41
ఫరో కలలు
రెండు సంవత్సరాల తరువాత ఫరోకు ఒక కల వచ్చింది. అందులో అతడు నైలు నది దగ్గర నిలబడ్డాడు. పుష్టిగా ఉన్న అందమైన ఏడు ఆవులు నైలు నదిలో నుండి పైకి వచ్చి జమ్ముగడ్డిలో మేస్తున్నాయి. వాటి తరువాత వికారంగా, బక్కచిక్కిన ఏడు ఆవులు నైలు నదిలో నుండి పైకి వచ్చి ఆ ఆవుల దగ్గర నది ఒడ్డున నిలబడ్డాయి. అప్పుడు అందవిహీనమైనవీ చిక్కిపోయినవీ అయిన ఆవులు అందమైన బలిసిన ఆవులను తినేశాయి. దాంతో ఫరో నిద్రలేచాడు. అతడు నిద్రపోయి రెండవసారి కల కన్నాడు. అందులో మంచి పుష్టిగల ఏడు కంకులతో ఉన్న కాడ పైకి వచ్చింది. తూర్పుగాలి వల్ల పాడైపోయిన ఏడు తాలు కంకులు వాటి తరువాత మొలిచాయి.
అప్పుడు నిండైన పుష్టిగల ఆ ఏడు కంకులను ఆ తాలుకంకులు మింగివేశాయి. అంతలో ఫరో మేలుకుని అది కల అని గ్రహించాడు. ఉదయాన్నే అతని మనస్సు కలవరపడింది కాబట్టి అతడు ఐగుప్తు శకునగాళ్ళందరినీ అక్కడి పండితులందరిని పిలిపించి తన కలలను వివరించి వారితో చెప్పాడు గాని ఫరోకు వాటి అర్థం చెప్పే వాడెవడూ లేడు.
అప్పుడు గిన్నె అందించేవారి నాయకుడు “ఈ రోజు నా తప్పు గుర్తుకు వచ్చింది. 10 ఫరో తన సేవకుల మీద కోపపడి నన్నూ రొట్టెలు చేసేవారి నాయకుడినీ రాజు అంగరక్షకుల అధిపతి ఇంట్లో కావలిలో ఉంచాడు. 11 ఒకే రాత్రి నేనూ అతడు కలలు కన్నాము. ఒక్కొక్కడు వేర్వేరు అర్థాలతో కలలు కన్నాము. 12 అక్కడ రాజ అంగ రక్షకుల అధిపతికి సేవకుడిగా ఉన్న ఒక హెబ్రీ యువకుడు మాతో కూడ ఉన్నాడు. అతనితో మా కలలను మేము వివరించి చెబితే అతడు వాటి అర్థాన్ని మాకు తెలియచేశాడు. 13 అతడు మాకు ఏమి చెప్పాడో దాని ప్రకారమే జరిగింది. నా ఉద్యోగం నాకు మళ్ళీ ఇప్పించి వేరేవాడిని ఉరి తీయించారు” అని ఫరోతో చెప్పాడు.
14 ఫరో యోసేపును పిలిపించాడు. చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించారు. అతడు క్షవరం చేసుకుని బట్టలు మార్చుకుని ఫరో దగ్గరికి వచ్చాడు.
15 ఫరో యోసేపుతో “నేనొక కల కన్నాను. దాని అర్థం చెప్పేవారు ఎవరూ లేరు. నువ్వు కలను వింటే దాని అర్థాన్ని తెలియచేయగలవని నిన్నుగూర్చి విన్నాను” అన్నాడు. 16 యోసేపు “అది నావలన కాదు, దేవుడే ఫరోకు అనుకూలమైన సమాధానం ఇస్తాడు” అని ఫరోతో చెప్పాడు.
