14
ఇశ్రాయేలు ప్రజల తిరుగుబాటు
1 ఆ రాత్రి ప్రజలందరూ పెద్దగా కేకలు పెట్టి ఏడ్చారు. 2 ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులకు వ్యతిరేకంగా గొడవ చేశారు. 3 ఆ సమాజమంతా వారితో “ఈ అరణ్యంలో చనిపోవడం కన్నా మేము ఐగుప్తులో చనిపోతే బాగుండేది! మేము కత్తివాత చావాలని యెహోవా మమ్మల్ని ఈ ప్రదేశానికి తీసుకొచ్చాడా? మా భార్యలు, మా చిన్న పిల్లలు బాధల పాలౌతారు. మళ్ళీ ఐగుప్తు తిరిగి వెళ్ళడం మాకు మేలు కాదా?” అన్నారు.
4 వారు “మనం ఇంకొక నాయకుణ్ణి ఎంపిక చేసుకుని ఐగుప్తుకు తిరిగి వెళ్దాం పదండి” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. 5 అప్పుడు మోషే, అహరోను ఇశ్రాయేలు ప్రజల సమావేశం ఎదుట సాగిలపడ్డారు.
6 అప్పుడు, ఆ ప్రదేశాన్ని పరిశీలించి చూసిన వారిలో నూను కొడుకు యెహోషువ, యెఫున్నె కొడుకు కాలేబు బట్టలు చింపుకుని, 7 ఇశ్రాయేలీయుల సర్వజన సమూహంతో మాట్లాడుతూ “మేము సంచారం చేసి పరిశీలించి చూసిన ప్రదేశం ఎంతో మంచి ప్రదేశం. 8 యెహోవా మనలను బట్టి ఆనందిస్తే, ఆ ప్రదేశంలో మనలను చేర్చి, దాన్ని మనకు ఇస్తాడు. అది పాలు తేనెలు ప్రవహించే ప్రదేశం.
9 కాబట్టి, మీరు యెహోవా మీద తిరగబడవద్దు. ఆ దేశ ప్రజలకు భయపడవద్దు. వారు మనకు అన్నం తిన్నంత తేలిక. యెహోవా మనతో ఉన్నాడు గనక వారి భద్రత ఇక వారి పై నుండి తొలిగిపోతుంది. వాళ్లకు భయపడవద్దు” అన్నారు. కాని, ఆ సమూహం, వారిని రాళ్లతో కొట్టి చంపాలన్నారు. 10 అప్పుడు సన్నిధి గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులందరికీ కనబడింది.
11 యెహోవా మోషేతో “ఎంతకాలం ఈ ప్రజలు నన్ను కించపరుస్తారు? నా శక్తిని చూపించే సూచనలన్నీ నేను వారి మధ్య జరిగించినా, నన్ను ఇంకెంతకాలం నమ్మకుండా ఉంటారు? 12 నేను వారి మీద తెగులుపంపిస్తాను. వారికి వారసత్వ హక్కు లేకుండా చేస్తాను. ఈ జనం కంటే మరింత గొప్ప బలమైన జనాంగాన్ని నీ వంశం ద్వారా పుట్టిస్తాను” అన్నాడు.
13 మోషే యెహోవాతో “అలా చేస్తే ఐగుప్తీయులు దాని గురించి వింటారు. ఎందుకంటే నీ బలంతో నువ్వు ఈ జనాన్ని ఐగుప్తీయుల్లో నుంచి రప్పించావు. వారు ఈ దేశ వాసులతో ఈ విషయం చెప్తారు. 14 యెహోవా అనే నువ్వు ఈ ప్రజల మధ్య ఉన్నావనీ, యెహోవా అనే నువ్వు ముఖాముఖిగా కనిపించినవాడివనీ, నీ మేఘం వారి మీద నిలిచి ఉన్నదనీ, నువ్వు పగలు మేఘస్తంభంలోనూ, రాత్రి అగ్నిస్తంభంలోనూ వారి ముందు నడుస్తున్నావనీ, వారు విని ఉన్నారు గదా.
