సరాలు జీవించిన వ్యక్తి యువకుడు అని పిలువబడతాడు.
(అయితే పాపం చేసినవాడు వంద సంవత్సరాలు బతికినా అన్నీ కష్టాలే.)
21 “ఆ పట్టణంలో ఒక వ్యక్తి ఇల్లు కడితే ఆ వ్యక్తి అక్కడ నివసిస్తాడు.
ఒక వ్యక్తి గనుక ద్రాక్షతోట నాటతే ఆ వ్యక్తి ఆ తోటలోని ద్రాక్ష పండ్లు తింటాతడు.
22 ఒకడు ఇల్లు కట్టగా మరొకడు ఆ ఇంటిలో
నివసించటం అనేది జరుగదు.
ఒకడు ఒక తోటను నాటగా మరొకడు
ఆ తోట ఫలాలు తినటం అనేది జరుగదు.
వృక్షాలు బతికినంత కాలం నా ప్రజలు బతుకుతారు.
నేను ఏర్ప రచుకొనే ప్రజలు, వారు తయారుచేసే వాటిని అనుభవిస్తారు.
23 ప్రతిఫలం ఏమి లేకుండా ప్రజలు మరల ఎన్నడూ పనిచేయరు.
చిన్నతనంలోనే మరణించే పిల్లల్ని ప్రజలు మరల ఎన్నడు కనరు.
నా ప్రజలంతా యెహోవాచేత ఆశీర్వదించబడతారు. నా ప్రజలు, వారి పిల్లలు ఆశీర్వదించబడుతారు.
24 వారికి అవసరమైనవి, వారు అడగకముందే నేను తెలుసుకొంటాను.
సహాయంకోసం వారు నన్ను అడుగుట ముగించక ముందే నేను వారికి సహాయం చేస్తాను.
25 తోడేళ్లు, గొర్రెపిల్లలు కలిసి మేతమేస్తాయి.
సింహాలు పశువులతో కలిసి మేస్తాయి.
నా పవిత్ర పర్వతం మీద నేలపై పాము ఎవరినీ భయపెట్టదు, బాధించదు.”
ఇవన్నీ యెహోవా చెప్పాడు.