6
నజరేతులో యేసు
మత్తయి 13:54-58; లూకా 4:16
యేసు అక్కడ నుండి తన శిష్యులతో కలసి తన స్వగ్రామానికి వచ్చాడు విశ్రాంతి దినాన సమాజ మందిరంలో ఉపదేశించడం మొదలు పెట్టాడు. చాలామంది ఆయన ఉపదేశం విని ఎంతో ఆశ్చర్యపడ్డారు. “ఈ సంగతులన్నీ ఇతనికెలా తెలుసు? దేవుడు ఇతనికి ఎంతటి జ్ఞానం ఇచ్చాడు! ఇతని చేతుల ద్వారా ఇన్ని మహత్కార్యాలు ఎలా జరుగుతున్నాయి? ఇతడు వడ్రంగి కదూ! మరియ కొడుకు కదూ! యాకోబు, యోసే, యూదా, సీమోనులకు ఇతడు అన్న కదూ! ఇతడి చెల్లెళ్ళు అందరూ ఇక్కడ మనతోనే ఉన్నారు కదా!” అని చెప్పుకుంటూ ఆయన విషయంలో చాలా అభ్యంతరపడ్డారు.
యేసు వారితో, “ప్రవక్తకు తన సొంత ఊరిలో, సొంత వారి మధ్య, సొంత ఇంట్లో తప్ప అన్ని చోట్లా గౌరవం లభిస్తుంది” అని అన్నాడు. అక్కడ యేసు కొద్దిమంది రోగుల మీద తన చేతులుంచి వారిని బాగుచేయడం తప్ప ఏ మహత్కార్యాలూ చేయలేకపోయాడు. వారి అపనమ్మకానికి ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఆ తరువాత యేసు చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ ఉపదేశం చేశాడు.
యేసు పన్నెండు మందిని పంపించడం
మత్తయి 10:1-42; లూకా 9:1-6
యేసు తన పన్నెండుమంది శిష్యులను దగ్గరికి పిలుచుకుని, వారికి దయ్యాల మీద అధికారమిచ్చి ఇద్దరిద్దరిగా పంపుతూ ఇలా ఆజ్ఞ ఇచ్చాడు.
“ప్రయాణం కోసం చేతికర్ర తప్ప ఇంకేదీ తీసుకు వెళ్ళకండి. ఆహారం గాని, చేతి సంచిగాని, నడికట్టులో డబ్బుగాని, తీసుకు వెళ్ళకండి.
చెప్పులు వేసుకోండి గాని, మారు దుస్తులు తీసుకు వెళ్ళకండి. 10 ఒకరి ఇంటికి వెళ్ళాక ఆ గ్రామం విడిచే వరకూ ఆ ఇంట్లోనే ఉండండి.
11 ఏ గ్రామం వారైనా మిమ్మల్ని స్వీకరించకపోతే, మీ మాటలు వినకపోతే, మీరు ఆ గ్రామం వదిలే ముందు వారి వ్యతిరేక సాక్షంగా మీ పాద ధూళిని దులిపి వేయండి.”
12 శిష్యులు వెళ్ళి ‘పశ్చాత్తాప పడండి’ అంటూ ప్రకటించారు. 13 ఎన్నో దయ్యాలను వదిలించారు. శిష్యులు అనేకమంది రోగులను నూనె రాసి బాగుచేశారు.
హేరోదు ఇబ్బంది, యోహాను వధ
మత్తయి 14:1-14; లూకా 9:7-9
14 యేసు పేరు ప్రసిద్ధి కావడం వల్ల ఆ సంగతి హేరోదు రాజుకు తెలిసింది. బాప్తిసం ఇచ్చే యోహాను బతికి వచ్చాడని, అందుకే యేసులో మహత్కార్యాలు చేసే శక్తి ఉన్నదని కొందరు అన్నారు. 15 ఇతరులు, “ఈయన ఏలీయా” అన్నారు. ఇంకొందరు, “పూర్వకాలపు ప్రవక్తల వంటి ప్రవక్త” అన్నారు. 16 కాని, హేరోదైతే, “నేను తల నరికించిన యోహాను మళ్ళీ బతికి వచ్చాడు” అన్నాడు.
