10
 1 ఇశ్రాయేలు గుబురుగా పెరిగిన ద్రాక్ష చెట్టుతో సమానం.  
వారి ఫలం విరగ గాసింది.  
ఫలించినకొద్దీ వారు బలిపీఠాలను మరి ఎక్కువగా కట్టుకున్నారు.  
తమ భూమి సారవంతమైన కొద్దీ,  
వారు తమ దేవతా స్థంభాలను మరి విశేషంగా నిర్మించారు.   
 2 వారి హృదయం కపటమైనది,  
వారు త్వరలోనే తమ అపరాధానికి శిక్ష పొందుతారు.  
యెహోవా వారి బలిపీఠాలను కూల్చేస్తాడు.  
వారి దేవతా స్థంభాలను ధ్వంసం చేస్తాడు.   
 3 వాళ్ళిలా అంటారు. “మనకు రాజు లేడు, మనం యెహోవాకు భయపడం.  
రాజు మనకేమి చేస్తాడు?”   
 4 వారు శుష్కప్రియాలు వల్లిస్తారు.  
అబద్ధ ప్రమాణాలతో ఒప్పందాలు చేస్తారు.  
అందువలన నాగటి చాళ్లలో విషపు మొక్కలాగా దేశంలో వారి తీర్పులు మొలుస్తున్నాయి.   
 5 బేతావెనులో ఉన్న దూడల విషయమై దాని ప్రజలు భయపడతారు.  
దాని వైభవం పోయిందని ప్రజలు, సంతోష పడుతూ వచ్చిన దాని అర్చకులు దుఃఖిస్తారు.   
 6 వారు గొప్ప రాజుకు కానుకగా అష్షూరు దేశంలోకి బందీలుగా వెళ్ళిపోతారు.  
ఎఫ్రాయిము అవమానం పాలవుతుంది.  
ఇశ్రాయేలు వారు విగ్రహాల మాటలు విన్నందుకు సిగ్గు పడతారు.   
 7 షోమ్రోను రాజు నాశనమైపోతాడు. నీళ్లలో కొట్టుకు పోయే పుడకలాగా ఉంటాడు.   
 8 ఇశ్రాయేలు వారి పాపానికి ప్రతిరూపాలైన ఆవెనులోని ఎత్తయిన పూజా స్థలాలు నాశనం అవుతాయి.  
వారి బలిపీఠాల మీద ముళ్ళ కంప పెరుగుతుంది.  
పర్వతాలతో “మమ్మల్ని కప్పండి” అనీ,  
కొండలను చూసి “మా మీద పడండి” అనీ వారు చెబుతారు.   
 9 ఇశ్రాయేలూ, గిబియా దినాల నుండి నీవు పాపం చేస్తూ వచ్చావు.  
వారు అక్కడ ఉండిపోయారు.  
గిబియాలో ఉన్న దుర్మార్గుల మీదికి యుద్ధం ముంచుకు రాలేదా?   
 10 నేను అనుకున్నప్పుడు వారిని శిక్షిస్తాను.  
వారు చేసిన రెండింతల దోషక్రియలకు నేను వారిని బంధించినప్పుడు,  
అన్యప్రజలు సమకూడి వారి మీదికి వస్తారు.   
 11 ఎఫ్రాయిము కంకులు నూర్చడంలో నైపుణ్యం సంపాదించిన పెయ్య.  
అయితే దాని నున్నని మెడకు నేను కాడి కడతాను.  
ఎఫ్రాయిము పొలం దున్నుతాడు.  
యూదా భూమిని దున్నుతాడు.  
యాకోబు దాన్ని చదును చేస్తాడు.   
 12 మీ కోసం నీతి విత్తనం వేయండి.  
నిబంధన విశ్వాస్యత అనే కోత కోయండి.  
ఇదివరకెప్పుడూ దున్నని బీడుభూమి దున్నండి.  
ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతివర్షం కురిపించే వరకూ,  
యెహోవాను వెదకడానికి ఇదే అదను.   
 13 నీవు దుర్మార్గం అనే పంటకోసం దుక్కి దున్నావు.  
పాపమనే కోత కోసుకున్నావు.  
ఎందుకంటే నీ పథకాలపై ఆధారపడ్డావు.  
నీకున్న అసంఖ్యాకమైన సైనికులను నమ్ముకున్నావు.   
 14 నీ ప్రజల మధ్య అల్లరి రేగుతుంది.  
ప్రాకారాలు గల నీ పట్టణాలన్నీ పాడైపోతాయి.  
షల్మాను రాజు యుద్ధం చేసి బేతర్బేలును పాడు చేసినట్టు అది ఉంటుంది.  
పిల్లలతో సహా తల్లులను నేలకేసి కొట్టి చంపినట్టు అది ఉంటుంది.   
 15 ఇలా మీరు చేసిన ఘోరమైన దుష్టక్రియలను బట్టి బేతేలూ, నీకు నాశనం ప్రాప్తిస్తుంది.  
ప్రాతఃకాలాన ఇశ్రాయేలు రాజును పూర్తిగా నిర్మూలం చేస్తారు.