లేవీయకాండము
1
బలులు, అర్పణల నియమాలు
1 యెహోవా దేవుడు మోషేను పిలిచి, సన్నిధి గుడారంలో నుండి అతనితో మాట్లాడాడు. యెహోవా అన్నాడు: 2 “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు, మీలో ఎవరైనా యెహోవాకు అర్పణ తెచ్చినప్పుడు, ఆవుల మందలోనుండి గాని, గొర్రెల మందలోనుండి గాని దానిని తీసుకొని రావాలి.
3 “ఒక వ్యక్తి తన ఆవుల మందలో ఒక దానిని దహనబలిగా అర్పిస్తుంటే, అది నిర్దోషమైన గిత్తయి*గిత్త అనగా విత్తులు కొట్టబడని యవ్వన ఎద్దు. దీన్ని కోడెదూడ అని కూడా అంటారు. వుండాలి. ఆ వ్యక్తి ఆ గిత్తను సన్నిధి గుడారపు ద్వారం దగ్గరకు తీసుకొని వెళ్లాలి. అప్పుడు యెహోవా ఆ అర్పణను అంగీకరిస్తాడు. 4 ఈ వ్యక్తి ఆ గిత్త తలమీద తన చేయి పెట్టాలి. ఆ వ్యక్తి పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆ దహనబలి అర్పణను యెహోవా అంగీకరిస్తాడు.
5 “ఆ వ్యక్తి యొక్క గిత్తను యోహోవా ఎదుట వధించాలి. అప్పుడు అహరోను కుమారులైన యాజకులు ఆ గిత్త రక్తాన్ని తీసుకొని రావాలి. సన్నిధి గుడారపు ద్వారం దగ్గర బలిపీఠం చుట్టూ ఆ రక్తాన్ని వారు చిలకరించాలి. 6 అతడు ఆ పశువు చర్మాన్ని ఒలిచి, ఆ పశువును ముక్కలుగా నరకాలి. 7 యాజకులైన అహరోను కుమారులు బలిపీఠం మీద కట్టెలు, నిప్పు ఉంచాలి. 8 యాజకులైన అహరోను కుమారులు ఆ ముక్కలను (తల, కొవ్వు) కట్టెలు మీద పెట్టాలి. ఆ కట్టెలు బలిపీఠం మీద నిప్పుల్లో ఉంటాయి. 9 ఆ పశువు లోపలి భాగాలను, కాళ్లను నీళ్లతో యాజకుడు కడగాలి. తర్వాత ఆ పశువు అవయవాలు అన్నింటినీ బలిపీఠం మీద యాజకుడు దహించాలి. అది అగ్నిపై అర్పించబడే దహనబలి, ఇది యెహోవాకు ఇష్టమైన సువాసన.
10 “ఒక వ్యక్తి గొర్రెనుగాని మేకనుగాని దహన బలిగా అర్పిస్తుంటే, ఏ దోషం లేని మగదానిని మాత్రమే అతడు అర్పించాలి. 11 ఆ వ్యక్తి బలిపీఠానికి ఉత్తరాన, యెహోవా ఎదుట ఆ జంతువును వధించాలి. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు, ఆ జంతువు రక్తాన్ని బలిపీఠం చుట్టూ చిలకరించాలి. 12 అప్పుడు యాజకుడు ఆ జంతువును ముక్కలుగా నరకాలి. ఆ జంతువు తల, కొవ్వులను యాజకుడు ఉంచుకొంటాడు. ఆ ముక్కలను యాజకుడు కట్టెల మీద చక్కగా పేర్చాలి. బలిపీఠం మీద నిప్పుల్లో ఆ కట్టెలు ఉంటాయి. 13 లోపలి భాగాలను, కాళ్లను నీళ్లతో యాజకుడు కడగాలి. అప్పుడు యాజకుడు ఆ జంతువు అవయవాలన్నింటినీ అర్పించి, బలిపీఠం మీద దహించాలి. అది అగ్నిపై అర్పించబడే దహనబలి, ఇది యెహోవాకు ఇష్టమైన సువాసన.
14 “ఒక వ్యక్తి ఒక పక్షిని యెహోవాకు దహన బలిగా అర్పించాలను కొంటే, తెల్ల గువ్వ, లేక పావురం పిల్ల మాత్రమే యివ్వాలి. 15 అర్పణను యాజకుడు ఆ బలిపీఠం దగ్గరకు తీసుకొని రావాలి. యాజకుడు ఆ పక్షి తలను తుంచివేయాలి. అప్పుడు ఆ పక్షిని బలిపీఠం మీద యాజకుడు దహించాలి. ఆ పక్షి రక్తాన్ని బలిపీఠం పక్కగా కార్చివెయ్యాలి. 16 యాజకుడు ఆ పక్షి మేత పొట్టను, దాని ఈకలను తీసివేసి, బలిపీఠానికి తూర్పుగా పారవేయాలి. ఇది వారు బలిపీఠపు బూడిదను పారవేసేచోటు. 17 అప్పుడు యాజకుడు ఆ పక్షి రెక్కలను పట్టి చీల్చాలి గాని దానిని రెండు భాగాలుగా విడదీయకూడదు. బలిపీఠం మీద అగ్నిలో ఉన్న కట్టెలపైన ఆ పక్షిని యాజకుడు దహించాలి. అది అగ్నిపైన అర్పించబడే దహనబలి, ఇది యెహోవాకు ఇష్టమైన సువాసన.