50
బబులోనుకు సంబంధించిన సందేశం
బబులోను దేశానికి, కల్దీయులను ఉద్దేశించి యెహోవా ఈ సందేశాన్ని ఇచ్చాడు. యెహోవా ఈ వర్తమానాన్ని యిర్మీయా ద్వారా చెప్పాడు.
 
“అన్ని దేశాల వారికి ఈ వర్తమానం ప్రకటించండి!
జెండా ఎగురవేసి ఈ సందేశం ప్రకటించండి!
పూర్తి సమాచారాన్ని ప్రకటిస్తూ ఇలా చెప్పండి,
‘బబులోను రాజ్యం వశపర్చుకోబడుతుంది.
బేలు*బేలు బేలు అనేది దైవానికి మరో పేరు. బబులోను దేశీయులకు ఇది ముఖ్యమైన దైవం. దైవం అవమానపర్చబడుతుంది.
మర్దూక్ మిక్కిలి భీతిల్లుతుంది.
బబులోను విగ్రహాలు అవమానపర్చబడతాయి.
దాని విగ్రహ దేవతలు భయంతో నిండిపోతాయి.’
ఉత్తర దేశమొకటి బబులోనును ఎదుర్కొంటుంది.
ఆ దేశం బబులోనును వట్టి ఎడారివలె మార్చివేస్తుంది.
ప్రజలెవ్వరూ అక్కడ నివసించరు.
మనుష్యులు, జంతువులు అంతా అక్కడ నుండి పారిపోతారు”
యెహోవా ఇలా చెపుతున్నాడు, “ఆ సమయంలో
ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు కలిసి ఒక్కరీతిగా రోదిస్తారు.
వారంతా కలిసి వారి దేవుడైన
యెహోవాను వెతుక్కుంటూ వెళతారు.
ఆ ప్రజలు సియోనుకు ఎలా వెళ్లాలి అని దారి అడుగుతారు.
వారు ఆ దిశగా వెళ్లటానికి బయలు దేరుతారు.
ప్రజలు యిలా అంటారు. ‘రండి, మనల్ని మనము యెహోవాకు కలుపుకొందాం.
శాశ్వతమైన ఒక నిబంధన చేసికొందాము.
మన మెన్నటికీ మరువలేని ఒక నిబంధన చేసికొందాం.’
 
“నా ప్రజలు తప్పిపోయిన గొర్రెలవలె ఉన్నారు.
వారి కాపరులు (నాయకులు) వారిని తప్పుదారి పట్టించారు.
వారి నాయకులు వారిని కొండల్లో, కోనల్లో తిరిగేలా చేశారు.
వారి విశ్రాంతి స్థలమెక్కడో వారు మర్చిపోయారు.
నా ప్రజలను చూచిన వారంతా వారిని గాయపర్చారు.
పైగా వారి శత్రువులు, ‘మేము ఏ నేరమూ చేయలేదన్నారు.’
ఆ ప్రజలు యెహోవా పట్ల పాపం చేశారు. యెహోవాయే వారి అసలైన విశ్రాంతి స్థలం.
వారి తండ్రులు నమ్మిన యెహోవాయే వారి దేవుడు.
 
“బబులోను నుండి పారిపొండి.
కల్దీయుల రాజ్యాన్ని వదిలిపొండి.
మందముందు నడిచే మేకలు మాదిరి వుండండి.
ఉత్తరాన్నుండి చాలా దేశాలను నేను కూడగట్టుకు వస్తాను.
ఈ దేశాల కూటమి బబులోను మీదికి యుద్ధానికి సిద్ధమవుతుంది.
ఉత్తర దేశాల వారిచేత బబులోను చెరబట్టబడుతుంది.
ఆ రాజ్యాలు బబులోను మీదికి చాలా బాణాలు వేస్తాయి.
యుద్ధం నుండి వట్టి చేతులతో
తిరిగిరాని సైనికుల్లా ఈ బాణాలు వుంటాయి.
10 కల్దీయుల భాగ్యాన్నంతా శత్రువు కొల్లగొడతాడు.
శత్రు సైనికులు తాము కోరుకున్నవన్నీ పొందగలుగుతారు.”
ఇవి యెహోవా చెప్పిన విషయాలు.
 
