19
యూదయలో యేసు
1 యేసు ఈ మాటలు చెప్పిన తరువాత గలిలయ ప్రాంతాన్ని విడిచి యొర్దాను నది అవతల ఉన్న యూదయ ప్రాంతానికి వచ్చాడు. 2 గొప్ప జనసమూహాలు ఆయనను వెంబడించాయి. ఆయన వారిని అక్కడ బాగుచేశాడు.
విడాకుల గురించి యేసు ఉపదేశం
మత్తయి 5:31, 32; మార్కు 10:1-12; లూకా 16:18; 1కొరింతీ 7:10-15
3 పరిసయ్యులు ఆయన దగ్గరికి వచ్చి, ఆయనను పరీక్షించడం కోసం, “ఏ కారణం చేతనైనా సరే, పురుషుడు తన భార్యను విడిచిపెట్టడం చట్టబద్ధమేనా?” అని అడిగారు.
4 అందుకాయన, “సృష్టికర్త ఆది నుండి వారిని పురుషునిగా స్త్రీగా సృష్టించాడనీ, 5 ‘అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరూ ఏకశరీరంగా అవుతారు’ అని చెప్పాడనీ మీరు చదవలేదా? 6 కాబట్టి వారింక ఇద్దరు కాదు, ఏక శరీరమే. కాబట్టి దేవుడు జత పరిచిన వారిని మనిషి వేరు చేయకూడదు” అని జవాబిచ్చాడు.
7 అందుకు వారు, “అలాటప్పుడు ఒక స్త్రీని విడిచిపెట్టాలంటే ఆమెకు విడాకుల పత్రిక రాసివ్వాలని మోషే ఎందుకు ఆజ్ఞాపించాడు?” అని అడిగారు. 8 అప్పుడాయన, “మీ హృదయ కాఠిన్యాన్ని బట్టే మీ భార్యలను విడిచిపెట్టవచ్చని మోషే చెప్పాడు గానీ, ప్రారంభం నుండీ అలా జరగలేదు. 9 భార్య వ్యభిచారం చేసిన కారణంగా కాక, ఎవరైనా తన భార్యను విడిచిపెట్టి మరొకరిని పెళ్ళిచేసుకుంటే అతడు వ్యభిచార పాపం చేస్తున్నాడు. అలాగే వేరొకడు విడిచిపెట్టిన స్త్రీని పెళ్ళి చేసికొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడని మీతో చెబుతున్నాను” అని వారితో అన్నాడు.
10 ఆయన శిష్యులు, “భార్యాభర్తల మధ్య సంబంధం ఇలాటిదైతే అసలు పెళ్ళి చేసుకోక పోవడమే మంచిది” అని ఆయనతో అన్నారు. 11 అందుకు యేసు, “దేవుడు అనుమతించిన వారు తప్ప మరి ఎవరూ ఈ మాటను అంగీకరించ లేరు. 12 తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టినవారు ఉన్నారు, మనుషులు నపుంసకులుగా తయారు చేసినవారు ఉన్నారు. పరలోక రాజ్యం కోసం తమను తామే నపుంసకులుగా చేసుకున్న వారూ ఉన్నారు. ఈ మాటను అంగీకరించ గలవాడు దాన్ని స్వీకరించి పాటిస్తాడు గాక” అని వారితో చెప్పాడు.
యేసు చిన్న పిల్లలను దీవించడం
మార్కు 10:17-30; లూకా 18:15-17
13 అప్పుడు కొందరు తమ పిల్లల మీద యేసు తన చేతులుంచి ప్రార్థన చేయాలని కోరుతూ చిన్నపిల్లలను ఆయన దగ్గరకి తీసుకుని వచ్చారు. అయితే ఆయన శిష్యులు ఆ పిల్లలను తీసుకొచ్చిన వారిని గద్దించారు. 14 అప్పుడు యేసు, “చిన్నపిల్లలను అడ్డుకోకుండా నా దగ్గరికి రానియ్యండి. పరలోకరాజ్యం ఇలాటి వారిదే” అని వారితో చెప్పాడు. 15 ఆ పిల్లల మీద చేతులుంచిన తరవాత ఆయన అక్కడనుంచి వెళ్ళిపోయాడు.
