19
లేవీ వంశపు వ్యక్తి మరియు అతని దాసి* దాసి ఉపపత్ని లేక స్త్రీ సేవకురాలు భార్యగా వ్యవహరించే సేవకురాలు.
ఆ సమయమున, ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. చాలా దూరానవున్న కొండదేశమైన ఎఫ్రాయిముల్లో లేవీ వంశమునకు చెందిన వ్యక్తి ఉండెను. అతనికి ఒక దాసివుండెను. ఆమె అతనికి భార్యవలె ఉండెను. యూదాలోని బేత్లెహేముకు ఆ దాసి చెందింది. కాని ఆ దాసి లేవీ వంశపు వ్యక్తితో ఒక ఒడంబడిక చేసుకొంది. ఆమె అతనిని విడిచి పెట్టి, యూదాలోని బేత్లెహేములో ఉన్న తన తండ్రి వద్దకు వెళ్లింది. అక్కడ ఆమె నాలుగు నెలలపాటు ఉంది. తర్వాత ఆమె భర్త ఆమెకోసం వచ్చాడు. ఆమెతో అతను ప్రీతిపూర్వకంగా మాటలాడాడు. ఆమె మరల తన వద్దకు రావాలని అలా మాటలాడాడు. అతను తన సేవకుని, రెండు గాడిదలను తీసుకొని వెళ్లాడు. లేవీ వంశపు వ్యక్తి ఆమె తండ్రి ఇంటికి వచ్చాడు. లేవీ వంశపు వ్యక్తిని చూసి ఆమె తండ్రి బయటికి వచ్చి అతనిని అభినందించాడు. ఆమె తండ్రికి చాలా సంతోషం కలిగింది. ఆ స్త్రీ తండ్రి లేవీ వ్యక్తిని ఇంటిలోనికి తీసుకుని వెళ్లాడు. లేవీ వ్యక్తి మామగారు అతనిని ఇంట ఉండుమని కోరాడు. అందువల్ల ఆ లేవీ వ్యక్తి మూడురోజులున్నాడు. అతను తిని, తాగి, మామగారి ఇంట నిదురించాడు.
నాలుగవ రోజున, తెల్లవారుజామున వారు మేల్కొన్నారు. లేవీ వంశపు వ్యక్తి బయలుదేరే సన్నాహంలో వున్నాడు. కాని ఆ యువతి తండ్రి తన అల్లుడితో ఇలా అన్నాడు: “మొట్టమొదట ఏమైనా తిను. నీవు తిన్న తర్వాత వెళ్లవచ్చును.” అందువల్ల లేవీ వంశపు వాడు అతని మామగారు తినుటకు, తాగుటకు కలిసి కూర్చొనిరి. ఆ తర్వాత మామగారు అతనితో, “ఈ సాయంకాలందాకా ఇక్కడే వుండి, విశ్రాంతి తీసుకుని, ఆనందించి వెళ్లవచ్చు” అన్నాడు. అందువల్ల ఆ ఇద్దరూ కలసి తిన్నారు. లేవీ వంశపువాడు వెళ్లాలని లేచాడు. కాని అతని మామగారు ఆ రాత్రికి ఉండిపొమ్మని అతనిని వేడుకొన్నాడు.
తర్వాత, ఐదవరోజున తెల్లవారు జామునే లేవీ వంశపువాడు మేల్కొన్నాడు. అతడు బయలుదేరే సన్నాహంలో ఉన్నాడు. కాని ఆ స్త్రీ తండ్రి అల్లుడితో ఇలా చెప్పాడు: “మొదట ఏదైనా తిను. నిశ్చింతగా ఈ సాయంకాలందాకా ఉండు.” కనుక వాళ్లిద్దరూ మళ్లీ కలసి తిన్నారు.
తర్వాత లేవీ వంశపువాడు, అతని దాసి అతని సేవకుడు బయలుదేరడానికి లేచారు. కాని ఆ యువతి తండ్రి, “చాలా చీకటిపడింది. రోజు చాలావరకు అయిపోయింది. కనుక రాత్రికి ఇక్కడే వుండి సంతోషమనుభవించు. రేపు ఉదయం నీవు తెల్లవారుజామునే మేల్కొని నీ తోవను వెళ్లు” అన్నాడు.
