5
“ఒక వ్యక్తి తాను చూసిన దాన్ని గానీ, విన్న దాన్ని గానీ సాక్ష్యం చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు సాక్ష్యం చెప్పకుండా పాపం చేస్తే దానికి ఆ వ్యక్తే బాధ్యత వహించాలి. ఇంకా ఒక వ్యక్తి దేవుడు అపవిత్రమని నిర్దేశించిన ఏ అశుద్ధ జంతువు కళేబరాన్ని గానీ, పశువు కళేబరాన్ని గానీ, పాకే జంతు కళేబరాన్ని గానీ తెలియక తాకితే ఆ వ్యక్తి అపవిత్రుడూ, అపరాధీ అవుతాడు.
ఒక వ్యక్తిని అపవిత్రం చేసిన వాటిని అది ఏదైనా సరే, తాకిన వ్యక్తి ఆ అపవిత్రతను తాకానని తెలుసుకున్న తరువాత అపరాధి అవుతాడు. అలాగే ఎవరైనా తెలియకుండా తొందరపడి మంచైనా, చెడైనా చేస్తానని ఒట్టు పెట్టి ప్రమాణం చేసినా, తెలియకుండా తొందరపడి ఏదైనా చేస్తానని ఒట్టు పెట్టి ప్రమాణం చేసినా ఆ తరువాత తెలుసుకుని చేయకుండా ఉంటే ఆ విషయంలో అతడు అపరాధి అవుతాడు.
వీటిలో ఏ విషయంలోనైనా అతడు అపరాధి అయితే తాను ఎలాంటి పాపం చేశాడో దాన్ని ఒప్పుకోవాలి. తాను చేసిన అపరాధం కోసం బలి అర్పణను యెహోవా సమక్షంలోకి తీసుకురావాలి. దానికోసం తన మందలోనుండి ఆడమేకనైనా, ఆడగొర్రెనైనా పాపం కోసం బలిగా అర్పించాలి. అతని పాపం కోసం యాజకుడు పరిహారం చేస్తాడు.
ఒకవేళ అతనికి గొర్రెని తెచ్చే స్తోమత లేకపోతే తన పాపం కోసం అపరాధ బలి అర్పణగా రెండు గువ్వలను గానీ, రెండు పావురం పిల్లలను గానీ తీసుకు రావచ్చు. వాటిలో ఒకటి పాపం కోసం చేసే అర్పణ, మరొకటి దహనబలి కోసం. అతడు వాటిని యాజకుడి దగ్గరికి తీసుకురావాలి. యాజకుడు మొదట ఒకదాన్ని పాపం కోసం బలిగా అర్పిస్తాడు. అతడు దాని తలను తుంచి వేస్తాడు కానీ పూర్తిగా వేరు చేయడు. అతడు కొంత రక్తాన్ని బలిపీఠం పక్కన చిలకరించాలి. మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగున కుమ్మరించాలి. ఇది పాపం కోసం చేసే బలి.
10 తరువాత ఆదేశాల్లో చెప్పినట్టు రెండో పక్షిని దహనబలిగా అర్పించాలి. అతడు చేసిన పాపం కోసం యాజకుడు పరిహారం చేస్తాడు. అప్పుడు అతనికి క్షమాపణ కలుగుతుంది.
11 ఒకవేళ అతనికి రెండు గువ్వలను, రెండు పావురం పిల్లలను కొని తెచ్చే స్తోమతు లేకపోతే, అతడు తన పాపం కోసం అర్పణగా ఒక *ఒక ఎయిఫా.కిలో సన్నని గోదుమ పిండిని తీసుకురావాలి. అది పాపం కోసం చేసే అర్పణ కాబట్టి దాని మీద నూనె పోయకూడదు, ఎలాంటి సాంబ్రాణి వేయకూడదు.
12 అతడు యాజకుని దగ్గరికి దాన్ని తీసుకురావాలి. అప్పుడు యాజకుడు యెహోవా మంచితనం గూర్చి కృతజ్ఞతాపూర్వకంగా జ్ఞాపకం చేసుకోడానికి దానిలో నుండి ఒక గుప్పెడు స్మృతి చిహ్నంగా తీసి యెహోవాకి దహనబలి అర్పించే చోట దహించాలి. అది పాపం కోసం చేసే బలి అర్పణ. 13 పైన చెప్పిన వాటిలో అతడు చేసిన పాపాన్ని యాజకుడు కప్పివేస్తాడు. అప్పుడు అతనికి క్షమాపణ కలుగుతుంది. నైవేద్యం అర్పణలో మిగిలినది యాజకునికి చెందినట్టుగా ఇక్కడ కూడా అర్పణ చేయగా మిగిలినది యాజకునికి చెందుతుంది.”
అపరాధ బలి
14 తరువాత యెహోవా మోషేకు ఇంకా ఇలా చెప్పాడు. 15 “ఒక వ్యక్తి యెహోవాకు అర్పితమైన వాటిని ముందు పొరపాటుగా ఆయనకు చెల్లించకుండా తెలియక ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తే, అప్పుడు అతడు తన అపరాధ బలి అర్పణను యెహోవా దగ్గరికి తీసుకు రావాలి. అతడు తన దోషం కోసమైన బలి. పరిహారం చెల్లించే బలి.అపరాధ బలిగా మందలో నుండి లోపం లేని పొట్టేలును తీసుకురావాలి. ఆ పొట్టేలు విలువను ప్రత్యక్ష గుడారంలో చెలామణీ అయ్యే వెండితో నిర్ణయించాలి. 16 పరిశుద్ధమైన వస్తువు విషయంలో తాను చేసిన తప్పుకు నష్ట పరిహారం చెల్లించాలి. దానికి ఐదో వంతు చేర్చి దాన్ని యాజకుడికి ఇవ్వాలి. అప్పుడు యాజకుడు అపరాధ బలి అర్పణ అయిన పొట్టేలుతో అతని కోసం పరిహారం చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తికి క్షమాపణ కలుగుతుంది.
17 ఎవరైనా చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన దాన్ని చేసి పాపం చేస్తే, అది పొరపాటుగా చేసినా అపరాధి అవుతాడు. దానికి శిక్ష పొందుతాడు. 18 అతడు తన అపరాధ బలి అర్పణగా మందలో నుండి లోపం లేని పొట్టేలును తీసుకు రావాలి. దాని ప్రస్తుత వెల నిర్ణయం జరగాలి. దాన్ని అపరాధ బలి అర్పణగా యాజకుడి దగ్గరికి తీసుకురావాలి. అప్పుడు యాజకుడు పొరపాటుగా ఆ వ్యక్తి చేసిన పాపం కోసం పరిహారం చేస్తాడు. అప్పుడు అతనికి క్షమాపణ కలుగుతుంది. 19 అది అపరాధబలి. అతడు నిజంగానే యెహోవా ఎదుట దోషి అయ్యాడు.”

*5:11 ఒక ఎయిఫా.

5:15 దోషం కోసమైన బలి. పరిహారం చెల్లించే బలి.