15 కాబట్టి నువ్వు ఒక్క దెబ్బతో ఈ ప్రజలను చంపితే నీ కీర్తిని గురించి విన్న ప్రజలు 16 ‘ప్రమాణ పూర్వకంగా తాను ఈ ప్రజలకిచ్చిన దేశంలో వారినిచేర్చడానికి శక్తిలేక, యెహోవా వారిని అరణ్యంలో చంపేశాడు’ అని చెప్పుకుంటారు. 17 ‘యెహోవా దీర్ఘశాంతుడు, నిబంధన నమ్మకత్వం సమృద్ధిగా కలిగినవాడు. 18 దోషం, అతిక్రమం పరిహరించేవాడు. అపరాధిని నిరపరాధిగా ఎంచకుండా, మూడు నాలుగు తరాల వరకూ తండ్రుల దోషాన్ని కొడుకుల మీదికి తెచ్చే వాడిగా ఉన్నాడు’ అని నువ్వు చెప్పిన మాట ప్రకారం నా ప్రభువు బలానికి ఘనత కలుగు గాక. 19 ఐగుప్తులోనుంచి వచ్చింది మొదలు ఇంతవరకూ నువ్వు ఈ ప్రజల పాపం పరిహరించినట్టు నీ గొప్ప నిబంధన నమ్మకత్వాన్నిబట్టి ఈ ప్రజల పాపాన్ని దయచేసి క్షమించు” అన్నాడు. 20 యెహోవా “నీ కోరిక ప్రకారం నేను క్షమించాను. 21 కాని, నా జీవంతో తోడు, భూమి అంతా నిండి ఉన్న యెహోవా మహిమ తోడు, 22 ఐగుప్తులో, అరణ్యంలో నేను చేసిన సూచనలనూ, నా మహిమను చూసిన ఈ మనుషులందరూ, ఈ పదిసార్లు నా మాట వినకుండా నన్ను పరీక్షకు గురి చేశారు. 23 కాబట్టి వారి పితరులకు ప్రమాణ పూర్వకంగా నేనిచ్చిన దేశాన్ని వారు చూడనే చూడరు. నన్ను పట్టించుకోని వారిలో ఎవరూ దాన్ని చూడరు. 24 నా సేవకుడైన కాలేబు వీళ్ళ లాంటి వాడు కాదు. అతడు పూర్ణమనస్సుతో నన్ను అనుసరించిన కారణంగా అతడు పరిశీలించడానికి వెళ్ళిన దేశంలో అతన్ని ప్రవేశపెడతాను. 25 అతని సంతానం దాన్ని స్వాధీనం చేసుకుంటుంది. అమాలేకీయులు, కనానీయులు ఆ లోయలో నివాసం ఉంటున్నారు. రేపు మీరు తిరిగి ఎర్రసముద్రం మార్గంలో అరణ్యంలోకి ప్రయాణమై వెళ్ళండి” అన్నాడు.
26 ఇంకా యెహోవా మోషే అహరోనులతో మాట్లాడుతూ, 27 “నాకు విరోధంగా నన్ను విమర్శించే ఈ చెడ్డ సమాజాన్ని నేనెంత వరకూ సహించాలి? ఇశ్రాయేలీయులు నాకు విరోధంగా చేస్తున్న విమర్శలు నేను విన్నాను.
28 నువ్వు వారితో, యెహోవా చెప్పేదేమంటే, నేను జీవంతో ఉన్నట్టు, మీరు నాతో చెప్పినట్టు నేను కచ్చితంగా మీపట్ల చేస్తాను. 29 మీ శవాలు ఈ అరణ్యంలోనే రాలిపోతాయి. మీ పూర్తి లెక్క ప్రకారం మీలో లెక్కకు వచ్చిన వారందరూ, అంటే, ఇరవై సంవత్సరాలు మొదలు ఆ పైవయస్సు కలిగి, నాకు విరోధంగా విమర్శించిన వారిందరూ రాలిపోతారు. 30 యెఫున్నె కొడుకు కాలేబు, నూను కొడుకు యెహోషువ తప్ప మీకు నివాసంగా ఇస్తానని నేను ప్రమాణం చేసిన దేశంలో కచ్చితంగా మీలో ఎవరూ ప్రవేశించరు.
