యోబు
1
యోబు మంచి మనిషి
ఊజు దేశంలో ఒక మంచి మనిషి జీవించాడు. అతని పేరు యోబు. యోబు మంచివాడు, నమ్మక మైనవాడు. యోబు తన జీవితాంతము దేవుని ఆరాధించాడు. యోబు చెడు క్రియలకు దూరంగా ఉండేవాడు. యోబుకు ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమారైలుండిరి. యోబుకు ఏడు వేల గొర్రెలు, మూడు వేల ఒంటెలు, వెయ్యి ఎద్దులు, ఐదు వందల ఆడ గాడిదలు సొంతంగా ఉన్నాయి. వీటికి తోడు అతనికి చాలా మంది పనివాళ్లు ఉన్నారు. తూర్పు ప్రాంతంలో యోబు మిక్కిలి ధనవంతుడుగా ఉండేవాడు.
యోబు కుమారులు వంతుల ప్రకారం వారి ఇండ్లలో విందులు చేసుకొంటూ, వారి సోదరీలను ఆహ్వానిస్తుండేవారు. యోబు పిల్లలు విందు చేసు కొన్న తర్వాత, అతడు ఉదయం పెందలాడే లేచేవాడు. అతడు తన పిల్లల్లో ఒక్కొక్కరి కోసం ఒక్కోక్క దహనబలి అర్పించేవాడు. “ఒకవేళ నా పిల్లలు నిర్లక్ష్యంగా ఉండి, వారి విందులో దేవునికి విరోధంగా పాపం చేశారేమో” అని అతడు తలచేవాడు. తన పిల్లలు వారి పాపాల విషయంలో క్షమించబడాలని అతడు ఎల్లప్పుడు ఇలా చేస్తూ ఉండేవాడు.
అప్పుడు దేవదూతలు యెహోవా సముఖంలో సమావేశమయ్యే రోజు వచ్చింది. అప్పుడు ఆ దేవదూతలతోబాటు సాతానుకూడ వచ్చాడు. “ఎక్కడి నుండి వస్తున్నావు?” అని సాతానును యెహోవా అడిగాడు.
“నేను భూలోకంలో సంచారం చేస్తూ ఉన్నాను” అని యెహోవాకు సాతాను జవాబు చెప్పాడు.
అంతట యెహోవా, “నా సేవకుడైన యోబును నీవు చూశావా? భూమి మీద అతనిలాంటి వారు ఎవ్వరూ లేరు. యోబు నిజంగా మంచి మనిషి మరియు నమ్మకమైనవాడు. అతడు దేవుణ్ణి ఆరాధిస్తాడు. దుర్మార్గపు పనులకు అతడు దూరంగా ఉంటాడు” అని సాతానుతో అన్నాడు.
“ఓ తప్పకుండా! కానీ యోబు దేవుణ్ణి ఆరాధించటానికి ఒక గట్టి కారణం ఉంది! 10 అతణ్ణి, అతని కుటుంబాన్ని, అతనికి ఉన్న సర్వాన్ని నీవు ఎల్లప్పుడూ కాపాడుతూ ఉన్నావు. అతడు చేసే ప్రతిపనిలో నీవు అతణ్ణి విజయుణ్ణి చేస్తున్నావు. అవును, నీవు అతణ్ణి ఆశీర్వదించావు. అతడు చాలా ధనికుడు గనుక అతని పశువుల మందలు, గొర్రెల మందలు దేశం అంతటానిండి ఉన్నాయి. 11 కానీ అతనికి ఉన్న సర్వాన్నీ నీవు గనుక నాశనం చేస్తే అతడు నీకు వ్యతిరేకంగా, నీముఖం మీదనే శపిస్తాడని ప్రమాణం చేస్తున్నాను” అని సాతాను జవాబిచ్చాడు.
12 “సరే, యోబుకు ఉన్న వాటన్నింటికీ నీవు ఏమైనా చేయి. కాని అతని శరీరానికి మాత్రం హానిచేయవద్దు” అని యెహోవా సాతానుతో చెప్పాడు.
అప్పుడు సాతాను యెహోవా సన్నిధి నుండి వెళ్లిపోయాడు.
