24
బిలాము మూడో ప్రవచనం
1 ఇశ్రాయేలును యెహోవా ఆశీర్వదించాలనే కోరుతున్నట్టు బిలాము గమనించాడు. కనుక ఎలాంటి మంత్రాలు ప్రయోగించినా గాని దానిని బిలాము మార్చదలచుకోలేదు. కానీ బిలాము పక్కకు తిరిగి అరణ్యం చూసాడు. 2 బిలాము అరణ్యాన్ని చూచి, అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలందర్నీ చూసాడు. వారు, వారి కుటుంబాలతో ఆ ప్రదేశాల్లో నివసిస్తున్నారు. అప్పుడు దేవుని ఆత్మ బిలాము మీదికి రాగా 3 బిలాము ఈ విషయాలు చెప్పాడు:
“బెయోరు కుమారుడు ఈ విషయాలు చెబుతున్నాడు.
నా కళ్లు తేటగా చూస్తున్నాయి కనుక ఈ మాటలు పలుకుతున్నాను.
4 నేను దేవుని మాటలు వింటున్నాను కనుక ఈ మాటలు చెబుతున్నాను.
నేను చూడాలని ఆ సర్వశక్తిమంతుడు కోరుతున్న వాటిని నేను చూడ గలుగుతున్నాను.
నేను సాగిలపడి తేటగా చూసినవాటిని చెబుతున్నాను.
5 “యాకోబు ప్రజలారా, మీ గుడారాలు చాలా అందంగా ఉన్నాయి.
ఇశ్రాయేలు ప్రజలారా, మీ నివాసాలు అందంగా ఉన్నాయి.
6 భూమి మీద మీ గుడారాలు లోయల్లా
పరచుకొన్నాయి.
అవి నదీ తీరంలో
తోటలా ఉన్నాయి.
యెహోవా నాటిన అది చక్కటి
సువాసనగల మొక్కలా ఉంది.
అది నీళ్ల దగ్గర పెరిగే
అందమైన చెట్లలా ఉంది.
7 మీకు ఎల్లప్పుడూ తాగటానికి కావాల్సినంత నీరు ఉంటుంది.
మీ ఆహారం పండించుకోవటానికి కావాల్సినంత నీరు ఎల్లప్పుడూ ఉంటుంది మీకు.
ఆ ప్రజల రాజు అగాగుకంటె గొప్పవాడుగా ఉంటాడు.
వారి రాజ్యం చాలా గొప్పది అవుతుంది.
8 “ఆ ప్రజలను ఈజిప్టునుండి దేవుడే బయటకు తీసుకొచ్చాడు.
వారు అడవి ఆవు అంతటి బలంగలవారు. తమ శత్రువులందర్నీ వారు ఓడిస్తారు.
వారి శత్రువుల ఎముకల్ని వారు విరుగగొడ్తారు.
వారి బాణాలు వారి శత్రువుల్ని చంపేస్తాయి.
9 తన ఆహారం మీదికి ఎగబడటానికి సిద్ధంగా వున్న సింహంలా ఇశ్రాయేలీయులున్నారు.
వారు నిద్రపోతున్న కొదమ
సింహంలా ఉన్నారు.
దానిని మేల్కొలి పేందుకు
ఎవడికి ధైర్యం చాలదు.
నిన్ను ఆశీర్వదించే వారు
ఆశీర్వాదం పొందుతారు.
నిన్ను ఎవరైనా శపిస్తే వారికి
గొప్ప కష్టాలు వస్తాయి.”
10 అప్పుడు బాలాకు బిలాముమీద చాల కోపపడ్డాడు. బిలాముతో బాలాకు అన్నాడు: “నిన్ను వచ్చి నా శత్రువులను శపించుమని పిలిచాను. కానీ నీవు వాళ్లను ఆశీర్వదించావు. వాళ్లను మూడు సార్లు నీవు ఆశీర్వదించావు. 11 ఇప్పుడు ఇంటికి వెళ్లిపో. నీకు చాలా ఇస్తానని నేను నీతో చెప్పాను. అయితే నీవు నీ ప్రతిఫలం పోగొట్టుకొనేటట్టు చేసాడు యెహోవా.”