17 ఇంతకు ముందు హేరోదు స్వయంగా యోహానును బంధించి, ఖైదులో వేయించాడు. తాను వివాహం చేసుకున్న హేరోదియ కారణంగా అతడు ఈ పని చేయవలసి వచ్చింది. ఈమె హేరోదు సోదరుడైన ఫిలిప్పు భార్య. 18 ఎందుకంటే యోహాను హేరోదుతో, “నీ సోదరుని భార్యను తెచ్చుకోవడం అన్యాయం” అని హెచ్చరించాడు. 19 అందుచేత హేరోదియ యోహాను మీద పగపట్టి, అతణ్ణి చంపాలని ఆశించింది కానీ అలా చెయ్యలేకపోయింది. 20 ఎందుకంటే హేరోదు యోహానుకు భయపడేవాడు. యోహాను నీతిమంతుడు, పవిత్రమైనవాడు అని హేరోదుకు తెలుసు కనుక అతణ్ణి కాపాడుతూ వచ్చాడు. హేరోదు యోహాను మాటలు విన్నప్పుడు ఎంతో కలవర పడేవాడు. అయినా అతని మాటలు వినడానికి ఇష్టపడేవాడు.
21 ఒక రోజు హేరోదియకు అవకాశం దొరికింది. హేరోదు తన రాజ్యంలోని అధికారులను, సైన్యాధిపతులను, గలిలయలోని గొప్పవారిని పిలిచి తన పుట్టిన రోజు విందు చేశాడు. 22 హేరోదియ కూతురు వచ్చి నాట్యం చేసి, హేరోదును అతని అతిధులను మెప్పించింది. అప్పుడు హేరోదు ఆమెతో, “నీకు ఏది ఇష్టమో అది అడుగు, ఇస్తాను!” అని అన్నాడు. 23 “నువ్వు ఏది అడిగినా ఇస్తాను, నా రాజ్యంలో సగమైనా సరే!” అని ప్రమాణం చేశాడు.
24 ఆమె బయటకి వెళ్ళి తన తల్లితో, “నన్నేమి కోరుకోమంటావు?” అని అడిగింది. ఆమె, “బాప్తిసం ఇచ్చే యోహాను తల కోరుకో” అని చెప్పింది. 25 వెంటనే ఆమె రాజు దగ్గరికి త్వరగా వెళ్ళి, “బాప్తిసం ఇచ్చే యోహాను తలను పళ్ళెంలో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పించండి, నాకు కావలసింది అదే” అని అడిగింది. 26 రాజుకు చాలా దుఃఖం కలిగింది గాని, తాను చేసిన ప్రమాణం కారణంగా తనతో కూర్చుని ఉన్నవారిని బట్టి ఆమె కోరికను తోసిపుచ్చలేక పోయాడు.
27 అందువల్ల అతడు వెంటనే యోహాను తల తీసుకు రమ్మని ఆజ్ఞాపించి భటుణ్ణి పంపాడు. ఆ భటుడు వెళ్ళి ఖైదులోనే యోహాను తల నరికి 28 దాన్ని ఒక పళ్ళెంలో పెట్టి, తీసుకు వచ్చి ఆమెకు కానుకగా ఇచ్చాడు. ఆమె దాన్ని తన తల్లికి ఇచ్చింది. 29 యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి అతని శవాన్ని తీసుకుపోయి సమాధి చేశారు.
ప్రచార పర్యటన నుండి అపొస్తలుల తిరిగి రాక
లూకా 9:10
30 అపొస్తలులు యేసు దగ్గరికి తిరిగి వచ్చి తాము చేసిన వాటి గురించీ బోధించిన వాటి గురించీ వివరంగా ఆయనకు చెప్పారు.
ఐదు వేలమందికి ఆహారం
మత్తయి 14:1-2; లూకా 9:10-17; యోహా 6:5-13
31 వారి దగ్గరికి అనేకమంది వస్తూ పోతూ ఉండడం వల్ల వారికి భోజనం తినడానికి కూడా సమయం లేకపోయింది. యేసు వారితో, “నాతో మీరు మాత్రమే ఒక నిర్జన ప్రదేశానికి వచ్చి, కొంత విశ్రాంతి తీసుకోండి” అని అన్నాడు. 32 అందువల్ల వారు మాత్రమే పడవలో ఏకాంతంగా నిర్జన ప్రదేశానికి వెళ్ళారు. 33 అయితే వారు వెళ్తూ ఉండగా జనసమూహాలు ఆయనను గుర్తుపట్టి వివిధ గ్రామాల నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి వారికన్నా ముందే ఆ నిర్జన ప్రదేశానికి చేరుకున్నారు.
34 పడవలో యేసు అక్కడికి చేరినప్పుడు పెద్ద జనసమూహం ఆయనకు కనిపించింది. కాపరి లేని గొర్రెల్లా ఉన్న ఆ ప్రజలను చూసి ఆయనకు జాలి కలిగింది. అందుచేత ఆయన వారికి అనేక విషయాలు ఉపదేశించ సాగాడు.
