14
విశ్రాంతి దినాన యేసు స్వస్థపరిచాడు
ఒక విశ్రాంతి దినం ఆయన ఒక పరిసయ్యుల అధికారి ఇంట్లో భోజనానికి వెళ్ళాడు. అక్కడ ఆయనను అందరూ గమనిస్తున్నారు. అక్కడ వాపు రోగం ఉన్న ఒకడు ఆయనకు ఎదురుగా ఉన్నాడు. అప్పుడు యేసు, “విశ్రాంతి దినాన స్వస్థపరచడం న్యాయమా కాదా?” అని ధర్మశాస్త్ర బోధకులనూ పరిసయ్యులనూ అడిగాడు. వారు మాట్లాడలేదు. అప్పుడు ఆయన అతణ్ణి దగ్గరికి తీసుకుని అతని రోగం బాగు చేసి పంపించేశాడు. “మీలో ఎవరి గాడిదైనా ఎద్దైనా విశ్రాంతి దినాన గుంటలో పడిపోతే దాన్ని బయటకు తీయకుండా ఉంటారా?” అని వారిని అడిగాడు. ఈ ప్రశ్నకు వారు ఆయనకు జవాబేమీ ఇవ్వలేకపోయారు.
తన గురించి ఎక్కువగా ఊహించుకునే అతిథి
ఆ విందుకు ఆహ్వానం అందినవారు భోజనపంక్తిలో అగ్ర స్థానాలను ఎన్నుకోవడం చూసి ఆయన ఇలా అన్నాడు, “నిన్ను ఎవరైనా పెళ్ళి విందుకు పిలిస్తే అక్కడ అగ్ర స్థానంలో కూర్చోవద్దు. ఒకవేళ నీకంటే గొప్పవాణ్ణి అతడు పిలిచి ఉండవచ్చు. మిమ్మల్నిద్దర్నీ పిలిచినవాడు వచ్చి, ‘ఈయన్ని ఇక్కడ కూర్చోనివ్వు’ అనవచ్చు. అప్పుడు నువ్వు సిగ్గు పడి చివరి స్థానంలో కూర్చోడానికి వెళ్తావు. 10 కాబట్టి నీకు ఆహ్వానం అందినప్పుడు వెళ్ళి చివరి స్థానంలో కూర్చో. అప్పుడు నిన్ను ఆహ్వానించిన వాడు వచ్చి నీతో ‘మిత్రమా, పై స్థానానికి వెళ్ళు.’ అనవచ్చు. అప్పుడు నీకు అందరి ముందూ గౌరవం కలుగుతుంది. 11 తనను తాను గొప్ప చేసుకునేవాడు తగ్గడం, తగ్గించుకునేవాడు హెచ్చడం జరుగుతుంది.”
12 తరువాత ఆయన తనను పిలిచిన వ్యక్తితో ఇలా అన్నాడు, “నువ్వు పగలైనా రాత్రి అయినా విందు చేసినప్పుడు నీ స్నేహితులనూ నీ సోదరులనూ నీ బంధువులనూ ధనికులైన నీ పొరుగువారినీ పిలవకు. ఎందుకంటే నువ్వు వారిని పిలిచావు కాబట్టి వారు నిన్ను తిరిగి పిలవవచ్చు. కాబట్టి ఆ విధంగా వారు నీ రుణం తీర్చుకుంటారు. 13 అందుకని నువ్వు విందు చేసినప్పుడు పేదలనూ వికలాంగులనూ కుంటివారినీ గుడ్డివారినీ పిలువు. 14 నీకు తిరిగి ఉపకారం చేయడానికి వారి దగ్గరేమీ ఉండదు. కాబట్టి నువ్వు దీవెన పొంది ధన్యుడివి అవుతావు. చనిపోయిన నీతిమంతులు సజీవంగా లేచినప్పుడు నీకు ప్రతిఫలం దొరుకుతుంది” అని చెప్పాడు. 15 ఆయనతో భోజనానికి కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని, “దేవుని రాజ్యంలో భోజనం చేసేవాడు ధన్యుడు” అని ఆయనతో అన్నాడు.
గొప్ప విందు ఉపమానం
మత్తయి 22:1-14
16 అప్పుడు ఆయన అతనితో ఇలా చెప్పాడు, “ఒక మనిషి పెద్ద విందు చేయించి చాలా మందిని పిలిచాడు. 17 విందుకు వేళయినప్పుడు అతడు ‘ఇప్పుడు విందు సిద్ధంగా ఉంది, రండి’ అని తాను పిలిచిన వారితో చెప్పడానికి తన సేవకుణ్ణి పంపాడు.
