2
జ్ఞానం చెప్పేది వినండి
నా కుమారుడా, నేను చెప్పే ఈ సంగతులు అంగీకరించు. నా ఆజ్ఞలు జ్ఞాపకం ఉంచుకో. జ్ఞానం చెప్పేది విని, గ్రహించటానికి నీ శక్తి కొలది ప్రయత్నించు. జ్ఞానం కోసం గట్టిగా మొరపెట్టు, అవగాహన కోసం గట్టిగా అడుగు. వెండికోసం వెదకినట్టు జ్ఞానం కోసం వెదుకు. దాచబడిన ధనం కోసం వెదకినట్టు దానికోసం వెదకు. వీటిని నీవు చేస్తే అప్పుడు నీవు యెహోవాను గౌరవించటం నేర్చుకొంటావు.నీవు నిజంగా దేవుణ్ణి గూర్చి నేర్చుకొంటావు.
యెహోవా జ్ఞానము ప్రసాదిస్తాడు. జ్ఞానము, అవగాహన ఆయన నోటి నుండి వస్తాయి. ఆయన నిజాయితీ పరులకు మంచి జ్ఞానం దాచి సమకూర్చి ఇస్తాడు. ఆయన నిజాయితీగా నడుచుకొనేవారికి కవచం లాంటివాడు. ఇతరుల యెడల న్యాయంగా ఉండేవాళ్లను ఆయన కాపాడతాడు. ఆయన తన పవిత్ర ప్రజలను కాపాడతాడు.
కనుక యెహోవా తన జ్ఞానమును ప్రసాదిస్తాడు. అప్పుడు మంచివి, న్యాయమైనవి మరియు సరియైనవి నీవు గ్రహిస్తావు. 10 నీ హృదయంలోనికి జ్ఞానం వస్తుంది, నీ ఆత్మ జ్ఞానం కలిగి ఆనందిస్తుంది.
11 జ్ఞానం నిన్ను కాపాడుతుంది, వివేచన నీకు కావలి కాస్తుంది. 12 దుర్మార్గులు జీవించే చెడు మార్గంలో జీవించకుండ జ్ఞానము, వివేచన మిమ్మల్ని వారిస్తాయి. ఆ మనుష్యులు వారు చెప్పే వాటిలో కూడా దుర్మార్గులు 13 వారు మంచితనం విడిచి పెట్టి, ఇప్పుడు చీకట్లో (పాపంలో) జీవిస్తున్నారు. 14 వారు తప్పుచేసి సంతోషిస్తూ, దుర్మార్గపు చెడు మార్గాలలో ఆనందిస్తున్నారు. 15 ఆ మనుష్యులు నమ్మదగిన వారు కారు వారు అబద్ధాలాడి మోసం చేస్తారు. కానీ మీ జ్ఞానం,వివేచన వాటన్నిటి నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతాయి.
16 మరో దేశపు స్త్రీ ఎవరైనా నీవు ఆమెతో పాపము చేసేందుకు నిన్ను ఒప్పించేందుకని, దుర్మార్గులు తియ్యటి మాటల ప్రయోగించవచ్చు. 17 ఆమె చిన్నదిగా ఉన్నప్పుడే వివాహం చేసుకుంది కాని ఆమె తన భర్తను విడిచి పెట్టింది. ఆమె తన వివాహ ప్రమాణాన్ని నిలుపుకోవటం లేదు. ఆమె తన దేవుని నిబంధనను మర్చిపోతుంది. కాని లేదు అని ఆమెతో చెప్పేందుకు జ్ఞానం నీకు సహోయం చేస్తుంది. 18 నీవు బలహీనుడవై ఆమె ఇంట ప్రవేశిస్తే నాశనం (మరణం) వైపు మొదటి మెట్టు మీద నడచినట్టే. నీవు ఆమెను అలానే వెంబడిస్తే ఆమె నిన్ను సమాధికి నడిపిస్తుంది. 19 ఆమె ఒక సమాధిలా ఉంది. ఒకవేళ ఏ పురుషుడైనా ఆ స్త్రీ దగ్గరకు వెళ్తే, అతడు ఎన్నటికీ తిరిగి రాడు. ఆ మనిషి జీవితం మరలా ఎన్నటికి మొదటిలా ఉండదు.
20 కనుక నీవు మంచి మనుష్యుల అడుగుజాడలను అనుసరించేలా, మంచి మనుష్యులు జీవించే విధంగా జీవించునట్లు జ్ఞానం సహాయం చేస్తుంది. 21 సరిగ్గా జీవించే ప్రజలు దేశాన్ని తామే స్వంతంగా కలిగి ఉంటారు. మంచిని జరిగించే మనుష్యులు వారి భూమిలో జీవిస్తారు. 22 కానీ దుర్మార్గులు వారి భూమిని పోగొట్టుకొంటారు. ఆ దుర్మార్గులు దేశం నుండి తొలగించి వేయబడతారు.