11 “బబులోనూ, నీవు ఉద్రేకంతోను, సంతోషంతోను వున్నావు.
నీవు నా భూమిని తీసికొన్నావు.
ధాన్యంలో చిందులేసే పడుచు ఆవులా
నీవు నాట్యం చేస్తున్నావు.
గుర్రాలు సంతోషంలో చేసే
సకిలింపుల్లా వుంది నీ నవ్వు.
12 ఇప్పుడు నీ తల్లికి తలవంపులవుతుంది.
నినుగన్న తల్లి కలత చెందుతుంది.
దేశాలన్నిటిలో బబులోను అతి సామాన్యమైపోతుంది.
ఆమె బెట్టయైన వట్టి ఎడారిలా అవుతుంది.
13 యెహోవా తన కోపం చూపటంతో
అక్కడ ఎవ్వరూ నివసించరు.
బబులోను నగరం పూర్తిగా ఖాళీ అవుతుంది.
బబులోను పక్కగా పోయే ప్రతివాడు భయపడతాడు.
అది నాశనం చేయబడిన తీరుచూచి విస్మయంతో వారు తలలు ఆడిస్తారు.
 
14 “బబులోనుతో యుద్ధానికి సిద్ధమవ్వండి.
వింటిని బట్టిన వీరుల్లారా, బబులోనుపై బాణాలు వేయండి.
మీ బాణాల్లో వేటినీ మిగల్చవద్దు.
బబులోను యెహోవా పట్ల పాపం చేసింది.
15 బబులోను చుట్టూ సైనికులు జయ నినాదాలు చేస్తారు.
ఇప్పుడు బబులోను లొంగిపోయింది!
దాని ప్రాకారాలు, బురుజులు కూలదోయబడ్డాయి!
వారికి అర్హమైన శిక్షను యెహోవా ఆ ప్రజలకు ఇస్తున్నాడు.
ప్రజలారా, బబులోనుకు తగిన శిక్షను ఇవ్వండి.
అది ఇతర దేశాలకు ఏమి చేసిందో,
దానిని ఆ రాజ్యానికి తిరిగి చేయండి.
16 బబులోను ప్రజలను మొక్కలు నాటనివ్వకండి.
వారి పంటను సేకరించనీయవద్దు.
బబులోను సైనికులు చాలా మందిని తమ నగరానికి బందీలుగా తీసికొనివచ్చారు.
ఇప్పుడు శత్రు సైన్యాలువచ్చాయి.
కావున ఆ బంధీలంతా ఇండ్లకు తిరిగి వెళ్లుచున్నారు.
ఆ బందీలు తిరిగి తమ తమ దేశాలకు పరుగున పోతున్నారు.
 
17 “పొలాల్లో చెల్లాచెదరైన గొర్రెల్లా ఇశ్రాయేలు వున్నది.
సింహాలు తరిమిన గొర్రెల్లా ఇశ్రాయేలు వున్నది.
వానిని తిన్న మొదటి సింహం అష్షూరు రాజు.
వాని ఎముకలు నలుగగొట్టిన చివరి సింహం బబులోను రాజైన నెబుకద్నెజరు.
18 కావున సర్వశక్తిమంతుడు, ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా ఇలా చెపుతున్నాడు,
‘బబులోను రాజును, అతని దేశాన్ని నేను త్వరలో శిక్షిస్తాను.
నేను అష్షూరు రాజును శిక్షించినట్లు అతనిని నేను శిక్షిస్తాను.
 
