95
 1 రండి, మనం యెహోవాని స్తుతించుదాము.  
మన రక్షణా బండైన ప్రభువుకు సంతోషగానం చేద్దాము.   
 2 యెహోవాకు మనం కృతజ్ఞతా కీర్తనలు పాడుదాము.  
సంతోష గీతాలు మనం ఆయనకు పాడుదాము.   
 3 ఎందుకంటే ఆయన మహా గొప్ప దేవుడు గనుక.  
ఆయన యితర “దేవుళ్లందరినీ” పాలించే మహా రాజు.   
 4 లోతైన గుహలు, ఎత్తయిన పర్వతాలు యెహోవాకు చెందుతాయి.   
 5 మహా సముద్రమూ ఆయనదే ఆయనే దాన్ని సృష్టించాడు.  
దేవుడు తన స్వహస్తాలతో పొడినేలను చేశాడు.   
 6 రండి, మనం సాగిలపడి ఆయనను ఆరాధించుదాము.  
మనలను సృష్టించిన దేవున్ని మనం స్తుతిద్దాము.   
 7 ఆయన మన దేవుడు,  
మనం ఆయన ప్రజలము.  
మనం ఆయన స్వరం వింటే నేడు మనం ఆయన గొర్రెలము.   
 8 దేవుడు చెబతున్నాడు, “మెరీబా*మెరీబా నిర్గ. కా. 17:1-7 చూడండి. దగ్గర మీరు ఉన్నట్టుగా  
అరణ్యంలో మస్సా దగ్గర మీరు ఉన్నట్టుగా మొండిగా ఉండకండి.   
 9 మీ పూర్వీకులు నన్ను శోధించారు. వారు నన్ను పరీక్షించారు.  
కానీ అప్పుడు నేను ఏమి చేయగలిగానో వారు చూశారు.   
 10 ఆ ప్రజలతో 40 సంవత్సరాలు నేను సహనంగా ఉన్నాను.  
వారు నమ్మకస్తులు కారని నాకు తెలుసు.  
ఆ ప్రజలు నా ఉపదేశాలు అనుసరించటానికి నిరాకరించారు.   
 11 అందుచేత నాకు కోపం వచ్చి,  
‘వారు నా విశ్రాంతి దేశంలో ప్రవేశించరు అని ప్రమాణం చేశాను.’ ”