10 కాని లేవీ వంశపువాడు మరోరాత్రికి అక్కడ వుండదలచుకోలేదు. అతను తన రెండు గాడిదలను, తన దాసిని వెంటబెట్టుకున్నాడు. యెబూసు నగరమునకు సమీపించాడు. (యెరూషలేముకు మరోపేరు యెబూసు). 11 ఆ రోజు చాలావరకు అయిపోయింది. యెబూసు నగరము దగ్గరికి వచ్చారు. అప్పుడు సేవకుడు తన యజమానిని చూసి, “యెబూసు నగరం వద్ద మనము ఆగిపోదాము. ఈ రాత్రికి ఇక్కడే ఉందాము” అన్నాడు.
12 కాని అతని యజమాని అయిన లేవీ వంశపు వాడు, “కాదు, మనము తెలియని నగరం లోపలికి వెళ్లకూడదు. అక్కడి ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు కాదు. గిబియా నగరమునకు మనము వెళదాము” అన్నాడు. 13 లేవీ వంశపు వ్యక్తి, “పదండి, గిబియా లేక రామా నగరమునకు వెళ్ళుదాము. ఈ రెండు నగరాలలో ఒక దానిలో మనము ఈ రాత్రి గడుపుదాము” అన్నాడు.
14 అందువల్ల లేవీ వంశపువాడు, అతనితో ఉన్న మనుష్యులు పైకి ప్రయాణం చేశారు. గిబియా నగరమును వారు ప్రవేశించే సమయానికి సూర్యుడు అస్తమిస్తున్నాడు. బెన్యామీను వంశీయుల ప్రదేశంలో గిబియా ఉంది. 15 అందువల్ల వారు గిబియాలో ఆగిపోయారు. ఆ నగరములో ఆ రాత్రికి ఉండాలని వారనుకున్నారు. వారు నగరం మధ్యకు వచ్చి అక్కడ కూర్చున్నారు. కాని ఎవ్వరూ వారిని తమ ఇంటికి రమ్మని పిలవలేదు.
16 ఆ సాయంకాలం పొలంనుంచి ఒక వృద్ధుడు నగరములోనికి వచ్చాడు. అతని ఇల్లు కొండ దేశమయిన ఎఫ్రాయిములో ఉన్నది. కాని ఇప్పుడతను గిబియా నగరములో నివసిస్తున్నాడు. (గిబియా మనుష్యులు బెన్యామీను వంశమునకు చెందిన వారు). 17 ఆ వృద్ధుడు లేవీ వంశపువాడయిన ఆ ప్రయాణికుని చూశాడు. ఆ వృద్ధుడు, “మీరెక్కడికి వెళ్ళుతున్నారు? ఎక్కడినుంచి వచ్చారు?” అని ప్రశ్నించాడు.
18 లేవీ వంశపువాడు సమాధానం చెప్పాడు: “మేము యూదాలోని బేత్లెహేమునుంచి ప్రయాణం చేస్తున్నాము. మేము స్వగృహానికి వెళ్ళుతున్నాము. అయితే ఈ రాత్రి ఎవరూ మమ్ములను ఉండమని ఆహ్వానించలేదు. ఎఫ్రాయిము కొండదేశానికి వెనకవున్న వాళ్లము మేము. నేను స్వగృహమునకు వెళ్ళుతున్నాను. 19 మా గాడిదలకు తగినంత గడ్డి ఆహారం వున్నాయి. మాకు రొట్టె, మద్యము ఉన్నది. అనగా, నాకు, యువతికి మరియు నా సేవకుడికి. మాకేమియు అవసరము లేదు.”
20 వృద్ధుడిట్లు చెప్పాడు: “నీవు మా ఇంట్లో ఉండవచ్చును. నీకు కాలసినదంతా నేనిస్తాను. నగర మధ్యమున మాత్రం రాత్రివేళ ఉండకూడదు.” 21 తర్వాత లేవీ వంశపువానిని, అతని మనుష్యుల్ని అతను తన ఇంటికి తీసుకని వెళ్లాడు. అతని గాడిదలకు ఆయన ఆహారం పెట్టాడు. వారు కాళ్లు కడుగుకున్నారు. ఆ తర్వాత తినుటకు తాగుటకు ఆయన వారికిచ్చాడు.
