3
ప్రాకార నిర్మాతలు
1 ప్రధాన యాజకుని పేరు ఎల్యాషీబు. ఎల్యాషీబూ, యాజకులైన అతని సోదరులూ పనిలోకి పోయి, గొర్రెల ద్వారాన్ని నిర్మించారు. వాళ్లు ప్రార్థనలు జరిపి యెహోవా పేరిట ఆ ద్వారమును ప్రతిష్ఠ చేశారు. దాని ద్వారాలను ప్రాకారంలో సరైన చోట వుంచారు. ఆ యాజకులు యెరూషలేము ప్రాకారాన్ని హమ్మేయా గోపురం దాకా, హనన్యే గోపురుం దాకా నిర్మించి, అక్కడ ప్రార్థనలు జరిపి, ప్రతిష్ఠించారు.
2 యాజకులు కట్టిన గోడ భాగానికి పక్కనే యెరికోవాసులు గోడను కట్టారు. ఇమ్రీ కుమారుడైన జక్కూరు యెరికోవాసులు కట్టినదానికి పక్కగా గోడ భాగమును కట్టాడు.
3 హస్సెనాయా కుమారులు మత్స్య ద్వారాన్ని నిర్మించారు. వాళ్లు కొయ్య దూలాలను సరిగ్గా అమర్చి, కట్టడానికి తలుపులు పెట్టి, తర్వాత ఆ తలుపులకు గడియలు, తాళాలు అమర్చారు.
4 ఊరియా కుమారుడు మెరేమోతు గోడలో తర్వాత భాగాన్ని నిర్మించాడు. (ఊరియా హక్కోజు కుమారుడు).
బెరెక్య కుమారుడు మెషుల్లాము గోడలో తర్వాత భాగాన్ని కట్టాడు. (బెరెక్యా మెషేజబెయేలు కుమారుడు.)
బయనా కొడుకు సాదోకు గోడలో తర్వాత భాగము కట్టాడు.
5 తెకోవీయులు గోడలో తర్వాతి భాగాన్ని కట్టారు. అయితే, తెకోవా నాయకులు తమ పాలనాధికారి నెహెమ్యా కోసం పని చేసేందుకు అంగీకరించలేదు.
6 పాసెయ కుమారుడు యెహోయూదా, బెసోద్యా కుమారుడు మెషుల్లాము పాతద్వారం మరమ్మతు చేశారు. వాళ్లు దూలాలను సరిగ్గా ఉంచి, తలుపులను కీలు గుడిదెల మీద నిలిపి, తలుపులకు గడియలు, తాళాలు అమర్చారు. 7 గిబ్యోను వాళ్లూ, మిస్పా వాళ్లూ గోడలో తర్వాత భాగాన్ని నిర్మించారు. గిబ్యోనుకు చెందిన మెలట్యా, మేరోనోతుకి చెందిన యాదోనూ పనిచేశారు. గిబ్యోను, మేరోనోతులు యూఫ్రటిసు నది వశ్చిమ ప్రాంత పాలనాధికారుల అజమాయిషీలో వున్నాయి.
8 హర్శయా కుమారుడు ఉజ్జీయేలు గోడలో తర్వాత భాగాన్ని మరమ్మతు చేశాడు. ఉజ్జీయేలు బంగా రపుపని చేసే కంసాలి. హనన్యా అత్తర్ల తయారీదారు. వీళ్లు వెడల్పు గోడవరకు యెరూషలేమును కట్టి, నిలిపారు.
9 వీరి పక్కన హూరు కుమారుడు రెఫాయా గోడలో తదుపరి భాగాన్ని నిర్మించాడు. రెఫాయా యెరూషలేములో సగం భాగానికి పాలనాధికారి.
10 హరూమఫు కొడుకు యెదాయా గోడలో తర్వాత భాగాన్ని నిలిపాడు. యెదాయా నిలిపిన గోడ భాగం అతని యింటి పక్కనే వుంది. హషబ్మేయా కొడుకు హట్టూషు తర్వాత గోడ భాగాన్ని మరమ్మతు చేశాడు. 11 హారీము కొడుకు మల్కీయా, పహత్మోయాబు కొడుకు హష్షూబు తర్వాత భాగాన్నీ, అగ్ని గుండపు గోపురాన్నీ మరమ్మతు చేశారు.