17 అందుకు ఫరో “నా కలలో నేను ఏటి ఒడ్డున నిలబడ్డాను. 18 బలిసిన, అందమైన ఏడు ఆవులు ఏటిలోనుండి పైకివచ్చి జమ్ముగడ్డిలో మేస్తున్నాయి. 19 నీరసంగా చాలా వికారంగా చిక్కిపోయిన మరి ఏడు ఆవులు వాటి తరువాత పైకి వచ్చాయి. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశంలో ఎక్కడా నాకు కనబడలేదు. 20 చిక్కిపోయి వికారంగా ఉన్న ఆవులు బలిసిన మొదటి ఏడు ఆవులను తినేశాయి. 21 అవి వాటి కడుపులో పడ్డాయి గాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు, మొదట ఉన్నట్లే అవి చూడ్డానికి వికారంగా ఉన్నాయి. అంతలో నేను మేలుకున్నాను. 22 నా కలలో నేను చూస్తే, పుష్టిగల ఏడు మంచి వెన్నులు ఒక్క కంకికి పుట్టాయి. 23 తూర్పు గాలిచేత చెడిపోయి, ఎండిన ఏడు పీలవెన్నులు వాటి తరువాత మొలిచాయి. 24 ఈ పీలవెన్నులు ఆ మంచి వెన్నులను మింగివేశాయి. ఈ కలను పండితులకు తెలియచేశాను గాని దాని అర్థాన్ని తెలియచేసే వారెవరూ లేరు” అని అతనితో చెప్పాడు.
25 అందుకు యోసేపు “ఫరో కనిన కల ఒక్కటే. దేవుడు తాను చేయబోయేది ఫరోకు తెలియచేశాడు. ఆ ఏడు మంచి ఆవులు, ఏడేళ్ళు. 26 ఆ ఏడు మంచికంకులు ఏడేళ్ళు. 27 కల ఒక్కటే. వాటి తరువాత చిక్కిపోయి వికారంగా పైకి వచ్చిన ఏడు ఆవులూ ఏడేళ్ళు. తూర్పు గాలి చేత చెడిపోయిన ఏడు తాలువెన్నులు, ఏడేళ్ళ కరువు. 28 నేను ఫరోతో చెప్పే మాట ఇదే. దేవుడు తాను చేయబోయేది ఫరోకు చూపించాడు. 29 ఇదిగో ఐగుప్తు దేశమంతటా చాలా సమృద్ధిగా పంట పండే ఏడేళ్ళు రాబోతున్నాయి. 30 వాటి తరువాత ఏడేళ్ళ కరువు వస్తుంది. అప్పుడు ఆ పంట సమృద్ధినంతా ఐగుప్తు దేశం మరచిపోతుంది. ఆ కరువు దేశాన్ని నాశనం చేస్తుంది. 31 దాని తరువాత వచ్చే కరువుచేత దేశంలో ఆ పంట సమృద్ధి జ్ఞాపకంలో లేకుండా పోతుంది. ఆ కరువు చాలా భారంగా ఉంటుంది. 32 ఈ పని దేవుడే నిర్ణయించాడు. దీన్ని దేవుడు చాలా త్వరగా జరిగిస్తాడు. అందుకే ఆ కల ఫరోకు రెండుసార్లు వచ్చింది.
33 కాబట్టి ఫరో వివేకమూ జ్ఞానమూ ఉన్నమనిషిని వెతికి ఐగుప్తు దేశం మీద అతన్ని నియమించాలి. 34 ఫరో అలా చేసి ఈ దేశం మీద పర్యవేక్షకులను నియమించి, సమృద్ధిగా పంట పండే ఏడేళ్ళలో ఐగుప్తు దేశమంతటా అయిదో భాగం తీసుకోవాలి. 35 వారు రాబోయే ఈ మంచి సంవత్సరాల్లో దొరికే ఆహారమంతా సమకూర్చాలి. ఆ ధాన్యాన్ని ఫరో ఆధీనంలో ఉంచి, పట్టణాల్లో భద్రం చేయాలి. 36 కరువు వలన ఈ దేశం నశించి పోకుండా ఆ ధాన్యం ఐగుప్తు దేశంలో రాబోయే ఏడేళ్ళ కరువు కాలంలో సిద్ధంగా ఉంటుంది” అని ఫరోతో చెప్పాడు.
37 ఈ సలహా ఫరోకూ అతని పరివారమందరి దృష్టికీ నచ్చింది. 38 ఫరో తన పరివారంతో “ఇతనిలాగా దేవుని ఆత్మ ఉన్నవాడు మనకు దొరుకుతాడా?” అన్నాడు. 39 ఫరో, యోసేపుతో “దేవుడు ఇదంతా నీకు తెలియచేశాడు కాబట్టి నీలాగా వివేకమూ జ్ఞానమూ ఉన్న వారెవరూ లేరు. 40 నువ్వు నా భవనంలో అధికారిగా ఉండాలి. నా ప్రజలంతా నీకు లోబడతారు. సింహాసనం విషయంలోనే నేను నీకంటే పైవాడిగా ఉంటాను” అన్నాడు. 41 ఫరో “చూడు, ఐగుప్తు దేశమంతటి మీద నేను నిన్ను నియమించాను” అని యోసేపుతో చెప్పాడు. 42 ఫరో తన చేతికి ఉన్న తన రాజముద్ర ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి పెట్టాడు. శ్రేష్ఠమైన బట్టలు అతనికి తొడిగించి, అతని మెడలో బంగారు గొలుసు వేశాడు. 43 తన రెండవ రథంలో అతన్ని ఎక్కించాడు. కొందరు అతని ముందు నడుస్తూ “నమస్కారం చేయండి” అని కేకలు వేశారు. ఐగుప్తు దేశమంతటి మీదా ఫరో అతన్ని నియమించాడు.