12 బాలాకుతో బిలాము అన్నాడు: “నీవు నా దగ్గరకు మనుష్యుల్ని పంపించావు. నన్ను రమ్మని వాళ్లు అడిగారు. 13 కానీ వారితో నేను, ‘బాలాకు అతి సుందరమైన తన భవనాన్ని వెండి, బంగారాలతో నింపి ఇవ్వవచ్చుగాక. నేను మాత్రం నన్ను చెప్పమని యెహోవా నాకు చెప్పిన మాటలే చెబుతాను మంచిగాని చెడుగాని, నా అంతట నేనే ఏదీ చెయలేను. యెహోవా ఆజ్ఞాపించినట్లు నేను చేసి తీరాల్సిందే’ అన్నాను. ఈ సంగతులు నేను నీ మనుష్యులతో చెప్పటం నీకు జ్ఞాపకంలేదా? 14 ఇప్పుడు నేను నా స్వంత ప్రజల దగ్గరకు వెళ్తున్నాను. అయితే నేను నీకు ఒక హెచ్చరిక ఇస్తున్నాను. నీకూ, నీ ప్రజలకూ ఇశ్రాయేలు ప్రజలు ఇక ముందు ఏమి చేస్తారో నేను నీకు చెబుతాను.”
బిలాము చివరి ప్రవచనాలు
15 అప్పుడు బిలాము ఈ విషయాలు చెప్పాడు:
“బెయెరు కుమారుడైన బిలాము మాటలు ఇవి.
విషయాలను తేటగా చూడగలవాని మాటలు ఇవి.
16 మాటలను దేవుని దగ్గరనుండి వినగల వాని మాటలు ఇవి.
మహోన్నతుడైన దేవుడు నాకు నేర్పినవాటిని నేను నేర్చుకున్నాను.
నేను చుడాలని సర్వశక్తుడైన దేవుడు కోరినవాటిని నేను చూసాను.
నేను ఆయనకు సాగిల పడుతున్నాను. దేవునికి కావలసినదానిని నేను తేటగా చూడగలను.
17 “యెహోవా రావటం నేను చూస్తున్నాను, కానీ ఇప్పుడే కాదు.
ఆయన రాక నేను చూస్తున్నాను, కానీ అది త్వరలోనే జరగదు.
యాకోబు వంశంనుండి ఒక నక్షత్రం వస్తుంది.
ఇశ్రాయేలు నుండి ఒక కొత్త పాలకుడు వస్తాడు.
ఆ పాలకుడు మోయాబు ప్రజల తలలు చితకగొడ్తాడు.
షేతు కుమారులందరి తలలు ఆ పాలకుడు చితకగొడ్తాడు.
18 ఇశ్రాయేలీయులు బలము గలవారవుతారు.
అతనికి ఏదోము దేశము, అతని శత్రువైన శేయీరు*శేయీరు ఎదోముకి మరో పేరు. దొరుకుతాయి.
19 “యాకోబు వంశంనుండి ఒక కొత్త పాలకుడు వస్తాడు.
పట్టణంలో ఇంకా బతికి ఉన్న వాళ్లను ఆ పాలకుడు నాశనం చేస్తాడు.”
20 తర్వాత బిలాము అమాలేకు ప్రజలను చూచి ఈ మాటలు చెప్పాడు:
“దేశాలన్నింటిలో అమాలేకు అతి బలంగలది.
కానీ అమాలేకు కూడ నాశనం చేయబడుతుంది”!
21 తర్వాత బిలాము కెనాతీ ప్రజలను చూచి ఈ మాటలు చెప్పాడు:
“మీ దేశం క్షేమంగా ఉందని మీ నమ్మకం.
ఎత్తయిన కొండమీద పక్షి గూడులా అది కాపాడ బడుతోందని మీ నమ్మకం.
22 అయితే మీరు కెనాతీ ప్రజలు నాశనం చేయబడతారు.
అష్షూరు మిమ్మల్ని బందీలుగా చేస్తుంది.”
23 అప్పుడు బిలాము ఈ మాటలు చెప్పాడు:
“దేవుడు ఇలా చేసినప్పుడు ఏ వ్యక్తి బతకలేడు.
24 కిత్తీము తీరాలకు ఓడలు వస్తాయి.
ఆ ఓడలు అష్షూరు, ఎబెరులను ఓడిస్తాయి.
అయితే తర్వాత ఆ ఓడలు కూడ నాశనం చేయ బడతాయి”
25 అప్పుడు బిలాము లేచి, తన స్వంత ఊరికి తిరిగి వెళ్లి పోయాడు.