యోబు సర్వం పోగొట్టుకొన్నాడు
13 ఒకరోజు యోబు కుమారులు, కుమారైలు అతని జ్యేష్ఠ కుమారుని ఇంటివద్ద తినుచూ ద్రాక్షారసం తాగుతూ ఉన్నారు. 14 అంతలో ఒక సందేశకుడు యోబు దగ్గరకు వచ్చి, “ఎడ్లు దున్నుతూ, ఆ దగ్గరలోనే గాడిదలు గడ్డి మేస్తూ వుండగా, 15 షెబాయీయులు*షెబాయీయులు ఎడారి ప్రాంతపు ఒక జన సమూహం. వాళ్లు ప్రజలను ఎదుర్కొని వాళ్ల వస్తువులను దొచుకొనేవారు. మా మీద దాడి చేసి నీ జంతువులను తీసుకొనిపోయారు! నన్ను తప్ప మిగిలిన నీ సేవకులనందరినీ షెబాయీయులు చంపేశారు. నీతో చెప్పటానికే నేనొక్కడినే తప్పించుకొన్నాను” అని చెప్పాడు.
16 ఆ సందేశకుడు ఇంకా మాట్లాడుతూ ఉండగానే మరో సందేశకుడు యోబు దగ్గరకు వచ్చాడు. “ఆకాశంనుండి మెరుపుల ద్వారా అగ్నిపడి నీ గొర్రెలను, సేవకులను కాల్చివేసింది. నీతో చెప్పేందుకు నేను ఒక్కణ్ణి మాత్రమే తప్పించుకొన్నాను!” అని రెండో సందేశకుడు చెప్పాడు.
17 ఆ సందేశకుడు ఇంకా మాట్లాడు తూండగానే ఇంకో సందేశకుడు వచ్చాడు. “కల్దీయులు పంపిన మూడు గుంపులవారు వచ్చి మా మీద పడి ఒంటెలను తీసుకొని పోయారు. పైగా వారు సేవకులను చంపేశారు. నీతో చెప్పేందుకు నేనొక్కణ్ణి మాత్రం తప్పించుకొన్నాను” అని ఈ మూడో సందేశకుడు చెప్పాడు.
18 మూడో సందేశకుడు ఇంకా చెబుతూ ఉండగానే మరో సందేశకుడు వచ్చాడు. “నీ పెద్ద కుమారుని యింటి వద్ద నీ కుమారులు, కుమారైలు భోజనం చేస్తూ, ద్రాక్షారసం తాగుతూ ఉండగా. 19 అకస్మాత్తుగా ఎడారినుండి ఒక బలమైన గాలి వీచి ఇంటిని పడ గొట్టేసింది. ఆ ఇల్లు నీ కుమారులు, కుమారైల మీద పడగానేవారు మరణించారు. నీతో చెప్పేందుకు నేను ఒక్కణ్ణి మాత్రమే తప్పించుకొన్నాను” అని నాలుగో సందే శకుడు చెప్పాడు.
20 యోబు ఇది వినగానే తన విచారాన్ని, కలవరాన్ని తెలియజేయడానికి తన బట్టలు చింపుకొని, తలగుండు చేసుకొన్నాడు. తరువాత యోబు సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించాడు. 21 అతడు ఇలా చెప్పాడు:
 
“నేను ఈ లోకంలో పుట్టినప్పుడు
నేను దిగంబరిని, నాకు ఏమీ లేదు.
నేను మరణించి లోకాన్ని విడిచి పెట్టేటప్పుడు
నేను దిగంబరినిగా ఉంటాను. నాకు ఏమీ ఉండదు.
యెహోవా ఇచ్చాడు.
యెహోవా తీసుకున్నాడు.
యెహోవా నామాన్ని స్తుతించండి!”
 
22 ఇవన్నీ సంభవించినా కానీ యోబు మాత్రం పాపం చేయలేదు. అతడు దేవుణ్ణి నిందించనూలేదు.

*1:15: షెబాయీయులు ఎడారి ప్రాంతపు ఒక జన సమూహం. వాళ్లు ప్రజలను ఎదుర్కొని వాళ్ల వస్తువులను దొచుకొనేవారు.