19 “ ‘కాని ఇశ్రాయేలును మళ్లీ వాని స్వంత పొలాలకు తీసుకొని వస్తాను.
అతడు కర్మేలు పర్వతం మీదను బాషాను భూముల్లోను పండిన పంటను తింటాడు.
అతడు తిని, తృప్తి పొందుతాడు.
ఎఫ్రాయిము మరియు గిలాదు ప్రాంతాలలో గల కొండల మీద అతడు తింటాడు.’ ”
20 యెహోవా ఇలా చెపుతున్నాడు, “ఆ సమయంలో ప్రజలు ఇశ్రాయేలు యొక్క తప్పులెదకటానికి గట్టిగా ప్రయత్నిస్తారు.
కాని వారికి కన్పించదు.
ప్రజలు యూదా పాపాలు వెదక యత్నిస్తారు.
కాని ఏ పాపాలూ కనుగొనబడవు.
ఎందువల్లనంటే ఇశ్రాయేలు, యూదా రాజ్యాలలో మిగిలిన కొద్దమందిని నేను రక్షిస్తున్నాను.
పైగా వారి పాపాలన్నిటినీ నేను క్షమిస్తున్నాను.”
 
21 యెహోవా యిలా చెపుతున్నాడు, “మెరాతయీయు దేశంపై దండెత్తండి!
పెకోదీలో వుంటున్న ప్రజలను ఎదుర్కొనండి!
వారిని ఎదుర్కొనండి!
వారిని చంపండి. వారిని సర్వ నాశనం చేయండి!
నా ఆజ్ఞ ప్రకారం అంతా చేయండి!
 
22 “యుద్ధ ధ్వని దేశమంతా వినిపిస్తుంది.
అది తీవ్రవినాశనానికి సంబంధించిన ధ్వని.
23 బబులోను ఒకనాడు
సర్వప్రపంచానికి సుత్తివలె వుంది.
కాని ఇప్పుడా “సుత్తి” విరిగి ముక్కలై పోయింది.
బబులోను సాటి రాజ్యాలన్నిటిలో నిజంగా మిక్కిలి నాశనమైనది.
24 బబులోనూ, నీ కొరకు నేను వల పన్నాను.
అది నీవు తెలిసికొనే లోపుగానే నీవు పట్టుబడ్డావు.
నీవు యెహోవాకు వ్యతిరేకంగా పోరాడావు.
అందువల్ల నీవు చూడబడి, పట్టుబడ్డావు.
25 యెహోవా తన గిడ్డంగిని తెరిచాడు.
ఆ గిడ్డంగి నుండి యెహోవా తన కోపమనే ఆయుధాన్ని వెలికి తీశాడు.
సర్వశక్తిమంతుడైన దేవుడు తాను చేయవలసిన పని ఒకటి వుండుటచే ఆ ఆయుధాన్ని వెలికి తీశాడు.
ఆయన చేయవలసిన కార్యం కల్దీయుల రాజ్యంలో ఉంది.
 
26 దూర తీరాల నుండి బబులోను మీదికి రండి.
ఆమె ధాన్యాగారాలను పగులగొట్టండి.
బబులోనును సర్వనాశనం చేయండి.
సజీవంగా ఎవ్వరినీ వదల వద్దు.
పెద్ద ధాన్యరాసులవలె వారి శవాలను గుట్టవేయండి.
27 బబులోనులో ఉన్న గిత్తలన్నిటినీ (యువకులు) చంపండి.
వారు నరకబడనివ్వండి.
వారిని ఓడింపబడే సమయం వచ్చింది. వారికి మిక్కిలి కష్టం వచ్చిపడింది.
వారు శిక్షింపబడే సమయంవచ్చింది.
28 బబులోను దేశం నుండి ప్రజలు పారిపోతున్నారు.
వారా దేశంనుండి తప్పించుకొనిపోతున్నారు. ఆ ప్రజలు సీయోనుకు వస్తున్నారు.
యెహోవా చేస్తున్న పనులను ఆ ప్రజలు ఇతరులకు చెపుతున్నారు,
బబులోనుకు అర్హమైన శిక్షను యెహోవా ఇస్తున్నారని వారు చెబుతున్నారు.
యెహోవా ఆలయాన్ని బబులోను ధ్వంసం చేసింది. కావున యెహోవా ఇప్పుడు బబులోనును ధ్వంసం చేస్తున్నాడు.
 