35 చాలా పొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “ఇది నిర్జన ప్రదేశం, ఇప్పటికే పొద్దుపోయింది. 36 ఈ ప్రజలకు తినడానికి ఏమీ లేదు కాబట్టి వారు చుట్టూ ఉన్న పల్లెలకో గ్రామాలకో వెళ్ళి ఏదైనా కొనుక్కోడానికి వారిని పంపివెయ్యి” అన్నారు. 37 అయితే యేసు వారితో, “మీరే వారికి ఆహారం పెట్టండి!” అన్నాడు. అందుకు వారు ఆయనతో, “రెండు వందల దేనారాలకు రొట్టెలు కొని, వారికి పంచి పెట్టమంటావా” అని ఆయనను అడిగారు. 38 ఆయన వారితో “మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయో చూడండి” అన్నాడు. వారు వెళ్ళి చూసి, “ఐదు రొట్టెలు, రెండు చిన్న చేపలు ఉన్నాయి” అని అన్నారు.
39 అప్పుడాయన అందరినీ గుంపులు గుంపులుగా పచ్చగడ్డి మీద కూర్చోబెట్టమని శిష్యులతో చెప్పాడు. 40 ప్రజలు గుంపుకు యాభైమంది, వందమంది చొప్పున కూర్చున్నారు. 41 యేసు ఆ ఐదు రొట్టెలు, రెండు చేపలు చేతపట్టుకుని ఆకాశం వైపు చూసి, దేవునికి కృతజ్ఞత చెప్పి రొట్టెలు విరిచి, జనసమూహానికి వడ్డించడానికి శిష్యులకు అందించాడు. అదే విధంగా ఆ రెండు చేపలను కూడా భాగాలు చేసి అందరికీ పంచాడు. 42 అందరూ తిని సంతృప్తి చెందారు.
43 శిష్యులు మిగిలిన రొట్టె ముక్కలను, చేప ముక్కలను పన్నెండు గంపల నిండా నింపారు. 44 ఆ రోజు అక్కడ రొట్టెలు తిన్న పురుషులు ఐదు వేల మంది.
యేసు నీటి పై నడక
మత్తయి 14:22-32; యోహా 6:15-21
45 ఆ తరువాత యేసు తన శిష్యులను తనకన్నా ముందు బేత్సయిదాకు వెళ్ళమని చెప్పి వారిని పడవ ఎక్కించాడు. 46 జనసమూహాన్ని పంపివేసిన తరువాత ఆయన ప్రార్థించడానికి కొండకు వెళ్ళాడు. 47 చీకటి పడుతూ ఉన్న సమయంలో శిష్యులు ఉన్న పడవ సముద్రం మధ్యలో ఉంది. యేసు మాత్రమే ఒడ్డున ఉన్నాడు. 48 ఎదురుగాలి వీస్తూ ఉండడం వల్ల శిష్యులు చాలా కష్టంగా పడవ నడపడం చూసి యేసు తెల్లవారుజామున సరస్సు మీద నడుస్తూ వారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన వారిని దాటి వెళ్ళబోతూ ఉండగా, 49 ఆయన శిష్యులు ఆయన నీళ్ళ మీద నడవడం చూసి, దయ్యం అనుకుని భయపడి బిగ్గరగా కేకలు వేశారు. 50 వెంటనే యేసు వారితో, “ధైర్యంగా ఉండండి. నేనే! భయపడకండి!” అని అన్నాడు.
51 ఆయన వారి దగ్గరికి వచ్చి, పడవ ఎక్కగానే గాలి ఆగింది. వారు తమలో తాము ఆశ్చర్యపడుతూ అమితంగా విభ్రాంతి చెందారు. 52 ఎందుకంటే రొట్టెలు పంచిన అద్భుతాన్ని వారు చూశారు కాని, వారి హృదయం బండబారి పోయింది కాబట్టి రొట్టెలను గురించిన సంగతి వారు గ్రహించలేదు.
గెన్నేసరెతు తీరాన స్వస్థతలు
మత్తయి 14:34-36
53 వారు అవతలి ఒడ్డుకు వెళ్ళి గెన్నేసరెతు ప్రాంతానికి చేరి అక్కడ పడవ నిలిపారు. 54 వారు పడవ దిగిన వెంటనే ప్రజలు యేసును గుర్తుపట్టారు. 55 ప్రజలు చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలకు పరుగెత్తుకుంటూ వెళ్ళి రోగులను మంచాల మీద ఉంచి ఆయన ఉన్న చోటికి తీసుకు వచ్చారు. 56 యేసు ఏ గ్రామంలో, ఏ పట్టణంలో ఏ పల్లెలో ప్రవేశించినా వారు రోగులను వీధుల్లో పడుకోబెట్టి, ఆయన వస్త్రాన్నయినా తాకనియ్యమని ఆయనను బతిమాలారు. ఆయనను తాకిన వారంతా బాగుపడ్డారు.