కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక
గ్రంథకర్త
పౌలు తన జీవితంలో బలహీనుడుగా అనిపిస్తున్న సమయంలో ఈ పత్రిక రాశాడు. కొరింతి సంఘం ఇబ్బందుల్లో ఉందని అతనికి తెలిసింది. స్థానిక విస్వాసుల ఐక్యతను కాపాడడానికి అతడు పూనుకున్నాడు. పౌలు ఈ లేఖ రాసినప్పుడు కొరింతు విశ్వాసుల పట్ల అతనికి ఉన్న ప్రేమను బట్టి అతడితో మనస్తాపంతో ఉన్నాడు. ఈ ఇబ్బందులు మానవపరమైన బలహీనతలేగానీ దేవుని వైపు నుండి సహాయం కూడా అతనికి అందింది. “నా కృప నీకు చాలు. బలహీనతల్లోనే నా బలప్రభావాలు పరిపూర్ణం అవుతాయి” (12:7-10). ఈ లేఖలో పౌలు తన పరిచర్యను, తన అపోస్తలిక అధికారాన్ని, తీవ్రంగా సమర్థించుకోవాల్సి వచ్చింది. దేవుని సంకల్పం మూలంగానే తాను క్రీస్తు అపోస్తలుడినని నొక్కి చెప్పడంతో పౌలు ఈ లేఖ మొదలు పెట్టాడు (1:1). అపోస్తలుని గురించీ క్రైస్తవ విశ్వాసం గురించీ ఈ లేఖ అనేక విషయాలను తెలియజేస్తున్నది.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ. 56 - 57
ఈ పత్రికను పౌలు మాసిడోనియా నుండి రాశాడు.
స్వీకర్త
కొరింతు లోని దేవుని సంఘానికి, ఆకయ (ఇది రోమ్ సామ్రాజ్యంలో ఒక పరగణా. కొరింతు దీని ముఖ్య పట్టణం) లోని వారికి పౌలు రాశాడు.
ప్రయోజనం
ఈ పత్రిక రాయడంలో పౌలు మనసులో అనేక ఉద్దేశాలు ఉన్నాయి. తాను రాసిన నిష్టురమైన పత్రిక కొరింతు క్రైస్తవులు సానుకూలంగా స్పందించిన దానికి (1:3-4; 7:8-9, 12, 13) అతడు సంతోషించాడు. ఆసియాలో తనకు వాటిల్లిన కష్టాలు వారికి తెలిపాడు (1:8-11). బాధ కలిగించినందుకు క్షమించమని కోరాడు (2:5 – 11). క్రైస్తవ పరిచర్య అనే ఉన్నతమైన పిలుపులోని నిజమైన అర్థం వారికి వివరించాడు. (2:14-7:4). ఇవ్వడం అనే సుగుణాన్ని వారికి నేర్పిస్తూ యెరుషలేములోని పేద క్రైస్తవులకు వారు ఇవ్వదలుచుకున్న కానుక పూర్తి చేయమని ప్రోత్సహించాడు (అధ్యా. 8, 9).
ముఖ్యాంశం
పౌలు తన అపోస్తలత్వాన్ని సమర్థించుకోవడం.
విభాగాలు
1. పౌలు పరిచర్య వివరణ — 1:1-7:16
2. యెరుషలేము పేదల కోసం చందా — 8:1-9:15
3. పౌలు తన అధికారాన్ని సమర్థించుకోవడం — 10:1-13:10
4. త్రిత్వ సంబంధమైన దీవెన వాక్కులతో ముగింపు — 13:11-14
1
కార్యాచరణలో పౌలు పద్ధతులు-వివరణ
కొరింతులోని దేవుని సంఘానికీ అకయ ప్రాంతమంతటా ఉన్న పరిశుద్ధులందరికీ దేవుని సంకల్పం వలన క్రీస్తు యేసు అపొస్తలుడు అయిన పౌలు, మన సోదరుడు తిమోతి రాస్తున్న విషయాలు. మన తండ్రి అయిన దేవుని నుండీ యేసు క్రీస్తు ప్రభువు నుండీ మీకు కృప, శాంతి కలుగు గాక. మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతి కలుగు గాక. ఆయన దయగల తండ్రి, అన్ని విధాలా ఆదరించే దేవుడు.
ఆయన మా కష్టాలన్నిటిలో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. దేవుడు మాకు చూపిన ఆ ఆదరణ మేమూ చూపి ఎలాంటి కష్టాల్లో ఉన్నవారినైనా ఆదరించగలిగేలా ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నాడు.
క్రీస్తు పడిన బాధలు మాలో అధికమయ్యే కొద్దీ, క్రీస్తు ఆదరణ కూడా మాలో అంతకంతకూ అధికం అవుతూ ఉంది. మాకు కష్టాలు వస్తే అవి మీ విమోచన కోసం, మీ ఆదరణ కోసం. మాకు ఆదరణ కలిగితే అది కూడా మీ ఆదరణ కోసమే. మాలాగే మీరూ పడుతున్న కష్టాలను సహించడానికి కావలసిన ఓర్పును ఈ ఆదరణ కలిగిస్తున్నది.
