నిర్గమకాండం
గ్రంథకర్త
సంప్రదాయికంగా ఈ పుస్తకం రచయిత మోషే అని చెబుతారు. దైవ ప్రేరణతో ఈ పుస్తకం మోషే రాశాడని అంగీకరించడానికి రెండు మంచి కారణాలున్నాయి. మొదటిది, మోషే ఈ వ్రాత పనిలో ఉన్నాడని నిర్గమకాండం గ్రంథమే చెబుతున్నది. నిర్గమ 34:27 లో దేవుడు “ఈ వాక్యములను వ్రాసికొనుము” అని మోషేతో చెప్పాడు. మరొక చోట మోషే దేవుని ఆజ్ఞ పాటించి “మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి” అని ఉంది. నిర్గమ కాండంలోని మాటలను మోషే రాశాడని ఈ వచనాలను బట్టి భావించడం సమంజసమే. రెండవది, నిర్గమకాండంలో వర్ణించిన సంఘటనలన్నిటినీ మోషే చూశాడు, పాల్గొన్నాడు కూడా. అతడు ఫరో ఇంటిలో విద్యాభ్యాసం చేశాడు. ఆ విధంగా వీటిని రాయడానికి సామర్థ్యం అతనికి ఉంది.
రచనా కాలం, ప్రదేశం
ఇంచుమించు క్రీ. పూ 1450 - 1410
ఈ తేదీకి ముందు ఇశ్రాయేలీయులు తమ అపనమ్మకం మూలంగా అరణ్యప్రదేశంలో 40 సంవత్సరాలు తిరుగులాడారు. ఈ గ్రంథరచన ఈ సమయంలో జరగడానికి అవకాశం ఉంది.
స్వీకర్త
ఈజిప్టు వదిలి బయట వచ్చిన తరమే మొదటిగా ఈ గ్రంథాన్ని అందుకున్నది. (నిర్గమ 17:14; 24:4; 34:27-28).
ప్రయోజనం
ఇశ్రాయేలీయులు యెహోవా ప్రజలు ఎలా అయ్యారు, అనే వైనాన్నినిర్గమ కాండం వివరిస్తున్నది. ఆ జాతి దేవుని ప్రజలుగా జీవించేందుకు పాటించవలసిన నిబంధన నియమాలు ఇందులో వితరంగా రాసి ఉన్నాయి. ఇశ్రాయేలుతో నిబంధన స్థిరపరచిన విశ్వసనీయుడైన, మహాబలవంతుడైన, రక్షణకర్త, పవిత్రుడు అయిన దేవుణ్ణి నిర్గమకాండం ఆవిష్కరిస్తున్నది. దేవుణ్ణి నామం మూలంగా ఆయన చర్యల మూలంగా దేవుని వ్యక్తిత్వం వెల్లడి అయింది. ఇదంతా దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానం (ఆది 15:12-16). ఆయన చేసిన వాగ్దానం అబ్రహాము సంతతిని ఈజిప్టు బానిసత్వం నుండి విడిపించటంలో నేరవేరింది అని చూపించడానికే గాక ఒక కుటుంబం ఎంపిక అయిన జాతిగా ఎలా రూపొందింది అని వివరించే కథ ఇక్కడ ఉంది. (నిర్గమ 2:24; 6:5; 12:37). ఈజిప్టు విడిచి వెళ్ళిన హెబ్రీయిల సoఖ్య బహుశా 20 నుంచి 30 లక్షల వరకు ఉండవచ్చు.
ముఖ్యాంశం
విమోచనం
విభాగాలు
1. ముందు మాట — 1:1-2:25
2. ఇశ్రాయేల్ విమోచనం — 3:1-18:27
3. సీనాయి దగ్గర ఇచ్చిన మాట — 19:1-24:18
4. దేవుని రాజ మందిర గుడారం — 25:1-31:18
5. తిరుగుబాటు మూలంగా దేవుని నుండి వైదొలగడం — 32:1-34:35
6. దేవుని గుడారం కూర్పు — 35:1-40:38
1
ఇశ్రాయేలు ప్రజల దురవస్థ
1 యాకోబుతోబాటు ఐగుప్తుకు వెళ్ళిన అతని కొడుకులు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను, బెన్యామీను, 2 దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. 3 యాకోబుకు పుట్టిన సంతానం మొత్తం 70 మంది. 4 యోసేపు ఐగుప్తులో ఉన్న ఆ సమయంలో 5 వీళ్ళంతా తమ తమ కుటుంబాలతో సహా ఐగుప్తులో నివసించారు.
