85
సంగీత నాయకునికి. కోరహు కుమారుల స్తుతి కీర్తన 
  1 యెహోవా, నీ దేశం మీద దయ చూపించుము.  
యాకోబు ప్రజలు విదేశంలో ఖైదీలుగా ఉన్నారు. ఖైదీలను తిరిగి వారి దేశానికి తీసుకొని రమ్ము.   
 2 యెహోవా, నీ ప్రజలను క్షమించుము!  
వారి పాపాలు తుడిచివేయుము.   
 3 యెహోవా, కోపంగాను,  
ఆవేశంగా నుండవద్దు.   
 4 మా దేవా, రక్షకా, మా మీద కోపగించటం మానివేసి,  
మమ్మల్ని మరల స్వీకరించు.   
 5 నీవు మామీద శాశ్వతంగా కోపగిస్తావా?   
 6 దయచేసి మమ్మల్ని మరల బ్రతికించుము!  
నీ ప్రజలను, సంతోషింపజేయుము.   
 7 యెహోవా, నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగా మాకు చూపించుము.  
మమ్మల్ని రక్షించుము.   
 8 దేవుడు చప్పేది నేను వింటున్నాను.  
తన ప్రజలకు శాంతి కలుగుతుందని యెహోవా చెబతున్నాడు.  
ఆయన అనుచరులు వారి అవివేక జీవిత విధానాలకు తిరిగి వెళ్లకపోతే వారికి శాంతి ఉంటుంది.   
 9 దేవుడు తన అనుచరులను త్వరలో రక్షిస్తాడు.  
మేము త్వరలోనే మా దేశంలో గౌరవంగా బతుకుతాము.   
 10 దేవుని నిజమైన ప్రేమ ఆయన అనుచరులకు లభిస్తుంది.  
మంచితనం, శాంతి, ఒకదానితో ఒకటి ముద్దు పెట్టుకొంటాయి.   
 11 భూమి మీద మనుష్యులు దేవునికి నమ్మకంగా వుంటారు.  
పరలోకపు దేవుడు వారికి మేలు అనుగ్రహిస్తాడు.   
 12 యెహోవా మనకు అనేకమైన మంచివాటిని ఇస్తాడు.  
భూమి అనేక మంచి పంటలను ఇస్తుంది.   
 13 మంచితనం దేవునికి ముందర నడుస్తూ  
ఆయన కోసం, దారి సిద్ధం చేస్తుంది.