46
ప్రధాన సంగీతకారుడి కోసం, కోరహు వారసుల కీర్తన. అలమోత్ రాగం పై పాడాలి. ఒక గీతం.
1 దేవుడు మన ఆశ్రయం. మన బలం. సమస్యల్లో మన తక్షణ సహాయం.
2 కాబట్టి భూమి మారిపోయినా, సముద్ర అఖాతంలో పర్వతాలు మునిగిపోయినా మేము భయపడం.
3 సముద్రంలో నీళ్ళు గర్జించినా, తీవ్ర ఉద్రేకంతో అవి పొంగినా, వాటి పొంగుకు పర్వతాలు కంపించినా సరే.
సెలా.
4 ఒక నది ఉంది, దాని ప్రవాహాలు దేవుని పట్టణాన్ని, అత్యున్నత ప్రభువు మందిరపు పరిశుద్ధ స్థలాన్ని సంతోషపెడుతూ ఉన్నాయి.
5 దేవుడు ఆ పట్టణం మధ్యలో ఉన్నాడు. దాన్ని ఎవ్వరూ కదిలించలేరు. దేవుడు ఆమెకు సహాయం చేస్తాడు. త్వరలో ఆయన సహాయం చేస్తాడు.
6 జాతులు ఘోషిస్తున్నాయి. రాజ్యాలు కంపిస్తున్నాయి. ఆయన తన స్వరాన్ని పెంచినప్పుడు భూమి కరిగిపోయింది.
7 సేనల ప్రభువైన యెహోవా మనతో ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.
8 రండి, యెహోవా చేసిన పనులు, భూమిని ఆయన నాశనం చేసిన విధానం చూడండి.
9 భూమి అంతటి మీదా జరుగుతున్న యుద్ధాలను ఆయన నిలిపివేస్తాడు. ఆయన విల్లును విరుస్తాడు. ఈటెను ముక్కలు చేస్తాడు. యుద్ధ రధాలను*రధాలను డాలులను కాల్చి వేస్తాడు.
10 నిశ్శబ్దంగా ఉండండి. నేనే యెహోవాని అని తెలుసుకోండి. జనాలలో నన్ను హెచ్చిస్తారు. భూమిపై నన్ను ఉన్నత స్థానంలో ఉంచుతారు.
11 సేనల ప్రభువైన యెహోవా మనతో ఉన్నాడు. యాకోబు దేవుడు మన ఆశ్రయం.