72
సొలొమోను కీర్తన
1 దేవా, రాజుకు నీ న్యాయవిధులను, రాకుమారుడికి నీ నీతిని తెలియజెయ్యి.
2 అతడు నీతిని బట్టి నీ ప్రజలకు, న్యాయవిధులను బట్టి పేదవారికి న్యాయం తీరుస్తాడు గాక.
3 నీతిని బట్టి పర్వతాలు, కొండలు ప్రజలకు క్షేమం కలిగిస్తాయి గాక.
4 ప్రజల్లో పేదవారికి అతడు న్యాయం తీరుస్తాడు గాక. అక్కరలో ఉన్నవారి పిల్లలను రక్షించి, బాధపెట్టే వారిని నలగగొడతాడు గాక.
5 సూర్యచంద్రులు ఉన్నంత కాలం, తరతరాల్లో ప్రజలు నీలో భయభక్తులు చూపుతారు గాక.
6 కోసిన గడ్డిపై కురిసే వానలాగా, భూమిని తడిపే మంచి వర్షంలాగా అతడు దిగి వస్తాడు గాక.
7 అతని కాలంలో నీతిమంతులు వర్ధిల్లుతారు గాక. చంద్రుడు గతించే వరకూ క్షేమాభివృద్ధి ఉండు గాక.
8 సముద్రం నుండి సముద్రం వరకూ, యూఫ్రటీసు నది మొదలుకుని భూదిగంతాల వరకూ అతని ఆధిపత్యం వ్యాపిస్తుంది గాక.
9 ఎడారి ప్రజలు*ఎడారి ప్రజలు అతని శత్రువులు అతనికి లోబడతారు గాక. అతని శత్రువులు నేల మట్టి నాకుతారు గాక.
10 తర్షీషు రాజులు, ద్వీపాల రాజులు కప్పం చెల్లిస్తారు గాక. షేబ రాజులు, సెబా రాజులు కానుకలు తీసుకు వస్తారు గాక.
11 రాజులందరూ అతని ఎదుట సాగిలపడతారు గాక. అన్యజనాలు అతనికి సేవ చేస్తారు గాక.
12 ఎందుకంటే అక్కరలో ఉన్నవారు మొర పెట్టినప్పుడు అతడు వారికి సహాయం చేస్తాడు. సహాయం దొరకని పేదలను అతడు విడిపిస్తాడు.
13 నిరుపేదల పట్లా అక్కరలో ఉన్నవారి పట్లా అతడు జాలి చూపుతాడు. పేదల ప్రాణాలను అతడు రక్షిస్తాడు.
14 బలాత్కారం నుండీ హింస నుండీ అతడు వారి ప్రాణాన్ని విమోచిస్తాడు. వారి ప్రాణం†ప్రాణం రక్తం అతని దృష్టికి విలువైనది.
15 రాజు చిరంజీవి అవుతాడు గాక. షేబ బంగారం అతనికి ఇస్తారు గాక. అతని క్షేమం కోసం ప్రజలు ఎప్పుడూ ప్రార్థన చేస్తారు గాక. దేవుడు రోజంతా అతణ్ణి దీవిస్తాడు గాక.
16 దేశంలో, పర్వత శిఖరాల మీదా ధాన్యం సమృద్ధిగా పండు గాక. వారి పంటలు గాలికి లెబానోను వృక్షాలలాగా ఊగుతూ ఉంటాయి గాక. పట్టణ ప్రజలు భూమి మీది పచ్చికలాగా వర్ధిల్లుతారు గాక.
17 రాజు నామం శాశ్వతంగా నిలుస్తుంది గాక. అతని పేరు సూర్యుడున్నంత కాలం నిలబడుతుంది గాక. అతనిని బట్టి ప్రజలు దీవెనలు పొందుతారు గాక. అన్యజనాలు అతడు ధన్యుడని చెప్పుకుంటారు గాక.
18 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతులు పొందుతాడు గాక. ఆయన ఒక్కడే ఆశ్చర్యకార్యాలు చేసేవాడు.
19 ఆయన మహిమగల నామం నిరంతరం స్తుతులు పొందుతుంది గాక. ఈ భూమి అంతా ఆయన మహిమతో నిండి ఉంటుంది గాక. ఆమేన్. ఆమేన్.
20 యెష్షయి కొడుకు దావీదు ప్రార్థనలు ముగిశాయి.