44 ఫరో యోసేపుతో “నేను ఫరోని. నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశమంతటా ఎవరూ తన చేతిని కానీ కాలిని కానీ ఎత్తకూడదు” అన్నాడు. 45 ఫరో, యోసేపుకు “జఫనత్ పనేహు” అని పేరు పెట్టాడు. అతనికి ఓను అనే పట్టణ యాజకుడైన పోతీఫెర కూతురు ఆసెనతుతో పెళ్ళిచేశాడు. 46 యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుటికి వచ్చినప్పుడు ముప్ఫై ఏళ్లవాడు. యోసేపు ఫరో దగ్గరనుండి బయలుదేరి ఐగుప్తు దేశమంతటా తిరిగాడు. 47 సమృద్ధిగల ఏడేళ్ళలో భూమి చాలా విరివిగా పండింది. 48 ఐగుప్తు దేశంలోని ఏడేళ్ళ ధాన్యమంతా అతడు సమకూర్చి, పట్టణాల్లో దాన్ని నిల్వ చేశాడు. ఏ పట్టణం చుట్టూ ఉన్న పొలాల ధాన్యం ఆ పట్టణంలోనే నిల్వచేశాడు. 49 యోసేపు సముద్రపు ఇసుకంత విస్తారంగా ధాన్యాన్ని నిలవ చేశాడు. అది కొలతకు మించిపోయింది కాబట్టి దాన్నిక కొలవడం మానుకున్నారు.
50 కరువు కాలం ముందే యోసేపుకు ఇద్దరు కొడుకులు పుట్టారు. ఓను పట్టణ యాజకుడైన పోతీఫెర కూతురు ఆసెనతు వారికి తల్లి. 51 అప్పుడు యోసేపు “దేవుడు నా కష్టాన్నంతా మా నాన్న ఇంట్లో వారందరినీ నేను మరచిపోయేలా చేశాడు” అని తన పెద్దకొడుక్కి “*మరచిపోయేలా.మనష్షే” అనే పేరు పెట్టాడు. 52 “నేను బాధ అనుభవించిన దేశంలో దేవుడు నన్ను ఫలవంతం చేశాడు” అని రెండో కొడుక్కి “ద్విగుణీకృతము. రెండింతలు చెయ్యడం.ఎఫ్రాయిము” అనే పేరు పెట్టాడు. 53 ఐగుప్తు దేశంలో సమృద్ధిగా పంట పండిన ఏడేళ్ళు గడిచిపోయాయి. 54 యోసేపు చెప్పిన ప్రకారం ఏడేళ్ళ కరువు మొదలయింది గాని ఐగుప్తు దేశమంతటా ఆహారముంది.
55 ఐగుప్తు దేశమంతటా కరువు వచ్చినప్పుడు ఆ దేశప్రజలు ఆహారం కోసం ఫరోకు మొరపెట్టుకున్నారు. అప్పుడు ఫరో “మీరు యోసేపు దగ్గరికి వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయండి” అని ఐగుప్తీయులందరితో చెప్పాడు. 56 ఆ ప్రదేశమంతా కరువు వ్యాపించింది. యోసేపు గిడ్డంగులన్నీ విప్పించి ఐగుప్తీయులకు ధాన్యం అమ్మాడు. ఐగుప్తు దేశంలో ఆ కరువు తీవ్రంగా ఉంది. 57 ఆ కరువు లోకమంతా తీవ్రంగా ఉండడం వల్ల లోకమంతా యోసేపు దగ్గర ధాన్యం కొనడానికి ఐగుప్తుకు వచ్చింది.

*41:51 మరచిపోయేలా.

41:52 ద్విగుణీకృతము. రెండింతలు చెయ్యడం.