12 గోడలో తర్వాత భాగాన్ని హల్లోహెషు కొడుకు షల్లూము తన కుమారైల సాయంతో మరమ్మతు చేశాడు. షల్లూము యెరూషలేము రెండవ భాగానికి పాలనాధికారి.
13 హానూను అనేవాడు, జానోవా పట్టణ వాసులూ కలిసి లోయద్వారాన్ని పునర్నిర్మించారు. వాళ్లు దాని తలుపులను కీలుల మీద నిలిపారు. తర్వాత ఆ తలుపులకు వాళ్లు గడియలు, తాళాలు బిగించారు. అంతేకాక, వాళ్లు 500 గజాల గోడను కూడా బాగుచేశారు. వాళ్లు బూడిద రాశి ద్వారందాకా ఉన్న గోడను బాగు చేశారు.
14 రేకాబు కొడుకు మల్కీయా పెంట గుమ్మాన్ని సరిచేశాడు. మల్కీయా, బేత్ హక్కెరెము ప్రాంతానికి అధిపతి. అతను ఆ ద్వారాన్ని నిలిపి, దాని తలుపులను కీలులమీద తగిలించి, వాటికి గడియలను, తాళాలను అమర్చాడు.
15 కొల్హోజె కొడుకు షల్లూము ఇంటి ద్వార గుమ్మాన్ని బాగుచేశాడు. ఇతను మిస్పా ప్రాంతపు అధిపతి. అతను ఆ ద్వారాన్ని బాగుచేసి, దానికి పైకప్పు వేయించాడు. అతను కీలుల మీద తలుపులు నిలిపి, వాటికి గడియలు, తాళాలు అమర్చాడు. రాజుగారి తోట పక్కన వున్న సిలోయము కోనేరువరకువున్న గోడ భాగాన్ని కూడా షల్లూము బాగుచేశాడు. దావీదు నగరం నుంచి కిందికి పోయే మెట్లవరకు వున్న గోడను కూడా అతనే బాగుచేశాడు.
16 అజ్జూకు కొడుకు నెహెమ్యా గోడలో తర్వాత భాగాన్ని బాగుచేసాడు. ఈ నెహెమ్య బేత్‌సూరు సగం ప్రాంతానికి అధిపతి. అతను దావీదు సమాధికి ఎదుట పున్న స్థలంలోని కోనేరును, యుద్ధ వీరుల భవనాన్నీ బాగుచేశాడు.
17 తర్వాత భాగాన్ని లేవి వంశీములు బాగు చేశారు. ఆ లేవీయులు బానీ కుమారుడు రెహూము అజమా యిషీలో పనిచేశారు. కెయిలా ప్రాంతంలో సగం భాగానికి అధిపతి అయిన హషబ్యా తర్వాతి భాగాన్ని బాగుచేశాడు. అతను తన సొంత ప్రాంతానికి చెందిన వాటినే బాగుచేశాడు.
18 వాళ్ల సోదరులు తర్వాతి భాగాన్ని బాగుచేశారు. వాళ్లు హేనాదాదు కుమారుడు బవ్వై పర్యవేక్షణలో పని చేశారు. కెయిలా ప్రాంతపు సగంభాగానికి ఈ బవ్వై అధిపతి.
