4
మోషేకి దేవుడిచ్చిన అద్భుత శక్తి
అప్పుడు మోషే “వాళ్ళు నన్ను నమ్మరు. నా మాట వినరు. ‘యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు’ అంటారేమో” అని జవాబిచ్చాడు.
యెహోవా “నీ చేతిలో ఉన్నది ఏమిటి?” అని మోషేను అడిగాడు. అతడు “కర్ర” అన్నాడు.
అప్పుడు దేవుడు “ఆ కర్రను నేల మీద పడవెయ్యి” అన్నాడు. అతడు దాన్ని నేల మీద పడవెయ్యగానే అది పాముగా మారిపోయింది. మోషే భయపడి దూరంగా పరిగెత్తాడు.
అప్పుడు యెహోవా “నీ చేత్తో దాని తోక పట్టుకో” అని చెప్పాడు. అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకోగానే అది అతని చేతిలో కర్రగా మారిపోయింది.
ఆయన “దీన్ని బట్టి వాళ్ళు తమ పూర్వీకుల దేవుడు యెహోవా, అంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడని నమ్ముతారు” అన్నాడు.
తరువాత యెహోవా “నీ చెయ్యి నీ అంగీలో పెట్టుకో” అన్నాడు. అతడు తన చెయ్యి అంగీలో ఉంచి బయటికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టురోగం సోకినట్టు మంచులాగా తెల్లగా మారిపోయింది.
తరువాత ఆయన “నీ చెయ్యి మళ్ళీ నీ అంగీలో ఉంచుకో” అన్నాడు. అతడు తన చెయ్యి తన అంగీలో ఉంచుకుని బయటికి తీసినప్పుడు అది అతని మిగతా శరీరంలాగా మామూలుగా అయిపోయింది.
అప్పుడు దేవుడు “వాళ్ళు నా శక్తిని కనపరిచే మొదటి అద్భుతాన్ని పట్టించుకోకుండా నమ్మకుండా ఉంటే రెండవ దాన్ని బట్టి నమ్ముతారు. ఈ రెండు అద్భుతాలను చూసి కూడా నిన్ను నమ్మకుండా నీ మాట వినకుండా ఉంటే, నువ్వు నదిలోని కొంచెం నీళ్ళు తీసుకుని ఎండిన నేల మీద కుమ్మరించు. నువ్వు నదిలో నుండి తీసి పొడి నేలపై పోసిన నీళ్లు రక్తంలాగా మారిపోతాయి” అన్నాడు.
10 మోషే “ప్రభూ, నీవు నీ దాసుడినైన నాతో మాట్లాడడానికి ముందుగానీ తరవాతగానీ ఏనాడూ నేను మాటకారిని కాను. నా నోరు, నా నాలుక మందమైనవి” అన్నాడు.
11 అప్పుడు యెహోవా “మనుషులకు నోరు ఇచ్చిన వాడు ఎవరు? మూగ వారిని, చెవిటి వారిని, చూపు గలవారిని, గుడ్డి వారిని అందరినీ పుట్టించినది ఎవరు? యెహోవానైన నేనే గదా. 12 కాబట్టి వెళ్లు, నేను నీ నోటికి తోడుగా ఉండి, నువ్వు ఏం మాట్లాడాలో నీకు చెబుతాను” అని మోషేతో చెప్పాడు.
13 మోషే “ప్రభూ, నువ్వు వేరెవరినైనా ఎన్నుకుని అతణ్ణి పంపించు” అన్నాడు. 14 అందుకు యెహోవా మోషే మీద కోపపడి “లేవీయుడైన నీ అన్న అహరోను ఉన్నాడు గదా? అతడు చక్కగా మాట్లాడగలడని నాకు తెలుసు. అంతేగాక ఇప్పుడు అతడు నిన్ను కలుసుకోవడానికి నీకు ఎదురు వస్తున్నాడు. అతడు నిన్ను బట్టి తన మనసులో సంతోషిస్తాడు. 15 నువ్వు చెప్పవలసిన మాటలు అతనితో చెప్పు. నేను నీ నోటికీ, అతని నోటికీ తోడుగా ఉంటాను. మీరిద్దరూ ఏమి చేయాలో నేను చెబుతాను. 16 అతడే నీ నోరుగా ఉండి నీకు బదులు ప్రజలతో మాట్లాడతాడు. అతనికి నువ్వు దేవుని స్థానంలో ఉన్నట్టు లెక్క. 17 ఆ చేతికర్రను పట్టుకుని దానితో ఆ అద్భుతాలన్నీ చేయాలి” అని చెప్పాడు.
