105
యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుము. ఆయన నామాన్ని ఆరాధించుము.
ఆయన చేసే అద్భుత కార్యాలను గూర్చి జనాలతో చెప్పు.
యెహోవాను గూర్చి పాడుము. ఆయనకు స్తుతులు పాడుము.
ఆయన చేసే అద్భుతకార్యాలు అన్నింటిని గూర్చి చెప్పు.
యెహోవా పవిత్ర నామాన్ని గూర్చి ఆతిశయించు.
యెహోవాను ఆరాధించే ప్రజలారా, మీరంతా సంతోషించండి.
బలంకోసం యెహోవా దగ్గరకు వెళ్లండి.
సహాయంకోసం ఎల్లప్పుడూ ఆయన దగ్గరకు వెళ్లండి.
యెహోవా చేసే ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి.
ఆయన అద్భుతాలను, జ్ఞానంగల నిర్ణయాలను జ్ఞాపకం చేసుకోండి.
దేవుని సేవకుడైన అబ్రాహాము సంతతివారు మీరు.
దేవుడు ఏర్పరచుకొన్న యాకోబు సంతతివారు మీరు.
యెహోవా మన దేవుడు.
యెహోవా సర్వలోకాన్నీ పాలిస్తాడు.*యెహోవా… పాలిస్తాడు అక్షరార్థముగా “ఆయన ఆజ్ఞలు ప్రపంచమంతటిలో ఉన్నవి.”
దేవుని ఒడంబడికను శాశ్వతంగా జ్ఞాపకం చేసికోండి.
1,000 తరాలవరకు ఆయన ఆదేశాలను జ్ఞాపకం ఉంచుకోండి.
దేవుడు అబ్రాహాముతో ఒక ఒడంబడిక చేసాడు.
ఇస్సాకుకు దేవుడు వాగ్దానం చేశాడు.
10 యాకోబుకు (ఇశ్రాయేలు) దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు.
ఇశ్రాయేలుతో దేవుడు తన శాశ్వత ఒడంబడిక చేసాడు.
11 “నేను నీకు కనాను దేశాన్ని ఇస్తాను, ఆ దేశం నీకు చెందుతుంది.”
అని దేవుడు చెప్పాడు.
12 అబ్రాహాము కుటుంబం చిన్నదిగా ఉన్నప్పుడు దేవుడు ఆ వాగ్దానం చేశాడు.
మరియు వారు కనానులో నివసిస్తున్న యాత్రికులు మాత్రమే.
13 దేశం నుండి దేశానికి, రాజ్యం నుండి రాజ్యానికి
వారు ప్రయాణం చేసారు.
14 కానీ యితర మనుష్యులు ఆ కుటుంబాన్ని బాధించనియ్యకుండా దేవుడు చేసాడు.
వారిని బాధించవద్దని దేవుడు రాజులను హెచ్చరించాడు.
15 “నేను ఏర్పాటు చేసుకొన్న నా ప్రజలను బాధించవద్దు.
నా ప్రవక్తలకు ఎలాంటి కీడూ చేయవద్దు.” అని దేవుడు చెప్పాడు.
16 దేవుడు ఆ దేశంలో ఒక కరువు వచ్చేటట్టు చేశాడు.
ప్రజలకు తినుటకు సరిపడినంత ఆహారం లేదు.
17 అయితే దేవుడు వారికి ముందుగా వెళ్లుటకు యోసేపు అనే మనిషిని పంపించాడు.
యోసేపు ఒక బానిసవలె అమ్మబడ్డాడు.
18 యోసేపు కాళ్లను తాళ్లతో వారు కట్టివేశారు.
అతని మెడకు వారు ఒక ఇనుప కంటె వేశారు.
19 యోసేపు చెప్పిన సంగతులు నిజంగా జరిగేంతవరకు
అతడు బానిసగా యోసేపు చెప్పింది సరియైనది అని యెహోవా సందేశం రుజువు చేసింది.
20 కనుక యోసేపును విడుదల చేయమని ఈజిప్టు రాజు ఆదేశించాడు.
అనేక మందికి అధికారిగా ఉన్న అతనిని కారాగారం నుండి వెళ్లనిచ్చాడు.
21 అతడు యోసేపును తన ఇంటికి యజమానిగా నియమించాడు.
రాజ్యంలో అన్ని విషయాలను గూర్చి యోసేపు జాగ్రత్త తీసుకొన్నాడు.
22 యోసేపు యితర నాయకులకు హెచ్చరిక ఇచ్చాడు.
పెద్ద మనుష్యులకు యోసేపు నేర్చించాడు.
23 తరువాత ఇశ్రాయేలు ఈజిప్టుకు వచ్చాడు.
యాకోబు హాము దేశంలోహాము దేశం ఈజిప్టు వారు హాము వంశస్థులని బైబులు తెలియజేస్తుంది. నివసించాడు.
24 యాకోబు కుటుంబం చాలా పెద్దది అయింది.
వారు వారి శత్రువులకంటే శక్తిగలవారయ్యారు.
25 కనుక ఈజిప్టు ప్రజలు యాకోబు వంశాన్ని ద్వేషించటం మొదలు పెట్టారు.
ఈజిప్టువారు బానిసలకు విరోధంగా పథకాలు వేయటం ప్రారంభించారు.
26 కనుక దేవుడు తన సేవకుడైన మోషేను,
తాను ఏర్పాటు చేసుకొన్న యాజకుడు అహరోనును పంపించాడు.
27 హాము దేశంలో అనేక అద్భుతాలు చేయటానికి
దేవుడు మోషే, అహరోనులను వాడుకొన్నాడు.
28 దేవుడు కటిక చీకటిని పంపించాడు.
కాని ఈజిప్టు వాళ్లు ఆయన మాట వినలేదు.
29 కనుక దేవుడు నీళ్లను రక్తంగా మార్చాడు.
వాళ్ల చేపలన్నీ చచ్చాయి.
30 ఆ దేశం కప్పలతో నింపివేయబడింది.
రాజు గదులలో కూడ కప్పలు ఉన్నాయి.
31 దేవుడు ఆజ్ఞ ఇవ్వగా జోరీగలు,
దోమలు వచ్చాయి.
అన్నిచోట్లా అవే ఉన్నాయి.
32 దేవుడు వర్షాన్ని వడగండ్లుగా చేశాడు.
ఈజిప్టువారి దేశంలో అన్ని చోట్లా అగ్ని మెరుపులు కలిగాయి.
33 ఈజిప్టువారి ద్రాక్షా తోటలను, అంజూరపు చెట్లను దేవుడు నాశనం చేశాడు.
వారి దేశంలో ప్రతి చెట్టునూ దేవుడు నాశనం చేసాడు.
34 దేవుడు ఆజ్ఞ ఇవ్వగా మిడుతలు, పచ్చిగడ్డి మిడుతలు వచ్చాయి.
అవి లెక్కింపజాలనంత విస్తారంగా ఉన్నాయి.
35 మిడుతలు, పచ్చిగడ్డి మిడుతలు దేశంలోని మొక్కలన్నింటినీ తినివేశాయి.
నేల మీద పంటలన్నింటినీ అవి తినివేశాయి.
36 అప్పుడు ఈజిప్టు దేశంలో ప్రతి మొదటి సంతానాన్నీ దేవుడు చంపేశాడు.
వారి జ్యేష్ఠ కుమారులను దేవుడు చంపివేశాడు.
37 అప్పుడు దేవుడు ఈజిప్టు నుండి తన ప్రజలను బయటకు తీసుకొని వచ్చాడు.
వారు వెండి బంగారాలు వారి వెంట తెచ్చారు.
దేవుని ప్రజలు ఎవ్వరూ తొట్రిల్లి పడిపోలేదు.
38 దేవుని ప్రజలు వెళ్లిపోవటం చూచి ఈజిప్టు సంతోషించింది.
ఎందుకంటే దేవుని ప్రజలను గూర్చి వారు భయపడ్డారు.
39 దేవుడు తన మేఘాన్ని ఒక దుప్పటిలా పరిచాడు.
రాత్రివేళ తన ప్రజలకు వెలుగు ఇచ్చుటకు దేవుడు తన అగ్నిస్తంభాన్ని ఉపయోగించాడు.
40 ప్రజలు భోజనం కోసం ఆడిగినప్పుడు దేవుడు వారికి పూరేళ్లను రప్పించాడు.
దేవుడ వారికి ఆకాశం నుండి సమృద్ధిగా రొట్టెను యిచ్చాడు.
41 దేవుడు బండను చిల్చగా నీళ్లు ఉబకుతూ వచ్చాయి.
ఎడారిలో ఒక నది ప్రవహించడం మొదలైంది.
 
