2
యాజకులకు నియమాలు
“యాజకులారా, ఈ నియమం మీ కోసమే! నా మాట వినండి! నేను చెప్పే మాటలు గమనించండి! నా పేరును మీరు గౌరవించాలి. మీరు నా పేరును గౌరవించకపోతే, అప్పుడు మీకు చెడు విషయాలు సంభవిస్తాయి. మీరు ఆశీర్వాదాలు చెప్పగా అవి శాపనార్థాలు అవుతాయి. మీరు నా పేరు అంటే గౌరవం చూపడం లేదు గనుక కీడులు సంభవించేటట్టు నేను చేస్తాను.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
“చూడండి, మీ సంతతివారిని నేను శిక్షిస్తాను. పవిత్ర దినాల్లో, యాజకులారా, మీరు నాకు బలులు అర్పిస్తారు. చచ్చిన జంతువుల్లో నుండి పేడ, పేగులు మీరు తీసి, వాటిని పారవేస్తారు. కానీ నేను ఆ పేడను మీ ముఖాలకు పులిమివేస్తాను, మరియు దానితోపాటుమీరు విసరివేయబడుతారు! అప్పుడు ఈ ఆజ్ఞను నేను ఎందుకోసం మీకు ఇచ్చానో అది మీరు నేర్చు కొంటారు. లేవీతో నా ఒడంబడిక కొన సాగాలని నేను ఈ విషయాలు మీతో చెపుతున్నాను.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
యెహోవా చెప్పాడు, “లేవీతో ఆ ఒడంబడిక నేను చేశాను. అతనికి జీవం-శాంతి ఇస్తానని నేను వాగ్దానం చేశాను-మరియు నేను వాటిని అతనికి ఇచ్చాను! లేవీ నేనంటే భయభక్తులు చూపాడు! అతడు నా పేరుకు గౌరవం చూపించాడు! లేవీ సత్య ప్రబోధాలు నేర్పించాడు. లేవీ అబద్ధాలు నేర్పించలేదు. లేవీ నిజాయితీపరుడు, అతడు శాంతిని ప్రేమించాడు. లేవీ నన్ను అనుసరించి, అనేకమంది తాము చేసిన చెడ్డ పనుల కోసం శిక్షింపబడకుండా వారిని అతడు రక్షించాడు. ప్రతి యాజకుడూ దేవుని ప్రబోధాలు ఎరిగి ఉండాలి. ప్రజలు ఒక యాజకుని దగ్గరకు వెళ్లి, దేవుని ప్రబోధాలను అతని వద్ద నేర్చుకోగలిగి ఉండాలి. యాజకుడు ప్రజలకు దేవుని సందేశకునిగా ఉండాలి.”
(యెహోవా చెప్పాడు,) “యాజకులారా, మీరు నన్ను అనుసరించటం మానివేశారు! మనుష్యులచేత చెడు చేయించటానికి ఆ ప్రబోధాలు మీరు వినియోగించుకొన్నారు. లేవీతోటి ఒడంబడికను మీరు భగ్నం చేశారు!” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. “నేను మీతో చెప్పిన విధంగా మీరు జీవించరు! మీరు నా ప్రబోధాలు అంగీకరించలేదు! కనుక నేను మిమ్మల్ని ప్రాముఖ్యం లేనివారినిగా చేస్తాను. ప్రజలు మిమ్మల్ని బహిష్కరిస్తారు!”
యూదా దేవునికి సమ్మకంగా లేడు
10 మన అందరికీ ఒకే తండ్రి ఉన్నాడు (దేవుడు). ఆ దేవుడే మనలో ప్రతి ఒక్కరినీ చేశాడు! కనుక ప్రజలు ఎందుకు వారి సోదరులను మోసం చేస్తున్నారు? ఆ ప్రజలు ఒడంబడికను సన్మానించటం ెలేదని వ్యక్తం చేస్తున్నారు. మన పూర్వీకులు దేవునితో చేసుకున్న ఒడంబడికను వారు గౌరవించరు. 11 యూదా మనుష్యులు ఇతరులను మోసం చేశారు. యెరూషలేములో, ఇశ్రాయేలులో ప్రజలు భయంకర విషయాలు జరిపించారు. యూదాలో ప్రజలు యెహోవా పవిత్ర ఆలయాన్ని గౌరవించలేదు. ఆ స్థలం దేవునికి ఇష్టమైనది! యూదా ప్రజలు ఆ విదేశీ దేవతను పూజించటం మొదలు పెట్టారు. 12 యెహోవా ఆ మనుష్యులను యూదా వంశంలోనుండి తొలగించివేస్తాడు. ఆ ప్రజలు యెహోవాకు కానుకలు తీసికొని రావచ్చుగాక, కానీ అది సహాయ పడదు. 13 నీవు ఏడ్చి, యెహోవా బలిపీఠాన్ని కన్నీళ్ళతో నింపవచ్చు, కానీ యెహోవా నీ కానుకలు అంగీకరించడు. నీవు ఆయనకోసం తెచ్చే వస్తువులతో యెహోవా సంతోషించడు.
14 “మా కానుకలను యెహోవా ఎందుచేత అంగీ కరించలేదు?” అని మీరు అడుగుతారు. ఎందుకంటే మీరు చేసిన చెడుకార్యాలు యెహోవా చూశాడు, మీకు విరుద్ధంగా ఆయనే సాక్షి. నీవు నీ భార్యను మోసం చేయటం ఆయన చూశాడు. నీవు యువకునిగా ఉన్నప్పుడే నీవు ఆ స్త్రీకి వివాహం చేయబడ్డావు. ఆమె నీ స్నేహితురాలు. తర్వాత మీరు ఇద్దరూ ఒకరికి ఒకరు ప్రమాణాలు చేసికొన్నారు-ఆమె మీకు భార్య అయింది. కానీ నీవు ఆమెను మోసం చేసావు. 15 భర్తలు, భార్యలు ఒకే శరీరం, ఒకే ఆత్మ కావాలని దేవుడు కోరుచున్నాడు. ఎందుకంటే, వారికి పవిత్రమైన పిల్లలు ఉండాలని. అందుచేత ఆత్మ పరమైన ఆ ఐక్యతను కాపాడుకోండి. మీ భార్యను మోసం చేయవద్దు. నీవు యువకునిగా ఉన్నప్పటి నుండి ఆమె నీకు భార్యగా ఉంది.
16 “విడాకులు అంటే నాకు అసహ్యం. మరియు పురుషులు తమ భార్యలయెడల చేసే కృరమైన పనులు నాకు అసహ్యం. అందుచేత మీ ఆత్మపరమైన ఐక్యాన్ని కాపాడుకోండి. నీ భార్యను మోసం చేయవద్దు” అని ఇశ్రయేలీయుల దేవుడైన యెహోవా చెపుతున్నాడు.
తీర్పు కోసం ప్రత్యేక సమయం
17 మీరు తప్పుడు విషయాలు నేర్పించారు. ఆ తప్పుడు ప్రబోధాలు యెహోవాకు చాలా విచారం కలిగించాయి. చెడుకార్యాలు చేసే వారంటే దేవునికి ఇష్టం అని మీరు ప్రబోధించారు. అలాంటివారే మంచివాళ్లని దేవుడు తలుస్తాడు అని మీరు ప్రబోధించారు. చెడుకార్యాలు చేసినందుకు దేవుడు శిక్షించడు అని మీరు ప్రబోధం చేశారు.