సంపన్నుడైన యువ అధికారి
మార్కు 10:17-30; లూకా 18:18-30; 10:25-30
16 ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి, “బోధకుడా, శాశ్వతజీవం పొందాలంటే నేను ఏ మంచి పని చేయాలి?” అని ఆయనను అడిగాడు. 17 అందుకు యేసు, “మంచి పని ఏమిటో చెప్పమని నన్నెందుకు అడుగుతున్నావు? మంచి వాడు ఒక్కడే ఉన్నాడు. అయితే నీవు శాశ్వత జీవాన్ని కోరుకుంటే ఆజ్ఞలను పాటించు” అన్నాడు.
18 అతడు, “ఏ ఆజ్ఞలు?” అని ఆయనను అడిగాడు. యేసు, “నరహత్య, వ్యభిచారం, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, 19 నీ తల్లిదండ్రులను గౌరవించు, నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటావో, నీ పొరుగువాణ్ణి కూడా అంతే ప్రేమించు అనేవే” అని చెప్పాడు.
20 అందుకు ఆ యువకుడు, “వీటన్నిటినీ నా చిన్నతనం నుండీ పాటిస్తూనే ఉన్నాను. ఇవి కాక నేనింకేమి చెయ్యాలి?” అన్నాడు. 21 అందుకు యేసు, “నీవు ఇంకా పరిపూర్ణత సాధించాలంటే, వెళ్ళి నీకున్నదంతా అమ్మేసి దాన్ని బీదవారికి పంచిపెట్టు. అప్పుడు నీకు పరలోకంలో ఆస్తి కలుగుతుంది. తరువాత నీవు వచ్చి నన్ను అనుసరించు” అని అతనితో చెప్పాడు. 22 అయితే ఆ యువకుడు గొప్ప ఆస్తిపరుడు. అతడు ఆ మాట వినగానే చాలా విచారంగా తిరిగి వెళ్ళిపోయాడు.
23 యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు, “నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం. 24 ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూదిరంధ్రంలో గుండా ఒంటె దూరి వెళ్ళడం తేలిక.” 25 శిష్యులు ఈ మాట విని చాలా ఆశ్చర్యపోయారు. “ఇలా అయితే ఇంకెవరు పరలోకంలో ప్రవేశించగలరు?” అన్నారు. 26 యేసు వారితో, “ఇది మానవులకు అసాధ్యమే. కానీ, దేవునికి సమస్తమూ సాధ్యమే” అని చెప్పాడు.
రానున్న రాజ్యంలో అపొస్తలుల స్థానాలు
27 అప్పుడు పేతురు, “ఇదిగో మేము మాకున్నదంతా వదిలేసి నీ వెంట వచ్చాం గదా, మాకేమి లభిస్తుంది?” అని ఆయనను అడగగా 28 యేసు వారితో ఇలా అన్నాడు, “కొత్త సృష్టిలో మనుష్య కుమారుడు తన మహిమాన్విత సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు, నన్ను అనుసరించిన మీరు కూడా పన్నెండు సింహాసనాల మీద కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకు తీర్పు తీరుస్తారు.
29 నా నామం నిమిత్తం సోదరులను, సోదరీలను, తండ్రినీ, తల్లినీ, పిల్లలనూ, భూములనూ ఇళ్ళనూ విడిచిపెట్టిన ప్రతివాడూ అంతకు వంద రెట్లు పొందుతాడు. దానితోబాటు శాశ్వత జీవం కూడా సంపాదించుకుంటాడు. 30 మొదటివారిలో చాలామంది చివరి వారవుతారు. చివరివారిలో చాలామంది మొదటి వారవుతారు.”