76
ప్రధాన సంగీతకారుని కోసం, తీగ వాయిద్యాలతో పాడేది. ఆసాపు కీర్తన, ఒక పాట.
1 యూదాలో దేవుడు తనను తెలియబరచుకున్నాడు. ఇశ్రాయేలులో ఆయన నామం ఘనమైనది.
2 షాలేంలో*షాలేంలో యెరూషలేము ఆయన నివాసం ఉంది, సీయోనులో ఆయన గృహం ఉంది.
3 అక్కడ ఆయన విల్లంబులు, డాలు, కత్తి మిగతా యుద్ధాయుధాలను విరిచి వేశాడు.
సెలా.
4 నువ్వు నీ శత్రువులను జయించి పర్వతాల నుంచి దిగి వస్తూ మెరిసిపోతున్నావు. నీ మహిమను ప్రదర్శిస్తున్నావు.
5 గుండె ధైర్యం గలవారు దోపిడికి గురి అయ్యారు. నిద్రపోయారు. శూరులంతా నిస్సహాయులయ్యారు.
6 యాకోబు దేవా, యుద్ధంలో నీ గద్దింపుకు గుర్రం, రౌతు కూడా మూర్ఛిల్లారు.
7 నీకు, నీకు మాత్రమే భయపడాలి. నువ్వు కోపపడితే నీ ఎదుట ఎవరు నిలుస్తారు?
8 నీ తీర్పు పరలోకం నుంచి వచ్చింది, భూమికి భయమేసింది, అది మౌనంగా ఉంది.
9 దేవా! నువ్వు తీర్పు ప్రకటించడానికి, దేశమంతటా అణగారిన వాళ్ళను కాపాడడానికి లేచావు.
సెలా.
10 కోపంతో వారిపై నీ తీర్పు ప్రజలు కచ్చితంగా నిన్ను స్తుతించేలా చేస్తుంది. నీ ఆగ్రహాన్ని నువ్వు పూర్తిగా వెల్లడిస్తావు.
11 మీ యెహోవా దేవునికి మొక్కుకుని వాటిని చెల్లించండి. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా భయభక్తులకు పాత్రుడైన ఆయనకు కానుకలు తీసుకు రండి.
12 అధికారుల పొగరును ఆయన అణచివేస్తాడు, భూరాజులు ఆయనకు భయపడతారు.