8
ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎజ్రా చదివి వినిపించడం
1 అప్పుడు ప్రజలంతా ఒకే ఉద్దేశంతో నీటి ద్వారం ఎదురుగా ఉన్న మైదానంలో సమకూడారు. యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకు రమ్మని ఎజ్రాశాస్త్రితో చెప్పారు. 2 ఎజ్రా ఏడవ నెల మొదటి రోజున గ్రంథాన్ని చదువుతుండగా అర్థం చేసుకోగలిగే స్త్రీ పురుషులు కలసి ఉన్న సమూహం ఎదుటికి ఆ ధర్మశాస్త్ర గ్రంథం తెచ్చాడు. 3 అతడు నీటి ద్వారం ఎదురుగా ఉన్న మైదానంలో ఉదయం నుండి మధ్యాహ్నం దాకా నిలబడి ఉన్న ఆ స్త్రీ పురుషులకు, అంటే జ్ఞానంతో దాన్ని అర్థం చేసుకోగల వారందరికీ వినిపించాడు. ప్రజలంతా ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని శ్రద్ధగా విన్నారు.
4 ఆ పని కోసం చెక్కతో చేసిన ఎత్తయిన వేదిక మీద ఎజ్రా నిలబడ్డాడు.
అతని కుడివైపు మత్తిత్యా, షెమ, అనాయా, ఊరియా, హిల్కీయా, మయశేయా అనేవాళ్ళు.
ఎడమవైపు పెదాయా, మిషాయేలు, మల్కీయా, హాషుము, హష్బద్దానా, జెకర్యా, మెషుల్లాము అనేవాళ్ళు నిలబడ్డారు.
5 అప్పుడు అందరికంటే ఎత్తయిన వేదికపై ఎజ్రా నిలబడి ప్రజలంతా చూస్తుండగా గ్రంథం తెరిచాడు. ప్రజలంతా లేచి నిలబడ్డారు. 6 ఎజ్రా గొప్ప దేవుడైన యెహోవాను స్తుతించినప్పుడు ప్రజలంతా తమ చేతులు పైకెత్తి ఆమేన్, ఆమేన్ అని కేకలు వేస్తూ, క్రిందికి నేల వైపుకు తమ తలలు వంచుకుని యెహోవాకు నమస్కరించారు. 7 ప్రజలు ఇలా నిలబడి ఉన్న సమయంలో యేషూవ, బానీ, షేరేబ్యా, యామీను, అక్కూబు, షబ్బెతై, హోదీయా, మయశేయా, కెలీటా, అజర్యా, యోజాబాదు, హానాను, పెలాయా, లేవీయులు ధర్మశాస్త్రం అర్థాన్ని, భావాలను వారికి తెలియజేశారు. 8 ఆ విధంగా ప్రజలు మరింత స్పష్టంగా అర్థం చేసుకుని గ్రహించగలిగేలా గ్రంథాన్ని చదివి వినిపించి వాటి సారాంశం తెలియజేసారు.
9 ధర్మశాస్త్ర గ్రంథంలోని విషయాలు గ్రహించిన ప్రజలు బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టారు. అధికారి నెహెమ్యా, యాజకుడు, శాస్త్రి అయిన ఎజ్రా, ప్రజలకు వివరించే లేవీయులు వారితో “మీరు ఏడవ్వద్దు. ఈ రోజు మీ దేవుడైన యెహోవాకు కేటాయించిన రోజు” అని చెప్పారు. 10 అప్పుడు నెహెమ్యా “బయలు దేరండి. కొవ్విన మాంసం తినండి. ఏదైనా తియ్యటిది తాగండి. ఇప్పటి దాకా తమ కోసం ఏమీ సిద్ధం చేసుకోని వాళ్లకు వాటాలు పంపించండి. ఎందుకంటే ఈ రోజు పరిశుద్ధమైనది. మీరు దుఃఖపడొద్దు. యెహోవాలో ఆనందమే మీ బలం” అని చెప్పాడు.
11 ఈ విధంగా లేవీయులు ప్రజలందరినీ ఓదార్చారు. “మీరు దుఃఖించడం ఆపండి. చింతించకండి. ఇది పవిత్రమైన రోజు” అన్నారు. 12 ఆ తరువాత ప్రజలు తాము విన్న మాటలన్నీ గ్రహించి, తినడానికీ, తాగడానికీ, లేని వారికి వాటాలు పంపించడానికీ, సంతోషంగా గడపడానికీ ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్లారు. 13 రెండవ రోజు ప్రజల పెద్దల్లో ప్రముఖులు, యాజకులు, లేవీయులు ధర్మశాస్త్ర గ్రంథంలోని విషయాలు తెలుసుకోవాలని ఆచార్యుడు ఎజ్రా దగ్గర సమకూడారు. 14 యెహోవా మోషేకు అనుగ్రహించిన గ్రంథం పరిశీలించినప్పుడు ఏడవ నెలలో జరిగే పండగ సమయంలో పర్ణశాలల్లో గడపాలని రాసి ఉన్నట్టు వారు కనుగొన్నారు*యెహోవా మోషేకు అనుగ్రహించిన గ్రంథం పరిశీలించినప్పుడు ఏడవ నెలలో జరిగే పండగ సమయంలో పర్ణశాలల్లో గడపాలని రాసి ఉన్నట్టు వారు కనుగొన్నారు లేవీ 23:34-36, 39-43; ద్వితీ 16:13-15.
15 వాళ్ళు యెరూషలేంలో, తమ పట్టణాల్లో ఈ విధంగా చాటింపు వేయించారు. “గ్రంథంలో రాసి ఉన్నట్టు, మీరు కొండలకు వెళ్లి ఒలీవచెట్ల కొమ్మలు, అడవి ఒలీవచెట్ల కొమ్మలు, గొంజి చెట్ల కొమ్మలు, ఈతచెట్ల కొమ్మలు, గుబురుగా ఉండే రకరకాల చెట్ల కొమ్మలు తీసుకువచ్చి పర్ణశాలలు కట్టాలి.” 16 కాబట్టి ప్రజలు వెళ్లి కొమ్మలు తెచ్చి అందరూ తమ తమ ఇళ్ళ మీద, వాకిళ్ళలో, మందిరం పరిసరాల్లో, నీటి ద్వారం వీధిలో, ఎఫ్రాయీం ద్వారం వీధిలో పర్ణశాలలు కట్టారు.
17 చెర నుండి తిరిగి వచ్చినవాళ్ళంతా పర్ణశాలలు కట్టుకుని వాటిలో ఉన్నారు. అందరూ ఆనందించారు. నూను కొడుకు యెహోషువ జీవిత కాలం తరువాత నుండి ఇప్పటి వరకూ ఇశ్రాయేలీయులు ఈ విధంగా చేయలేదు. 18 అంతే కాకుండా, మొదటి రోజు నుండి ఏడవ రోజు వరకూ ప్రతిరోజూ ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథం చదివి, వినిపిస్తూ వచ్చాడు. వాళ్ళు ఇలా వారం పాటు ఈ పండగ రోజులు ఆచరించారు. తరువాత ఎనిమిదవ రోజున నిర్ణయించిన క్రమం ప్రకారం పవిత్ర సమావేశంలో సమకూడారు.
*8:14 యెహోవా మోషేకు అనుగ్రహించిన గ్రంథం పరిశీలించినప్పుడు ఏడవ నెలలో జరిగే పండగ సమయంలో పర్ణశాలల్లో గడపాలని రాసి ఉన్నట్టు వారు కనుగొన్నారు లేవీ 23:34-36, 39-43; ద్వితీ 16:13-15