22 ఆ లేవీ వంశపు వ్యక్తియు, అతనితో వున్న మనుష్యులును సంతోషంగా వుండగా, ఆ నగరమునకు చెందినవారు కొందరు ఇంటిని చుట్టుముట్టారు. వారు దుర్జనులు. వారు తలుపు కొట్టసాగారు. ఆ ఇంటి స్వంతదారైన వృద్ధుని వుద్దేశించి కేకలు వేయసాగారుస. వారు ఇలా అన్నారు; “మీ ఇంటికి వచ్చిన ఆ వ్యక్తిని వెలుపలికి తీసుకుని రమ్ము. మేమతనితో సంభోగింపదలచినాము.”
23 వృద్ధుడు వెలుపలికి పోయి ఆ దుర్జనులతో మాటలాడెను: “వద్దు, నా స్నేహితులారా! అటువంటి చెడ్డ పనులు చేయవద్దు. అతను మా ఇంటి అతిథి. ఈ మహా పాపకృత్యం మీరు చేయవద్దు అన్నాడు. 24 ఇదుగో చూడండి. ఇక్కడ నా కుమార్తె ఉంది. ఆమెకి ఇంతకు మునుపెన్నడూ సంభోగమననేమో తెలియదు. ఆమెను నేను వెలుపలికి తీసుకు వస్తాను. మరియు ఆయన దాసిని కూడ బయటికి తీసుకు వస్తాను. మీ ఇష్టమొచ్చినట్లు వారిని చేయవచ్చును. మీరు వారిని హింసించవచ్చు. కాని మా యింటికి వచ్చిన వ్యక్తితో పాపకృత్యం చేయవద్దు” అన్నాడు.
25 కాని ఆ చెడ్డ మనుష్యులు వృద్ధుని మాటలు వినదలచుకోలేదు. అందువల్ల లేవీ వంశపువాడు తన దాసిని వెలుపలికి తీసుకువెళ్లి, ఆమెను చెడ్డవారి చెంత ఉంచాడు. ఆ చెడ్డవారు ఆమెను గాయపరిచారు. ఆ రాత్రియంతయు ఆమెను బలాత్కరించారు. తర్వాత తెల్లవారుజామున ఆమెను విడిచిపెట్టారు. 26 తెల్లవారుజామున తన యజమాని నివసిస్తున్న ఇంటికి ఆమె వచ్చింది. ఆమె ముందు తలుపు వద్ద పడిపోయింది. ఆమె అచ్చటనే వెలుతురు వచ్చేవరకు పడివుంది.
27 ఉదయాన లేవీ వంశపువాడు మేల్కొన్నాడు. అతను ఇంటికి వెళ్లవలెనని అనుకొన్నాడు. వెలుపలికి వెళ్లుటకుగాను తలుపు తెరిచాడు. గడపవద్ద ఒక చేయి ఉంది. అక్కడ అతని దాసి ఉంది. 28 లేవీ వంశపువాడు, “లెమ్ము మనము వెళ్లిపోదాం” అనెను. కాని ఆమె సమాధానం చెప్పలేదు ఆమె చనిపోయింది.
లేవీ వంశపు వాడు తన దాసిని గాడిదమీద వేసుకుని ఉంటికి వెళ్లాడు. 29 అతను ఇల్లు చేరుకోగానే ఒక కత్తి తీసుకొని దాసిని పన్నెండు భాగాలుగా ఖండించాడు. తర్వాత అతను ఆ పన్నెండు భాగాలను ఇశ్రాయేలు ప్రజలు నివసించిన అన్ని ప్రదేశాలకు పంపిచాడు. 30 ఇది చూసిన వారు, “ఇశ్రాయేలులో ఇంతకు మునుపు ఎన్నడూ ఇలా జరగలేదు, ఈజిప్టునుంచి మనం వచ్చిన నాటినుండి మనం ఇప్పటివరకు ఇలాంటిది చూచి వుండలేదు. దీన్ని గురించి చర్చించి మనమేమి చేయవలెనో చెప్పు” అన్నారు.

*^ దాసి ఉపపత్ని లేక స్త్రీ సేవకురాలు భార్యగా వ్యవహరించే సేవకురాలు.