12
పరిసయ్యుల పొంగజేసే పదార్థం గురించి హెచ్చరిక
మార్కు 8:14-21
అంతలో వేలకొద్దీ ప్రజలు పోగయి ఒకరినొకరు తొక్కుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆయన మొదట తన శిష్యులతో ఇలా చెప్పనారంభించాడు.
“పరిసయ్యుల పులిసిన పిండిని గురించి అంటే వారి వేషధారణ విషయం జాగ్రత్త పడండి. కప్పి పెట్టింది ఏదీ బట్టబయలు కాకపోదు. రహస్యమైనదేదీ తెలియకుండా ఉండదు. అందుకని మీరు చీకటిలో మాట్లాడేవి వెలుగులో వినబడతాయి. గదుల్లో చెప్పుకునేవి ఇంటి కప్పుల పైన చాటిస్తారు.
నా స్నేహితులైన మీకు నేను చెప్పేదేమిటంటే దేహాన్ని చంపడం మినహా మరేమీ చేయలేని వాడికి భయపడవద్దు. ఎవరికి మీరు భయపడాలో చెబుతాను. చంపిన తరువాత నరకంలో పడవేసే శక్తి గల వాడికి భయపడండి. ఆయనకే భయపడమని మీకు చెబుతున్నాను.
ఐదు పిచ్చుకలను రెండు కాసులకు అమ్ముతారు కదా. అయినా వాటిలో ఒక్కదాన్ని కూడా దేవుడు మర్చిపోడు. మీ తలవెంట్రుకలన్నిటికీ లెక్క ఉంది. భయపడకండి. మీరు ఎన్నో పిచ్చుకల కంటే విలువైన వారు కదా.
ఇంకా మీతో చెప్పేదేమిటంటే, నన్ను మనుషుల ముందు ఎవరు అంగీకరిస్తాడో వాణ్ణి మనుష్య కుమారుడు దేవుని దూతల ముందు అంగీకరిస్తాడు. మనుషుల ముందు నేనెవరో తెలియదు అనే వారి గురించి నేను కూడా దేవుని దూతల ముందు వారెవరో నాకు తెలియదు అని చెబుతాను. 10 మనుష్య కుమారుడికి వ్యతిరేకంగా ఏదన్నా మాట అనే వాడికి పాపక్షమాపణ కలుగుతుంది గానీ పరిశుద్ధాత్మను దూషిస్తే వాడికి క్షమాపణ లేదు.
11 వారు సమాజమందిరాల్లో పెద్దల దగ్గరకూ అధిపతుల దగ్గరకూ అధికారుల దగ్గరకూ మిమ్మల్ని తీసుకు వెళ్ళేటప్పుడు అక్కడ ఎలా జవాబివ్వాలా, ఏం మాట్లాడాలా అని చింత పడవద్దు. 12 మీరు ఏం చెప్పాలో ఆ సమయంలోనే పరిశుద్ధాత్మ మీకు నేర్పిస్తాడు.”
13 ఆ జనసమూహంలో ఒకడు, “ఉపదేశకా, వారసత్వంగా వచ్చిన ఆస్తిలో నాకు భాగం పంచమని మా అన్నయ్యతో చెప్పండి” అన్నాడు. 14 అందుకు ఆయన, “ఏమయ్యా, మీ మీద పెద్దమనిషిగా మధ్యవర్తిగానో నన్నెవరు నియమించారు?” అన్నాడు. 15 ఆయన ఇంకా వారితో ఇలా అన్నాడు, “మీరు అత్యాశకు చోటివ్వకండి. జీవం అంటే సంపదలు విస్తరించడం కాదు.”
తెలివిలేని ధనికుని ఉపమానం
16 తరువాత ఆయన వారికి ఈ ఉపమానం చెప్పాడు. “ఒక ధనవంతుడి భూమి బాగా దిగుబడి ఇచ్చింది. 17 అప్పుడు అతడు ఇలా ఆలోచించాడు, ‘నా పంట సమకూర్చుకోడానికి నాకు స్థలం చాలదు. కాబట్టి నేనేం చేయాలి? ఇలా చేస్తాను. 18 నా గిడ్డంగులు పడగొట్టి ఇంకా పెద్దవి కట్టిస్తాను. వాటిలో నా ధాన్యమంతటినీ, నా ఆస్తి అంతటినీ నిల్వ చేస్తాను. 19 అప్పుడు నా ప్రాణంతో ‘ప్రాణమా, ఎన్నో సంవత్సరాలకు సరిపడే తరగని ఆస్తి నీ కోసం సమకూర్చాను. సుఖపడు, తిను, తాగు, సంతోషంగా ఉండు’ అని చెబుతాను’ అనుకున్నాడు. 20 అయితే దేవుడు అతడితో, ‘మూర్ఖుడా! ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను. నువ్వు కూడబెట్టినవి ఎవరివి అవుతాయి?’ అని అతనితో అన్నాడు.