18 అయితే వారంతా ఒక్కపెట్టున సాకులు చెప్పడం మొదలు పెట్టారు. మొదటివాడు ‘నేనొక పొలం కొన్నాను. వెంటనే వెళ్ళి దాన్ని చూసుకోవాలి. నన్ను క్షమించాలని వేడుకుంటున్నాను’ అన్నాడు. 19 మరొకడు ‘నేను ఐదు జతల ఎద్దులు కొన్నాను. ఇప్పుడు నేను వాటిని పరీక్షించడానికి వెళ్తున్నాను. నన్ను క్షమించాలని వేడుకుంటున్నాను’ అన్నాడు. 20 మరొకడు ‘నేను పెళ్ళి చేసుకున్నాను. కాబట్టి రాలేను’ అన్నాడు. 21 అప్పుడా పనివాడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి చెప్పాడు.
దాంతో ఆ యజమాని కోపగించుకుని ఆ సేవకుడితో ‘నువ్వు త్వరగా ఊరి వీధుల్లోకీ, సందుల్లోకీ వెళ్ళి అక్కడ ఉన్న పేదలనూ వికలాంగులనూ గుడ్డివారినీ కుంటివారినీ తీసుకుని రా’ అన్నాడు. 22 తరవాత ఆ పనివాడు వచ్చి ‘ప్రభూ, నువ్వు చెప్పినట్టే చేశాను. కానీ ఇంకా చోటు ఉంది’ అన్నాడు. 23 అప్పుడు ఆ యజమాని తన సేవకుడితో ‘నా ఇల్లు నిండిపోవాలి. కాబట్టి నువ్వు రాజ మార్గాల్లోకీ, కంచెల్లోకీ వెళ్లి అక్కడి వారిని బలవంతంగా తీసుకురా. 24 నేను నీకు చెబుతున్నాను. నేను మొదట పిలిచిన వారిలో ఒక్కడు కూడా నా విందు రుచి చూడడు’ ” అన్నాడు.
శిష్యరికానికి పరీక్ష
మత్తయి 10:37-39
25 గొప్ప జన సమూహాలు ఆయనతో వస్తూ ఉన్నారు. ఆయన వారి వైపు తిరిగి ఇలా అన్నాడు, 26 “నా దగ్గరికి వచ్చే వాడెవడైనా సరే, తన తండ్రినీ తల్లినీ భార్యనీ పిల్లలనూ అన్నదమ్ములనూ అక్కచెల్లెళ్ళనూ చివరకూ తన ప్రాణాన్ని కూడా ద్వేషించకపోతే వాడు నా శిష్యుడు కాలేడు. 27 అలాగే తన సిలువను మోసుకుంటూ నా వెనుక రానివాడు నా శిష్యుడు కాలేడు.
గోపురం
28 “మీలో ఎవరైనా ఒక గోపురం కట్టాలని అనుకుంటే దాన్ని మొదలుపెట్టి కొనసాగించడానికి కావలసింది తన దగ్గర ఉందో లేదో లెక్క చూసుకోడా? 29 అలా చూసుకోకుండా మొదలు పెట్టేసి ఆ తరువాత గోపురం పూర్తి చేయలేకపోతే, 30 చూస్తున్న వారంతా ‘ఈ మనిషి కట్టడం మొదలు పెట్టాడు గానీ ముగించ లేకపోయాడు’ అంటూ వేళాకోళం చేస్తారు.
యుద్ధం
31 “అలాగే ఒక రాజు మరో రాజుపై యుద్ధానికి బయలుదేరినప్పుడు, ఇరవై వేల మంది సైన్యంతో తన మీదికి వస్తున్నవాణ్ణి ఎదుర్కోడానికి తన వద్ద ఉన్న పదివేల మంది సైన్యం సరిపోతుందో లేదో ఆలోచించుకోడా? 32 తన శక్తి చాలదనుకుంటే ఆ రాజు దూరంగా ఉన్నప్పుడే రాయబారం పంపి సంధి చేసుకోడానికి ప్రయత్నిస్తాడు కదా! 33 అదే విధంగా మీలో తనకు ఉన్నదంతా వదులుకోని వాడు నాకు శిష్యుడు కాలేడు.
చప్పబడి పోయిన ఉప్పు
మత్తయి 5:13; మార్కు 9:50
34 “ఉప్పు మంచిదే. అయితే ఉప్పు తన సారాన్ని కోల్పోతే దానికి తిరిగి సారం దేనివల్ల కలుగుతుంది? 35 అది భూమికి గానీ, ఎరువులా వాడడానికి గానీ పనికిరాదు. కాబట్టి దాన్ని బయట పారవేస్తారు. వినడానికి చెవులున్న వాడు విను గాక.”