మీరు మా కష్టాలను ఎలా పంచుకుంటున్నారో అలాగే మా ఆదరణ కూడా పంచుకుంటున్నారని మాకు తెలుసు. అందుచేత మీ గురించి మాకు దృఢమైన ఆశాభావం ఉంది. సోదరులారా, ఆసియ ప్రాంతంలో మేము పడిన బాధలు మీకు తెలియకుండా ఉండడం మాకిష్టం లేదు. మేము బతుకుతామనే నమ్మకం లేక, మా శక్తికి మించిన భారంతో పూర్తిగా కుంగిపోయాము.
వాస్తవంగా, మాకు మరణదండన విధించినట్టు అనిపించింది. అయితే చనిపోయిన వారిని లేపే దేవుని మీద తప్ప, మా మీద మేము నమ్మకం ఉంచకుండేలా అలా జరిగింది. 10 ఆయన అలాటి భయంకరమైన ఆపద నుండి మమ్మల్నిరక్షించాడు, మళ్లీ రక్షిస్తాడు. ఆయన మీద మా నమ్మకం పెట్టుకున్నాము. మళ్ళీ మళ్ళీ ఆయన మమ్మల్ని తప్పిస్తాడు. 11 మా కోసం మీరు ప్రార్థన ద్వారా సహాయం చేస్తూ ఉంటే ఆయన దీన్ని చేస్తాడు. చాలామంది ప్రార్థనల వల్ల దేవుడు మమ్మల్ని కనికరించినందుకు ఎంతోమంది మా తరపున కృతజ్ఞత చెబుతారు.
12 మా అతిశయం ఇదే! దీనికి మా మనస్సాక్షి సాక్ష్యం. లౌకిక జ్ఞానంతో కాక దేవుడు ప్రసాదించే సదుద్దేశంతో యథార్థతతో దేవుని కృపనే అనుసరించి, లోకంలో మరి ముఖ్యంగా మీ పట్ల నడుచుకున్నాము. 13 మీరు చదివి అర్థం చేసుకోలేని సంగతులేవీ మీకు రాయడం లేదు. 14 మీరు ఇప్పటికే కొంతవరకూ మమ్మల్ని అర్థం చేసుకున్నారు. కడవరకూ అర్థం చేసుకుంటారని ఆశాభావంతో ఉన్నాం. మన యేసు ప్రభువు దినాన, మీరు మాకూ, మేము మీకూ గర్వ కారణంగా ఉంటాం. 15 ఈ నమ్మకంతో నేను మొదట మీ దగ్గరికి రావాలనుకున్నాను. దీనివలన మీకు రెండు సార్లు ప్రయోజనం కలగాలని నా ఉద్దేశం.
16 మాసిదోనియకు వెళ్తూ ఉన్నపుడు మిమ్మల్ని కలుసుకుని మాసిదోనియ నుండి మళ్ళీ మీ దగ్గరికి రావాలనీ, తరువాత మీరు నన్ను యూదయకు సాగనంపగలరనీ అనుకున్నాను. 17 నేను ఇలా ఆలోచించి చపలచిత్తంగా నడచుకున్నానా? నేను “అవును, అవును” అన్న తరువాత, “కాదు, కాదు” అంటూ లౌక్యంగా ప్రవర్తిస్తున్నానా? 18 అయితే దేవుడు నమ్మదగినవాడు. మేము, “అవును” అని చెప్పి, “కాదు” అనం. 19 నేనూ, సిల్వానూ, తిమోతీ, మీకు ప్రకటించిన దేవుని కుమారుడు యేసు క్రీస్తు “అవును” అని చెప్పి, “కాదు” అనేవానిగా ఉండలేదు. ఆయన ఎప్పుడూ, “అవును” అనేవానిగానే ఉన్నాడు. 20 దేవుని వాగ్దానాలన్నీ క్రీస్తులో, “అవును” గానే ఉన్నాయి. కాబట్టి దేవుని మహిమ కోసం ఆయన ద్వారా మనం, “ఆమెన్” అంటున్నాం.
21 క్రీస్తులో మిమ్మల్నీ మమ్మల్నీ స్థిరపరిచేది దేవుడే. ఆయనే మనలను అభిషేకించి 22 మనం తన వాళ్ళమన్న ముద్ర మనపై వేసాడు, మన హృదయాల్లో తన ఆత్మను హామీగా ఇచ్చాడు.
23 మిమ్మల్ని నొప్పించడం ఇష్టం లేక నేను కొరింతుకు మళ్ళీ రాలేదు. దీనికి దేవుడే నా సాక్షి. 24 మీ విశ్వాసం మీద పెత్తనం చెలాయించే ఉద్దేశం మాకు లేదు. మీరు మీ విశ్వాసంలో నిలిచి ఉండగా మీ ఆనందం కోసం మీతో కలిసి పని చేస్తున్నాము.