21 దేవుని విషయంలో ధనవంతుడు కాకుండా తన కోసమే సమకూర్చుకునే వాడు అలాగే ఉంటాడు” అన్నాడు.
22 తరువాత యేసు తన శిష్యులతో ఇలా చెప్పాడు, “అందుచేత ఏం తింటామని మీ ప్రాణం కోసమో, ఏం కట్టుకుంటామని మీ శరీరం కోసమో మధన పడవద్దు. 23 ఆహారం కంటే ప్రాణం, వస్త్రం కంటే దేహం గొప్పవి కావా? 24 కాకుల గురించి ఆలోచించండి. అవి విత్తనాలు చల్లవు, కోయవు, వాటికి గిడ్డంగులూ, కొట్లూ లేవు. అయినా వాటిని దేవుడు పోషిస్తున్నాడు. మీరు పక్షులకంటే ఎంతో ఉన్నతమైన వారు. 25 పైగా మీలో ఎవడు చింత పడడం వల్ల తన ఎత్తును ఒక మూరెడు ఎక్కువ చేసుకోగలడు? 26 కాబట్టి చిన్న చిన్న విషయాలే మీరు చేయలేకపోతే పెద్దవాటిని గురించి ఆలోచించడం ఎందుకు? పువ్వులు ఎలా పూస్తున్నాయో చూడండి. 27 అవి కష్టపడవు, బట్టలు నేయవు. అయినా తన వైభవమంతటితో సహా సొలొమోనుకున్న అలంకరణ ఈ పూలలో ఏ ఒక్కదాని అలంకరణకీ సరి తూగదని మీకు చెబుతున్నాను.
28 అల్ప విశ్వాసులారా, ఈ వేళ పొలంలో ఉండి, రేపు పొయ్యిలో వేసే అడవి గడ్డినే దేవుడిలా అలంకరిస్తే మీకు మరి ఎంతో ఖాయంగా బట్టలిస్తాడు గదా. 29 ఏం తింటాం, ఏం తాగుతాం అని దిగులు పెట్టుకోకండి. చింతించకండి. 30 లోకులు వీటిని వెతుకుతారు. ఇవి మీకు కావాలని మీ తండ్రికి తెలుసు. 31 మీరు మాత్రం ఆయన రాజ్యాన్ని వెదకండి. దానితోపాటుగా ఇవి కూడా మీకు లభిస్తాయి.
32 చిన్న మందా, భయపడకండి. మీకు రాజ్యాన్నివ్వడం మీ తండ్రికి ఇష్టం. 33 మీకు ఉన్నవాటిని అమ్మి దాన ధర్మాలు చేయండి. పరలోకంలో పాతగిలిపోని డబ్బు సంచులనూ, నాశనం కాని ధనాన్నీ సంపాదించుకోండి. అక్కడికి దొంగ రాడు, పురుగు పట్టదు. 34 మీ డబ్బు ఎక్కడ ఉంటుందో మీ హృదయం అక్కడే ఉంటుంది.
రెండవ రాకకు సంబంధించిన ఉపమానాలు, హెచ్చరికలు
మత్తయి 24:37-25:30
35 “మీ నడుము బిగించుకుని ఉండండి. మీ దీపాలు వెలుగుతూ ఉండనివ్వండి. 36 యజమాని ఎప్పుడు వస్తాడో అని అతని కోసం ఎదురు చూస్తూ అతడు పెండ్లి విందు నుండి వచ్చి తలుపు కొట్టగానే తలుపు తీసే సేవకుల్లా ఉండండి.
37 యజమాని వచ్చి ఏ సేవకులు మెలకువగా ఉండడం చూస్తాడో ఆ దాసులు ధన్యులు. అప్పుడు అతడు తన నడుం కట్టుకుని వారిని భోజనానికి కూర్చోబెట్టి, వారికి తానే పరిచర్య చేస్తాడని మీకు కచ్చితంగా చెబుతున్నాను. 38 అతడు రాత్రి రెండవ జాములో వచ్చినా, మూడవ జాములో వచ్చినా ఏ సేవకులు మెలకువగా ఉండడం చూస్తాడో ఆ సేవకులు ధన్యులు. 39 దొంగ ఏ సమయంలో వస్తాడో ఇంటి యజమానికి తెలిస్తే అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనివ్వడని తెలుసుకోండి. 40 మీరు ఊహించని సమయంలో మనుష్య కుమారుడు వస్తాడు కాబట్టి మీరు కూడా సిద్ధంగా ఉండండి” అని వారికి చెప్పాడు. 41 అప్పుడు పేతురు, “ప్రభూ ఈ ఉపమానం మా కోసమే చెబుతున్నావా లేక అందరి కోసం చెబుతున్నావా?” అని ఆయనను అడిగాడు.
