53
సంగీత నాయకునికి. మాహలతు రాగంలో పాడతగిన దావీదు ధ్యానం. 
  1 తెలివి తక్కువ వాడు మాత్రమే దేవుడు లేడని తలుస్తాడు.  
అలాంటి మనుష్యులు చెడిపోయిన వారు, చెడు విషయాలను చేస్తారు.  
సరియైన దాన్ని చేసేవాడు ఒక్కడూ లేడు.   
 2 నిజంగా దేవుడు పరలోకంలో ఉండి మనల్ని చూస్తూ ఉన్నాడు.  
దేవునికొరకు చూసే జ్ఞానంగల వాళ్లు ఎవరైనా ఉన్నారేమో అని  
కనుగొనేందుకు దేవుడు చూస్తూ ఉన్నాడు.   
 3 కానీ ప్రతి మనిషీ దేవునికి వ్యతిరేకంగా తిరిగి పోయాడు.  
ప్రతి మనిషీ చెడ్డవాడే.  
మంచి చేసేవాడు లేడు.  
ఒక్కడూ లేడు.   
 4 దేవుడు చెబతున్నాడు, “ఆ దుర్మార్గులకు సత్యం బాగా తెలుసు.  
కాని వారు నన్ను ప్రార్థించరు.  
ఆ దుర్మార్గులు వారి భోజనం తినటానికి ఎంత సిద్ధంగా ఉంటారో నా ప్రజలను నాశనం చేయటానికి కూడ అంత సిద్ధంగా ఉంటారు.”   
 5 కాని ఆ దుర్మార్గులు ఇంతకు ముందెన్నడూ  
భయ పడనంతగా భయపడిపోతారు.  
ఆ దుర్మార్గులు ఇశ్రాయేలీయులకు శత్రువులు. దేవుడు ఆ దుర్మార్గులను నిరాకరించాడు.  
కనుక మీరు వారిని ఓడిస్తారు.  
దేవుడు మీ శత్రువుల ఎముకలను చెదరగొట్టేస్తాడు.   
 6 ఇశ్రాయేలు ప్రజలారా,  
సీయోనుకు విజయాన్ని ఎవరిస్తారు?  
దేవుడు తన ప్రజలను తిరిగి వర్ధిల్లజేసేటప్పుడు  
యాకోబు సంతోషిస్తాడు.  
ఇశ్రాయేలు బహుగా ఆనందిస్తాడు.