6 యోసేపు, అతని అన్నదమ్ములు, వాళ్ళ తరం వారు అంతా చనిపోయారు. 7 ఇశ్రాయేలు ప్రజలు వారు నివసిస్తున్న ప్రాంతమంతటా తమ సంతానంతో బాగా విస్తరించి అభివృద్ధి పొందారు. ఆ ప్రాంతమంతా ఇశ్రాయేలు ప్రజలతో నిండిపోయింది. 8 కొంతకాలానికి యోసేపు ఎవరో తెలియని కొత్త రాజు ఐగుప్తును పరిపాలించడం మొదలు పెట్టాడు.
9 అతడు తన ప్రజలతో ఇలా అన్నాడు “ఇశ్రాయేలు ప్రజలను చూడండి. వీళ్ళు మనకంటే సంఖ్యలో ఎక్కువగా, శక్తిమంతులుగా ఉన్నారు. 10 వాళ్ళ విషయంలో మనం తెలివిగా ఏదన్నా చేద్దాం. లేకపోతే వాళ్ళ జనాభా పెరిగిపోతుంది. ఒకవేళ యుద్ధం గనక వస్తే వాళ్ళు మన శత్రువులతో చేతులు కలిపి మనకి వ్యతిరేకంగా యుద్ధం చేసి ఈ దేశం నుండి వెళ్లిపోతారేమో” అన్నాడు.
11 అందుచేత వారు ఇశ్రాయేలు ప్రజలచే కఠిన బాధ చేయించి కఠినులైన అధికారులను వారి మీద నియమించాడు. ఆ అధికారులు ఫరో రాజు కోసం పీతోము, రామెసేసు అనే గిడ్డంగుల పట్టణాలను కట్టించారు. 12 ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను అణగదొక్కేకొద్దీ వారు అంతకంతకూ విస్తరిస్తూ పోవడంతో వారు ఇశ్రాయేలు ప్రజల విషయం భయాందోళనలు పెంచుకున్నారు. 13 ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలతో మరింత కష్టమైన పనులు చేయించుకున్నారు. 14 బంకమట్టి పని, ఇటుకల పని, పొలంలో చేసే ప్రతి పనీ కఠినంగా చేయించుకుని వారి ప్రాణాలు విసిగిపోయేలా చేశారు. వారు ఇశ్రాయేలు ప్రజలతో చేయించుకొనే అన్ని పనులూ కఠిన బాధతో కూడి ఉండేవి.
15 ఐగుప్తు రాజు హీబ్రూ మంత్రసానులతో మాట్లాడాడు. వారి పేర్లు షిఫ్రా, పూయా. 16 “మీరు హెబ్రీ స్త్రీలకు పురుడు పోస్తున్నప్పుడు జాగ్రత్తగా కనిపెట్టి చూడండి. మగ పిల్లవాడు పుడితే ఆ బిడ్డను చంపివేయండి, ఆడ పిల్ల అయితే బతకనియ్యండి” అన్నాడు. 17 అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్టు చేయలేదు. మగపిల్లలను చంపకుండా బతకనిచ్చారు. 18 ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి “మీరు ఇలా ఎందుకు చేశారు? మగపిల్లలను చంపకుండా ఎందుకు బతకనిచ్చారు?” అని అడిగాడు.
19 అప్పుడు ఆ మంత్రసానులు “హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలలాంటి వాళ్ళు కాదు. తెలివైనవాళ్ళు. మంత్రసాని వాళ్ళ దగ్గరికి వెళ్లకముందే ప్రసవిస్తున్నారు” అని ఫరోతో చెప్పారు. 20 మంత్రసానులు దేవునికి భయపడినందువల్ల దేవుడు వారిని దీవించాడు. ఇశ్రాయేలు ప్రజల్లో వారి సంతానం విస్తరించింది. 21 ఆయన వారి వంశాన్ని వృద్ధి చేశాడు. 22 అప్పుడు ఫరో “వారికి పుట్టిన ప్రతి మగపిల్లవాణ్ణి నైలు నదిలో పడవేయండి. ఆడపిల్లను బతకనియ్యండి” అని తన ఐగుప్తు ప్రజలకు ఆజ్ఞాపించాడు.