గృహ నిర్వాహకుడు, సేవకులు
42 దానికి ప్రభువు ఇలా అన్నాడు, “సరైన సమయంలో అందరికీ ఆహారం పెట్టడానికి యజమానుడు తన ఇంటిపై నియమించే నమ్మకమైన, బుద్ధిగల నిర్వాహకుడెవడు? 43 యజమాని వచ్చి ఏ పనివాడు ఆ విధంగా చేయడం చూస్తాడో ఆ పనివాడు ధన్యుడు. 44 అప్పుడు ఆ యజమాని తన ఆస్తి అంతటి మీదా అతణ్ణి ఉంచుతాడని మీకు చెబుతున్నాను.
45 అయితే ఆ పనివాడు నా యజమాని ఆలస్యం చేస్తున్నాడని మనసులో అనుకుని తోటి దాసదాసీలను కొట్టడం, తిని తాగి మత్తెక్కి ఉండడం చేస్తే 46 వాడు ఎదురు చూడని రోజున తెలియని సమయంలో యజమాని వస్తాడు. వాణ్ణి కఠినంగా శిక్షించి నమ్మదగని వారి గతే వాడికి పట్టేలా చేస్తాడు. 47 తన యజమాని ఇష్టం తెలిసి కూడా సిద్ధపడకుండా, ఆయన ఇష్ట ప్రకారం చేయకుండా ఉండే సేవకుడికి చాలా దెబ్బలు తగులుతాయి. 48 దెబ్బలకు తగిన పనులు చేసినా తెలియక చేసిన వాడికి తక్కువ దెబ్బలే తగులుతాయి. ఎవరికి ఎక్కువగా ఇచ్చారో అతని దగ్గర ఎక్కువగా తీసుకుంటారు. మనుషులు ఎవరికి ఎక్కువ అప్పగిస్తారో వారి దగ్గరే ఎక్కువగా అడుగుతారు.
క్రీస్తు విభేదాలు కలిగించేవాడు
49 “నేను భూమి మీద అగ్ని వేయడానికి వచ్చాను. అది ఇప్పటికే రగులుకుని మండాలని ఎంతగానో కోరుతున్నాను. 50 అయితే నేను పొందాల్సిన బాప్తిసం ఉంది. అది జరిగే వరకూ నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. 51 నేను భూమి మీద శాంతిని స్థాపించడానికి వచ్చానని మీరు అనుకుంటున్నారా? కానే కాదు. నేను చీలికలు కలగజేయడానికే వచ్చానని మీకు చెబుతున్నాను.
52 ఇక నుండి ఒక ఇంట్లో ఉండే ఐదుగురు వేరుపడి ఇద్దరికి విరోధంగా ముగ్గురూ, ముగ్గురికి విరోధంగా ఇద్దరూ ఉంటారు. 53 తండ్రి కొడుక్కీ, కొడుకు తండ్రికీ, తల్లి కూతురుకీ, కూతురు తల్లికీ, అత్త కోడలికీ, కోడలు అత్తకూ విరోధులుగా ఉంటారు” అని చెప్పాడు.
54 తరవాత ఆయన జనసమూహాలతో ఇలా అన్నాడు, “మీరు పడమర నుండి మబ్బు పైకి రావడం చూసేటప్పుడు వాన వస్తుందని వెంటనే చెప్పేస్తారు. అలాగే జరుగుతుంది. 55 దక్షిణపు గాలి వీయడం చూసేటప్పుడు వడగాలి కొడుతుందని చెబుతారు. అలాగే జరుగుతుంది. 56 కపట భక్తులారా, మీరు భూమి, ఆకాశాల ధోరణులను గుర్తిస్తారు గానీ ఇప్పటి కాలం తీరు గుర్తించలేక పోతున్నారు.
57 ఏది న్యాయమో మీ అంతట మీరే ఎందుకు ఆలోచించరు? 58 మీపై నేరారోపణ చేసే వాడితో కలసి న్యాయాధికారి దగ్గరికి వెళ్తున్నప్పుడు దారిలోనే అతనితో రాజీపడే ప్రయత్నం చెయ్యి. లేకుంటే అతడు నిన్ను న్యాయాధిపతి దగ్గరికి లాక్కుపోతాడు. ఆ న్యాయాధిపతి నిన్ను భటుడికి అప్పగిస్తాడు. ఆ భటుడు నిన్ను జైల్లో పెడతాడు. 59 చివరి పైసా చెల్లించేంత వరకూ నువ్వు బయటకు రానే రావని నీకు చెబుతున్నాను.” అన్నాడు.