29 “బబులోను మీదికి విలుకాండ్రను పిలవండి.
ఆ నగరాన్ని చుట్టుముట్టమని వారికి చెప్పండి.
ఎవ్వరినీ తప్పించుకోనివ్వద్దు.
అది చేసిన దుష్టకార్యాలకు తగిన ప్రతీకారం చేయండి.
అది ఇతర రాజ్యాలకు ఏమి చేసిందో, దానిని ఆ దేశానికి కూడా చేయండి.
బబులోను యెహోవాను గౌరవించలేదు.
పరిశుద్దుడైన ఇశ్రాయేలు దేవునిపట్ల అది మూర్ఖంగా ప్రవర్తించింది.
కావున బబులోనును శిక్షించండి.
30 బబులోను యువకులు వీధుల్లో చంపబడతారు.
ఆ రోజున దాని సైనికులంతా చనిపోతారు.”
యెహోవా ఈ విషయాలు చెపుతున్నారు.
 
31 “బబులోనూ, నీవు మిక్కిలి గర్విష్ఠివి.
అందుచే నేను నీకు వ్యతిరేకినైనాను.”
సర్వశక్తమంతుడైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు.
“నేను నీకు వ్యతిరేకిని.
నీవు శిక్షింపబడే సమయం వచ్చింది.
32 గర్విష్ఠియైన బబులోను తూలిపడి పోయింది.
అది లేచుటకు ఎవ్వరూ సహాయపడరు.
దాని పట్టణాలలో నేను అగ్ని రగుల్చుతాను.
దాని చుట్టూ వున్న వారందరినీ ఆ అగ్ని పూర్తిగా దహించివేస్తుంది.”
 
33 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నారు.
“ఇశ్రాయేలు, యూదా ప్రజలు బానిసలై యున్నారు.
శత్రువు వారిని చెరబట్టాడు. శత్రువు ఇశ్రాయేలును వదిలిపెట్టడు.
34 కాని, దేవుడు ఆ ప్రజలను తిరిగి తీసికొని వస్తాడు.
ఆయన పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా.
ఆ ప్రజలను ఆయన బాగా రక్షిస్తాడు.
వారి రాజ్యానికి విశ్రాంతి కల్గించే విధంగా ఆయన వారిని రక్షిస్తాడు.
అంతేగాని బబులోనులో నివసించే వారికి ఆయన విశ్రాంతినివ్వడు.”
 
35 యెహోవా ఇలా చెపుతున్నాడు,
“బబులోనులో నివసించే ప్రజలను ఒక కత్తి చంపుగాక.
బబులోను రాజును, అతని అధికారులను,
జ్ఞానులను ఒక కత్తి హతము చేయుగాక.
36 బబులోను యాజకులను, దొంగ ప్రవక్తలను కత్తి సంహరించుగాక,
ఆ యాజకులు పట్టి మూర్ఖులవుతారు.
బబులోను సైనికులను ఒక కత్తి చంపుగాక.
ఆ సైనికులు భీతావహులవుతారు.
37 బబులోను గుర్రాలను, రథాలను ఒక కత్తి నరికి వేయుగాక.
విదేశ కిరాయి సైనికులను ఒక కత్తి సంహరించుగాక,
ఆ సైనికులందరూ భయపడిన స్త్రీ లవలె ఉంటారు.
బబులోను ధనాగారాల మీదికి ఒక కత్తి వెళ్లుగాక.
ఆ ధనాగారాలు దోచుకోబడతాయి.
38 బబులోను నీటి వనరులపైకి ఒక కత్తి వెళ్లుగాక.
ఆ నీటి వనరులన్నీ ఎండిపోతాయి.
బబులోను దేశంలో విగ్రహాలు కోకొల్లలు.
బబులోను ప్రజలు మూర్ఖులని ఆ విగ్రహాలు చాటి చెపుతున్నాయి.
అందుచే ఆ ప్రజలకు కష్టనష్టాలు సంభవిస్తాయి.
39 బబులోను మరెన్నడూ ప్రజలతో నిండిఉండదు.
పిచ్చి కుక్కలు, ఉష్ట్ర పక్షులు, తదితర ఎడారి జంతువులు అక్కడ నివసిస్తాయి.
అంతేగాని, మళ్లీ జనం అక్కడ ఎన్నడూ నివసించరు.
40 సొదొము, గొమొర్రా నగరాలను, వాటి చుట్టుపట్ల పట్టణాలను
దేవుడు పూర్తిగా నాశనం చేశాడు.
ఇప్పుడా పట్టణాలలో ఎవ్వరూ నివసించరు.
అదేరీతి, బబులోనులో ఎవ్వరూ నివసించరు.
అక్కడ నివసించటానికి ప్రజలు అసలు వెళ్లరు.”
 