19 యేషూవ కుమారుడు ఏజెరు తర్వాతి భాగాన్ని బాగుచేశాడు. ఏజెరు మిస్పా అధిపతి. అతను ఆయుధాగారం నుంచి ప్రాకారం మూలదాకా వున్న భాగాన్ని బాగుచేశాడు. 20 జబ్బయి కుమారుడు బారూకు గోడలో తదుపరి భాగాన్ని బాగుచేశాడు. బారూకు విశేషంగా శ్రమించి, ప్రాకారం మూలనుంచి ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు ఇంటిదాకా వున్న గోడ భాగాన్ని బాగుచేశాడు. 21 హక్కోజు మనుమడు, ఊరియా కుమారుడు అయిన మెరేమోతు ఎల్యాషీబు ఇంటి ముఖ ద్వారం నుంచి, ఆ ఇంటి చివరిదాకా వున్న గోడ భాగాన్ని బాగుచేశాడు. 22 ప్రాకారపు తదుపరి భాగాన్ని ఆ ప్రాంతంలో*ఆ ప్రాంతంలో బహుశా “యోర్దాను లోయ” అయ్యుంటుంది. నివసించే యాజకులు బాగుచేశారు.
23 బెన్యామీను, హష్షూబులు తమ ఇంటి మందరి గోడ భాగాన్ని బాగుచేశారు. అనన్యా కుమారుడు, మయశేయా కోడుకు అయిన అజర్యా తన ఇంటి పక్కన వున్న గోడ భాగాన్ని బాగుచేశాడు.
24 హేనాదాదు కొడుకు బిన్నూయి అజర్యా ఇంటి దగ్గర్నుంచి ప్రాకారపు మలుపుదాకా, అక్కణ్నుంచి మూలదాకా గోడభాగాన్ని బాగుచేశాడు.
25 ఊజై కుమారుడు పాలాలు ప్రాకారపు మలుపు నుంచి గోపురం దాకా పనిచేశాడు. రాజుగారి పై అంతస్తు దగ్గర, అది రాజుగారి రక్షకభటుల ఆవరణానికి దగ్గర వున్న గోవురం. పరోషు కొడుకు పెదాయా పొలాలు పక్కన పని చేశాడు.
26 ఆలయ సేవకులు ఓపెలు కొండమీద నివసించేవారు. వాళ్లు జలద్వారం దాకా, దాని దగ్గరవున్న గోపురం దాకా ఉన్న గోడ తదుపరి భాగాన్ని బాగు చేశారు.
27 పెద్ద గోపురం దగ్గర్నుంచి ఓపెలు గోడదాకా ఉన్న ప్రాకార భాగమంతటినీ తెకోవీయులు బాగు చేశారు.
28 తమ ఇండ్లకి ఎదురుగా గుర్రపు గుమ్మానికి పైనున్న ప్రాకార భాగాన్ని యాజకులు బాగుచేశారు. ప్రతి ఒక్క యాజకుడూ తన స్వగృహానికి ఎదుట ఉన్న గోడ భాగాన్ని బాగుచేశాడు. 29 ఇమ్మేరు కొడుకైన సాదోకు తన ఇంటి ముందరి గోడ భాగాన్ని బాగు చేశాడు. షెకన్నాకొడుకైన షెమయా గోడలో అటు తర్వాత భాగాన్ని బాగుచేశాడు. షెమయా తూర్పు ద్వార రక్షకుడు.
30 షలెమ్యా కొడుకు హనన్యా, జాలాఫు కొడుకు హానూనూ గోడలో మిగిలిన భాగాన్ని బాగుచేశారు. (హానూను జాలాపు ఆరవ కొడుకు).
బెరెక్యా కొడుకు మెషుల్లాము తన ఇంటి ముందరి గోడ భాగాన్ని బాగుచేశాడు. 31 ఆలయ సేవకుల, వ్యాపారస్తుల ఇళ్లదాకా ఉన్న తదుపరి గోడ భాగాన్ని మల్యీయా బాగుచేశాడు. అంటే, తనిఖీ ద్వారం దగ్గర్నుంచి అన్నమాట. ప్రాకారపు మూలలో ఉన్న గదిదాకా ఉన్న గోడ భాగమంతటినీ మల్కీయా బాగు చేశాడు. మల్కీయా బంగారంపని చేసేవాడు. 32 స్వర్ణకారులూ, వ్యాపారస్థలూ మూలనున్న గదినుంచి గొర్రెల ద్వారం దాకా ఉన్న గోడ భాగాన్ని బాగుచేశారు.