46
సంగీత నాయకునికి, కోరహు కుమారుల అలామోతు రాగ గీతం. 
  1 దేవుడు మా ఆశ్రయం, మా శక్తి.  
ఆయన యందు, మాకు కష్ట కాలంలో ఎల్లప్పుడూ సహాయం దొరుకుతుంది.   
 2 అందుచేత భూమి కంపించినప్పుడు,  
మరియు పర్వతాలు సముద్రంలో పడినప్పుడు మేము భయపడము.   
 3 సముద్రాలు పొంగినను, చీకటితో నిండినను,  
భూమి, మరియు పర్వతాలు కంపించినను మేము భయపడము.   
 4 ఒక నది ఉంది. దాని కాలువలు దేవుని నివాసానికి,  
మహోన్నత దేవుని పరిశుద్ధ పట్టణానికి సంతోషం తెచ్చి పెడ్తాయి.   
 5 ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు. కనుక అది ఎన్నటికీ నాశనం చేయబడదు.  
సూర్యోదయానికి ముందే దేవుడు సహాయం చేస్తాడు.   
 6 రాజ్యాలు భయంతో పణకుతాయి.  
యెహోవా కేక వేయగా ఆ రాజ్యాలు కూలిపోతాయి. భూమి పగిలిపోతుంది.   
 7 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.  
యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.   
 8 చూడండి, యెహోవా చేసే మహత్తర కార్యాలు చూడండి.  
ఆ కార్యాలు భూమి మీద యెహోవాను ప్రసిద్ధి చేస్తాయి.   
 9 భూమి మీద ఎక్కడైనా సరే యుద్ధాలను యెహోవా ఆపివేయగలడు.  
సైనికుల విల్లులను, వారి ఈటెలను ఆయన విరుగగొట్టగలడు. రథాలను ఆయన అగ్నితో కాల్చివేయగలడు.   
 10 దేవుడు చెబతున్నాడు, “మౌనంగా ఉండి, నేను దేవుణ్ణి అని తెలుసుకోనండి.  
రాజ్యాలతో నేను స్తుతించబడతాను.  
భూమిమీద మహిమపర్చబడతాను.”   
 11 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.  
యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.