మోషే ఐగుప్తుకు తిరిగి వెళ్ళడం
18 ఇది జరిగిన తరువాత మోషే తన మామ యిత్రో దగ్గరికి బయలుదేరి వెళ్ళాడు. “నువ్వు అనుమతి ఇస్తే నేను ఐగుప్తులో ఉన్న నా జనుల దగ్గరికి వెళ్తాను, వాళ్ళింకా బతికి ఉన్నారో లేదో చూసి వస్తాను” అన్నాడు. యిత్రో క్షేమంగా వెళ్ళి రమ్మని పంపించాడు. 19 అప్పుడు యెహోవా మిద్యానులో ఉన్న మోషేతో “నిన్ను చంపాలని చూసిన వాళ్ళంతా చనిపోయారు. కాబట్టి ఐగుప్తుకు తిరిగి వెళ్లు” అని చెప్పాడు. 20 మోషే తన భార్యబిడ్డలను వెంటబెట్టుకుని గాడిదపై కూర్చోబెట్టి ఐగుప్తుకు ప్రయాణమయ్యాడు. తనతోబాటు దేవుని కర్రను చేతబట్టుకుని వెళ్ళాడు.
21 అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు “నీవు ఐగుప్తుకు చేరిన తరువాత చేయడానికి నేను నీకిచ్చిన అద్భుత కార్యాలు ఫరో సమక్షంలో చెయ్యాలి, అయితే నేను అతని హృదయం కఠినం చేస్తాను. అతడు ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనివ్వడు. 22 అప్పుడు నువ్వు ఫరోతో ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలు యెహోవా సంతానం. యెహోవాపెద్ద కొడుకు. 23 నన్ను సేవించడానికి నా కుమారుణ్ణి వెళ్ళనిమ్మని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు గనక వారిని వెళ్ళనియ్యకపోతే నేను నీ కొడుకును, నీ పెద్ద కొడుకును చంపేస్తాను అని యెహోవా చెబుతున్నాడు’ అని అతనితో చెప్పాలి” అన్నాడు.
24 ప్రయాణం మధ్యలో వారు బస చేసినప్పుడు యెహోవా వారిని ఎదుర్కొని మోషేను చంపడానికి చూశాడు. 25 మోషే భార్య సిప్పోరా ఒక పదునైన రాయి తీసుకుని తన కొడుక్కి సున్నతి చేసి మర్మాంగ చర్మం కొన మోషే *మూల భాషలో ఇక్కడున్న దానికి మోషే మర్మాంగం దగ్గర తాకించింది అని అర్థం వస్తుంది.పాదాల దగ్గర పడేసింది. “నువ్వు నిజంగా నా రక్తసంబంధమైన భర్తవి” అని చెప్పింది. 26 అప్పుడు యెహోవా అతణ్ణి విడిచిపెట్టాడు. అప్పుడు ఆమె “ఈ సున్నతిని బట్టి నువ్వు నాకు రక్తసంబంధమైన భర్తవయ్యావు” అంది.
27 మోషేను కలుసుకోవడానికి ఎడారికి వెళ్ళమని యెహోవా అహరోనుతో చెప్పాడు. అతడు వెళ్లి దేవుని పర్వతం దగ్గర మోషేను కలుసుకుని అతణ్ణి ముద్దు పెట్టుకున్నాడు. 28 అప్పుడు మోషే యెహోవా తనను పంపిన సంగతిని చెప్పమన్న మాటలన్నిటినీ, ఆయన చేయమని ఆజ్ఞాపించిన అద్భుత క్రియలన్నిటినీ గూర్చి అహరోనుకు తెలియజేశాడు.
29 తరువాత మోషే అహరోనులు వెళ్లి ఇశ్రాయేలు ప్రజల పెద్దలందరినీ సమావేశ పరిచారు. 30 మోషేతో యెహోవా చెప్పిన మాటలన్నిటినీ వారికి అహరోను వివరించాడు. ప్రజలందరి ఎదుటా అద్భుత క్రియలను జరిగించినప్పుడు అందరూ వారి మాటలు నమ్మారు. 31 యెహోవా తమ బాధలను కనిపెట్టి తమను దర్శించాడని విన్న ఇశ్రాయేలు ప్రజలు తలలు వంచుకుని ఆయనను ఆరాధించారు.

*4:25 మూల భాషలో ఇక్కడున్న దానికి మోషే మర్మాంగం దగ్గర తాకించింది అని అర్థం వస్తుంది.