31
లెమూయేలు రాజు చెప్పిన జ్ఞాన సూక్తులు
లెమూయేలు రాజు చెప్పిన జ్ఞాన సూక్తులు ఇవి. ఈ విషయాలను అతని తల్లి అతనికి నేర్పించింది.
నీవు నా కుమారుడవు. నేను ప్రేమించే నా కుమారుడివి. నాకు కావాలని నేను ప్రార్థించిన కుమారుడివి నీవు. స్త్రీలకోసం నీ బలం వ్యర్థం చేయవద్దు. స్త్రీలే రాజులను నాశనం చేసేవాళ్లు. వారికోసం నిన్ను నీవు వ్యర్థం చేసుకోవద్దు. లెమూయేలూ, రాజులు ద్రాక్షారసం తాగటం జ్ఞానముగల పనికాదు. మద్యము కోరుట పరిపాలకులకు జ్ఞానముగల పనికాదు. వారు విపరీతంగా తాగేసి న్యాయచట్టం చెప్పేదానిని మరచి పోవచ్చు. అప్పుడు వారు పేద ప్రజల హక్కులు అన్నీ తీసివేస్తారు. మద్యం పేద ప్రజలకు ఇమ్ము. ద్రాక్షారసం కష్టంలో ఉన్న ప్రజలకు ఇమ్ము. అప్పుడు వారు అది తాగి, వారు పేదవాళ్లు అనే మాట మరచిపోతారు. వాళ్లు తాగేసి వారి కష్టాలన్నీ మరచిపోతారు.
ఒకడు తనకు తానే సహాయం చేసికోలేకపోతే అప్పుడు నీవు అతనికి సహాయం చేయాలి. కష్టంలో ఉన్న ప్రజలందరికీ నీవు సహాయం చేయాలి. సరైనవి అని నీకు తెలిసిన విషయాల కోసం నీవు నిలబడు. మనుష్యులందరికీ న్యాయంగా తీర్పు తీర్చు. పేద ప్రజల, నీ అవసరం ఉన్న ప్రజల హక్కులను కాపాడు.
పరిపూర్ణమైన భార్య
10 “పరిపూర్ణమైన స్త్రీ” దొరకటం ఎంతో కష్టం.
కాని ఆమె నగలకంటె ఎంతో ఎక్కువ అమూల్యం.
11 ఆమె భర్త ఆమెను నమ్మగలడు.
అతడు ఎన్నడూ దరిద్రునిగా ఉండడు.
12 మంచి భార్య తన జీవితకాలం అంతా తన భర్తకు మంచినే చేస్తుంది.
ఆమె ఎన్నడూ అతనికి చిక్కు కలిగించదు.
13 ఆమె ఉన్నిబట్ట తయారు చేస్తూ
ఎల్లప్పుడూ పనిలో నిమగ్నమవుతుంది.
14 ఆమె దూరము నుండి వచ్చిన ఓడలా ఉంటుంది.
అన్ని చోట్ల నుండీ ఆమె ఆహారం తీసుకొని వస్తుంది.
15 ఆమె అతి వేకువనే మేలుకొంటుంది.
తన కుటుంబానికి భోజనం, తన పని వారికి భోజనం ఆమె వండుతుంది.
16 ఆమె పొలాన్ని చూస్తుంది. దాన్నికొంటుంది.
ఆమె ద్రాక్షతోట నాటేందుకు ఆమె దాచుకొన్న డబ్బు ఉపయోగిస్తుంది.
17 ఆమె చాలా కష్టపడి పని చేస్తుంది.
ఆమె బలంగా ఉండి తన పని అంతా చేసుకో గలుగుతుంది.
18 ఆమె తయారు చేసిన వాటిని అమ్మినప్పుడు ఆమె ఎల్లప్పుడూ లాభం సంపాదిస్తుంది.
మరియు రాత్రి చాలా పొద్దుపోయేదాకా ఆమె పని చేస్తుంది.
19 ఆమె స్వంతంగా దారం తయారు చేసికొని
తన స్వంత బట్ట నేస్తుంది.
20 ఆమె ఎల్లప్పుడూ పేద ప్రజలకు పెడుతుంది.
అవసరంలో ఉన్న వారికి సహాయం చేస్తుంది!
21 చలిగా ఉన్నప్పుడు ఆమె తన కుటుంబం విషయం దిగులు పడదు.
ఆమె వారందరికి మంచి వెచ్చని దుస్తులు ఇస్తుంది.
22 ఆమె దుప్పట్లు నేసి పడకలమీద పరుస్తుంది.
నన్నని నారతో చేయబడ్డ వస్త్రాలు ఆమె ధరిస్తుంది.
23 ఆమె భర్తను ప్రజలు గౌరవిస్తారు.
అతడు దేశ నాయకులలో ఒకడు.
24 ఆమె మంచి వ్యాపార దక్షతగల స్త్రీ. ఆమె బట్టలు, నడికట్లు తయారు చేసి
వాటిని వ్యాపారస్థులకు అమ్ముతుంది.
25 ఆమె బలంగా ఉంటుంది. మరియు, ప్రజలు ఆమెను గౌరవిస్తారు.
ఆమె స్థానము బలంగాను మరియు సురక్షితంగాను ఉంటుంది.
భవిష్యత్తును గురించి సంతోషిస్తుంది.
26 ఆమె మాట్లాడినప్పుడు జ్ఞానముగా ఉంటుంది.
ఆమె జ్ఞానం ఉపదేశముతోనిండి ఉంటుంది.
27 ఆమె ఎన్నడూ బద్ధకంగా ఉండదు.
కాని ఆమె తన ఇంటి విషయాలను గూర్చి జాగ్రత్త తీసుకొంటుంది.
28 ఆమె పిల్లలు పెద్దవారై ఆమెను ఘనపరుస్తారు.
మరియు ఆమె భర్త ఆమెను గూర్చి ఎన్నో మంచి విషయాలు చెబుతాడు.
29 “ఎంతో మంది స్త్రీలు మంచి భార్యలు అవుతారు.
కాని నీవు శ్రేష్ఠమైన దానివి” అని ఆమె భర్త చెబుతాడు.
30 సౌందర్యము, అందము నిన్ను మోసగించవచ్చు.
అయితే యెహోవాను గౌరవించే స్త్రీ పొగడబడాలి.
31 ఆమెకు అర్హమైన ప్రతిఫలం రావాలి.
ఆమె చేసిన విషయాల కోసం ప్రజలు ఆమెను బహిరంగంగా ఘనపర్చాలి.