42 దేవుడు తన పవిత్ర వాగ్దానం జ్ఞాపకం చేసికొన్నాడు.
దేవుడు తన సేవకుడు ఆబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసికొన్నాడు.
43 దేవుడు తన ప్రజలను ఈజిప్టునుండి బయటకు రప్పించాడు.
ప్రజలు వారి సంతోష గీతాలు పాడుతూ ఆనందంగా బయటకు వచ్చారు.
44 అప్పుడు యితరులు నివసిస్తున్న దేశాన్ని దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు.
ఇతరుల కష్టార్జితాన్ని దేవుని ప్రజలు పొందారు.
45 దేవుడు తన ప్రజలు తన న్యాయ చట్టాలకు విధేయులవుతారని ఇలా చేసాడు.
వారు ఆయన ఉపదేశములకు జాగ్రత్తగా విధేయులు కావాలని దేవుడు ఇలా చేసాడు.
 
యెహోవాను స్తుతించండి.
 

*105:7: యెహోవా… పాలిస్తాడు అక్షరార్థముగా “ఆయన ఆజ్ఞలు ప్రపంచమంతటిలో ఉన్నవి.”

105:23: హాము దేశం ఈజిప్టు వారు హాము వంశస్థులని బైబులు తెలియజేస్తుంది.