31 కాని, బందీలౌతారని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశం లోపలికి రప్పిస్తాను. మీరు తృణీకరించిన దేశాన్ని వారు అనుభవిస్తారు. 32 మీ విషయంలో మాత్రం, మీ శవాలు ఈ అరణ్యంలో రాలిపోతాయి. 33 మీ పిల్లలు ఈ అరణ్యంలో నలభై సంవత్సరాలు తిరుగులాడతారు. ఈ అరణ్యం మీ శరీరాలను చంపే వరకూ మీ తిరుగుబాటు వల్ల వచ్చిన పర్యవసానాలను వారు భరించాలి.
34 మీరు ఆ ప్రదేశాన్ని సంచారం చేసి చూసిన నలభై రోజుల లెక్క ప్రకారం రోజుకు ఒక సంవత్సరం ప్రకారం నలభై సంవత్సరాలు మీ పాపశిక్షను భరించి, నేను మీకు శత్రువైతే ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవాలి. 35 నేను, యెహోవాను మాట్లాడాను. నాకు విరోధంగా సమకూడిన ఈ దుర్మార్గపు సమాజం పట్ల నేను దీన్ని కచ్చితంగా జరిగిస్తాను. ఈ అరణ్యంలో వారు నాశనం అయిపోతారు. ఇక్కడే చనిపోతారు” అన్నాడు.
36 మోషే పంపినప్పుడు ఆ దేశంలో సంచారం చేసి చూడడానికి వెళ్లి తిరిగి వచ్చి ఆ దేశం గురించి చెడ్డ సమాచారం చెప్పడం వల్ల సమాజం అంతా అతని మీద తిరుగుబాటు చేసిన మనుషులు, 37 అంటే ఆ దేశం గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిలో తెగులు వల్ల చనిపోయారు. 38 అయితే ఆ దేశం సంచారం చేసి చూసిన మనుషుల్లో నూను కొడుకు యెహోషువ, యెఫున్నె కొడుకు కాలేబు బ్రతికారు.
39 మోషే ఇశ్రాయేలీయులందరితో ఆ మాటలు చెప్పినప్పుడు ఆ ప్రజలు చాలా దుఃఖపడ్డారు. 40 వారు ఉదయాన లేచి ఆ కొండ శిఖరం ఎక్కి “మనం నిజంగా పాపం చేశాం. చూడండి, మనం ఇక్కడ ఉన్నాం. యెహోవా మనకు వాగ్దానం చేసిన స్థలానికి వెళ్దాం” అన్నారు. 41 కాని మోషే “మీరు యెహోవా ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నారు? 42 దాన్ని మీరు సాధించ లేరు. యెహోవా మీ మధ్య లేడు కాబట్టి మీ శత్రువుల ఎదుట మీరు హతం అవుతారు. మీరు వెళ్ళవద్దు. 43 ఎందుకంటే, అమాలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరారు. మీరు ఖడ్గం చేత చనిపోతారు. మీరు యెహోవాను అనుసరించ లేదు గనక ఇంక యెహోవా మీకు తోడుగా ఉండడు” అని చెప్పాడు.
44 కాని వారు మూర్ఖంగా ఆ కొండ కొన మీదకు ఎక్కి వెళ్ళారు. కాని, యెహోవా నిబంధన మందసం గానీ, మోషే గానీ శిబిరం నుంచి బయటకు వెళ్ళలేదు. 45 అప్పుడు ఆ కొండ మీద నివాసం ఉన్న అమాలేకీయులు, కనానీయులు దిగి వచ్చి వారిపై దాడి చేసి, హోర్మా వరకూ వారిని తరిమి హతం చేశారు.