41 “చూడండి! ఉత్తరాన్నుండి జనులు వస్తున్నారు.
వారొక బలమైన రాజ్యం నుండి వస్తున్నారు.
ప్రపంచం నలుమూలల నుండి చాలామంది రాజులు కలిసి వస్తున్నారు.
42 వారి సైన్యాలకు ధనుస్సులు, ఈటెలు ఉన్నాయి.
ఆ సైనికులు బహు క్రూరులు
వారికి దయలేదు.
గుర్రాలపై స్వారి చేస్తూ సైనికులు వస్తారు.
అప్పుడు సముద్ర ఘోషలా శబ్దంపుడుతుంది.
వారివారి స్థానాలలో యుద్ధానికి సిద్ధంగా నిలబడతారు!
బబులోను నగరమా, నీపై దాడికి వారు సిద్ధంగా వున్నారు.
43 ఆ సైన్యాల గురించి బబులోను రాజు విన్నాడు. అతడు బాగా బెదరిపోయాడు!
అతని చేతులు బిగుసుకుపోయేటంతగా అతడు భయపడ్డాడు.
ప్రసవ స్త్రీ వేదనవలె, అతని భయం
అతని కడుపును ఆరాటపెడుతుంది.”
 
44 యెహోవా చెపుతున్నాడు, “అప్పుడప్పుడు యొర్దాను నదీ తీరాన
దట్టమైన పొదల నుండి ఒక సింహం వస్తుంది.
ప్రజలు పొలాల్లో మందవేసిన పశువులపైకి ఆ సింహం వచ్చిపడుతుంది.
అప్పుడా పశువులు చెల్లాచెదరైపోతాయి.
నేనా సింహంలా వుంటాను. బబులోనును దాని రాజ్యం నుంచి తరిమిగొడతాను!
ఇది చేయటానికి నేనెవరిని ఎన్నుకుంటాను?
నాలాగా మరే వ్యక్తి లేడు.
నన్నెదిరించగలవాడు మరొక్కడూ లేడు.
కావున నేనే ఆ పని చేస్తాను.
నన్ను బయటకు తోలటానికి ఏ గొర్రెల కాపరీ రాడు.
నేను బబులోను ప్రజలను తరిమిగొడతాను.”
 
45 బబులోనుకు వ్యతిరేకంగా యెహోవా
పన్నిన పధకాన్ని వినండి.
కల్దీయులకు వ్యతిరేకంగా యెహోవా
ఏమి చేయ నిర్ణయించాడో వినండి.
“శత్రువు బబులోనులోని గొర్రె పిల్లలను (ప్రజలను)
తిరిగి తీసికొంటాడు.
ఆ గొర్రె పిల్లలను ఆయన ఇంటికి తీసికొని వెళతాడు.
ఆ పిమ్మట బబులోను పచ్చిక బయళ్లను యెహోవా పూర్తిగా నాశనం చేస్తాడు.
జరిగిన దానికి బబులోను విస్మయం చెందుతుంది.
46 బబులోను పడిపోతుంది.
ఆ పతనానికి భూమి కంపిస్తుంది.
బబులోను పతనాన్ని గురించి
ప్రపంచ ప్రజలంతా వింటారు.”

*50:2: బేలు బేలు అనేది దైవానికి మరో పేరు. బబులోను దేశీయులకు ఇది ముఖ్యమైన దైవం.